అందాల మధ్య…..

భౌగోళిక ప్రదేశం
ప్రకృతి రమణీయకతకు ఆలవాలం
ఉన్నతంగా నిలిచే హిమశిఖరాలొక వైపు
గలగల పారే నదీనదాలొకవైపు

జీవన సమయాలలో తొంగిచూసామా ….
అంతంత మాత్రం అతుకుల బొంత

యాత్రికుల సందడిలా
ఏడాదిలో కొన్ని ఋతువులే వేడుక చేస్తుంటాయి
కడుపులు నింపుతుంటాయి

తరాలు మారినా అంతం కాని దారిద్ర్యం
దారిద్య్రానికి తలవంచని నైజం
సాగిస్తుంటారు ప్రశాంతం జీవనం

కలలెప్పుడూ అవవు నిజం
నిరంతరం సమస్యల వలయాలు
ప్రకృతి ప్రకోపమో వైరి దేశపు కుతంత్రమో

ఏదైతేనేం! ఎరుకరాని మరణం నీడలో
నిరంతరం సరిహద్దు గ్రామాల ప్రజానీకం
నాగరికులకు నవ్య దీప్తుల హిమవన్నగ నయగారాలు చూపుతుంటారు

తాత తండ్రుల నుండి
తమ పిల్లలకు ఆవాస నివాసాల ప్రదేశం
విడిచి చరించ లేరు
లేదు వేరే అవకాశం

ప్రమాదాలెట్లా ఎదురవుతాయో తెలియని నిరంతరం భయం!
ప్రకృతి కన్నెర్ర చేస్తే విరిగిపడే కొండ చరియల క్రిందనా?
దొంగచాటుగా వైరి విసిరిన బాంబుల దాడిలోనా?
స్వదేశ శత్రుదేశాల మధ్య జరిగే క్రాస్ ఫైరింగ్ లోనా?

మృత్యువు పలకరించే వరకు తెలియదు ఆ నిజం
అయినా వెరవరు అక్కడి ప్రజానీకం

సాగిస్తారు సామాన్య జీవనం
ఆలోచనలలో నిరంతర మధనం
ఎప్పటికాగేను ఈ దారుణ మారణ హోమమని!
ఇరుదేశాల మధ్య శాంతి సఖ్యతలెప్పుడని?

కాశ్మీర్ ఓ అందాల నిలయం
కాశ్మీర్ ఓ అయోమయాల విలయం

సరిహద్దు గ్రామాల సమస్యలెప్పుడు తీరాలని
నిరంతరం ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు
ప్రకృతి అందాల మధ్య భయం గుప్పిట్లో….

Written by Dr. Majji Bharathi

రచయిత్రి పరిచయం

ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము (2026) అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, బహుళ, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. మూడు కథలకు ప్రథమ బహుమతులు, నాలుగు కథలకు ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమల(కోడలమ్మకథలు)

ధీరలారా! ధీరులారా! శిరసాభివందనం