అనామకులెవరు? ( కాలమ్ )

 “అనామకుడు” అని తిరస్కరిస్తే అనర్థం తప్పదా? ప్రేమను గౌరవించని పెళ్లిళ్లు పిలుస్తున్న పర్యవసానం ఏంటి?’

ఆ మధ్య ఓ వార్త యువకుల మదిలో సంచలనం రేపింది. అదేమిటో తెలుస్తే మీరు కూడా అవాక్కవుతారు. కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్‌కి వెళ్తే, అక్కడ భార్య భర్తని కడతేర్చిన వైనం వింటే ఒళ్లు జలదరించక మానదు. అందుకు ఆ యువతికి ఆమె ప్రియుడు పరోక్షంగా సహకరించాడని తెలిసింది. వారిద్దరూ ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు.

ఈ ఘటన ఒక్కటే కాదు, ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వార్తలు విన్నప్పుడు ఎవరైనా అందుకు కారకులైన ఆ యువతులనే దోషిగా నిలబెడతాం. అది సహజం కూడా. కానీ సమస్య లోతుల్లోకి వెళితే, దీని వెనుక ఉన్న అసలు కారకులెవరో బోధపడుతుంది.

అసలు నన్నడిగితే, అమ్మాయిలను ఇటువంటి రాక్షస కృత్యాలకు ప్రేరేపించే దుష్ట శక్తులు ఏవంటే — వేరే ఎవరో కాదండోయ్, ఈ అమ్మాయిలను కన్న తల్లిదండ్రులే! ఆశ్చర్యపోతున్నారా? ససేమిరా ఒప్పుకోరా? సరే, ఇక నన్ను చెప్పనివ్వండి.

ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా, పెద్దలు తాము నిర్ణయించిన సంబంధమే చేసుకోవాలని నిర్బంధించే తల్లిదండ్రుల వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అంటాను. ఫలితంగా అభం శుభం తెలియని అమాయక మగపిల్లలు బలవుతున్నారు. ఈ కాలంలో కూడా పిల్లలు ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయకుండా బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం వల్లనే పర్యవసానం ఇలా ఏడుస్తోంది. చూస్తుంటే మనం మళ్ళీ రాతి యుగం వైపుకు పయనిస్తున్నామేమో అన్న అనుమానం కలగక మానదు!

ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన చెప్తాను, వినండి. మొన్నీ మధ్యే ఇంచుమించు ఇలాంటి సంఘటనే జరగబోయింది కానీ, అలా జరగకుండా నేను, మా వారు కలిసి కాపాడాం. మాకు అతి సన్నిహితులైన ఓ జంట మా ఇంటికి వచ్చారు. ఆవిడ పేరు ప్రసూన, ఆయన పేరు రవీంద్ర. ప్రసూన చనువుగా నేను కాఫీ కలపటానికి వంటింట్లోకి వెళ్తే, నాతో పాటు నా వెనకే తాను కూడా వచ్చింది. “ఇప్పుడేమీ వద్దు మానసా, ముందు నా మాట విను. మేము చాలా చిక్కుల్లో పడ్డాం. మాకు మీ సలహా కావాలి. అందుకే ఇప్పుడు మేము వచ్చాం.” అంది.

అప్పుడు నేనన్నాను, “అయ్యో అలాగా? ఏమయింది చెప్పు ప్రసూనా! మాకు చేతనైన సహాయం చేస్తాం.” అన్నాను కాఫీ కలపడం ఆపి, తనతో పాటు తిరిగి హాల్లోకి వస్తూ.

హాల్లో రవీంద్ర కూడా మా వారి సలహా ఈ విషయంలో అడుగుతున్నట్టున్నారు…

రవీంద్ర అన్నారు, “అదే… మన దివ్యకి సంబంధాలు చూస్తున్నాం అని మీకు కూడా తెలుసు కదా!”

“ఆఁ అయితే..!”

“తను మేము చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో రిజెక్ట్ చేస్తోంది…”

“తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అడగలేదా?”

ఆ ప్రశ్నకు జవాబు ఈసారి ప్రసూన ఇచ్చింది.

“ముందు చెప్పలేదు కానీ, తరచి అడిగితే ఒప్పుకుంది. తీరా వాడెవడో అనామకుడిని ప్రేమించిందిట ఈవిడగారు. చూస్తూ చూస్తూ ఒక అనామకుడికి ఎలా ఇస్తాం?” అంది. మళ్లీ తనే, “అందుకే మీరైనా కాస్త దానికి బుద్ధి చెప్తారని, మీ సహాయం కోసం ఇవాళ మీ ఇంటికి వచ్చాం!” అంది.

అప్పుడు నేనన్నాను, “అది కాదు ప్రసూనా, దివ్య ఆల్రెడీ ఒకరికి మనసిచ్చింది అని తెలిసి కూడా మనం తనని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది తెలుసా! ఫస్ట్ ఎండ్ ఫోర్మోస్ట్, అంటే పాయింట్ నంబర్ వన్, ఏ అఘాయిత్యానికైనా పూనుకోవచ్చు. పాయింట్ నంబర్ 2 లేకపోతే తను గనుక కొంచెం ధైర్యం కలదైతే, తను ప్రేమిస్తున్న అబ్బాయితో లేచిపోవచ్చు. పాయింట్ నంబర్ 3. ఒకవేళ మీరు, మేము కలిసి అన్ని విధాలా నచ్చచెప్పి ఈ పెళ్లి గనుక జరిపించామే అనుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా… ఆ మధ్య పేపర్లో ఓ వార్త వచ్చింది. ఇలాగే ఎవరినో ప్రేమించిందని తెలిసి కూడా తల్లిదండ్రులు బలవంతంగా వేరే అబ్బాయితో పెళ్ళి జరిపించారు. ఆ వధూవరులు హనీమూన్‌కి వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయి తన భర్తని, తను ప్రేమించిన అబ్బాయితో కలిసి పైలోకాలకు పంపేసింది. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. కాబట్టి కాస్త మనమే తగ్గాలి. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరువు బజారున పడిందా లేదా? ప్లస్ అమాయకుడైన ఆ పెళ్ళికొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టం లేని పెళ్లి చేయడంలో…!” అని ప్రసూన వంక చూశాను తన రియాక్షన్ కోసం. తన కళ్ళల్లో అంతులేని భయం కనిపించింది.

ఇంతలో మా వారు అందుకున్నారు, “అవునండీ, మానస చెప్పింది అక్షరాలా నిజం. నా సలహా ఏంటంటే, కొద్ది రోజులపాటు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. ఆమెను కొద్ది రోజుల పాటు తను ప్రేమించిన అబ్బాయిని గమనించమనండి. అతను ఎటువంటి వాడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, క్యారక్టర్ ఎటువంటిది , అతని ప్రేమ ఎంత నిజమైందో కొన్ని పరీక్షలు పెట్టి తెలుసుకోమనండి. అతను పాస్ అయ్యాడనుకోండి, అప్పుడు చూడొచ్చు. ఫెయిల్ అయితే సమస్యే లేదు.” అంటూండగా నేను కల్పించుకుని ఇలా అన్నాను, “అసలైనా ప్రేమించుకోవడం మీద నీకు ఎందుకు అంత ఏహ్య భావం? ఈ రోజుల్లో ఆడపిల్లలు తమ వరుడ్ని తామే ఎన్నుకుంటున్నారు. పేరెంట్స్ కూడా ఒప్పుకోక తప్పట్లేదు. ఒప్పుకోకపోతే మాత్రం ఎటువంటి పర్యవసానానికైనా సిద్ధంగా ఉండాలి. ఇదేమీ టీనేజ్ లవ్ కాదు కదా! మీ అమ్మాయి మేజర్. తన జీవిత భాగస్వామిని తానే ఎన్నుకునే హక్కు ఆమెకుంది. ఈ జనరేషన్ పిల్లలు ప్రేమ వివాహాలవైపే మొగ్గు చూపుతున్నారు. ఇక అతను అనామకుడు అయితే ఏంటి మన అమ్మాయిని చేసుకున్నాక అతను మన ఫామిలీ మెంబర్ అవుతాడు కాబట్టి దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఏమంటారు అన్నయ్యగారు?” అన్నాను రవీంద్ర వైపు చూస్తూ.

రవీంద్ర, ప్రసూన ఇద్దరూ మా మాటలకు కన్విన్స్ అయినట్లు కనిపించారు. ఇద్దరూ ముక్తకంఠంతో మాకు ధన్యవాదాలు చెప్పారు. “నిజంగా మీరు ఒక అనర్థం జరగకుండా కాపాడారు” అని మా ఇద్దరినీ మెచ్చుకున్నారు. “ఈ శుభ సందర్భంలో ఓ కప్పు కాఫీ తీసుకుని వెళ్ళండి” అన్నాను వాతావరణాన్ని తేలిక చేస్తూ!
***

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుసుకుందాం!

 ఏమిటో ఈ తిప్పలు?