“అమరనాథ్ యాత్ర”

యాత్ర

హిందువుల తీర్థయాత్రలలో అతి ముఖ్యమైనది, మంచుకొండలలో కొలువైన అమరనాథుని దర్శనయాత్ర. ఈ అమరనాథ్ గుహలోనే శివుడు పార్వతికి అమరత్వం గురించి ఉపదేశించాడని పౌరాణిక కథనం. ఈ యాత్ర ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలలలో (సుమారు 40 రోజులు) మాత్రమే ఉంటుంది. రాఖీపౌర్ణమితో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర కోసం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రోజుకు 15 వేలమందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలనుండి ఈ రిజిస్ట్రేషన్లు మొదలౌతాయి. ఈ యాత్ర చెయ్యాలనుకునేవారు, తప్పనిసరిగా గుండెకు, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది.

ఇంత జాగ్రత్త ఎందుకంటే, అమరనాథ్ గుహ, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తైన ప్రదేశంలో శ్వాసకోశ సమస్యలొచ్చి, ఊపిరితిత్తులలో నీరు చేరి ప్రాణాపాయం సంభవించే అవకాశాలెక్కువ. ముఖ్యంగా వృద్ధుల్లో, ఆస్తమా మొదలగు శ్వాసకోశ వ్యాధులున్నవారిలో, గుండె జబ్బులున్న వారిలో రిస్కెక్కువగా ఉంటుంది.

ఈ యాత్రలో అడుగడుగునా ప్రకృతి మనముందు అందంగా ఆవిష్కృతమవుతూనే ఉంటుంది. జలజల దూకే సెలయేర్లు, గలగల శబ్దం చేస్తూ ముందుకు సాగే నదీనదాలు, ఎత్తైన పర్వతాలు, మంచు శిఖరాలు, మధ్యమధ్యలో హిమానీనదాలు, పచ్చని చెట్లు, పచ్చదనం కప్పుకున్న లోయలు… మనసుని గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. వర్ణించాలనుకున్నా మాటలు చాలవు. ఎదలో అనుభూతులు నింపుకోవాలి తప్పించి.

అమరనాథ్ గుహ జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో, అనంతనాగ్ జిల్లాలో, పెహల్గాం తాలూకాలో, లిడ్డర్ లోయలో ఉంది. ఈ గుహ 40 మీటర్ల ఎత్తులో, విశాలంగా ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభువు. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం. పైనుండి నీరు చుక్క చుక్కగా క్రిందకు జారితే, అది ఘనీభవించి లింగాకారంలో కనిపిస్తుంది. దీనినే స్టాలగ్మైటంటారు. దీని ప్రక్కన మరో రెండు మంచు లింగాలుంటాయి. వీటిని పార్వతి, గణేషులకు ప్రతీకగా భావిస్తారు.

గుహ ఎత్తుగా ఉన్నందువలన చాలా దూరం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. గుహ అంటాం గాని, చాలా పెద్ద హాలులా ఉంటుంది. మీదకు వెళ్లడానికి, క్రిందకు దిగడానికి వేర్వేరుగా మెట్లుంటాయి.

గుహకు వెళ్లే దారిలో మనకు పెహల్గాం, చందన్వారి, శేషనాగ్ లేక్, మహాగణేష్ పర్వతం, పంచతరణి ఉంటాయి. వీటిల్లో వరుసగా నందిని, చంద్రుడిని, శేషుడిని, గణేశుని, పంచభూతాలను విడిచి, పార్వతీదేవిని తీసుకొని ఈ గుహకు శివుడు చేరుకుని, అమరత్వం గురించి ఉపదేశించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ గుహను దర్శించిన మొట్టమొదటి వ్యక్తి భృగు మహర్షని నమ్మకం.

ఈ గుహను చేరుకోవడానికి, పెహల్గాం- చందన్వారి (43 km), బాల్తాల్ (13 km) మార్గాలున్నాయి. త్రోవంతా చీనాబ్ కు ఉపనదైన, అమర్నాథ్ నది కనిపిస్తుంది.

ఈ యాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చినా, యాత్రికులందరూ ముందు జమ్మూ బేస్ క్యాంపులో (బనిహాల్ పోలీస్ స్టేషన్ పరిధి), ఆధార్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు చూపించి ఐడి కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడి కార్డులు లేకపోతే, ప్రయాణం ముందుకు సాగదు. క్రిందటి సంవత్సరం జూలై 12 వ తారీకున మేమక్కడికి చేరుకుని, బేస్ క్యాంపు నుండి జమ్మూకి వెళ్ళాం. అక్కడ కనీసం మూడు, నాలుగు చెకింగ్ పోయింట్లలో మనుషులను, లగేజీలను తనిఖీ చేస్తారు. చెక్ పాయింట్లు దాటాక, భాండార్స్ ఉంటాయి. అక్కడ భోజనం, టీ, టిఫిన్లు ఫ్రీగా యాత్రికులకు సప్లై చేస్తారు దాతలు. కూర్చోవడానికి, కొన్నిటి దగ్గర పడుకోవడానికి కూడా ఏర్పాట్లుంటాయి.

ఆ రాత్రి ఆశారాం బాపు (అప్పటికే అతను అరెస్టయ్యాడు) ఆశ్రమంలోని పెద్ద హాలులో విశ్రాంతి తీసుకుని, 13వ తారీకు ఉదయం రెండింటికే బాల్తాల్ బయలుదేరాం. అక్కడనుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగ్రత్ హెలిపాడ్ ఏరియాకు చేరుకున్నాం. ఆ మార్గంలోనే సోన్ మార్గ్ కూడా ఉంటుంది. మార్గమధ్యంలో ఎన్నో టన్నల్స్ దాటుతాం. 9 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్స్ కూడా ఉన్నాయి. నీలగ్రత్ చేరేసరికి సాయంకాలం నాలుగయింది.

అప్పటికి రెండు మూడురోజుల నుండి మంచు విపరీతంగా కురియడంతో, హెలికాప్టర్లు క్యాన్సిలవడంతో, యాత్రికులు చాలామందే ఉన్నారు. టికెట్లిచ్చి కూడా సాయంకాలం ఆరింటికి హెలికాప్టర్ సర్వీసులనాపి, వెనక్కి వెళ్ళిపొమ్మంటే అందరం ప్రొటెస్ట్ చేశాం. దాంతో మరుసటి రోజు ఉదయానికి టిక్కెట్లను ఇష్యూ చేశారు. ఆ రాత్రి నీలగ్రత్ లో టెంట్లలో ఉండి, 14వ తారీకు ఉదయాన్నే బయలుదేరి 8: 30am కు పంచతరణి చేరుకున్నాం.

హెలికాప్టర్లో మనుషుల బరువును బట్టి ఐదుగురు లేదా ఆరుగురిని పంపిస్తారు. లగేజీ కూడా హ్యాండ్ లగేజీయే ఉండాలి.

పంచతరణిలో ప్రీపెయిడ్ పోనీ, పాలకి పాయింట్లుంటాయి. మూడు కిలోమీటర్లే, నడుద్దామని బయలుదేరాం. గాని 5-6km దూరముంది. పచ్చ కర్పూరాన్ని దగ్గరుంచుకున్నాం. మార్గమంతా కొండ అంచుల్లోనే ఉంటుంది. కిందకి చూస్తే నది ప్రవహిస్తూ, ప్రక్కకు చూస్తే మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు. నదికి రెండవ ప్రక్కన కూడా ఎత్తైన కొండలే. నిల్చుని ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిద్దామంటే, వెళ్ళేటప్పుడు అమరనాథుడిని దర్శించుకునే తొందరలో ఉంటాం. వచ్చేటప్పుడు అలసిపోతాం. కానీ ఈ మధ్యలోనే కొన్ని ఫోటోలు తీసుకుంటే మనకు జ్ఞాపకాలుగా మిగులుతాయి.

మనం వెళ్లే మార్గంలో కూడా పెద్ద గ్లేషియర్స్, వాటిని తొలిచి మార్గాన్ని చేస్తూ కార్మికులు కనిపిస్తుంటారు. ఆ గ్లేషియర్స్ మీద నడిచినప్పుడు, జారుగా ఉండి, పడిపోయే అవకాశాలెక్కువ. కనుక జాగ్రత్తగా నడవాలి. సగం మార్గానికి చేరుకోగానే మనకు దూరంగా అమరనాథుని గుహ కనిపిస్తుంది. చూడగానే మనసు పులకరించిపోతుంది, కాస్సేపట్లో దర్శించుకోబోతున్నాం కదా అని. గాని ఇంకా చాలా దూరం నడవాల్సి వచ్చింది.

ఎత్తుకు వెళ్లే కొద్దీ త్రోవ ఇరుగ్గా ఉంటుంది. వచ్చీపోయే పాలకీలు, పోనీలు, మనుషులు… నడిచేవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దానికి తోడు ఆక్సిజన్ అందక, శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుంది. మధ్య మధ్యలో ఆగుతూ, పచ్చ కర్పూరాన్ని పీల్చుకుంటూ, ముందుకు నడవాల్సి ఉంటుంది.

లిడ్డర్ లోయకు వచ్చేటప్పటికి, పోనీలను ఆపేస్తారు. చుట్టూ వందలకొద్దీ పోనీలుంటాయి. మన ముందు ప్రవహిస్తూ అమరనాథ్ (పంచ తరణి) నది ఉంటుంది. నదికి ఒకవైపు నడిచే మార్గముంటే , ఇంకొక వైపు పోనీలు వెళ్లే మార్గముంటుంది. పోనీలు గుహ వరకు వెళ్తాయి. ఈ రెండు మార్గాలూ గుహ ముందు భాగంలో కలుస్తాయి. నడిచే మార్గంలోనే, చిన్నబ్రిడ్జి మీదనుండి నదిని దాటి వెళ్తే, చాలా టెంపరరీ స్ట్రక్చర్స్… ఆర్మీ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, చిన్న షాపులు, నదీ స్నానం చేశాక బట్టలు మార్చుకోవడానికి గదులు, భాండార్లు… చిన్న ఊరిలా ఉంటుంది. అక్కడే మన ఫోను డిపాజిట్ చెయ్యాల్సుంటుంది. గుహకు కొద్దిదూరంలో, చెకింగ్ చేస్తారు.

దూరంగా ఎత్తులో అమరనాథుని గుహ కనిపించగానే, అప్పటివరకు పడిన శ్రమనంతా మర్చిపోయి, మనసు తేలికైపోతుంది. ఎప్పుడెప్పుడు అమరనాధుని చూస్తామా అని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తాడు గాని, సుమారు కిలోమీటర్ దూరమైనా ఉంటుందేమో! ఎంతకీ దూరం తరగదనిపిస్తుంది. దగ్గరకొచ్చేటప్పటికి రెండు లైన్లు ఫార్మ్ చేసి, భక్తులను గుహకు పంపిస్తున్నారు.

చెప్పాను కదా! గుహ చాలా విశాలంగా, పైకప్పు చాలా ఎత్తులో ఉంటుంది. గుహ కుడిచేతి వైపు, ఎదురుగా మంచులింగం. మూడు నాలుగడుగుల ఎత్తున్నా, కొద్దిగా పలుచబడుతూ… వ్యయప్రయాసలకోర్చి, దర్శించాలనుకున్న అమరనాథ్ స్వయంభూ మంచులింగం, కళ్ళ ముందు కనిపించగానే, జన్మ ధన్యమైందనిపించింది. అలా చూస్తూ ఎంతసేపున్నానో! ఎంత చూసినా తనివితీరడం లేదు. గుహ మధ్యలో ఒక ఆకృతి వెడల్పుగా, ఎడమచేతి వైపు ఇంకొక మంచు ఆకృతి… పార్వతి, గణేశులకు ప్రతీకలు. ఈ మంచు ఆకృతుల వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడుంటుంది. బారికేడ్ ముందు ఎత్తైనపీఠం మీద, శివపార్వతులు, గణేష్, కార్తికేయులు పూజలందు కుంటున్నారు.

గుహనుండి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు చుట్టూ చూస్తే, మధ్యలో నది, అటూ ఇటూ జన ప్రవాహం, మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన నీలి ఆకాశం, అలా సాగుతూ తెలి మబ్బులు… ఎంతసేపు చూసినా తరగని సౌందర్యం… అలా కళ్ళల్లో నింపుకోవాలనిపిస్తూనే ఉంటుంది. గాని హెలికాప్టర్ సేవలు సాయంకాలం ఆరు గంటలకు క్లోజ్ చేస్తారని, ఆ టైంలోగా పంచతరణి చేరుకోవాలని ఆత్రుత.

మధ్యాహ్నం ఒంటిగంటకు వంతెన దాటి గుహకి నడవడం మొదలు పెడితే, నాలుగు గంటలకు మరల అక్కడికొచ్చాం. ఆశ్చర్యం… పైకి వెళ్ళినప్పుడు సన్నని పాయలా ఉన్న నది, ఇప్పుడు పెద్దదై, బట్టలు మార్చుకునే గదులను, అడుగు ఎత్తున ముంచింది. మధ్యాహ్నం దాటాక, మీదున్న గ్లేషియర్ కరిగి, నదీ ప్రవాహం పెరుగుతుంది. హఠాత్తుగా వాతావరణం కూడా మారిపోవచ్చు. మేఘాల విస్పోటనం జరిగితే, వరదలు సంభవించవచ్చు. అందుకని ఎంత తొందరగా పంచతరణి చేరుకుంటే అంత మంచిది. మార్గమధ్యంలో చిక్కుకుపోవాల్సి వస్తే, ప్రాణాలకు హామీ ఉండదు. క్రిందకు చేరుకునేసరికి హెలికాప్టర్ సర్వీసెస్ ఆపడం వలన, ఆ రాత్రికి పంచతరణిలో, టెంటుల్లో ఉండిపోయాం.

గుహకు వెళ్లడానికి నడక మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు, ఆయాసంగా అనిపిస్తే కాస్సేపు ఆగి, నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ, పెరిగిపోతున్న హృదయ చలనం మామూలైన వరకు ఆగి, మరల ప్రయాణాన్ని సాగిస్తే సులువుగా ఉంటుంది. కంగారు పడాల్సిన పనిలేదు. ఎక్కడకక్కడే సైనికులుంటారు. మనకి కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.

పంచతరణి నుండి నీలగ్రత్ చేరుకొని, ఆరోజు జీరో పాయింటుకు వెళ్ళాం. జీరో పాయింటనేది గ్లేషియర్. మీదకు వెళ్లడానికి స్నో బైక్స్ ఉన్నాయి. మీదకు నడిచి వెళ్లి, కిందకు దిగడానికి స్లెడ్జిలు కూడా ఉన్నాయి. అన్ని వయసుల వారూ చిన్న పిల్లలై, ఆ హిమానీనదంలో కేరింతలు కొడుతున్నారు. అక్కడనుండి లెహ్ బోర్డరుకు వెళ్ళాం. ఇక్కడకు కార్గిల్ 100 కిమీ, లడఖ్ 328 కిమీ.

ఈ యాత్రలో ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను.

ఒకటి, యాత్రికుల భక్తి తత్పరత. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఆకుంఠిత దీక్షతో ఈ యాత్రను చేస్తారు. ఈ యాత్ర అడుగడుగునా సవాళ్లతో కూడుకొని ఉంటుంది. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ముష్కరుల దాడులు. ఏదైనా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి… అయినా వెరవరు భక్తులు.

రెండవది మన సైనికుల కార్యదక్షత, దీక్షత. అడుగడుగునా మనకు భద్రత కల్పించడానికి, అహోరాత్రాలు శ్రమిస్తారు. ఆ కొండల అంచుల్లో, తుపాకీలను మోస్తూ పహారా కాస్తుంటారు. వారికి జోహార్లు అర్పించవలసిందే!

మూడవది దాతల సేవాతత్పరత. జమ్మూ బేస్ క్యాంపు నుండి, లంగర్ (భాండార్)లలో, నిస్వార్ధంగా, పిలిచి మరీ, యాత్రికులకు భోజనఏర్పాట్లు చూస్తారు. కావలసినంత పెట్టించుకోవచ్చు. గాని ఆహార పదార్థాలను వృధాచేస్తే మాత్రం ఒప్పుకోరు. మనం కూడా విరాళమివ్వచ్చు. స్వచ్ఛందంగా సేవ చెయ్యొచ్చు కూడా.

ఇంక పల్లకీల, పోనీల వాళ్ళు. వారిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నా, మనలను భద్రంగా తీసుకెళ్లి, భద్రంగా తీసుకొస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.

బాల్తాల్ నుండి మిలటరీ క్యాంపులు తప్పించి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండవు. యాత్రకోసం వేసిన గుడారాలు, టెంపరరీ షెడ్డులు మాత్రమే ఉంటాయిక్కడ. యాత్రున్న రోజుల్లో తప్పించి అక్కడ, పౌర జీవనముండదు. ఆర్మీ మాత్రం నిరంతరం పహారా కాస్తూనే ఉంటుంది.

అమరనాథ్ యాత్ర చెయ్యాలనుకున్నవారు, ఎటువంటి పరిస్థితికైనా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. శారీరక ధారుఢ్యాన్ని కూడా పెంచుకుంటే మంచిది. పెహల్గామ్ దాటాక, టెంట్లలోనే నిద్రించవలసి ఉంటుంది. పగటి ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో, రాత్రి అంత చల్లగా ఉంటుంది. వర్షం పడితే సరేసరి. ఉష్ణోగ్రతలు బాగా చల్లబడతాయి. అందుకని ఉలెన్ స్వెటర్లు, షాల్స్, గ్లౌస్, సాక్సులు, మఫ్లర్లు, వార్మర్స్ తీసుకెళ్లడం తప్పనిసరి. రైయిన్ కోట్, క్యాప్, సన్ స్క్రీన్ లోషన్ కూడా.

మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, భగవంతుని అనుగ్రహం తప్పనిసరని అర్థమౌతుంది మనకిక్కడ. ఏ క్షణమైనా యాత్ర నిలిచిపోవచ్చు. మనం వెళ్లే దారిలో మంచువర్షమే కురవచ్చు, కొండచరియలు విరిగిపడొచ్చు, మేఘ విస్ఫోటనం జరగొచ్చు. శత్రుదేశ సైనికులు తుపాకి గురిపెట్టవచ్చు. ఇన్ని అవాంతరాలుండే అవకాశమున్నా, భగవంతుని అనుగ్రహం మాపై పుష్కలంగా ఉండబట్టి, చక్కగా ఎటువంటి ఆటంకము లేకుండా, అమరనాథుని దర్శనం చేసుకుని, మధురానుభూతులను మూటగట్టుకొని, వైష్ణోదేవి దర్శనానికి పయనమయ్యాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“శుభ ముహూర్తం”- 6వ భాగం

భజన పాటలు