ఆరోజు మా ఒకటో తరగతి పిల్లలంతా కట్టగట్టి నా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.అంతలోనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఏమైందబ్బా వీళ్ళకు.ఏమిటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు?
ఇంటర్ వెల్ లో పిల్లల అటెండెన్స్ రిజిష్టర్లో పేర్లు రాసుకుంటున్న నాకు ఏమి అర్ధం కాలేదు.
రిజిస్టర్ పూర్తి చేసి పక్కకు పెట్టగానే టీచర్! టీచర్! అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పుతూ బోలెడంత ఆశ్చర్యాన్ని ఒలకబోస్తూ ఇగ్గో! ఇగ్గో నీకు తెలుసా! అంది ఓ చిట్టి బంగారు.
చెప్పకుండానే నాకేం తెలుస్తుంది? అదేమిటో చెప్పు? అనగానే ఇంతలో ఓ బుజ్జి కన్నయ్య ఏదో పరిశోధన చేసి కనిపెట్టిన వాడిలా నా దగ్గరకు వచ్చి టీచర్! టీచర్! మన బడికి అమెరికోడు వచ్చిండు టీచర్! అన్నాడు.
ఆఁ ! అమెరికోడా? ఎవరబ్బా అతడు? నాకు కూడా చాలా చాలా ఆశ్చర్యం వేసింది.
ఇగ్గో టీచర్! వాడు.. వాడు మన దగ్గరికే వస్తడు టీచర్. ఒకటో తరగతే. మా అత్త చెప్పింది. మరో బుజ్జి కన్నమ్మ వివరణ.
ఇలా మా మాటలు సాగుతుండగానే ఆ అమెరికోడిని తీసుకుని నా దగ్గరకు వచ్చింది వాళ్ళమ్మ.
ఓ పంతులమ్మా! మా తెల్లోడికి కాసింత గట్టిగ చెప్పండి.వీడుట్టి బెదురుగొడ్డు” అని నా దగ్గర కూచోబెట్టి వెళుతుంటే బేర్ మని ఏడవడం మొదలు పెట్టాడు. తెల్లగా వున్న వాడు కాస్త ఏడుస్తుంటే ఎర్రగా కందిపోయాడు. వాడి ఏడుపును ఆపేసరికి తాతలు దిగొచ్చారు. మిగతా పిల్లలకైతే ఓ వినోదం లా ఉంది. వాడినే వింతగా చూస్తూ ఉన్నారు.
మొత్తానికి వాడిని దగ్గరకు తీసుకొని ఓ చాక్లెట్ చేతిలో పెట్టి ఏడుపు మాన్పించాను.
ఏం పేరు నాన్నా? అడగ్గానే వెక్కుతూ అమెరికోడు అన్నాడు. నాకైతే నవ్వాగలేదు.కానీ నవ్వితే మళ్ళీ ఏడుపందుకుంటాడేమోనని “మరి మీ అమ్మ అలా చెప్పిందే? అనగానే “మా అమ్మొక్కతే నన్ను తెల్లోడు అంటుంది టీచర్! ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు. వాడు అనే తీరుకు నవ్వాపుకోలేక కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నా.
వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్న పిల్లల్లో ఓ సందేహం ” ఇంతకీ వీడు తెల్లోడా? అమెరికోడా? గుసగుసలు.
ఇంతలో హెచ్చెం గారు అడ్మిషన్ ఫాం పంపించారు.అందులో వాడి పేరు అరవింద్ అని వుంది.
ఒరేయ్! నాన్నా! నీ పేరు అరవింద్. రా! అన్నాను. కాదు టీచర్ నాపేరు అమెరికోడు.
ఇంతకాలం వాడి పేరేమిటో వాడికి తెలియదని తెలిసింది.
రోజూ అటెండెన్స్ పిలవడం వాడేమో ఉలుకు పలుకు లేకుండా కూర్చోవడం. ఎన్నిసార్లు చెప్పినా వాడి పేరును వాడు అస్సలు ఒప్పుకోలేదు.
ఇక వాడు తెల్లని పాలిపోయిన రంగులో,రాగి రంగు జుత్తుతో, చిన్న కళ్ళు తెల తెల్లని కనుబొమ్మలతో వింతగా కనిపించాడు.
నేనలా చూస్తుంటే ఏమనిపించిందో వాడు మొగ్గలా ముడుచుకు పోయాడు.
ఇక పిల్లల సంగతి సరే సరి. ఆ బుజ్జి కన్నయ్యను ఓ వింత మనిషిలా చూడసాగారు.
నేను వెంటనే తేరుకుని ఇటురా కన్నయ్యా! అని ఎంత పిలిచినా కుందేలు పిల్లలా ముడుచుకుని అలాగే కూర్చున్నాడు.
ఎంతో అనునయంగా, ప్రేమగా పిలిస్తే కానీ వాడికి నా మీద నమ్మకం కుదరలేదు.
దగ్గరకు రాగానే వాడి భుజం మీద చెయ్యి వేయబోయాను.అంతే ఉలిక్కిపడి భయపడుతూ గదిలో ఓ మూలకు పరిగెత్తాడు. ఆ కన్నయ్యకు నా చేతి స్పర్శ నచ్చలేదా?అర్థం కాలేదు.
అలా వారం రోజులు దగ్గరకు పిలవగానే దూరంగా పారిపోవడం,పిల్లలతో కలవకుండా ఎవరొచ్చి దాడి చేస్తారోనని భయపడటం గమనించాను. ఈ కన్నయ్య మనసుకేదో బలమైన గాయమే అయ్యింది అనుకున్నా.
నా చాక్లెట్లు,పాపిన్స్ అస్త్రాలు ప్రయోగిస్తూ నెమ్మదిగా దగ్గరకు రప్పించుకుని మాట్లాడించడం, పిల్లల జట్టు ఆటల్లో పాల్గొనేలా చేయడంతో కొంచెం కొంచెం మార్పు వచ్చింది.
ఇంతకూ ఆ బుజ్జి కన్నయ్య అంతగా బెదిరిపోయి దూరంగా ఉండటానికి కారణం తెల్లని వాడి శరీరాన్ని తాకి గిల్లడం.ఎర్రగా కందిపోతే అమెరికోడు ఎర్రటోడు అయ్యిండురోయ్ అని తెలిసిన వాళ్ళు, బంధువులు అలా చేస్తుంటే వాళ్ళ అమ్మకి చెబితే నువ్వు తెల్లోడివిగా ప్రేమతో అలా చేస్తున్నారని అనడంతో వాడి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అందుకే అందరికీ దూరంగా ఉంటుండని వాడి మాటలు,ప్రవర్తన ద్వారా అర్థమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి..వాడి వంటి మీద అక్కడక్కడా కమిలిన మచ్చలు..
ఆ కన్నయ్యను అమెరికోడు అని ఎవరు పిలిచినా పలకొద్ధనీ అరవింద్ అంటేనే పలకాలని చిన్న చిన్నగా మార్పు వచ్చేలా చేశాను.
వాళ్ళ అమ్మను పిలిపించి ఆ పసివాడి మనసును అర్థం చేసుకొమ్మని,వాడిని ఎవరూ తాకకుండా జాగ్రత్త చూసుకొమ్మని చెప్పాను. ఇంతకూ వాళ్ళు ఆ ఊరికి బతకడానికి వచ్చిన వాళ్ళు. ఆ సంవత్సరంలో మార్పు వచ్చి మామూలు పిల్లల్లా స్వేచ్ఛగా తిరిగే సమయంలో ఎటో వెళ్తున్నారని తెలిసింది.
తన కొడుకును మార్చినందుకు కృతజ్ఞతగా చెప్పడానికి వచ్చిందా తల్లి. నన్ను చుట్టేసుకుని నేను నీతోనే ఉంటా టీచర్! నేను వెళ్ళనని ఏడుస్తుంటే పిల్లలంతా వాడిని చూస్తూ ఏడవడం మొదలు పెట్టారు. నేను కూడా తట్టుకోలేక పోయాను.నాకు తెలియ కుండానే కళ్ళ నుంచి జారిన కన్నీళ్ళు వాడి తలమీద. తలెత్తి చిట్టి చేతులతో నా కళ్ళు తుడుస్తూ ” ఏడవకు టీచర్ మళ్ళీ వత్తా ! పిల్లల కళ్ళు కూడా తుడిచి వెక్కుతూ వెళ్ళిపోయాడు.
అలాంటి పిల్లలు కనబడినప్పుడల్లా అమెరికోడు కాదు కాదు అరవింద్ గుర్తొచ్చి గుండె బరువెక్కుతుంది.