కాగితం పడవ-1

నూతన ధారావాహికం

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి రేణుక అయోల తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. నాలుగు కవితా సంపుటాలు , ఒక కథా సంపుటి, రెండు దీర్ఘకావ్యాలు రచించి ప్రచురించిన అనుభవజ్ఞురాలు. తరుణి పత్రికకు ధారావాహిక నవలగా “కాగితం పడవ” నవలను అందిస్తున్నారు. ‘ సరోగసి’ అనే అంశంపై సాగుతున్న నవల ఇది. ఈ సమాజంలో స్త్రీల జీవితాలలో సంతానం, సంపాదన రెండూ వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టేవే అనే ధోరణి ఉన్నది. ఆర్థిక వనరులు లేని కుటుంబాలలో ఆడపిల్లల కష్టాలు, తల్లిదండ్రులపై వాళ్ళకుండే బాధ్యత వంటి విషయాలను ప్రోది చేస్తూ శాస్త్రీయ విధానాలతో వైద్య శాస్త్ర విషయాలతో నడిచే కథ తో ఈ నవల ఆసక్తికరంగా ఉంటుంది . చదవండి చదివించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక ఎడిటర్.

గోడ గడియారం సాయంత్రం 5 గంటలు కొట్టింది. కింద హాల్లో నిశ్శబ్దాన్ని తరిమేస్తూ! ఎప్పటిదో ఈ గోడ గడియారం

నా వయసుదే. నేను పుట్టినప్పుడు కొన్నారట! అయినా ఇప్పటికీ పనిచేస్తోంది. నాన్నకి చాలా ఇష్టమైనది… అందరికీ ఇష్టమైందే!ఒక్కోసారి విసుగు వస్తుంది – టంగు టంగు మంటూ మంచి నిద్రలో ఉలిక్కి ఉలిక్కిపడి నిద్రలేచేలా చేస్తుందినాన్న! అంటూ నాన్నకి కంప్లైంట్ చేస్తే, “అదే నీకు నీ సమయాన్ని గుర్తు చేస్తోంది…

సమయం విలువలు నేర్పిస్తుంది కూడా!

అన్నప్పుడు నాన్న మీద కూడా కోపం వచ్చేది.“కొత్తది, నిశ్శబ్దంగా ఉండేదని కొందాము” అని చిన్నప్పుడు గొడవ చేసేదాన్ని! నాన్న విని వినట్టు ఉండేవారు. క్రమంగా అలవాటు అయ్యిపోయింది… ఇప్పుడు అది గంటలు కొట్టకపోతే తోచదు అనుకుంది ఇందు!

.హఠాత్తుగా వర్షం మొదలైంది. భూమికి, ఆకాశానికి మధ్య వాన తెర వేసినట్లు. కాలేజీ నుంచి నయనిక ఇంకా రాలేదు. వర్షం పడుతోందని ఎక్కడైనా ఆగిపోయి ఉంటుంది.

ఎన్నోసార్లు కృష్ణ అన్నాడు తన కారు వాడుకోమని. చెప్పినావినదు – తన స్కూటర్‌పైనే వెళ్తుంది…

“పార్కింగ్ ప్రాబ్లెం” అంటుంది. మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌లో కారు నడపడం కష్టం అనుకుంటూ…

నిజమే కదా! రోడ్డుపై బైకులు, స్కూటర్లు విన్యాసాలు చేస్తూ – ఒక్కోసారి ఫుట్‌పాత్ నుంచే దూసుకెళ్తుంటాయి. అంత తొందర ఎందుకో అనిపిస్తుంది. వాళ్ల ప్రాణాలకూ, ఎదుటివారి ప్రాణాలకూ కూడా ప్రమాదమే కదా. అయినా ఎవరూ పట్టించుకోరు. ఎవరి దారి వాళ్లది, ఎవరి తొందర వాళ్లది…ఫోన్ చేతిలో పట్టుకుని మెట్లు ఎక్కి బాల్కనీలో నిల్చుంది ఇందు. వర్షం తగ్గిపోయింది. చిన్నగా జల్లు పడుతోంది. వర్షం చేసిన పిల్లకాలువల్లో కాగితం పడవలను చేసి వదిలేస్తే – అవి ఊగుతూ, మునుగుతూ, తేలుతూ ఉంటే, వాటి వెనక పిల్లలు పరుగులు తీస్తూ ఆడుకుంటున్నారు! వాళ్లు అక్కడ కాలనీ బట్టలన్నీ ఇస్త్రీ చేసే మల్లేశం పిల్లలు,ఆ చుట్టుపక్కల పిల్లలుఅందరూ కలిసి హాయిగా ఆడుకుంటున్నారు….

నవలా రచయిత్రి రేణుక అయోలా

ఎంత నిశ్చింతగా ఆడుకుంటున్నారు! ఎలాంటి భేషజాలు లేకుండా. ఆ దృశ్యం – “బాల్యం కిటికీ తెరిచి చూడు” అన్నట్టుగా ఉంది! వాళ్ల ఆట చూస్తే  – ఎలాంటి బంధనాలు లేని జీవితాలు!ఇక్కడి అపార్ట్‌మెంట్ పిల్లలు ఇలా వర్షంలో ఆడుకోగలరా? గ్రేటర్ కమ్యూనిటీ పిల్లలకి వస్తుందా?

ఆ స్వేచ్ఛ? చదువులు, ఫోన్లు, పోటీలు, స్టేటస్ సింబల్స్‌లో మునిగిపోయాక వాన వెల్లువలో తడుస్తూ ఆడే స్వేచ్ఛ ఎక్కడ? వెన్నెలని అర్థం చేసుకోగలరా? నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకుంటూ

బాల్కనీ రైలింగ్ దగ్గర నిల్చున్న ‘’ఇందుని’ వెతుక్కుంటూ వచ్చింది నయనిక.“అమ్మా! ఇక్కడ ఉన్నావా? కింద అంతా వెతికాను. నాన్న వచ్చారేమో అనుకున్నాను,” అంది.“నాన్న వచ్చే వారానికికదే వస్తారు, మర్చిపోయావా

లేదు. నువ్వు మేడ మీద ఉంటే‘నాన్న’

సడన్గా వచ్చారేమో అనుకున్నా!

మీ నాన్నకి అంత తీరిక కూడానా?

చెప్పిన టైంకి వస్తే అదే మహాభాగ్యం.!

ఈ వర్షంలోఆ పిల్లల ఆటను చూస్తూ..

నీకోసమే ఎదురు చూస్తున్నాను.

వర్షంలో ఎక్కడైనా ఆగవేమో అనుకుంటూ.

ఇంతలో నువ్వే వచ్చావు. వానలో తడిసినట్లు ఉన్నావు,అన్నాను….

అవును, రైన్ కోట్వేసుకోలేదు.వర్షం తగ్గిందని బయలుదేరగానే కురిసిన కొద్దిపాటి జల్లులకే  తడిసిపోయాను ఇంటికి వచ్చేలోగా అంది…

నువ్వు ఫ్రెష్‌అప్ అవుతావా? కాఫీ కలుపుతాను,

అన్నాను.ఒద్దునేను ఇవాళ మన ఇద్దరి కోసం కాఫీ చేస్తాను.

ఈ వర్షం చూస్తూ కబుర్లుచెప్పుకుంటూ తాగితేబాగుంటుంది. అంటూ కిందికి వెళ్తున్న నయనికని చూస్తూఅనుకున్నాను – ఈ అమ్మాయి నాదే.

నేనే కన్నాను! అవును కదా! ఎవరో ఎత్తుకుపోతున్నట్టు ఈ అలజడి ఎందుకు నాకు?

పైకి కట్టిన పోనీ, జీన్స్ టాప్, నీలి కళ్ళతో కొద్దిగా అలసిన ముఖం, తడిసిన టాప్… ఆ రూపం చూసి మనసులో మరోసారి మళ్లీ అనుకున్నాను – ఇంక నయనికని విడిచి ఉండలేనని.. అనిపించింది…

ఇవాళ నా మనసు ఎందుకింత గందరగోళంగా ఉంది? దేని కోసం ఇంత అలజడి? ఇవాళ ఆలోచనలు నన్ను ఒదలటం లేదు – 20 ఏళ్ల క్రితం జరిగిన జీవితపు ఆలోచనలు ఇవన్నీ…నేను సంతకాలుపెట్టినవేళ్లుగుర్తుకొస్తున్నాయి. నీలి కళ్లతో అందమైన శ్రీకాంత్ గుర్తొచ్చాడు. కోటిఆశలతో

మిలమిల లాడుతున్న వనజ కళ్ళుగుర్తొచ్చాయి.“మాదగ్గరకి వచ్చేయవా ఇందూ!” అంటూబతిమాలుకున్నఆవిడ చేతులు గుర్తుకొచ్చాయి. అయినా ఒక్క అడుగు వేయలేకపోయాను. తల్లి, తండ్రి.

అన్నీ తానే అయ్యి మమల్ని పెంచి పెద్ద చేసిన ‘నాన్నని ‘ఈ ఇల్లునివదిలిపెట్టలేకపోయాను.అలాంటి పరిస్థితుల్లో కృష్ణ నన్నుఆదుకోకపోయి ఉంటే నేను ఎలాంటి చిక్కుల్లో పడేదాన్నో ఊహిస్తే ఇప్పటికీ భయమే వేస్తుంది. ఎంత మొండిగా, ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నానో ఆలోచిస్తే మనసంతా చేదుగాఅయిపోతుంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నానా?

అని చాలా సార్లు అనుకుంటాను. తలుచుకుంటున్న

కొద్దీ నేనేనా? అనిపిస్తుంది.అసలు కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోయుంటే నా పరిస్థితి ఏమిటి?పెళ్లి కాని పిల్లగా తల్లి అయ్యుంటే సమాజం ముందుసరే!

‘నాన్న,అక్క,బావ.ముందు ఎలా నిలబడగలిగేదాన్ని? సమాజాన్ని లెక్క చేయలేని పరిస్థితిలో అప్పుడుఉన్నానేమోఆపరిస్థితుల్లోనేనుఏమీఆలోచించలేదు!

ఇప్పుడుఅనిపిస్తుంది – అప్పుడు నాన్నకి, అక్కకి ఏమి సమాధానం చెప్పేదాన్నో?

వాళ్లని ఎలా ఎదుర్కొనేదాన్నో అనుకోవడం చాలా ఆశ్చర్యంగానే ఉంది.

అధ్యాయం :2

 

“అమ్మా! అమ్మా!” అంటూ రెండు చేతుల్లో రెండు కాఫీ కప్పులు పట్టుకుని, నాకో కప్పు ఇస్తూ “ఇదిగో, నీ కప్పు తీసుకో” అని ఇచ్చింది నయనిక. నేను అలా దాన్నే చూస్తుంటే…“ఏమిటమ్మా! ఇవాళ నన్ను కొత్తగా చూస్తున్నట్లు, చూస్తున్నావు అని అడిగింది.

వెంటనే అనిపించింది – ఈ అమ్మాయి నాదే.

నేను ఎవరికీ ఇవ్వను!ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాను!

“అమ్మా!” అని పిలిచిన ప్రతిసారి, ఈ 20 ఏళ్ల చిన్నది నాదే అన్న భావమే మళ్లీ మళ్లీ వస్తోంది. ఆలోచనలోంచి తేరుకుంటూ…“ఆహా! ఏమీలేదు. ఇంత అందమైన పిల్లని నేనే కన్నానా అన్న సందేహంతో చూస్తున్నాను, అన్నాను.అంతా నీ పోలికే, అంది,

నా భుజంపై వాలుతూ.ఇద్దరం తాగిన కాఫీ ఖాళీ కప్పులను అక్కడే ఉన్న స్టూలుపై పెడుతుంటే, వర్షపు గాలిమా మధ్యలో దూరి ఇద్దరినీ చల్లగా చుట్టుకుంది.బాల్కనీలో నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న మా ఇద్దరి కళ్లకు పిల్లలు “కాగితం పడవలతో” ఆడుకుంటున్న దృశ్యం మళ్లీ కనబడింది. ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు.“నాకూ అలా ఆడుకోవాలని అంది.

అవును నాకు నా చిన్నతనం జ్ఞాపకం వస్తోంది వాళ్లను చూస్తూ ఉంటే! నేను దొడ్డమ్మ ఇలాగే ఆడుకునేవాళ్లం

అన్నాను,అవునా ఎంత అదృష్టం కద!అవునే వాళ్లనే చూస్తున్నాను. ఎంతటి స్వేచ్ఛకదా వాళ్ల జీవితానికి!” అన్నాను.

పోర్టీకోలో ఆగిన కారును చూసి, “తమ్ముడు వచ్చాడు, వాడిని అడుగుతాను,” అంటూ మెట్లు దిగి వెళ్లిపోయింది.

నామాటవినిపించుకుందోలేదోకూడాతెలియదు..

కొంతసేపటికి అక్క తమ్ముడుఆ పిల్లలతో కలిసి పోయి

వాళ్ల చేసి ఇచ్చిన కాగితం పడవతో, డిగ్రీ పూర్తిచేసి పీజీ చేద్దామని అనుకుంటున్న నయనిక, ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం లో ఉన్న సుధీర్, ఇద్దరూ చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆడుతున్నారు.ఆ దృశ్యం చూస్తూ ఉంటే నా మనసు గాల్లో తేలిపోతున్నట్లైంది…కాగితం పడవ మునిగిపోతూ, తేలుతూ వర్షపు కాలువలో వెళ్తున్నట్టే,

నా జీవితమూ ఎన్నో మలుపులు తిరిగిందో కదాఎన్ని కలలు! భవిష్యత్తుపై ఎంత ఆశ!అంతా కుప్పకూలిపోయింది. అప్పట్లో చాలా బాధపడ్డాను, ఏడ్చాను. ఇప్పుడు ఆ గాయం లేదు. పొరలు కట్టుకుని మనసులో ఎక్కడో ఒక మూలలో విసిరేసినట్లుఉంది.

అధ్యాం:3

మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే అనిపించింది – కృష్ణ లేని లోటు. ఇంకో వారం దాకా రాడు. సినిమా షూటింగ్ కోసం మనాలి వెళ్ళాడు. కృష్ణ’ లేని ఒంటరితనం చాలా విసుగ్గా అనిపించింది…ఆలోచనలు కాళ్లకు అడ్డం పడుతున్నట్లున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా మొండితనంతో, ధైర్యంతో ఎదుర్కొన్నాను. ఇవాళ మనసేందుకోఆలోచనల సముద్రాన్ని ఈదుతోంది.

ఎందుకో అర్థం లేని భయం వెంటాడుతోం..

ఎందుకు ఇవాళ ఇంత అలజడిగా ఉంది?

మనసు స్థిరంగా ఎందుకు ఉండలేకపోతుంది?

అన్ని ప్రశ్నలే సమాధానాలురాయనితెల్ల కాగితంలా!

“జీవితం ఎక్కడికి చేరుకుంటుందోతెలియని కాగితపు

పడవే కదా,అని అనుకుంటుంటే గోడగడియారం

టంగ్-టంగ్ మంటూ 6 గంటలు కొట్టింది. అమ్మ జ్ఞాపకం ఎదురుగా నిల్చింది.నేను 6 ఏళ్లకే అమ్మను కోల్పోయాను.

ఆలన, పాలన అందుకోకముందే ఈ లోకం వదిలింది, వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేని బాధ వెంటాడేది. ఎదుగుతున్న కొద్దీ ఆ లోటు మరింత గాఢమైంది. అక్కా, నాన్న వాళ్లే సమస్తమై అయ్యి నన్ను ప్రేమగా పెంచినా, నాలో తెలియని ఒంటరితనం మిగిలే ఉండేది.నాన్నకి కూడా అంతే! ఆయన చెప్పనప్పటికీ ఒంటరితనం అతన్ని పట్టుకుని పిడించింది! పైకి చెప్పుకోకపోయినా అర్థమయ్యేది. ఒంటరిగా తన గదిలో పడుకున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు…

చాలామంది “పెళ్లి” చేసుకోమని అన్నారు, కానీ నాన్న ఎప్పుడూ ఒప్పుకోలేదు. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టం! మేము ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళితే నాన్నను ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్న అప్పట్లో ఎప్పుడూ వెంటాడేది. సమాధానం తెలియని ప్రశ్న!

నాన్న అక్కను తన కళ్ల ముందే ఉండమన్నాడు. బావగారు కూడా ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ నాన్నకి తన మనసు విప్పి చెప్పుకునేందుకు ఎవరూ లేరు. ఈ బాధే నన్ను ఎప్పుడూ వెంటాడేది.ఆలోచనల్లో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే నయనిక సుధీర్‌తో పాటు వెనుక నిల్చున్న శ్రీకాంత్‌ కనబడాడు. వెనకనుంచి నయనిక, “అమ్మా! నీ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చారు. మన అడ్రస్ కోసం వెతుకుతున్నారు. నేనే తీసుకువచ్చాను. కూర్చోండి అంకుల్!” అంటుమేడపైకి వెళ్లిపోయారు.నేను ఇంకా తేరుకోలేదు. శ్రీకాంత్‌ని చూస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఇతనిని గుర్తుచేసుకున్నానుగా! ఎలా ఇక్కడికి వచ్చాడు? అనిపించింది. కల కాదు కదా! ఆలోచనలతో మొద్దు మారిపోయిన మెదడుతో ఉన్న నేను, అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాకుండా రాయిలా నిల్చున్నాను. నా పరిస్థితి అర్థం చేసుకున్నట్టు శ్రీకాంత్ అడిగాడు.“ఎలా ఉన్నావు ఇందూ! నా కూతురే కదా?” అన్నాడు. “నయనిక’ వెళ్లిన వైపు చూస్తూ.అప్పుడే నా చెవులు పనిచేస్తున్నట్టు వినిపించాయి మాటలు. ‘’

అవును, అన్నాను. మరేం మాట్లాడాలో తెలియని స్థితి నన్ను ఆవరించింది. అతను ఎదురుపడితే అడగాలనుకున్నవి, చెప్పాలనుకున్నవి, నిలదీసి, ఏదీ చేయలేకపోయాను గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నాను…

అతనే అన్నాడు – “రేపు సాయంత్రం నువ్వు కాలేజీ నుంచి వచ్చాక ఖాళీగా ఉంటే మా ఇంటికి తీసుకువెళతాను

అక్కడ మనం మాట్లాడుకుందాం!

అనివెళ్లిపోయాడు…. అప్పుడునాలో కదలిక వచ్చింది. మర్యాదకైనా కూర్చోమని చెప్పలేదు. ఎందుకలా? నయనికని తీసుకుపోతారని భయమా? ఆ పాప వాళ్లది కదా, అడిగితే ఇవ్వాల్సిందే ఇస్తానని కూడా అన్నాను ఒకప్పుడు! మరి ఇప్పుడేంటి ఈ స్వార్థం? కన్నీళ్లు ఉబికాయి.భయం ఎందుకో స్పష్టంగా అర్థం కాలేదు.కృష్ణకి ఫోన్ చేయాలి అనుకున్నాను, కానీ ఆగిపోయాను. ముందు వనజని చూడాలి – ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒక్కసారి చూడాలి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో కృష్ణతో కలిసి

ఆలోచించాలి. అప్పుడే కృష్ణతో మాట్లాడాలి.. అనుకున్నాను.

అమ్మ, నాన్న లేరు కదా. బయటకి వెళ్ళి భోజనం చేద్దాం,” అన్నారు.“సరే,” అన్నాను. నాకు వండే ఓపిక లేదు.నా మనసంతా మరోక చోటే ఉంది…

నా ఆలోచనలు ఒక్కసారిగా గతానికి.. వెళ్ళిపోయాయి..

.శ్రీకాంత్ దంపతులు నన్ను కేవలం ఆదరించడమే కాకుండా,

కృష్ణని కూడా ఆదుకున్నారు. వారి ప్రయత్నంతో కృష్ణ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు అవకాశాలు పొందాడు. ఆయనకు కృతజ్ఞతగా, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నయనికని తన కూతురుగానే చూసేవాడు.ఆ రోజు జ్ఞాపకం ఇప్పుడు కూడా పచ్చిగానే ఉంది.అమెరికాలో కొన్నేళ్లుగా డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ, నా మేనత్త కూతురు రేవతి వాళ్ల ఆయన కృష్ణమోహన్ ఇండియా వచ్చి “సంతాన సాఫల్య కేంద్రం – గిరిజా హాస్పిటల్స్” అంటూ కట్టడం మొదలుపెట్టారు.

అది మా మేనత్త పేరు. అక్కడే మొట్టమొదటిసారిగా శ్రీకాంత్ దంపతులను చూశాను.నా నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్లు ఇద్దరూ దేవుళ్లలా కనిపించారు…

అప్పుడు ఎలాంటి ఆలోచన లేదు; నా ముందు ఉన్నది ఒకటే ఒక్కఆందోళన..నా తండ్రిని బతికించుకోవాలి! ఎలాగైనా సరే అతను ఆరోగ్యంగా ఇంట్లో నవ్వుతూ మునపటిలా తిరగాలి…

ఆ హాస్పిటల్‌లోనేనా డెలివరీ అయింది. అప్పటికి ఇంకా పేరు పెట్టని ఆ పసిగుడ్డును ఒడిలో తీసుకుంటూ అనుకున్నాను – “నువ్వు నా అతిథివి రా! నువ్వు నా జీవితాన్ని ఆదుకున్న బంగారానివి,” అనుకున్నాను.కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం కొన్ని గంటల్లో నా జీవితాన్ని తలకిందులు చేసింది. “శ్రీకాంత్-వనజ” హాస్పిటల్‌కి వస్తూ ఉంటే వారి కారు ప్రమాదానికి గురయ్యారు…వనజ, శ్రీకాంత్ ఇద్దరూ స్పృహ తప్పి, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వనజ పరిస్థితి చాలా దారుణం. ఆ వార్త విన్న నేను తట్టుకోలేకపోయాను. నేను కన్నీటి పర్యంతమయ్యాను. “తల్లి లేని పిల్ల” ఎలా ఉంటుందో నాకు తెలుసు…కొద్ది రోజులు ఆగుదాం అన్నది రేవతి. “వచ్చి చూస్తాను” అన్నా, నువ్వు బాలింతరాలివి, వెళ్లడానికి వీల్లేదు అన్నారు అక్క, నాన్న. వాళ్లిద్దరినీ చూడాలని మనసు ఎంతగా కొట్టుకుపోయినా చూడలేకపోయాను.

ఆ తరువాత రేవతికి కూడా వాళ్ల ఆచూకీ ఎంత ప్రయత్నించినాదొరకలేదు……

రేవతి నేను కలిసి వాళ్లు ఉంటున్న బంగ్లాకు వెళ్లాము.ఆ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. అక్కడ వాచ్మన్ కూడా ఏమీ చెప్పలేకపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది…అలా నెలలు, వారాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ల దగ్గర నుండి ఫోన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసేదాన్ని, బారసాల చేసి “నయనిక” అనే పేరు పెట్టుకున్న తర్వాత ఇక ఎదురు చూడటం మానేశాను.

ఈసారి వాళ్లు వచ్చినా సరే, అడిగినా సరే నా పాపను ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చేసాను….సంవత్సరాలు గడిచిపోతున్నాయి.

ఆ పసిపాప నా ఒడిలోనే పెరిగి పెద్దదయ్యింది, వెంటనే ఏడాదికే సుధీర్ పుట్టాడు. ఇద్దరూ కలిసి ఆడుతూ పెద్దయ్యారు.తర్వాత కూడా ఎంత ప్రయత్నించినా శ్రీకాంత్ దంపతుల ఆచూకీ దొరకలేదు. ఇంకా వెతకడం విరమించుకున్నాను. పిల్లల్ని పెంచడంలో మునిగిపోయాను…ఇప్పుడు ఇన్నాళ్లకి, 20 ఏళ్ల తర్వాత, మళ్లీ వచ్చాడు శ్రీకాంత్!ఇప్పుడు నేనేంచెయ్యాలి?

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?“ప్రశ్నల కంచె” నా చుట్టూ కట్టుకున్నట్టే అనిపించింది.

(సశేష)

Written by Renuka Ayola

రేణుక అయోల
పూర్తి పేరు :
రేణుక అయ్యల సోమయాజుల
కవయిత్రి, రచయిత్రి.
కలం పేరు: రేణుక అయోల
పుట్టిన ఊరు: కటక్
నివాసం: హైదరాబాద్

1. కవితా సంపుటాలు - 4 పడవలో చిన్ని దీపం(2006 ), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు ( 2019), రవిక (2025) కవితా సంపుటాలు
2. కథా సంపుటి : 1 .
రెండు చందమామలు( 2008 )
3. దీర్ఘ కావ్యాలు : - 2
మూడవమనిషి దీర్ఘ కావ్యం
(2015 - హిజ్రాల హృదయ వేదన )
పృధ ఒక అన్వేషణ ( 2021)
4. అంతః తీరాల అన్వేషణ
రేణుక అయోల:
రచన సౌభాగ్య : 2018
( రేణుక అయోల రచించిన పూర్తి కవిత్వ సంపుటాల పైన విశ్లేషణ )
5. They long poem :2022
(మూడవ మనిషి దీర్ఘ కావ్యనికి ఆంగ్ల అనువాదం)
అనువాదకులు:
T. S.chanadra mouli

ప్రస్తుతం " కాగితం పడవ " నవల - తరుణి పత్రిక లో ధారావాహిక గా ప్రచురిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మగారింటికి దారేది?..

పసిదనంతో ప్రయాణం (కాలమ్)