అమ్మకు పెళ్లి(ళ్లా)

కథ

దేవసేన వంటగదిలో టేబుల్ దగ్గర కూర్చుంది, ఎదురుగా ఉన్న టీ కప్పు వైపు చూస్తూ. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో రెండు వీధుల అవతల కూరలమ్మ కేకలు లీలగా వినిపిస్తున్నాయి ….మరో ఇంట్లోంచి కొత్తగా సంగీతం నేర్చుకుంటున్న అమ్మాయి గొంతులోని ఆలాపనలు వినిపిస్తున్నాయి. ఆమె పిల్లలు అర్జున్, అఖిల ఇద్దరూ దూరంగా ఉన్నారు – అర్జున్ ముంబైలో పని చేయడం ప్రారంభించాడు. అఖిల వివాహం జరిగి రెండు సంవత్సరాలు. ఇంజనీరింగ్ చదివి, మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది తను. తన క్లాస్మేట్ చైతన్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని, బెంగళూరులో ఉంటోంది. ఈ మధ్య కాలంలో దేవసేన ఈ ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తోంది. విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమెకు ఇది చాలా సంవత్సరాలుగా అలవాటైంది. ఆమె తన పిల్లల కోసం తన జీవితం అంకితం చేసింది, కానీ ఇప్పుడు, వాళ్లు వారి స్వంత జీవితాల్లో, కెరియర్ లో ఎదుగుతున్నప్పుడు, ఆమెకు తన జీవితంలో శూన్యత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

ఆమె తన గతం గురించి చింతించడం లేదు. ఆమె ఇద్దరు అద్భుతమైన, ఆలోచనాత్మకమైన పిల్లలను పెంచింది. కానీ జీవితం ముందుకు సాగడంతో, తను ఇకపై ఏమి చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నట్లు ఆమెకు అనిపిస్తోంది. విడాకుల తర్వాత ఆమె తన కలలు, కోరికలు, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసింది. ఇప్పుడు, భవిష్యత్తు అనిశ్చిత, ఖాళీ రహదారిలా అనిపిస్తోంది.

ఈ ఒంటరితనం నుంచి విముక్తి లభిస్తుందా? ఎన్నోసార్లు మనసులో రేగే అలజడి, ఆలోచనలు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది. మనసారా తన భయాలు, బాధలు, సంతోషాలు వ్యక్తపరిచేందుకో మనిషి కోసం తనువు,మనసు తహతహలాడింది. చుట్టూ అందరూ ఉన్నా, తనకంటూ ఎవరూ లేరు కదా అనే భావన. కానీ దీన్ని అర్థం చేసుకునే వాళ్ళెవరు? ఒక్కోరోజు వంట చేసుకునేందుకు కూడా మనస్కరించదు. పిల్లలతో అన్నీ చెప్పుకోలేదు కదా! తను చూసిన ఓ మంచి సినిమా, చదివిన కథ, తాను రాయబోయే కథలు వీటిని గురించి ఎవరితో చర్చించగలదు? దీర్ఘంగా నిట్టూర్చింది .

************************

దసరా పండుగ రావడంతో పిల్లలిద్దరూ తల్లి దగ్గరకు వచ్చారు. వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేస్తూ ఆనందంగా ఉంది దేవసేన . భోజనాలు పూర్తి చేసి, హాల్ లో సోఫాలో కూర్చున్నారు ముగ్గురూ. తల్లి ఒడిలో తలపెట్టి గారాలు పోతూ,

“అమ్మా మేం నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం,” సందేహిస్తూనే మొదలెట్టింది అఖిల. “ఏమిటది?” అడిగింది తల్లి.

అర్జున్ మాట్లాడే ముందు అక్కాతమ్ముళ్లు చూపులు మార్చుకున్నారు. “అమ్మా, నువ్వు మా కోసం ఇన్నేళ్లూ ఎంతో చేశావు. నువ్వే మాకు సర్వస్వం. కానీ ఇప్పుడు మేం పెద్దవాళ్లమయ్యాం. మమ్మల్ని మేము చూసుకోగల వయసు వచ్చేసింది. ఇకపై నువ్వు నీ ఆనందం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని మేము అనుకుంటున్నాం.”

దేవసేన అయోమయంగా చూసింది. “మీ ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకీ ఉపోద్ఘాతం? నేను సంతోషంగా ఉన్నాను. మీరిద్దరూ బాగున్నారంటే నాకు కావాల్సింది మరేముంటుంది?”

అఖిల ముందుకు వంగింది, ఆమె స్వరం సున్నితంగా, కానీ దృఢంగా ఉంది. “అమ్మా అది నిజం కాదు. నువ్వు చాలా కాలం నుండి ఒంటరిగా ఉన్నావు . నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ….. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించాలని మేం భావిస్తున్నాము.”

ఆ మాటలకు ఉలిక్కిపడింది దేవసేన. మళ్లీ పెళ్లా? ఆమె ఆ ఆలోచనను కూడా ఆహ్వానించలేక పోయింది. ఇది అసాధ్యం అని కూడా అనిపించింది ఆమెకి. “మీరేం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చా? మనం అమెరికాలో లేము. మీరు చూసే ఆ విదేశీ సినిమాలు, సిరీస్ లలో జరిగినట్లు మన దేశంలో జరగదు, అర్థమౌతోందా?” ఆమె స్వరం ఆమెకే వినిపించలేదు.

“అమ్మా నువ్వు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము,” అర్జున్ మెల్లగా అన్నాడు. “నీకు ఒక తోడు అవసరం అమ్మా. ఇది చాలా ఆలస్యం కాదు.” దేవసేన తన పిల్లలను చూస్తూ ఉండిపోయింది. “మళ్లీ పెళ్లి? నా వయసులోనా? సమాజం అంగీరిస్తుందా? మన కుటుంబం ఏముంటుంది? పైగా అక్క అత్తారింట్లో సమస్య వస్తుంది” ఆమె వెంటనే తన తల్లి కమల గురించి ఆలోచించింది. తల్లి తనతో పిల్లల పట్ల, ఇంటి పట్ల, ముఖ్యంగా విడాకుల తర్వాత స్త్రీ యొక్క కర్తవ్యం ఎలా ఉంటుందనే దాని గురించి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి.

అఖిల ఆమె సంకోచాన్ని పసిగట్టింది, వెంటనే , “ ఇతరులు చెప్పేదాని గురించి మేము పట్టించుకోము. నీ సంతోషమే మాకు, నీకు కూడా ముఖ్యం.  జీవితంలో రెండవ అవకాశం కోసం వెతుకుతున్న మీలాంటి-విడాకులు తీసుకున్న లేదా వితంతువులకు సహాయం చేసే సంస్థలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా నీలాంటి ఎందరో తమకో భాగస్వామిని పొంది సంతోషంగా జీవిస్తున్నారు,” చెప్పింది తల్లితో.

అఖిల చెప్పేది గ్రహించడానికి ప్రయత్నిస్తూ దేవసేన మిన్నకుండిపోయింది. “అటువంటి సంస్థలు ఉన్నాయా?”

“ఒంటరి స్త్రీ పురుషులకు పునర్వివాహాన్ని ప్రోత్సహించే NGO గురించి నేను యూట్యూబ్ లో చూసాను.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కలవడానికి వారు సహాయం చేస్తారు.  వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.వారి సమావేశాలలో ఒకదానికి నువ్వు హాజరు కావచ్చు. చూడడానికే.” చెప్పింది అఖిల.

దేవసేన నిరసిస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ అర్జున్ ఆమెకా అవకాశం ఇవ్వకుండా. “అమ్మా, ఇది ఒక సమావేశం మాత్రమే. నచ్చకపోతే మళ్లీ వెళ్లాల్సిన పనిలేదు. అయితే దయచేసి ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా! అర్థం చేసుకో.”

ఆమె తన పిల్లలను చూసింది, వారి పట్ల ప్రేమతో ఆమె హృదయం పొంగిపోయింది. వారు తన ఆనందం గురించి ఆలోచిస్తున్నారు, తను చాలా కాలం క్రితమే ఆలోచించడం మానేసింది. సుదీర్ఘ విరామం తర్వాత, ఆమె చివరకు తల ఊపింది. “నేను దీని గురించి ఆలోచిస్తాను.”

అదే వారంలో జరిగిన తన తల్లిదండ్రుల వివాహ షష్టిపూర్తి సంబరానికి పిల్లలతో కలిసి వెళ్ళింది దేవసేన.అక్కడ పూజలో దంపతి తాంబూలాలు వంటి పూజలు చూస్తుంటే,తన ఒంటరితనం తనని వెక్కిరించినట్లుగా అనిపించింది ఆమెకు. పిల్లలు చెప్పిన విషయం ఆలోచించదగినదే అని మొదటిసారిగా భావించింది.

************************

వారం తర్వాత, ‘తోడూ నీడ’ NGO తన నెలవారీ సమావేశాన్ని నిర్వహిస్తున్న కమ్యూనిటీ హాల్‌లోకి సంకోచిస్తూ ప్రవేశించింది దేవసేన.ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె గుండె వేగంగా పరుగెత్తింది, ఏమి ఆశించాలో తెలియక. అక్కడ యాభై సంవత్సరాల వయసు దాటిన వారు చిన్న చిన్న గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ హాల్ అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు. కొందరు కూర్చున్నారు, మరికొందరు ఫలహారాల టేబుల్ దగ్గర నిలబడి ఉన్నారు.  ఆమెకు అది తన స్థానం కాదని అనిపించింది. బయటికి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో ఒక వ్యక్తి స్నేహపూర్వకంగా నవ్వుతూ తనని సమీపించాడు.

“హాయ్, నేను స్కందని,” అన్నాడు చేయి చాచి. “మీరు మొదటిసారి వచ్చారా?”

దేవసేన తడబడుతూ, నవ్వింది. “అవును, నేను ఈ సమూహానికి తగిన దానినో కాదో నాకు ఖచ్చితంగా తెలియదు.”

మెల్లగా నవ్వాడు. “మొదటిసారి వచ్చినప్పుడు నేను కూడా అదే అనుకున్నాను. కానీ నన్ను నమ్మండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాలు మళ్లీ ప్రారంభించడం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు. మనమందరం ఏదో ఒకదానిని ఎదుర్కొన్నాము—విడాకులు, జీవిత భాగస్వామిని కోల్పోవడం—అదే మనల్ని ఒకచోట చేర్చింది.”

‘మనసున మనసై

బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము

అదే స్వర్గము….

సమూహంలో ఒక స్త్రీ స్టేజ్ మీద అద్భుతంగా పాడుతోంది.

స్కంద పరిచయంతో  కొంచెం తేలికగా అనిపించింది ఆమెకి. అతని వ్యవహారశైలి స్నేహపూర్వకంగా కనిపించింది. సమావేశం జరుగుతున్న సమయంలో, ఇద్దరూ పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. తమ జీవిత కథలను పంచుకున్నారు-విడాకుల తర్వాత ఒంటరి తల్లిగా తన  సుదీర్ఘ ప్రయాణం గురించి దేవసేన చెప్పింది. తన భార్య మరణం తర్వాత టీనేజ్ కుమార్తె విశాఖ ను పెంచి పెళ్లి చేసిన ఒంటరి తండ్రిగా తన  జీవితం గురించి చెప్పాడు స్కంద. మొదటి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి మంచి భావం కలిగింది.

వారాలు గడిచేకొద్దీ, స్కందతో ఆమె స్నేహం మరింత బలపడింది. పుస్తకాలు చదవడం,తోటపని  పట్ల ఆసక్తి, సాహిత్యం పై అనురక్తి,కుటుంబంతో ప్రశాంతమైన సాయంత్రాలు గడపటం పట్ల ఇష్టం వంటి చాలా సారూప్యతలు తామిద్దరికీ ఉన్నాయని తెలుసుకున్నారు. తాను చిన్న చిన్న కథలు రాస్తానని చెప్పింది. ఆ కథలకి కావలసిన ఎన్నో ప్లాట్లు తన వద్ద ఉన్నాయని స్కంద చెప్పాడు.మెల్లమెల్లగా, దేవసేన ఇన్నాళ్లుగా తాను అనుభవించని ఏదో ఒక ఆనందాన్ని అనుభూతి చెందడం ప్రారంభించింది.

కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయం పట్ల అందరూ ఆమోదముద్ర వేయలేదు.

************************

ఒక సాయంత్రం, దేవసేన తన కుటుంబంతో కూర్చున్నప్పుడు, ఆమె తల్లి కమల NGO మీటింగ్‌ల టాపిక్‌ని తీసుకొచ్చింది. “నువ్వు మారు మనువు కోసం ఏదో ఒక సమూహానికి హాజరయ్యావని నేను విన్నాను”  ఆమె కంఠంలో అసమ్మతి  ధ్వనిస్తోంది.

అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆమె తండ్రి రాఘవ భార్యవైపు చూశాడు. “కమలా, తనను నీ మాటలతో బాధ పెట్టకు. ఆమె తనకు సంతోషాన్నిచ్చే పని చేస్తోంది. ”

కమల అరిచింది “సంతోషంగా ఉంటుందా? బంధువులు ఏమంటారు? యాబై ఏళ్ల, విడాకులు తీసుకున్న మహిళ మరలా కళ్యాణం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారా? ఇది ఏమాత్రం తగనిది! ఒక స్త్రీ యొక్క స్థానం ఆమె పిల్లలతో ముడి పడి ఉంటుంది. తల్లిగా తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. ఇకపై పిల్లలు ఆమెను చూసుకుంటారు. ఈ పిచ్చి పని అవసరం లేదు.”

తన తల్లి ఒప్పుకోకపోవడాన్ని ముందుగానే ఊహించింది కనుక మౌనంగా ఉండిపోయింది దేవసేన. అర్జున్ మాత్రం ఆగలేకపోయాడు. “అమ్మమ్మా ఇది సరికాదు. అందరిలాగే అమ్మ కూడా ఆనందానికి అర్హురాలు. కాలం మారింది.”

కమల అతని వైపు తీక్షణంగా చూసింది. “ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి  మీరిద్దరూ ఇంకా చిన్నవాళ్ళు. మన సాంప్రదాయంలో, ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇది సిగ్గుచేటు!”

ఎప్పుడూ తన ఆలోచనలో  ప్రగతిశీలంగా ఉండే రాఘవ, దయతో చిరునవ్వుతో కూతురి వైపు తిరిగాడు. “అమ్మాయ్, గత కొన్ని వారాలుగా నీ కళ్లలో వెలుగుని మళ్లీ చూశాను. నువ్వు ఇద్దరు అద్భుతమైన పిల్లలను పెంచావు, ఇప్పుడు నీ కోసం జీవించాల్సిన సమయం వచ్చింది,” ప్రేమ, దయతో కూడిన తండ్రి మాటలకు

దేవసేన కళ్ళలో కన్నీళ్ళు ఉబికాయి. “ధన్యవాదాలు, నాన్నా,”  భావోద్వేగంతో ఆమె గొంతు గద్గదికమైంది.

కానీ కమల ఊరుకోలేదు. “ఆ మనిషి, స్కంద సంగతేంటి? ఎవరతను? అతను నీకు సరైనవాడని నీకు ఎలా తెలుసు?” రెట్టించింది. “రేపు అతను నీ పిల్లలను ఆమోదిస్తాడా?”

తల్లి చెప్పకముందే సమాధానం చెప్పాడు అర్జున్. “స్కంద అంకుల్ చాలా మంచివారు అమ్మమ్మా. మేము అతనిని కలిశాము. అతను అమ్మలాగే ఒంటరి వాడు. అతనికీ ఒక కూతురు ఉంది. అమ్మా,అతనూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అతను మంచి మనసున్న మనిషి. అమ్మ ఆనందం గురించి పట్టించుకుంటాడు.”

కమల అడ్డంగా తల ఊపింది. “అయ్యో తల్లీ నీ సుఖం కంటే నాకేం కావాలమ్మా? కానీ ఒకసారి విడాకులు తీసుకున్న ఆడది మళ్ళీ పెళ్లి అంటోంది అంటే చుట్టాలూ పక్కాలూ అందరూ బుగ్గలు నొక్కుకోరూ? నీ వియ్యాల వారి గురించి ఆలోచించావా?  సంఘాన్ని ఎదిరించి బతికే శక్తి నాకు ఈ వయసులో లేదమ్మా. నువ్వే ఆలోచించు నీ నిర్ణయం సరైనదేనా?”

అఖిల మాట్లాడింది, ఆమె స్వరం ప్రశాంతంగా, స్థిరంగా ఉంది. “ఎవరో చుట్టాలూ పక్కాలూ ఏదో అనుకుంటారనే విషయం మాకు అనవసరం అమ్మమ్మా. ఇక మా అత్తగారు వాళ్ళకి నేను చెప్పుకోగలను. ఇది అమ్మ జీవితం .అమ్మకు జీవితంలో ఏది ఆనందం ఇస్తుందో అమ్మకు తెలుసా లేక నీ చుట్టాలు పక్కాలకు తెలుసా? వాళ్ళు ఏమన్నా అనుకోనీ మేం పట్టించుకోము. అమ్మ కూడా మరో అవకాశానికి అర్హురాలు. ఇది మాత్రం కాదనలేని నిజం.”

ఇక తాను మాట్లాడేందుకు అవకాశం లేకపోవడంతో విసవిసా లోనికి నడిచింది కమల.

***********************

తల్లి వ్యతిరేకించినా దేవసేన ,స్కందతో మాట్లాడటం మానలేదు . వాళ్ళు ప్రతి నిత్యం ఫోన్ లో ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు.  చాలా త్వరగా సన్నిహిత మిత్రులయ్యారు. స్కందతో పరిచయం పెరిగిన కొద్దీ, తను ఒక  భాగస్వామిని కలిగి ఉండడాన్ని ఎంతగా కోల్పోయానో గ్రహించింది ఆమె. తన ఆలోచనలను పంచుకోవడానికి ఎవరైనా, ఉండటం ఎంతో బాగుంది. ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి స్కంద. అతను కూడా తన దివంగత భార్య గురించి, ఆమె మరణం తర్వాత తాను ఎంత ఒంటరిగా ఉన్నాడో ఎన్నో సార్లు చెప్పేవాడు. ఇద్దరూ ఒకరి సాంగత్యంలో ఒకరు స్వాంతన పొందారు.

కానీ దేవసేనకు సందేహాలు మిగిలాయి. తల్లి పరుషమైన మాటలు ఆమె మనసులో ప్రతిధ్వనించాయి, మళ్లీ పెళ్లి చేసుకుంటే సమాజం తనను ఎలా చూస్తుందోనని ఆందోళన చెందింది. ఒక సాయంత్రం, పార్క్ లో నడుస్తూ, తన ప్రాణ స్నేహితురాలు సీతకి తన బాధలను చెప్పింది.

“నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీడంలేదు,” ఆమె చెప్పింది. “నా కుటుంబం నుండి, సమాజం నుండి చాలా ఒత్తిడి ఉంది. నేను తప్పు చేస్తున్నానా?”

సీత నడక ఆపి ఆమె వైపు తిరిగింది. “దేవీ,ఇది సమాజానికి సంబంధించినది కాదు. ఇది నీ గురించి, నీ జీవితం గురించి. ఇతరుల అంచనాల ప్రకారం జీవించడానికి జీవితం చాలా చిన్నది. అందరి గురించి ఆలోచిస్తూ ఇప్పటికే చాలా సమయం గడిపావు. నీ గురించి నువ్వు ఆలోచించుకునే సమయం ఇది కాదా?”

నీకు తెలీదని కాదు గానీ, కొన్ని విషయాలు చెప్తాను విను. విడాకులు లేవేమో గానీ, పూర్వకాలంలో వితంతువులు పునర్వివాహం చేసుకున్నట్లు ఆధారాలు మహాభారత కాలంలోనే ఉన్నాయి. మన వేదాలు, మనుస్మృతి, పరాశర స్మృతి,గరుడ పురాణం లాంటి ఎన్నో గ్రంథాలు విధవా పునర్వివాహం తప్పు కాదనే చెప్పాయి. తర్వాత కాలంలో తురుష్కుల దాడుల అనంతరం సతీ సహగమనం ఆచరణలోకి వచ్చింది. అంతే కాక వితంతువులకు శిరోముండనం చేసి మూలకు కూర్చోబెట్టే పద్దతి వచ్చింది. మన సంఘ సంస్కర్తలు రాజారాం మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు ఆ దురాచారాలు రూపుమాపేందుకు కృషి చేసి,వితంతు వివాహాలు చేయించారు. అది చాలా సంవత్సరాలు సమాజంలో సహజంగానే భావించబడింది. ఆపై ఎందువల్లనో మళ్ళీ సమాజంలో స్త్రీల పట్ల వివక్ష ఎక్కువైంది. పురుషులకు భార్య మరణించినా, విడాకులు తీసుకున్నా, వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకొమ్మంటూ బలవంతంగా ఐనా వివాహం చేసేసే ఈ మనుషులు మహిళలకు మాత్రం ఆ అవకాశం లేదంటూ ఆంక్షలు విధించింది.

ఎంత అన్యాయం! ఐతే అదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోంది.

తోడూ నీడ మగవారికి మాత్రమే కాదు, స్త్రీలకు కూడా అవసరమే అని అర్థం చేసుకుంటున్నారు. అసలు నిజానికి చిన్న వయసులో కన్నా, పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మధ్య వయసులో ఉన్న వారికి తనకంటూ తోడుగా ఒక మనిషి చాలా అవసరం. ఒంటరిగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యంపై ఎంతో దుష్ప్రభావం పడుతుంది. స్త్రీ పురుషులు ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఇద్దరికీ అన్ని విధాలా శ్రేయస్కరం. నువ్వు మరో ఆలోచన లేకుండా ముందుకెళ్ళు. నీ పిల్లలు నీకు మద్దతుగా ఉన్నారు. అది చాలు కదా. సమాజం అంతా నీ గురించి ఏం మాట్లాడుకుంటుందో అనవసరం. ఇన్నాళ్లూ,ఇకపైనా నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నీకు నీ చుట్టు పక్కల ఉన్నవారు ఏ మాత్రం సాయం వచ్చారు? నీ జీవితంలో వసంతం పూసే అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకు,” స్నేహితురాలికి హితబోధ చేసింది సీత.

“నువ్వు చెప్పేది బానే ఉంది కానీ ఏదో బెరుకు నన్ను వెనక్కి లాగుతోంది. జీవితంలో ఒక మగాడి చేతిలో మోసపోయిన నేను, ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది.మళ్ళీ పెళ్లి చేసుకుని, ఏదైనా జరిగితే తట్టుకోగలనా? రిస్క్ అవసరమా అనిపిస్తోందే,” ఆమె కంఠం వణికింది.

“దేవీ ఒకసారి ఏదో జరిగిందని ప్రతిసారీ అలాగే జరగదు. ఈ ప్రపంచంలో చాలా మంది పురుషులు తమ భార్యలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నేను కూడా స్కంద గారిని కలిసాను కదా, చాలా మంచి వ్యక్తి.నాకు ఆయనే నీకు సరైన జోడీ అనిపించింది. అతని సాన్నిధ్యంలో నువ్వు సంతోషంగా ఉంటావు. అనవసరమైన భయాలేమీ పెట్టుకోకు. ఆ అమ్మవారి దయవల్ల అన్నీ సానుకూలంగా జరుగుతాయి, సరేనా?” స్నేహితురాలికి ధైర్యం నూరిపోసింది సీత.

‘మనిషికో స్నేహం

మనసుకో దాహం’

ఆత్మ బంధువు సినిమాలో పాట దూరంగా ఎవరో ఫోన్ లో వింటున్నట్టున్నారు.

దేవసేన సీత కళ్ళలోకి చూసింది , వాటిలోని నిజాయితీని చూసింది. ఆమె చెప్పింది నిజమేనని అనిపించింది. చాలా కాలం పాటు, తను తన కంటే ముందు ఇతరులను ఉంచింది-మొదట తన పిల్లలు, తరువాత తన కుటుంబం, సమాజం. కానీ ఇప్పుడు, తన జీవితంలో మొదటిసారిగా,  పూర్తిగా తనదైన ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఆ దైవమే తనకి ఇస్తున్న అవకాశమేమో. చేజార్చుకుంటే ఎలా? స్థిర నిర్ణయం తీసుకుంది.

****************************

కొన్ని వారాల తర్వాత, దేవసేన తన కుటుంబాన్ని ఒకచోట చేర్చింది. కమల, రాఘవ, అర్జున్, అఖిల.  స్కంద, విశాఖ కూడా ఉన్నారు. వాతావరణం ఉద్విగ్నంగా ఉంది. ఆమె గుండె దడదడలాడుతూ ఉండగా,

“నేను ఒక నిర్ణయం తీసుకున్నాను,”  స్థిరమైన స్వరంతో ప్రారంభించింది. “సమాజం నా గురించి ఏమనుకుంటుందో, నా స్థానంలో ఉన్నవారికి ఏది సముచితం అనే దాని గురించి నేను చాలా సంవత్సరాలుగా చింతిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడే నేను ఒక విషయం గ్రహించాను. అందరిలాగే నేనూ ఆనందానికి అర్హురాలిని.”

ఆమె తల్లి వైపు చూస్తూ ఆగిపోయింది. “మీలో కొందరు ఆమోదించరని నాకు తెలుసు, కానీ ఇది నా జీవితం. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. స్కందా నేనూ కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకోబోతున్నాం.

కమల నిరసనగా నోరు తెరిచింది, కానీ ఆమె ఏమీ అనకముందే రాఘవ లేచి నిలబడి కూతురి భుజం మీద చెయ్యి వేశాడు. “నేను నీ గురించి గర్వపడుతున్నాను, తల్లీ,” అతను ప్రశంసా పూర్వకంగా చెప్పాడు. “మీరిద్దరూ ఈ ఆనందాన్ని పొందేందుకు అర్హులు.”

అర్జున్, అఖిల తమ తల్లి వైపుకు పరుగెత్తారు, వారి ముఖాలు గర్వంతో, ఆనందంతో వెలిగిపోయాయి. “అమ్మా, మేము చాలా సంతోషంగా ఉన్నాము,” అఖిల చెప్పింది, ఆమె గొంతు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

కమల, కోపంగా కనిపించినప్పటికీ, మౌనంగా ఉండిపోయింది. బహుశా ఆమె తన కుమార్తె సరైన ఎంపిక చేసుకుందని కొంత వరకూ అర్థం చేసుకుంది. లేదా ప్రపంచం మారుతోందని గ్రహించి ఉండవచ్చు, ఆమె దానికి సిద్ధంగా లేకపోయినా.

ఈ వివాహానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. స్కందా, దేవసేన కలిసి నిలబడి పెళ్లి ప్రమాణాలు చేసుకుంటూ ఉండగా, తనలో కొత్త ఉత్సాహం నిండినట్లు భావించింది.

‘మనసు పాడింది సన్నాయి పాట

కనులు ముకుళించగా….తనువు పులకించగా

గగనమే పూల తలంబ్రాలు కురిపించగా…’

తనకి ఇష్టమైన పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేసింది స్నేహితురాలు సీత.

ఆమె తన పిల్లలను, తన తండ్రిని, తల్లిని కూడా చూసింది. తను సరైన నిర్ణయం తీసుకున్నానని నమ్మకంతో ఆమె హృదయం నిండిపోయింది, తను మళ్లీ ప్రేమను కనుగొన్నందుకు మాత్రమే కాదు, తన జీవితాన్ని, సంతోషాన్ని, తన హక్కును తిరిగి పొందగలిగినందుకు.

ఇన్నేళ్లలో మొదటిసారిగా, తను నిజంగా తన కోసమే జీవిస్తున్నట్లు అనిపించింది. అమ్మకు పెళ్లి చేయాలని భావించిన తన పిల్లల పట్ల కృతజ్ఞతతో ఆమె మనసు ఉప్పొంగిపోయింది.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అయినంపూడి శ్రీలక్ష్మి

దొరసాని