దొరసాని

ధారావాహికం 61 వ భాగం

నీలాంబరి మరియు భూపతి ఆసంతోషాన్ని పంచుకుంటూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.. అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది భూపతికి.

ఫోన్ తీసుకొని లోపలికి వెళ్లి మాట్లాడి వచ్చాడు.

” ఎవరు ఫోన్ చేశారండి!” అని అడిగింది నీలాంబరి.

” చాలా మంచి వార్త నీలా! ఊహించగలవా” అన్నాడు భూపతి.

” పిల్లలు మన దేశానికి వస్తాం అంటున్నారు ఇంతకన్నా శుభవార్త నాకు ఇంకేం ఉంటుందండి” అన్నది నీలాంబరి.

“అది రక్తసంబంధమైన విషయం ..ఇదిఅభిరుచికి సంబంధించిన విషయం ఏంటో చెప్పు” అన్నాడు మళ్ళీ భూపతి.

” ఏమో నాఊహకు రావడం లేదు మీరే చెప్పండి” అన్నది నీలాంబరి.

” ఆరోజు చెప్పాను కదా కలెక్టర్ గారు ఫోన్ చేశారని.. నీ పెయింటింగ్స్ విషయమై మాట్లాడారు నీచిత్రలేఖనం గురించి పేపర్లో న్యూస్ లో కూడా వచ్చింది కదా అన్ని దేశాల నుండి ఇంత ప్రశంసలు పొందిన మన దేశ వనితకు మనం ఏమి ఇవ్వలేమా? అందుకే ప్రభుత్వం తరఫున మాట్లాడి సన్మానం చేస్తారట అదే కాకుండా నీపెయింటింగ్స్ అన్నీ నగరంలో జరిగే ఎక్సిబిషన్ లో పెడతారట ..అది విషయం చెప్పు నీకు ఇష్టమేనా ఇంకా వాళ్ళకి నేను సరేనని చెప్పలేదు నీ అభిప్రాయం చెప్పిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి నువ్వే మాట్లాడు” అన్నాడు భూపతి సంతోషంగా.

నీలాంబరికి చాలా సంతోషం వేసింది “నేను ఏదో సరదాకు వేసుకున్న బొమ్మలన్నీ ఇంత మంచి పేరు తెచ్చి పెడతాయని ఊహించలేదు ..ఇదంతా అలేఖ్య వల్లే జరిగింది తను ప్రోత్సాహం ఇవ్వకుంటే అక్కడ ఎగ్జిబిషన్ గ్యాలరీలో పెట్టే వాళ్లే కాదు పెట్టినందుకు ఎంతోమందికి అవన్నీ నచ్చి అవార్డులే కాకుండా డబ్బులు కూడా వచ్చాయి… ఆరోజు వివిధ దేశాల నుండి వచ్చిన ప్రముఖుల ముందర నేను మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది కాకపోతే నేను ఇంతమంది సభ్యుల ముందర మాట్లాడుతున్నాను అనే భావన నాకు రాలేదు. నాకు నా దేశం గుర్తు వచ్చింది అంతే నాకు ఏ భయము కలగలేదు” అని చెప్పింది నీలాంబరి తన్మయత్వంతో.

” అవును నీలా! నాకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఇంట్లో సాధారణంగా కనిపించే నా నీల అక్కడ అంత మంది ముందు గొప్పగా మాట్లాడటం నేనెప్పటికీ మర్చిపోలేను అదే కాకుండా నీసంకల్పం చాలా గొప్పది ఇంతమంది చిన్నారుల గురించి ఆలోచించి ఒక మంచి పనిని నిర్వర్తించావు” అన్నాడు భూపతి.

” ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే నాకు సాధ్యమైందిఎంత చదువుకున్నా ఎంత ధైర్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఆడవాళ్ళకి వెనుక నుండి కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధిస్తారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు కుటుంబ ప్రోత్సాహం లేకుంటే వాళ్లు ఏపనిని ఏకాగ్రతతో నిర్వర్తించలేరు అందుకనే నేను బాలసదనం ఏర్పాటు చేశాను వాళ్ల పిల్లల సంరక్షణ మనం చూసుకుంటే వాళ్లు వాళ్ళ రంగాలలో పనులు చేసుకుంటారు అదే నాజీవిత ఆశయం” అని చెప్పింది నీలాంబరి.

” ఇంతకీ నువ్వేం నిర్ణయించుకున్నావు వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడతావా’ అన్నాడు భూపతి.

” సరేనండీ రేపు మాట్లాడుతాను.. నేను చేయవలసిన పనులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి… కొంతమందితో కౌన్సిలింగ్ యూనిట్ పెట్టి మొబైల్ వాడకం గురించి అవగాహన ఇప్పించాలని అనుకున్నాను దానికి సరియైన వ్యక్తులు కావాలి ఎందుకంటే పిల్లలు మరియు యువత పక్కదారి పడుతున్నారు వారి సమయం అంతా వృధా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వస్తున్నాయి ..దీని గురించి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ..అదే నేను ఆలోచిస్తున్నాను” అన్నది నీలాంబరి.

” ఆవిషయం గురించి నేను ఆలోచిస్తాను అర్హత ఉన్న కొంతమందిని ఎంపిక చేసి వారితో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టిద్దాము పిల్లలకే కాదు పేరెంట్స్ కి కూడా అవసరమే..ఇది నా దృష్టిలో ఉంది నీలా” అన్నాడు భూపతి.

ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు…

అప్పుడే బయటకు వచ్చిన సౌదామిని” ఇంకా మీరు భోజనానికి రాలేదేమిటని చూస్తున్నాను ఇక్కడే కూర్చున్నారా అంత సీరియస్ డిస్కషన్ ఏంటి” అన్నది.

జరిగిన విషయం చెప్పాడు భూపతి.

సౌదామిని చాలా సంతోష పడింది…

“అత్తయ్యా! మీరు ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం మీ ఇంటి కోడల్ని కావడం నా అదృష్టమే.. చాలామంది పనికిరాని కబుర్లతో కాలాన్ని వ్యర్థం చేస్తూ సాగతీతతో వచ్చే సీరియల్స్ చూసుకుంటూ వాటిని జీవితానికి అన్వయం చేసుకుంటూ సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నారు మీరు అలా కాకుండా సమాజం పట్ల బాధ్యతను కూడా మీ చేతుల్లోకి తీసుకున్నారు ..మీలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది’ అంటూ నీలాంబరి చేయి పట్టుకుంది సౌదామిని.

” నన్ను పూర్తిగా మునగ చెట్టు ఎక్కించావా ఇంకా దిగలేను ..నేను చేసింది అంత గొప్ప విషయం ఏం కాదులేమ్మా! నాకు తోచింది చేశాను ఇంతమంది సహకారం ఉండబట్టే నా స్వప్నం సాకారం అయ్యింది ..నీలాంటి డాక్టర్ కోడలు బాలసదనానికి ఎంతో సేవ చేస్తుందంటే ఇది నా అదృష్టం కాదా” అన్నది నీలాంబరి.

” మీరిద్దరూ తీరిగ్గా ఒకరి భజన మరొకరు చేసుకుందురు గాని ముందు నాకు ఆకలేస్తుంది పదండి” అన్నాడు నవ్వుతూ భూపతి..

ముగ్గురు నవ్వుకుంటూ లోపలికి వెళ్లి భోజనం చేశారు…

పడక గదిలోకి వెళ్లి పడుకున్న నీలాంబరి భూపతికి కళ్ళముందు జరిగేదంతా కనిపిస్తూనే ఉంది పిల్లలందరూ ఇక్కడే ఉన్నట్టు మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లంతా సందడిగా ఉన్నట్లు ఎన్నో తీపి కబుర్లు చెప్పుకున్నారు.

సౌదామిని సాగర్ తో మాట్లాడుతూ ఇక్కడ విషయాలన్నీ చెప్పింది ..ఇంకా త్వరలో వారి ఎడబాటుకు తెరపడుతుంది అనే విషయం వారికి ఎంతో సంతోషాన్నిచ్చింది.

కార్తీక మాసపు వెన్నెల వెలుగులు కిటికీలో నుండి చూస్తుంది నీలాంబరి… శరదృతువులోని వెన్నెల ఎంతో హాయిగా ఉంటుంది అన్ని పున్నమలు ఒక తీరైతే కార్తీక పున్నమ వెన్నెల మహా అద్భుతం…

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏదో రాయాలనిపించింది నీలాంబరకి… కాగితము కలము తీసుకొని తనకు తోచినట్లుగా రాసుకుంది..

వెన్నెల పూలు
????????????????????????????

పున్నమి రేయిలో
పెరటిలో ఆకాశంకేసి చూసా..
వెన్నెల పూలను కోసి..
ఒడి నింపు కావాలని చూసా!

ఒడిసి పట్టుకున్నా..
జారిపోతుంది కోసల నుండి జాలు వారుగా !

జారుతున్న వెన్నెల దారను..
దోసిళ్ళలో పట్టుకోవాలని చూస్తే…
దొరకకుండా దోబూచులాడుతుంది చిలిపిగా!

చందమామను తెచ్చుకుని…
కదలకుండా కట్టేసుకుంటా..
ప్రేమ పాయసాన్ని తాగించి..

ఇంట్లోనే వెన్నెల పూలను పూయించి పంచేస్తా చీకట్లు కమ్ముకున్న వారికి..

ఇలా రాసింది చదువుకొని నవ్వుకొని “కవయిత్రిగా మారుతానేమో” అనుకుంది.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మకు పెళ్లి(ళ్లా)

నిర్ణయం