చిట్టి కథ గొప్ప సందేశం

దాన ఫలం (గుప్తదానం)

అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో బాగా డబ్బున్న ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి డబ్బుతో పాటుగా తను సంపాదించిన దాంట్లో ఎంతోకొంత లేని వాళ్లకు, ఆపదలో ఉన్న వాళ్లకు ,అవసరం అయిన వాళ్లకు దానం చేయడం కూడా బాగా అలవాటు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ….. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినప్పుడు వెంటనే సహాయం చేసేవాడు కాదు నాలుగు సార్లు తిప్పించుకోవటం, అవసరార్థమై వచ్చిన వారిని ఏదో ఒక మాట అని తర్వాత వారు అడిగిన సహాయం చేయటం, కసురుతూ ఇవ్వడం, తాను చేసిన చిన్న పనికి కూడా అందరూ మెచ్చుకోవాలని ఎదురు చూడటం, గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు భగవంతుడికి సమర్పించే కానుకలను కూడా ఆర్భాటంగా చేయటం, గుడి దగ్గర మెట్ల మీద కూర్చున్న యాచకులకు కూడా వెంటనే దానం చేయకుండా…. కారు వరకు పిలిపించుకొని అప్పుడు పదో పరోకో దానం చేయడం, ఎక్కడైనా సభలు సమావేశాలు జరిగినప్పుడు తన ద్వారా లబ్ధి పొందిన వారిని అక్కడ ఆ సమయంలో తనను గురించి గొప్పగా పొగుడుతూ చెప్పమని అడగటం, సన్మానాలు చేయించుకోవటం ఇలా రకరకాలుగా చేస్తూ దానం చేసేవాడు. ఇలా కొంతకాలo గడిచిన తర్వాత ఆ వ్యాపారికి ఏదో అనారోగ్యంతో మృత్యువాసన్నమైంది. అప్పుడు యమభటులు వచ్చి అతనిని నేరుగా స్వర్గానికి తీసుకువెళ్తారు. అప్పుడు అతడు చాలా సంతోష పడిపోతూ నేను చేసిన దానధర్మాల వలననే నాకు ఈ స్వర్గం ప్రాప్తించింది. మరణం తర్వాత కూడా స్వర్గసుఖాలు అనుభవించే యోగం కలిగింది అని సంతోషిస్తాడు. అక్కడినుండి చాలా కొద్ది రోజుల తర్వాత యమదూతలు అతడిని నరకానికి తీసుకువెళ్తారు.
అప్పుడు ఆ వ్యక్తి ఇదేంటి నన్ను స్వర్గం నుండి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు. ఆని వారిని అడుగుతాడు. అప్పుడు యమదూతలు నిన్ను నరకానికి తీసుకువెళ్తున్నాం అని సమాధానం చెబుతారు. ఏంటి నేను ఇన్ని దానాలు ధర్మాలు చేశాను. ఎంతోమంది పేదవారికి ఆశ్రయమిచ్చాను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను .అయినా నాకు నరకం ఎందుకు స్వర్గంలోనే ఉంచొచ్చు కదా!!!! అని కోపంగా అంటాడు. అప్పుడు ఆ యమభటులు చిన్న చిరునవ్వు నవ్వి నువ్వు చేసుకున్న పుణ్యంలో 99 శాతం ఎప్పుడో ఖర్చయిపోయింది ఇక మిగిలిన ఒక్క శాతానికి నిన్ను ఇన్ని రోజులు స్వర్గంలో ఉంచాం అని సమాధానం చెబుతారు. అదేంటి ఒక్క శాతం ఏంటి???? నేను చాలా చేశాను కదా ప్రజలకి ,భగవంతుడికి కూడా అని మళ్లీ హెచ్చు స్వరంతో వారిని ప్రశ్నిస్తాడు. ఓ !!! అదా చూడు నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఎవరికైనా ఏమి ఆశించకుండా సహాయం చేసావా ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు దానం చేసిన ప్రతిసారి కడు పేదవారి దగ్గర కూడా ఏదో ఒకటి ఆశించావు అప్పుడే నువ్వు దానం చేసిన ఫలితం లో సగం పోయింది. సరే అలాగైతే మిగిలిన సగం ఉండాలి కదా అని అడుగుతాడు యమభటులను ఆ వ్యక్తి. ఆ యమభటులు మళ్ళీ చిరునవ్వు నవ్వి….. ఓ అదా నువ్వు దానం చేసిన ప్రతిసారి నీ గురించి నువ్వు చేసే దానాలు గురించి నలుగురికి తెలియాలని కోరుకుని ఆ విధంగా ప్రయత్నం చేస్తూ దానం చేస్తావు. అప్పుడు నువ్వు చేసిన దానంలో ఇంకొక పావు వంతు ఖర్చు అయిపోయింది. ఓ అలాగా….పోనీ మిగిలిన పావు వంతైనా ఉండాలి కదా!!!!! అని యమభటులను ప్రశ్నిస్తాడు. ఓయ్ వ్యాపారి నీకు ఇంకా అర్థం కాలేదా మిగిలినది ఏమైనదో????? ఆ మిగిలిన పావు వంతులో నువ్వు సభలకు సమావేశాలకు వెళ్లినప్పుడు నలుగురు చేత నువ్వు చేసిన మంచి పనులను గురించి పొగించుకొని సన్మానాలు ,సత్కారాలు స్వీకరించావు. అక్కడనే నువ్వు చేసుకున్న మిగిలిన పుణ్యం కూడా పూర్తి ఖర్చయిపోయింది. అని చెప్తారు యమదూతలు. అదేంటి నేను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును నలుగురికి దానం చేసి చెప్పుకోవడంలో తప్పేముంది. అంతేకాకుండా నేను దైవకార్యాలకు పుణ్యకార్యాలకు ఎంతో ఖర్చు చేశాను .దానిని చెప్పుకోవడంలో నాకేమీ తప్పనిపించడం లేదు నేను చేసిన మంచి పనులను గురించి నలుగురికి చెప్పుకోవటం కూడా తప్పేనా అని గట్టిగా ప్రశ్నిస్తాడు యమదూతలను. అప్పుడు ఆ యమదూతలు చూడు నాయనా!!!! మన దగ్గరికి ఎవరైనా వచ్చి చేయి చాచారు అంటే వారు ఎంతో ఆపదలో ఉంటే తప్ప అలా ఆత్మాభిమానాన్ని చంపుకొని దానం స్వీకరించరు. అలా అవసరానికి నీ దగ్గరకు వచ్చి చేయి చాచిన వారిని నువ్వు ఎన్నో రకాలుగా తూలనాడావు. నానా దుర్భాషలాడావు. అంతేకాకుండా నువ్వు దేవుడికి సమర్పించిన కానుకలు, పంచిపెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు కూడా నీ గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే చేశావు కానీ….. భగవంతుడు నీకు అన్నీ సమకూర్చి నిన్ను ప్రశాంతంగా జీవించేలా చేశాడు కనుక భగవంతుడికి కృతజ్ఞతగా ఏదీ చేయలేదు నువ్వు. అంతేకాకుండా నువ్వు చేసిన ప్రతి పనిని నీ చేత సహాయం పొందిన వారి చేత అంతట చెప్పించి సన్మానాలు సత్కారాలు పొందావు.
నీకు ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను .నువ్వు ఒక పది రూపాయలు తీసుకొని కొట్టుకు వెళితే ఆ పది రూపాయల సరుకు కొనుక్కొని వస్తావు అంతేనా?? అవును. మరి ఆ 10 రూపాయలు తీసుకొని నీకు నువ్వు అడిగిన వస్తువు ఇచ్చిన కొట్టు యజమానికి పుణ్యం వస్తుందా????? అది ఎలా సాధ్యం పది రూపాయలు ఇచ్చి వస్తువు కొనుక్కున్నాను కదా పుణ్యం ఎందుకు వస్తుంది. అని సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి యమదూతలకు. కదా!!! అదేవిధంగా నువ్వు చేసిన ప్రతి పనికి కూడా ఏదో ఆశించి చేశావు .నువ్వు ఆశించిన ఫలితాన్ని పొందావు. అలాంటప్పుడు నువ్వు చేసింది వ్యాపారమే కానీ దానం ఎలా అవుతుంది చెప్పు. అని సమాధానం ఇచ్చారు యమదూతలు. అప్పటికి అర్థమైంది ఆ వ్యాపారికి తాను ఎంత తప్పు చేశాను అని. అతడు పశ్చాత్తాపంతో ఆ యమదూతల కాళ్ళ మీద పడి ఇప్పటికైనా నా తప్పు నాకు తెలియజేశారు .మళ్లీ జన్మంటూ ఉంటే ఏమి ఆశించకుండా భగవంతుడిచ్చిన దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ జీవితం కొనసాగిస్తాను. పదండి నరకానికి వెళ్దాం అని యమదూతలతో పాటుగా బయలుదేరుతాడు ఆ వ్యాపారి.
ఇదండీ కథ మనం కూడా నిత్యజీవితంలో ఇట్లాంటి పొరపాట్లు చాలానే చేస్తాం ఇలాంటి వ్యక్తులను చాలామందినే చూస్తాం. మనం చేసిన ప్రతి పనికి కూడా ఏదో ఆశించి చేస్తాం. ఏది ఆశించకుండా ,ఎవరిని తూలనాడకుండా మనకు ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగితే అది మాత్రమే మనం చేసుకున్న పుణ్యం ఖాతాలో పడుతుంది. లేదంటే అది మనం ఎదుటి వ్యక్తులతో చేసే వ్యాపారం అవుతుంది. చివరికి భగవంతుడితో కూడా…..
అందుకే అంటారు మన పెద్దలు కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని అదే గుప్త దానం అంటే

లోకా సమస్త సుఖినోభవంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“సర్వం జగన్నాథం”

విస్ఫోటనం ….