విస్ఫోటనం ….

వ్యాసం

“యాగము వద్దు సుమీ,శంభుని యామరి నావు సుమీ ,
శ్రీ గిరీశ సిరి మల్లేశుడు దైవము శివుడధికుండు సుమీ,
దక్షుడ వద్దు సుమీ ,యాగము ధర్మము గాదు సుమీ,
రక్షకుడఖిల జగంబుల కెల్లను మా రమణుడే కర్త సుమీ….
పనిచేసుకుంటూ, పాట పాడుకుంటున్న ధరణి తో , మీ అమ్మమ్మ నేర్పిందని, ఎప్పుడూ అదే పాటేనా?..
ఏముందమ్మా ఆ పాటలో?,,విసుగ్గా అంది దాక్షాయిని.….
“, ఏమి లేదని అడుగు! జీవితం ఉంది.ప్రస్తుతం మన పరిస్థితికి ఈ పాట అద్దం పడుతుంది తెలుసా? అహంభావంతో ఉన్న మీ నాన్న, అ సమర్థురాలిని నేను.ఈ పాటకు ప్రతీకలం .ఏమీ చేయలేక ఈ పాట పాడు కుంటున్నాను . చివరకు ఆ పరమేశ్వరుడే సాయం చేస్తాడని ఆశ. నిర్లిప్తంగా అంది ధరణి.
అబ్బా! అర్థమైనట్టు చెప్పొచ్చు కదా? ఈరోజు నాన్న మళ్ళీ మహేస్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడాడా? అయినా నీ పాట కి మన పరిస్థితికి సంబంధం ఏంటి? అంది దాక్షాయిని..
“ఈ పాట ఆడపిల్ల అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది.డబ్బు దర్పం ,అధికారం , అహంకారం, మనిషి చేత ఎన్ని అ కార్యాలు చేయిస్తా యో, తెలియజేస్తుంది . ఆ అ కార్యాలకు తగిన ఫలితం, అనుభవించి తీరాలనే ఒక ధర్మ సూక్ష్మాన్ని కూడా, తెలియజేస్తుంది… ఆలోచిస్తూ అంది ధరణి దేవి”.
ఈరోజు ఏదో జరిగింది.. నాన్న ఏదో అని ఉంటాడు. నాకు ముందు, ఆ దక్షుడి కథ చెప్పు, కుతూహలంగా అడిగింది ధరణి కూతురు దాక్షాయిని….
“ పరమ శివునికి భార్యగా గల పరాశక్తి , తన కూతురు గా పుట్టాలని, కఠోరమైన తపస్సు చేసి దుర్గాదేవి వలన
వరం పొందాడు దక్ష ప్రజాపతి,. పరమ శివుని పతిగా పొందడానికి పుట్టావని, పసిపిల్ల గా ఉన్నప్పటి నుండి “చెవినిల్లు కట్టుకుని “ చిన్న కూతురు సతికి నూరి పోసేవాడు.. దక్షుడు మాత్రమే కాకుండా, దక్షప్రజాపతి దగ్గరకు వచ్చి వెళ్లే ఋషులు, మునులు, పరమశివుని ప్రస్తుతిస్తూ ఉంటే,
పసితనం నుండీ సతికి పరమేశ్వరుడు ప్రాణాధికుడయ్యాడు. సతి ప్రాయం లోకి వచ్చి నప్పటి కే అధికార మదం తలకెక్కి అహంకారం పెరిగింది దక్షుడికి .
సతి వర పుత్రిక అన్న విషయాన్ని మరిచిపోయాడు.”అధికార మదం తలకెక్కితే అన్ని మరిచిపోయేలా చేస్తుంది.ధనం, దర్పం, అందం , ఆ హార్యం, ఉన్న వాడి నే అల్లుడు గా చేసుకుందా మను కుంటాడు.
తనకు నచ్చిన వాడి ని ,తను మెచ్చిన వాడినే ,వరించ మని కూతురికి చెప్పాడు..
కానీ! శివుని తప్ప, వేరే వారిని వరించనని సతి చెప్పడంతో ఆమె పై కోపగించాడు ,
శివుడు బిక్షపతి అని ,చులకనగా మాట్లాడడం,.పరమశివుని పత్నిగా, తనను తాను భావించు కున్న సతి ,శివుడే తన పతియని నిష్కర్షగా చెప్పింది. విష్ణువు, బ్రహ్మ వంటి వారు, సతి . విరాగుడైన శివునిలో రాగాన్ని నింపారు . సత్యమైన సరీ శివుల ప్రేమకు సహాయపడ్డారు. ,వారే దగ్గరుండి సతిని, ఆమె ఇష్టపడ్డ సాంబశివునికి ఇచ్చి వివాహం జరిపించడంకోసం దక్షణ్ణి ఒప్పించారు. దక్షుడు ఏమి చేయలేకపోయాడు .
కానీ! అతనికి శివుని పట్ల గల అసంతృప్తి అలాగే ఉండిపోయింది. శివుని ఆహార, విహారాలు, అసలు నచ్చక ,తన అల్లుడిగా చెప్పుకోవడానికి కూడా అంగీకరించలేక పోయాడు. .ఒక సారి దేవ సభలో తనను చూసి అందరూ లేచి నిలబడినా,శివుడు తనను గమనించక తాధ్యాత్మికత లో ఉండి పోవడాన్ని, మర్యాద తెలియక పోవడమని, తనను అవమానించడమేనని భావించి పరమ శివుని పై పగను పెంచు కుంటాడు..
అప్పటికే అంతరంగంలో ఎక్కడో, శివుడు తన తండ్రి అయిన బ్రహ్మ దేవుని ఐదవ శిరస్సును ఎడమ చేతితో గిల్లి అవతల పడేసాడన్న ఆక్రోషం కూడా ఉంది . గదక్షునిలో శివునిపై ద్వేషం అంతకంతకు పెరుగుతూ వచ్చింది.
ఆ అహంభావము, అనవసర ద్వేషంతోనే నిరీశ్వర యాగాన్ని మొదలుపెడతాడు దక్షుడు.
తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి,పిలవకపోయినా ,పుట్టింటిపై ప్రేమతో వచ్చింది సతి .
కూతుర్ని ఘోరంగా అవమానిస్తాడు దక్షుడు .తండ్రి తన భర్తను తూలనాడడం సహించ లేక పోతుంది .పెళ్లయిన ఆడపిల్ల తనను అవమానించిన సహిస్తుంది గానీ తన భర్తను అవమానిస్తే సహించలేదు. అదే భార్యాభర్తల బంధం. భారతీయ వివాహ వ్యవస్థలోని పరమార్థం. సతీదేవి .అనురాగానికి తప్ప, ఆడంబరాలకు ప్రాధాన్యత నివ్వలేదు. ఆగర్భ సీమంతురాలైన సతి, సాధారణ జీవితాన్ని కూడా సంతోషంగా అనుభవించింది . .
ఆమెకి పరమశివుడు ప్రాణం కంటే ఎక్కువ..! ప్రేమించినప్పుడు ఎంత పవిత్రంగా శివుని ఆరాధించిందో!, పెళ్లయిన పిదప కూడా అంతకు వేల రెట్లు ఆరాధన భావంతో శివుని అండగా నిలబడింది సతి .
ఆమె ఆనందం చూసి చపల బుద్ధి తో, చాలా చులకనగా మాట్లాడాడు ఆ బిచ్చగాడు నీకు ఏమీ ఆనందం ఇస్తున్నాడని ఎగతాళి చేస్తాడు.. శివనింద చేస్తాడు దక్షుడు .
తనను అనుక్షణం ఆనందంగా ఉంచుతూ,,అపురూపంగా చూసుకునే భర్త ఆనంద స్వరూపుడు సచ్చితానంద సదాశివుడని చెప్తుంది సతి. , అనవసరద్వేషంతో అవమానిస్తున్న తండ్రిని చూసి ఆగ్రహించింది సతి ,
దానికి తోడు,అవహేళన చేసిన అక్క చెల్లెళ్లు .,అస్సలు మాట్లాడ లేని అసమర్ధురాలైన తల్లి.
ఆ సభలో మారు మాట్లాడకుండా కూర్చున్న ఆత్మీయులు .అందరినీ చూసింది, దక్షుని అధికార దర్పానికి ఝడిసి నోరెత్త లేని,దేవతలను, మునులను ,ఋషులను చూసింది, ఒక్కసారి తనవారు అనుకున్న అందరి మీద ఉన్న మొహాన్ని తుంచేసుకుంది. “ విజ్ఞతకు ప్రతిరూపమైన సతి ,ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది”.
దక్షుని కూతురు దాక్షాయినిగా శరీరాన్ని దగ్ధం చేసుకోవడానికే నిశ్చయించుకుంది . ఈ దేహాన్ని చాలించి వేరే రూపంతో నీ దగ్గరకు చేరుకుంటానని మనసులోనే శివునికి ప్రమాణం చేసింది. యోగాగ్ని రగిల్చి అందులో దగ్ధమైపోయింది. నీ అహంకారం కూడా ఇలాగే ఆహుతవుతుందని దక్షుని శపించింది.. అది చూసిన తల్లి ప్రసూతి తల్లడిల్లిపోతూ, తరుణోపాయం తెలియక తలబాదు కుంటుంది.తల్లి మనసు కదా!
అహంకారి దక్ష్డు మాత్రం ,ఆ యాగాన్ని కొనసాగించమని ఆజ్ఞాపిస్తాడు..ప్రమదగణాలు పిచ్చెక్కినట్లు యజ్ఞ వేదిక నంతా చిందర వందరచేసాయి.. కొందరు శివునికి సమాచారం అందించడానికి పరిగెత్తారు.కొందరు యజ్ఞ వేదిక వద్ద విధ్వంసం సృష్టించారు.. చేష్టలుడిగి చూస్తున్న దేవతలలో కొందరు శిలాప్రతిమ లయ్యారు..రుద్రుడు తన రౌద్రాన్నంతటిని ప్రదర్శింపక మానడు.. ఈ ప్రళయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు అని అన్నాడు విష్ణువు.
కొడుకు పెడతోవ పట్టి వక్రబుద్ధి తో ప్రవర్తించిన విధానాన్ని చూసి, పన్నెత్తి మాట్లాడలేక, కన్ను ఎత్తి చూడలేక, కళ్ళు వాల్చేశాడు బ్రహ్మ.. రుద్రుని రౌద్ర ఫలితం అనుభవ పూర్వకంగా బ్రహ్మకు తెలుసు.. హాహాకారాలు పెడుతూ రుద్రుడికి ఈ విషయం అందజేయడానికి.వెళ్లారు కొందరు . స్థాణువయ్యాడు శివుడు. భరించలేకపోయాడు.. భార్యను అంత లా ప్రేమించాడు మరి. సతితో సహగమనం చేసిన శివుడు,
సతి లేదన్న విషయాన్ని భరించలేక పోయాడు..శివుడు భవ బంధాలకు ఎంత చిక్కుకోడో !చిక్కుకుంటే అంతలా అల్లుకుపోతాడు.ఆ ముడిని ఇప్పడం ఎవరికీ సాధ్యం కాదు .రుద్ర తాండవం చేశాడు.
సతీ వియోగాన్ని భరించలేక జట పెరికి నేలకు కొట్టాడు . వీరభద్రుడు వచ్చాడు వీరవిహారం చేశాడు కాళీమాత వచ్చింది కళ్ళు ఎర్ర చేసింది.వీరభద్రుని ఆజ్ఞాపించింది,ఏముంది దక్ష ప్రజాపతి శిరస్సు తెగి హోమగుండంలో పడింది. అహంకారం అంతరించింది.దక్షుడు భార్య ప్రసూతి పరిపరి విధాల పరమశివుని వేడుకోవడం వలన ,తల తెగడంతో అహంకార రహితుడైన దక్షుడికి మేక తలను అతికించి మళ్లీ సజీవుని చేస్తాడు.
పరమశివుడు ప్రాణాధిక మైన భార్య వియోగానికి పిచ్చివాడు అయిపోతాడు..
అది సతీ శివుల ప్రేమంటే అది సాలోచనగా అంది ధరణి
. విన్న దాక్షాయనికి వెన్నులో వణుకు పుట్టింది. ఆలోచనలో పడింది దాక్షాయణి .
.మన ఇంట్లో ఇలాంటి ప్రళయమే జరగబోతోందా? అంది తల్లితో మెల్లగా …
సతీ శివులు . ప్రకృతి పురుషులు. వారి ప్రేమ ప్రణయం పరమ పవిత్రమైనవి .
ప్రేమ ఆదర్శ మయినది. అది ఆవేశం కాదు. ఆలోచన.
పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమ, ఆడవాళ్ల లో ఉంటే అది పాతివ్రత్యం
.మగాళ్ళలో ఉంటే అది ఏకపత్నీవ్రతం. ఆ రెండూ ఉన్న దంపతుల యొక్క దాంపత్యమే ఆదర్శం.
ఆనాటి దాంపత్యాలు ఈనాటి యువతరానికి అసలైన ఉదాహరణలు కావాలి..అని చెప్తూ ఆలోచనలో పడింది ధరణీ దేవి .
. మీ నాన్న దక్షుడు కాదు. దత్తుడు..దక్షుడిని మించిన అహంకారి. నీకు మాత్రం ఎందుకో, దాక్షాయిని పేరే పెట్టాడు .. ఈ దాక్షారామం లో నివసించడం వల్ల కాబోలు.. ఆరు నెలల క్రితం నీవు చెప్పిన విషయం.విని ,
ఆ రోజు నుండి ఇంట్లో అంటుకున్నది అగ్ని.,. అనునిత్యం రగులుతునే ఉంది..
జరగబోయే పరిణామాలు తలుచుకొని ఝడిసిపోతోంది ధరణి.
దక్షుడు సతి దహనానికి కారకుడయితే! తన భర్త దత్తుడు ,అమ్మాయి ఇష్టపడిన అబ్బాయిని అంతం చేయడానికి కారకుడవ్వబోతున్నాడు.. పూర్ణపురుషాహంకారియైన తన భర్త , తన అనుచరుడితో మాట్లాడుతుంటేవింది ,మద్యాహ్మం నిద్రపోతున్న తను అకస్మాత్తుగా దాహం వేయడంతో మంచినీళ్ల కోసం వెళుతూ ,మధ్యలో హాల్లో అతడు ఫోన్ లో చెప్తున్న విషయాలు విని అవాక్కయింది..
ఆ అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండడం, అది విని ధరణి కి కొన్ని గంటలే అయింది.కొంపులను వెంకటేసుకు తిరుగుతూ గుండాయిజం చేస్తూ నాయకుని అని భావిస్తున్న తన భర్త నలుగురిని వెంట తీసుకుని, ఎవరి బ్రతుకులోనో .ఏదో నరకం సృష్టించడానికి వెళ్ళాడు..మంచిగా బ్రతకమని వీలైతే మంచి చేయమని అపకారం మాత్రం ఎవరికీ చేయొద్దని అనేకసార్లు చెప్పి చూసింది ధరణి.ఫలితంగా దెబ్బలు తిట్లు తింది.
అతడిని మార్చలేక తను మారలేక అనుక్షణం ఆవేదనకు గురవుతూ, ఉన్న ఒక్క కూతుర్ని ఒద్దికగా పెంచుతూ కాలం వెళ్ళదీస్తోంది ధరణి . దయాజాలీ సహనం సంస్కారం వంటి గుణాల కు సాకార రూపం ధరణి .
కూతురు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. .కుమిలి పోతోంది ధరణి.
అసలు ఆ అబ్బాయి తో చనువుగా ఉండమని చెప్పి, ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసిన వాడు తండ్రే ,
ఇప్పుడు తనని మరిచి పొమ్మనడం భరించ లేక పోతోంది ధరణి .చక్కగా చదువుకుంటున్న పిల్లను వాళ్లకి సంపన్న కుటుంబం అని అతనితో స్నేహం చేయమని ప్రోత్సహించినవాడు ఈరోజు వాళ్ళు వ్యాపారంలో దెబ్బతిని దివాలా తీసేసరికి ఆ అబ్బాయిని మరిచిపోమని కూతుర్ని ఆజ్ఞాపిస్తున్నాడు..
కూతురు దాక్షాయిని కి ధైర్యం చేసి తను విన్న విషయాన్ని చెప్పింది. ధరణి. ఎలాగైనా అబ్బాయిని కాపాడమంది .అతని తల్లికి గర్భశోకం కలిపించవద్దని ఏడుస్తూ చెప్పింది.
విషయం విని విస్తుపోయింది ధరణి కూతురు దాక్షాయణి …వెంటనే కోపంతో ఊగి పోయింది దాక్షాయణి..
.పోలీసులకు ఫిర్యాదు చేస్తా నంది .
వారించింది ధరణి. ఆవేశ పడవద్దు .మీ నాన్నకు పలుకుబడి ఉంది. మన దగ్గర సరియైన ఆధారాలు లేవు. .బండ కింద పడిన చేతులు ఉండిపోతే బలవంతంగా లాగకూడదు . మెల్లగా నేర్పుగా తీసుకోవాలి అంది తల్లి .
అమ్మలూ! నీ ప్రేమ నిజమైనదైతే ,మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ కాక పోతే! నువ్వెంత ఇష్టపడుతున్నావో, ఆ అబ్బాయి కూడా, నిన్ను అంత గా ఇష్టపడి తే ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతకండి. ఉన్నంతలో సర్దుకుపోతూ జీవించండి . పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో చల్లగా జీవించండి …
మీకు ఒకరంటే ఒకరికి విశ్వాసం ఉంటే, ఎవరు మిమ్మల్ని విడదీయలేరు. చావు పరిష్కారం కాదు..
ప్రేమంటే చచ్చిపోవడమో! చంపు కోవడమో! కాదు.పగ సాదించడంకాదు ..
ఈరోజు ఆవేశంతో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అతన్ని చులకన చేసే భావన నీకు లేకపోతే,
అతనికి కూడా నీ వంటే అంత మంచి అభిప్రాయం, ప్రేమ, ఉంటే, నా మాట విని దూరంగా వెళ్లిపోండి.,
‘నా తల్లి చనిపోతూ, ఎవరికీ తెలియకుండా ఇచ్చిన బంగారం ,నీకు ఇస్తాను .
తీసుకుని దూరంగా వెళ్ళిపో..అక్కడ ఇద్దరూ హాయిగా జీవించండి .అతడు చదువు కున్నవాడు, వ్యాపారంలో తెలివితేటలు ఉన్నవాడు కాబట్టి,నీవెలాగూ మంచి ఉద్యోగ మే చేసుకుంటున్నావు కాబట్టి
,మీకు లోటు ఉండదు అంది ధరణి, ఒక నిశ్చయానికి వచ్చి .
.వెంటనే బాధపడుతూ అంది,
అసలు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి చాలా తెలివైన వాడని ,బిజినెస్సులో బోలెడు సంపాదించాడని ,
అతడిని అల్లుడిని చేసుకుందామను కుంటున్నానని ఆశలు కల్పించిన వాడే మీనాన్న ,
ఆరు నెలల క్రితం వరకూ, ఆనందంగా తిరుగుతూ ఉంటే అన్ని విధాలా సమర్ధించిన మీనాన్న , ఆరు నెలల క్రితం వ్యాపారంలో అతని తండ్రికి పెద్ద నష్టం వచ్చి కుదేలై పోబట్టి ,ఇప్పుడు అతన్ని మరచిపో మంటున్నాడు.
ఇదే నీ పెళ్లయిన తర్వాత జరిగితే ఏం చేసే వాడు? ఆ కుర్రవాడికి ముందు ఆశలు కల్పించి ఇప్పుడు వీలులేదని ఆంక్షలు పెట్టడం ఎంతవరకు న్యాయం?.నువ్వు అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నావు కాబట్టి,. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితంలో నిన్ను కలవకుండా, తప్పించడానికి ,మొత్తం మీద, ఈ భూమి మీద అతడు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నాచెవులతో నేనువిన్నాను.అందుకే ఎక్కడికైనాదూరంగా వెళ్లిపొమ్మంటున్నాను బోరుమని ఏడుస్తూ అంది ధరణి.
నాన్న అతని స్నేహితులు. తిరిగే వ్యవహారం చూసి, ఎలాంటి హత్యలకైనా , దేనికైనా సిద్ధపడతాడని అనుకుంటు నే ఉన్నాను. అయినా !నువ్వు భయపడకమ్మా నాన్న .అతను తీసిన గోతిలో అతనే పడేటట్టు చేస్తాను .ఇతని నీ ,ఇతని దుష్ట స్నేహితులను జైలుకు పంపుతాను ..పాపం వీరి పాలబడి ఎందరు ఆడ పిల్లల బ్రతుకు అధ్వానం అవుతున్నాయో , నీకు తెలియదమ్మా . నేను వీళ్ళను వదిలి పెట్టను .
ఇక్కడ నాన్నకు తెలియని ఇంకో విషయం ఉంది. లండన్ లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ లో, మహేష్ కి
మాస్టర్స్ చేయడానికి అవకాశం వచ్చింది.. ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు అతడిని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు.
రేపు ఫ్లైట్ ఎక్కి పోతాడు కూడా. నాకు జాగ్రత్తలు చెప్పాడు మహేష్ . తను మాస్టర్స్ అయ్యేలోగా,
నన్ను కూడా తీసుకు పోవడానికి ప్లాన్ చేస్తాడట. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా నాకు ధైర్యం చెప్పారమ్మా .
ఈ లోపు నా ప్రయత్నాలు నేను చేస్తాను. నువ్వు మహేష్ విషయం నాన్న దగ్గర అనకు.
నేను కూడా ఏమీ మాట్లాడను. బెంగ పడి, నీ ఆరోగ్యం పాడు చేసుకోకు . నాన్న కాదు కదా!, ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా, నేను చచ్చిపోను .మహేష్ ని చావ నివ్వను.తను కూడా అంతే…
తను హైదరాబాద్ లో ఉన్నాడను కుని , నాన్న ఈ ఉచ్చులు పన్నుతున్నారు.ఆ ఉచ్చులో అతనే పడతాడు. తను గత నెలలో హైదరాబాద్ వెళ్లే ముందరే మహేష్ నేను మేమిద్దరము, మన దేవాలయంలో ఒక చల్లని సాయంత్రం ప్రమాణాలు చేసుకుని, దండలు మార్చు కున్నాం. ఇవుగో ఆ ఫొటోలు . ప్రమాణాలు చేసి, మా మొబైల్లలో రికార్డు చేసుకున్నాం కూడా. తనను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ,జీవితంలో ఎప్పుడూ అతని చేయు వదలనని నేను, నన్ను వదిలిపెట్టనని అతను ప్రమాణాలు చేసుకున్నాం. .మా వాయిస్ రికార్డు సి.డి.లు..చేసాం . నేను మాట్లాడింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరఇచ్చాం,
తను మాట్లాడింది నీ దగ్గర భద్రంగా ఒక కాపీ ఉంచడానికి నిశ్చయించుకున్నాం.
నువ్వు అనవసరంగా ఆందోళన పడి, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు . మేము స్థిరపడ్డాక నిన్ను నా దగ్గరకు తీసుకుపోతానమ్మ. మహేష్ అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు..
నేను ఈ తరం అమ్మాయినని పకపకా నవ్వింది దాక్షాయణి … నీ ఇల్లు బంగారం గాను ఎంత చక్కని వార్త చెప్పావే నా ఆందోళన అంతా ఆవిరైపోయింది.
ఏమోనే, తల్లీ! ఈ రోజుల్లో పిల్లలు ఎంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నా రో !అంత తొందరగా మనసు మార్చుకుంటున్నారు. ,ప్రేమ కోసం చంపడమో !, చావడమో చేస్తున్నారు .
ఆవేశంతో పెళ్లిళ్లు చేసుకుని ,అనుమానాలతో, ఆగ్రహంతో ,విడిపోతున్నారు . ఎందరో పిల్లల తల్లులు కూడా ,భారీ భావోద్వేగాలు అదుపులో పెట్టు కోలేక పిల్లల్ని బలి పశువులుగా చేస్తున్నారు .
పసిపిల్లల జీవితాల ను బలిపెట్టి, ఎంతోక్రూరంగా మారిపోతున్నారు.అవ న్నీ చూస్తూ,వింటుంటే ఉంటే ,
భయం వేసి అన్నాను అంది కళ్ళనీళ్లు పెట్టుకుని ధరణి..
అవునమ్మా! నువ్వు అన్నది నిజమే!కానీ, నీ పెంపకంలో నన్ను తీర్చిదిద్దావు. ఎంతో సహనంతో నాన్న నిన్ను ఎన్ని అవస్థలపాలు జేస్తున్నా, సర్దుకుపోతూ, నా కోసం జీవితాన్ని నెట్టు కొస్తున్నావు. ఇవన్నీ చూస్తూ. నేను మిగతా వాళ్ళ లాఎలా ఉండగలనమ్మా? నువ్వు భయపడకు .మహేశ్ ని అన్ని విధాల పరీక్షించాను .తను కూడా నా నుండి ఏ విషయం దాచలేదు. మాది ఆకర్షణ కాదు.ఆవేశము కాదు.అర్థం చేసుకున్నాము.
పరిస్థితులు చక్కబడ్డాక ,పెళ్లి చేసుకుని, నీ కళ్ళముందే హాయిగా ఉంటాం .నువ్వు మాతోనే ఉంటావు అంది స్థిరంగా దాక్షాయిని..కూతుర్ని గుండెలకు హద్దుకొని, నీ లాంటి పిల్లలు ఉంటే, తల్లిదండ్రులకు సమస్యలు ఎందుకు వస్తాయి కన్నా? సంతోషంగా అంది ధరణి..
సమాప్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిట్టి కథ గొప్ప సందేశం

తెలుసుకుందాం!