“తాతయ్యా! లింగమయ్యని పిలిస్తే నేనుఅడవికి వెళ్తాను. నీకుకావలసిన మూలికలు చెప్పు. నేను గుర్తు పట్టగలనేమో!” అందిబృంద.
చిరునవ్వు నవ్వాడు మణికంఠ. “అది అంతతేలిక కాదు తల్లీ! ఆ తుప్పల్లో జొరబడి వాటిని తీయడం ఒక్క కోయ, చెంచు జాతివాళ్ళకే సాధ్యం. లింగమయ్య మంచినేర్పరి. అయితే నీవు లింగమయ్యని వదిలి అటుఇటు వెళ్ళవద్దు. పులులు, సింహాలు అడవిలో లోపలికి ఉన్నాయి. కానీ విషప్పురుగులు,తేళ్ళు, పాములు ఎలుగుబంట్లు, అడవిదున్నలతో కొంచెం జాగ్రత్త. కోతులని ఆటలాడేవు అవి చాలాప్రమాదం.”
అంటూ తగు జాగ్రత్తలుచెప్పి మరుసటిరోజు అడవి ప్రయాణానికి సంసిద్ధంచేశాడు.
“దాదాపు పదికిలోమీటర్లు నడవాలి బృందా. నడవగలవా?”అనుమానంగా అడిగాడు మణికంఠ.
” ఓ! మేము చదువుకునేటప్పుడు ఫీల్డ్ ట్రిప్స్ ఉండేవి.దానికి తగ్గబూట్లు కూడాఉన్నాయి. అన్నీ తెచ్చుకున్నా” అందిబృంద.
” సరే పడుకో తల్లి! రేపుఉదయం ఐదున్నరగంటలకి బయలుదేరితే ఏడున్నరకి అడవిమొదలుకి చేరుతారు.” అన్నాడు మణికంఠ.
రాత్రంతా కలలుకంటూ పడుకుంది బృంద.
★★★
కార్తీకమాసం అవడంతో పుడమి పచ్చనిపైరుచీర కట్టి మంచుతెరల ముసుగులో పిల్లగాలుల సరసాలతో వయ్యారంగా నడుస్తోంది. ఎర్రనిసూర్యుడు మంచుతెర ముసుగు తొలగించగా పుడమిపడతి నుదిటిబింబమై కాంతులీనుతోంది.
నులివెచ్చని అరుణకిరణాలు తరువుతనువు చీల్చుకొని పక్షిరాజుల గూళ్ళమీద పడటంతో అప్పుడే తెలవారిందా అని విహంగాలు బద్ధకంగా వళ్ళువిరుచుకుని విహంగవిహారానికి బయలుదేరుతూ చేసే కిలకిలారావాలతో అడవంతా మేలుకొలుపు పాడింది. తరువుపై రాత్రి కురిసిన హిమబిందువులని లేతసూరీడు బంగారుకిరణాలు సృజించ పుష్యరాగపుకాంతులతో వింతసోయగాన్ని ప్రసరిస్తూ అడవితల్లి మకుటంలోమణులై ఒప్పారుతోంది.
ప్రకృతిఒడిలో పరవశించి నడుస్తున్న బృంద “బిడ్డా పదిలం” అన్న లింగమయ్యగొంతుతో అప్రమత్తమయ్యింది. కాస్తఉంటే పడిపోయినచెట్టుకి మోకాలుకొట్టుకునేది.
“లింగమయ్య కాకా! నువ్వు ఈ అడవిదాటి ఎక్కడికి వెళ్లలేదా!”
“లేదు బిడ్డా! వెళ్ళినా ఒక్కతూరి. గద్దర్ అన్నతో హైదరాబాదు పోయింటి .”
“ఈ అడవిలో నీవు ఎలా సంపాదించుతున్నావు? ఏం సంపాదిస్తావు? సరిపోతుందా నీకు? “
“చిన్న నవ్వునవ్వి మాకు ఖర్చులుఏముంటాయి? తింటానికితిండి మేమే సాగుచేసుకుంటమైతిమాయె. ఉండటానికి ఇల్లు మట్టి, బురద, చెట్ల ఆకులతో కొమ్మలతో కట్టుకుంటాం. కట్టుకోవడానికి గుడ్డకే మేము ఆధారపడ్డాము. వళ్ళు బాగలేకపోతే అడవితల్లి ఔషధాలు ఉండనేఉండె. వాటితో బ్రతుకో సావో. ఎలక్షన్లప్పుడు మేముండామని యాదుకొస్తది గొవర్నమెంట్ కి. ఆ తర్వాత మేము ఎవరో. ఆళ్ళెవరో! పుట్టతేనె, కుంకుళ్ళు, సీకాయ లాంటివి అమ్ముకుంటాము.మాకు ఏకష్టం వచ్చినా మీతాత లాంటోళ్ళు ఆదుకుంటారు. దానితో మా జీవితాలు తెల్లారుతాయి. అవు బిడ్డా! పదిలం ఎత్తుపల్లాలు ఉంటాయి. కొంచెంఆగు యాడనో అడవిదున్నలు కొట్లాడుగుంటున్నాయి. గవిట్లు అచ్చినాయా సానా పెమాదం.” అంటూ బృందని ఆపి చెవులు రిక్కించి ఆడుతూ లింగమయ్య.
బృంద ఆ శబ్దాన్ని పసిగట్టటానికి ప్రయత్నించింది. క్రమేపి ఆ శబ్దం దూరమవటంతో మరల నడవటం ప్రారంభించారు.
“బిడ్డా!ఈ అడవి ఇంకొక పదిమైళ్లు పోయినామంటే ఎర్రచందనం చెట్లగుపడతాయి. ఇగో మాగూడెం.” అంటూ వెదురు ఫెన్సింగ్ లతో రెల్లుగడ్డి పైకప్పులతో ఉన్న గడిసెలను చూపించాడు లింగమయ్య.
ఆకుపచ్చని అడవిలో అరవిచ్చిన మందారం లాంటి బృంద అందం గూడెంలో పిల్లలందరినీ ఆశ్చర్యపరిచింది.
చిన్నగా చెయ్యిఊపింది బృంద. అనుమానంతో నెమ్మదిగా అడుగులోఅడుగు వేస్తూ బృంద దరిచేరారు పిల్లలు.
“చదువుకుంటున్నారా? “అని అడిగింది బృంద అందులో ఒక పాపని. గబగబా గుడిసెలోకి పరుగెత్తి పలకతెచ్చి చూపింది. దానిమీద వంకరటింకరగా వర్ణమాల వ్రాసిఉంది.
“నువ్వే రాసావా? నీ పేరేమిటి” అని ప్రశ్నించింది బృంద.
“నా పేరు గిరిజ. నానే ఆసినా! సారు ‘గుడ్’ అనిండు.” అంటూ ఎంతోఆనందంగా చెప్పిందిగిరిజ.
బృంద ‘వెరీ గుడ్’ అంటూ తనుతెచ్చిన చాక్లెట్లు, పెన్సిళ్ళు,నోట్బుక్స్ పిల్లలకు పంచింది. వారి దుస్తులు చూసి కనులుచమర్చాయి బృందకి.ఈసారి వీరికి మంచి దుస్తులు తేవాలనుకుంది.
“లింగమయ్య నాకు అగ్నిశిఖని చూపెట్టవా! నేను వెళ్ళేలోగా అగ్నిశిఖ ఇక్కడనుంచి తీసికెళ్ళాలి. అది ఎట్లా గుర్తుపట్టడం?” అది బృంద.
” ఈ అడవి ఎంబడి ఇంకో ఐదు మైళ్ళు పోతే ఈ అడవి నల్లమల అడవులలో కలుస్తది. ఆడ దొరుకుతాది. అది చాలా అరుదైనది కానీ తేలికగా గుర్తుపట్టవచ్చు. పేరులెక్కనే దానికొస ఎర్రగా మంటశిఖ లా ఉంటది.” అన్నాడు లింగమయ్య.
లింగమయ్యమాటతీరులో వ్యత్యాసం బృంద గమనించింది.మూలికల విషయమై మాట్లాడినప్పుడు స్వచ్ఛంగా తాతయ్య మాట్లాడినట్లు మాట్లాడటం .మిగతా సందర్భంలో యాస.నవ్వుకుంది.తాతయ్య ప్రభావానికి.
త్రోవలో నేలవేము, అత్తిపత్తి, మొర్రి మొర్లి చెట్లను చూపించి వాటిని తెంపి బృందకి అందించాడు. బృంద వాటిని పదిలంగా స్పెసిమెన్ బ్యాగ్ లో దాచుకుంది.
కొంత దూరంలో నీటిచప్పుడు వినపడంగానే,
“లింగంకాకా! ఎక్కడో నీటిచప్పుడు వినపడుతోంది” అంది.
అవు బిడ్డా! ఈడ కొండలమీద పడ్డనీరు ఈ అడవి గుండాపారి మన పొలాలదిక్కు పోతది. ఈనీరే మాకు ఆధారం. ఈ నీటిలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఈ నీళ్లు తాగితే కొండరాళ్లుతిన్నా అరిగిపోతాయి. సానా జబ్బులు నయమవుతాయి అంటారు.” అంటూ అటుగా తీసుకెళ్లాడు లింగమయ్య.
ఆ సెలయేటి గలగలలు,పరిసర ప్రకృతి బృందకి భూతల స్వర్గమా అన్నట్లుంది. స్వచ్ఛమైన నీరు నేల మీద పారగా నేలమీద చిన్నచిన్న గులకరాళ్లు సహితం స్పష్టంగా కనబడుతున్నాయి. సూర్యకిరణాలు ఆ నీటి మీదపడి జలకన్య నాట్యం చేస్తుందా అన్న అనుభూతి కలిగింది.
ఇంతలో లింగమయ్య ఆకు దొన్నెలో ఆ సెలయేరు నీటినిపట్టి బృందకిచ్చాడు. దాహంతో ఉన్న బృంద ఆ నీటిని త్రాగింది. లేత కొబ్బరి నీరు రుచితో ఉన్న ఆ నీరు త్రాగగానే ఓ.ఆర్.ఎస్ త్రాగినంత శక్తి వచ్చింది బృందకి.
ఇంతలో అంతెత్తు రాళ్ళగుట్ట మీద నుంచి ఒకవ్యక్తి కాలుజారి దొర్లుతూ సెలయేటికి అటువైపు పడిపోవటం లింగమయ్య బృందలకి ఒకేసారి దృష్టిలోకి వచ్చింది.
“అయ్యో!ఎవరు? అంటూ ఒక్క అంగలో లింగమయ్య సెలయేరుదాటి అటువైపుకి వెళ్ళాడు.
బృంద నెమ్మదిగా ఆ సెలయేరు దాటింది. కాలికి బూట్లు తొడగటంతో ఆ సెలయేరు స్పర్శ తెలియనందుకు బాధపడింది.
” భద్రం బిడ్డా! అంటూ లింగమయ్య ఆవ్యక్తిని ఒడిసి పట్టుకుని పక్కనే నేలమీద వంగి ఉన్న చెట్టు కొమ్మపై కూర్చోబెట్టాడు.వెంటనే తుప్పల్లోకి వెళ్లి కొన్నిఆకులు తీసుకొచ్చి నీళ్లతో కడిగి చేతితో మెత్తగా నలిపి దాని రసం గాయం మీద వేసి నలిపిన ఆకులని కాలు మీద వేసి కర్చీఫ్ తో కట్టాడు లింగమయ్య.”
“ఎవరు బిడ్డ? యా ఊరు?” అడిగాడు లింగమయ్య.
“నేను శివరామకృష్ణగారి బంధువుని. అడవి చూడటానికి వచ్చాను. ఇక్కడ ఔషధీచెట్ల గురించి విన్నాను. కానీ ఇప్పుడు వాటి ప్రభావాన్ని అనుభవిస్తున్నాను. నా పేరు రవీంద్ర.” అంటూ చిరునవ్వు నవ్వాడు.
“మాట్టారి ఇంటికి వచ్చినావా! నాకు కబురంపితే ఈ బిడ్డతో నిన్ను కూడా తోడుకొని వచ్చి ఉండకపోనా! భద్రం.” అంటూ చేయిపట్టుకు లేపాడు లింగమయ్య
పరవాలేదంటూ లేచి నుంచున్నాడు ఎదురుగా వనదేవతలా ఉన్న బృందని చూశాడు ఎవరన్నట్లు ప్రశ్నార్ధకంగా.
“నేను బృంద. మణికంఠ ఆచార్యుల వారి మనుమరాలిని. అంటూ తనని తాను పరిచయం చేసుకుంది బృంద.
“చాలా సంతోషం అండి మీ పరిచయ భాగ్యం రాసిపెట్టి ఉండే పైనుంచిజారి మీ పాదాలచెంత పడ్డానేమో!” అంటూ లింగమయ్యకి వినిపించనంత నెమ్మదిగా అన్నాడు రవీంద్ర.
అప్పుడే పరిచయమై అలా సన్నిహితంగా మాట్లాడటం బృందకి ఏమాత్రంనచ్చలేదు.
“అన్నిచోట్ల తలలో ఉన్న కళ్ళతో కాక, కాళ్ళలో ఉన్న కళ్ళతో చూడాలి. ఏదోఁ అదృష్టం బాగుండి లింగంకాక కళ్ళబడ్డారు. లేకపోతే లేవలేక అక్కడే పడి ఉంటే మధ్యాహ్నం దాహానికి సెలయేరు దగ్గరికి వచ్చే ఏ మృగానికో ………. హుఁ ఎందుకు లెండి.” అంటూ ముందుకి అడుగువేసింది.
వెనుక అడుగుచప్పుడు వినపడక వెనక్కిచూసిన బృందకి కాలుకి గాయంనుంచి రక్తస్రావం అవటంతో రవీంద్ర అడుగు వేయటానికి కష్టపడటం గమనించింది. అయ్యో పాపం! అనుకుంటూ,
” కాకా!” అని పిలిచింది.
అక్కడే తుప్పల్లో ఆకులు తెంపడనికి వెళ్లిన లింగం వచ్చి”అయ్యో! రకతం సానా పోతుంది.” అంటూ మరిన్ని ఆకులను నలిపి గాయం మీద అదిమి బృంద ఇచ్చిన స్కార్ఫ్ తో గట్టికట్టు వేశాడు.
“లింగం కాక ఇవాల్టికి ఇకచాలు ఇంటికి పోదాం. ఆకలిగా ఉంది ఇక్కడే తిందాం.”అంటూ తను తెచ్చిన జొన్నరొట్టెలు, ఆకుకూర లింగమయ్యకి రవీంద్రకి పెట్టింది.
“వద్దండి! నేను ఇడ్లీలు తినే బయలుదేరా.” మొహమాట పడ్డాడు రవీంద్ర.
“మళ్లీ పధ్నాలుగుకిలోమీటర్లు నడిస్తే గాని వెనక్కి వెళ్ళలేం.తినండి. నాకు బయటికి వచ్చినప్పుడు నాకే కాక ఇంకా ఇద్దరు ముగ్గురికి ఎక్కువ ప్యాక్ చేసి తేవటం అలవాటు.” అంది బృంద.
ప్రకృతిఒడిలో రొట్టెలుతిని సెలయేటినీరు త్రాగేసరికి ఎక్కడలేని శక్తివచ్చింది ముగ్గురికీ.
“లింగంకాక నాకు అడవిలో ఇంకాకొంచెం లోపలికి వెళ్లాలని ఉంది ఎలాసాధ్యం?” అన్నాడు రవీంద్ర.
ఒక రేతిర మా గూడెంలో ఉండి తెల్లారిగట్టి మల్లా పయానం సేస్తిమా అడవిలో పల్లెలకి పోవచ్చు. ఆడ చెంచుల గూడెం ఉండాది. గూడెం పెద్ద చెంచ్వార్ సానా ఎరిక. మా బందుగు. కాకపోతే ఆడ రేతిరిమల్ల ఏందో గడబిడ అగుతోందట జర భద్రంగుండాల.” అన్నాడు లింగమయ్య.
“ఆహాఁ!” అన్నాడు సాలోచనంగా రవీంద్ర.
“అంత అడవి లోపలకా! అమ్మో ఏమంత అవసరం?” అంది బృంద.
“అవసరమే నేను నా ప్రాజెక్టు గురించి వచ్చాను.నేను ఎన్న్జీ.జీ.వో ని కొన్నివివరాలు సేకరించాలి. ఈ అడవిని కాపాడు కోవాలి.” అన్నాడు రవీంద్ర.
లింగమయ్య కి ఏమీ అర్థం కాలేదు. “అడవిని కాపాడుకోవాలి.” అన్న పదం తప్పించి.
“బిడ్డా నువ్వు ఈ అడవిగురించి మాగురించి ఏమి చేసినా మేమంతా నీఎనకే ఉంటాం.” అంటూ రవీంద్ర చేతులని కళ్ళకి అద్దుకున్నాడు.
“సరే నేను నీదగ్గరికి వస్తా లింగం కాక. తర్వాత ఏర్పాటు నువ్వేచూడు.ఎప్పుడు వచ్చేది ముందుగా చెప్తా.” అంటూ గ్రామం పొలిమేర దగ్గర నిష్క్రమించాడు రవీంద్ర.
“పద బిడ్డా! నిన్ను ఇంటితావున దింపుతా!” అన్నాడు బృందంతో లింగమయ్య కాక.
నేను ‘అగ్నిశిఖ’, ‘కాలమేఘ’ ని ఎలా గుర్తుపట్టాలో ఎప్పుడు వీలవుతుందో చెప్పుకాకా.అని మళ్ళీ గుర్తుచేసింది.
★★★
శుక్రవారం కలెక్టరుగారి అపాయింట్మెంట్ దొరికింది అంటూ రామనాథం శివరామకృష్ణకి, సీతారామయ్యకి,శేషయ్యకి,రాజన్నకి మెసేజ్ చేశాడు. శివరామకృష్ణ మణికంఠని, లింగమయ్యని, చెంచ్వార్ని తమ కూడా రమ్మని కోరాడు. రవీంద్రని తప్పక తమతో వచ్చి తమకు అండగా ఉండమని కోరాడు.
శుక్రవారం అందరూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు.
‘ఎంతసేపు నిరీక్షించాలో కలెక్టరుగారు ఏ విధంగా తమని అధికారికంగా స్వాగతిస్తారో!’ అని అనుమానంతో బయట వేచిఉన్నారు.
తాము వారితో మాట్లాడవలసినవి, ఎవరెవరు ఏ విషయం మాట్లాడాలన్నది ప్రణాళిక వేసుకున్నారు.
ఎదురుచూస్తున్నట్లు ” రామనాథం రామగిరి” అంటూ పిలిచారు. వెంటనే అందరూ లేచి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు.
ఎవరో ఒకరిద్దరిని మాత్రమే అని బంట్రోతు అడ్డగించాడు. వెంటనే రవీంద్ర ఒక కాగితం మీద
ఏదోవ్రాసి కలెక్టరుగారికి ఇవ్వమని ఆ బంట్రోతుని కోరాడు.
రెండునిమిషాల్లో కలెక్టరుగారు అందర్నీ
రమ్మనమన్నాడు. అందరినీ పంపించారు.
రామనాథంగారు క్లుప్తంగా సమస్యని వివరించి శేషయ్యని, రాజన్నని మాట్లాడమన్నారు.
“అయ్యా! నేను రామగిరిరైతుల తరపున వచ్చినాను. అయ్యా! తూరూపున ఉన్నపొలాలు కొండగట్టు వరకు సాగుచేసుకుంటున్నాం. మా రామగిరే కాక చిన్నచిన్న గ్రామాలందరివి కలిపి సుమారు పదివేలఎకరాలు సాగుభూమి ఉంది. అందులో మాది వరి ప్రధానపంటకాగా ప్రత్తి, చెఱకు,మామిడి, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు కూడా
భూమినిబట్టి సాగుచేస్తున్నాము.మంచి వ్యవసాయభూమిని ఏదో మందుల ఫ్యాక్టరీకని ఇవ్వమంటున్నారు. దాదాపు ఐదువందలమంది చిన్నపెద్ద రైతులందరం నేలతల్లిని నమ్ముకున్నాం. మా రైతులు యాడకిపోవాలి దొరా? ఇదేగనుక జరిగితే తలోఇంత పురుగుమందు త్రాగిసావాల. మేమేమి గన్యాయంసేసినాం దొరా? పంటలుపండించి గంజినీళ్లు మేముతావి ధాన్యమంతా మందికేఇస్తున్నాం గందా!”అంటూ తువ్వాలనోట్లోకుక్కుకున్నాడు దుఃఖాన్నిఆపుకుంటూ రాజన్న.
” అయ్యా! నేను లక్ష్మణగిరి రైతుల తరఫున వచ్చినాను. మాదంతా మామిడి తోటలు చెరకుపంట దాదాపు మూడువందలఎకరాల వ్యవసాయభూమి. ఎవరో ఆసామి రియల్ ఎస్టేట్ మడిసంట మాతావుకొచ్చి ధంకీల మీద ధంకీలు ఇస్తుండాడు. ఆ భూమిని అమ్మమని. గాయన ప్లాట్లుసేసి అమ్ముకుంటండంట. అమ్మకుంటే జబర్దస్త్ మమ్మల్ని ఖాళీ చేయిస్తానంటుండు. రేతిరి, పగలు మా గుడిసెల్ని భూమిని కాపలా కాసుకుంటున్నాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.” అంటూ వాపోయాడు శేషయ్య.
“మీ బాధలు ఏమిటి?” అని చెంచ్వార్, లింగమయ్య లను అడిగాడు. కలెక్టర్ అభిషేక్
“మా ఇద్దరిదీ ఒకటే సమస్య సారూ! రేత్రిళ్ళు ఎవరో అడవిని నరుకుతుండారు. చెంచయ్య
పోయిసూడంగా ఆరిచేతుల్లో తుపాకులు ఉండాయి. రోజు రేత్రిల్లు యాభైసెట్లు దాకా నరుకుతుండారు. పట్టించుకునోళ్ళు లేరాయే!” అంటూ వినమ్రంగా చెంచ్వార్, లింగమయ్యలు చెప్పారు.
“నమస్కారం! ఆచార్యులవారు. మీరు మాఆఫీసుకు రావడం సుదినమా! లేక ఇక్కడ వరకు రావాల్సి రావటం దుర్దినమా తెలియదు. మీ రాకకి కారణం సెలవీయండి.” అన్నాడు కలెక్టర్ అభిషేక్.
“మీరు మాయందు చూపుతున్న మర్యాదకు కృతజ్ఞుడను. ఇదేవిధంగా మా సమస్యలను ఆకళింపు చేసుకొని సహృదయంతో తగిననిర్ణయం తీసుకోండి. తెలంగాణ అడవులు ఎన్నో ఔషధీజాతి మొక్కలకి పుట్టినిల్లు. నల్లమలఅడవులవరకు వ్యాపించిన అడవులలో లభించే అరుదైన ఔషధమొక్కలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంవారికి ఉండగా, కంచేచేనుమేసినట్లు ప్రభుత్వమే అడవులను, సాగు భూములను తీసుకోవటం ఎంతవరకు సమంజసం? ఎన్నోజఠిలమైన ఆరోగ్యసమస్యలను ఎటువంటి దుష్ప్రభావము లేని ఆయుర్వేదవైద్యానికి కావలసిన మూలికలకు మాతృస్థానమైన అడవులను నరకటంవల్ల ఈ మూలికలు అంతరించే ప్రమాదంఉంది. అంతేకాదు పర్యావరణ సమతుల్యతకు గొడ్డలిపెట్టు అవుతుంది. మీరు సహృదయంతో మా విన్నపాలని పరిగణించాలని కోరుతున్నాను.” అన్నాడు మణికంఠాచార్యులు.
“మీరేమంటారు మిస్టర్ రవీంద్ర?” అంటూ రవీంద్రని చూసి చిరునవ్వునవ్వాడు అభిషేక్ .