ఒకరోజు ఒక అందమైన యువతి ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. చెప్పమ్మా ఏంటి నీ సమస్య అని అడిగాడు ఆ డాక్టర్ గారు .డాక్టర్ గారు ఆనందంగా జీవించడానికి ఏదైనా మందు ఉందా?? తెరపి ఉందా?? అని అడిగింది ఆ యువతి. ఆ డాక్టర్ గారు ఒక చిరునవ్వు నవ్వి ఏమ్మా నువ్వేం చేస్తావ్? చదువుకున్నావా ?ఉద్యోగం చేస్తున్నావా? నీ వివరాలు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ యువతి డాక్టర్ గారు నేను బాగా చదువుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. భర్త ఒక బాబు ఉన్నాడు. అని చెప్పింది. మరింకే అన్ని బాగానే ఉన్నాయి కదా!! నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. అదేనండి అర్థం కావటం లేదు. రోజు ఉదయమే లేచి ఇంటిల్లిపాదికి కావాల్సినవన్నీ చేసి పెట్టి బాక్స్ పెట్టుకొని ఆఫీస్ కి వెళ్తాను. సాయంత్రం మళ్ళీ అదే హడావిడిగా ఇంటికి వచ్చి భర్తకి బాబుకి కావలసిన వన్నిఆమర్చి తిని పడుకుంటాను.ఇంతకు మించి వేరే దేని మీద దృష్టి పెట్టాలనిపించదు .దృష్టి పెట్టాలనిపించదు అనేకన్నా సమయం కుదరటం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితం కదా!! ఓ అలాగా మీరు ఎప్పుడైనా గుళ్ల గోపురాలకు వెళ్ళటం కానీ, సరదాగా బయటికి వెళ్ళటం కానీ చేస్తుంటారా?? నీకు ఇష్టమైన పనులు ఏవైనా చేస్తుంటారా గతంలో చేసి వదిలేసినవి అని నా ఉద్దేశం. అప్పుడప్పుడు అని చెప్పిందా యువతి. దానధర్మాలు చేయటం కానీ… అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయటం కానీ చేస్తారా?? అని అడిగారు డాక్టర్ గారు. మావారికి ఇటువంటి వాటి పైన పెద్దగా ఆసక్తి ఉండదు డాక్టర్ గారు. గుడికి వెళ్లిన గుడిమెట్ల దగ్గర కూర్చున్న వాళ్ళని చూస్తేమా ఆయనకు చాలా చిరాకు. ఎవరైనా పేదవారికి ఏదైనా సహాయం చేద్దాం అన్న ఏ బాగానే ఉన్నారు కదా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా అని ఈసడించుకుంటారు. చేసేదేమీ లేక మిన్న కుండిపోతాను అన్నది ఆ యువతి. సరే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను .ఆవిడతో కాసేపు మాట్లాడండి. మీకు కావాల్సిన సమాధానం దాదాపుగా దొరుకుతుంది. అని చెప్పారు ఆ డాక్టర్ గారు. కమల ఒకసారి ఇలా రా అమ్మ అని ఒక 30 సంవత్సరాల యువతీని పిలిచి ఆ వచ్చిన యువతినిపరిచయం చేశాడు. చెప్పండి సార్ అన్నది ఆ యువతి. కాసేపు ఈ అమ్మాయి తో మాట్లాడు నాకు చిన్న పని ఉంది .నేను అరగంటలో వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. ఆ యువతి ఆమెను పిలిచి కూర్చోబెట్టి గ్లాస్ మంచినీళ్లు ఇచ్చింది చిరునవ్వుతో. మీ పేరు అని అడిగింది నా పేరు రమ్య అని చెప్పింది ఆనందాన్ని వెతుక్కుంటూ ట్రీట్మెంట్ కి వచ్చిన యువతి. చాలా బాగుంది అన్నది కమల. ఇంకా చెప్పండి మీరు ఏం చేస్తుంటారు మీ వివరాలు చెప్తారా అని అడిగింది కమల. రమ్య అన్ని విషయాలు కమలతో చెప్పింది. అన్ని విన్న కమల చిన్నగా నవ్వింది. ఎందుకలా నవ్వుతున్నారు . అవును నీ గురించి ఏమీ చెప్పనేలేదు మీరు చాలా ప్రశాంతంగా అసలు ఏ సమస్య లేనట్టుగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఇది ఎలా సాధ్యం అని అడిగింది రమ్య. కమల మరల ఒక చిరునవ్వు నవ్వి ఏమీ లేదమ్మా నా గురించి చెప్తాను వినండి. నాకు 22వ ఏట పెళ్లయింది. రెండేళ్లకు ఒక బాబు పుట్టాడు. బాగానే ఉన్నాము అనుకునే సమయంలో రోడ్డు యాక్సిడెంట్ లోనా భర్త నా కొడుకు ఇద్దరు మరణించారు. ఒంటరిగా మిగిలిపోయాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చాలా రోజులు చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఒకరోజు అకస్మాత్తుగా ఎక్కడినుండో ఒక కుక్క పిల్ల మా ఇంటి వారండాలో కనిపించింది .బయట చాలా వర్షం పడుతుంది. జాలి అనిపించి దాన్ని లోపలికి తీసుకొచ్చి చిన్న బట్టతో తడిచిన దాని తలను తుడిచి గిన్నెలో కాసిని పాలు పోసి దాని ముందు ఉంచాను. అది ఎంతో ఆత్రుతగా ఆ పాలన్నీ తాగేసింది. అది మొదలు అది నా చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత ఒక చిన్న చిరునవ్వు నా ముఖంపై కదలాడింది. కాస్త ఆనందంగా అనిపించింది.ఆ కుక్క పిల్ల ఆకలి తీర్చిన కారణమేమో. తర్వాత కొంతసేపటికి ఒక చిన్న ఆలోచన వచ్చింది .నేను చేసిన ఇంత చిన్న పనికి నా మనసులోని బాధ పక్కకు తొలగి చిరునవ్వు వచ్చింది. ఈరోజు నుండి మనసులో ఏమి ఉన్నా అందరిలో కలవాలి అని అవసరంలో ఉన్నవారికి నాకు తోచిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. మరుసటి మా పక్క ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వాళ్లకు ఆ పూట నాలుగు రొట్టెలు చేసి పెట్టాను. చాలా థాంక్స్ అండి అని ఎంతో కృతజ్ఞతా భావంతో నా కళ్ళలోకి చూసింది ఆ పక్కింటి ఆవిడ.ఆ పని కూడా నాకు ఆనందాన్ని కలిగించింది. ఇలా రోజురోజుకు నేను చేస్తున్న పనుల వల్ల, ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం వల్ల నేను మామూలు మనిషిని అయ్యాను. అంతేకాకుండా ఆనందంగా ఉండగలుగుతున్నాను. అప్పుడు అనిపించింది పోయిన దానిని ఎలాగో తిరిగి తీసుకురాలేను కానీ మన చుట్టూ ఉన్నవారితో సఖ్యతగా మెలుగుతూ, మనకు తోచిన సహాయం చేస్తూ, వారితో సత్సంబంధాలను నెలకొల్పుకుంటే ఆనందంగా ఉండవచ్చు అని. ఆ రోజు నుండి నాకు తోచినంత సహాయం చేస్తూ పనిలో, కానీ మాట సహాయం కానీ, నాకు ఉన్నంతలో డబ్బు సహాయం కానీ చేస్తూ వచ్చేదాన్ని. అని చెప్పింది కమల. సరేనండి ఇక నేను వెళ్తాను డాక్టర్ గారికి మళ్ళీ వారం కలుస్తానని చెప్పండి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్పి వెళ్లిపోయింది. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. కమల ఇందాక నీకు పరిచయం చేసిన ఆవిడ ఉందా? వెళ్లిపోయిందా?? అని అడిగారు డాక్టర్ గారు. ఇంతకుముందే చిన్న చిరునవ్వుతో వెళ్ళిపోయింది డాక్టర్ గారు. మరలా వారం వస్తా అని చెప్పింది డాక్టర్ గారు అని చెప్పింది కమల. మరల వారం రోజుల తర్వాత ఆ యువతి డాక్టర్ గారిని కలిసింది. ఇప్పుడు మునపటిలా దిగాలుగా టెన్షన్ గా లేదు. చాలా రిలాక్స్ గా ఉంది .చాలా సంతోషంగా కూడా కనిపిస్తుంది. నమస్కారం డాక్టర్ గారు అని డాక్టర్ గారిని పలకరించింది .ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు కలవకుండానే వెళ్ళిపోయారు అని అడిగారు డాక్టర్ గారు. ఆరోజు మీరు నాకు పరిచయం చేసిన వ్యక్తి ద్వారా నా సమస్యకు పరిష్కారం దొరికింది డాక్టర్ గారు. దానిని ఇంప్లిమెంట్ చేసి ఫలితంతో మిమ్మల్ని కలవాలని అప్పుడు వెళ్ళిపోయాను. ఇప్పుడు చక్కటి ఫలితంతో మీ ముందు కూర్చున్నాను. ఆమె చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం డాక్టర్ గారు తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాను అని చెప్పి రెండు చేతులు జోడించి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ మహిళ.
ఇదండీ కథ .కథ కల్పితమే కావచ్చు కానీ ఇందులో ఉన్న విషయం యదార్థం జరిగిపోయిన దానిని మనం మార్చలేము. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ మనకు చేతనైనంతలో మన చుట్టుపక్కల ఉన్నవారికి చేతనైన సహాయం చేస్తూ మనకు నచ్చిన అంశాల మీద మనసు లగ్నం చేస్తూ మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుంటే తప్పకుండా మనశ్శాంతిగా ,ప్రశాంతంగా ఉండగలుగుతాం .అవునంటారా? కాదంటారా?? ఆలోచించి చెప్పండి ????????
సర్వేజనా సుఖినోభవంతు ????????????????????
✍️✍️. మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.????????????????