‘ అం…అహా ! కం…కహా! ‘ అని రమణారెడ్డి చేతిలో దండం అలా తిప్పగానే ఇలా భవనాలు, లతామండపాలు, నాట్య మండపాలు, సేవకులు, పరిచారికలు, దుస్తులు, నగలు…ఒకటేమిటి! అన్నీ అలా నడిచొస్తుంటే సగటు ప్రేక్షకుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అది మాయాబజార్ సినిమా! మరిప్పుడు….ఓ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కబడ్డీ ఆడుతుంటారు, లేదా అందులో ఒకాయన ఓ లేటెస్ట్ సినిమా పాటకు డాన్స్ చేస్తాడు. మరొకాయన నిక్కరేసుకుని పలక పట్టుకుని బడికి వెళుతుంటాడు. ఒకేసారి ఎప్పుడూ కలవని ఓ నలుగురు హీరోలు చార్ మినార్ ముందు స్టూల్స్ వేసుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగుతుంటారు. ఇది ఏ ఐ మాయ!
మనిషి నిరంతరం కొత్త అన్వేషణల కోసం చూస్తుంటాడు. మానవ నాగరికత పెంపొందుతున్న కొలదీ సరి కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు ఎన్నెన్నో జరిగాయి, జరుగుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో నిరంతరం జరిగిన పరిశోధనల ఫలితంగా ఎన్నో సౌకర్యాలు, పరికరాలు, వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు వున్నా, అవి అందించే సేవల ముందు ఈ చెడు ఎక్కువేం కాదని భావించి దాన్ని ఎంతో కొంత భరిస్తూ వస్తున్నాం.
ఇప్పుడు అందరి నోట ఏఐ అన్నమాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఏఐ తో చేసిన ప్రయోగాలు చాలా కనిపిస్తున్నాయి. రీల్స్ రూపంలోనూ, ఇంస్టాగ్రామ్ లోనూ , ఫేస్బుక్ లోనూ, ఎక్స్ వేదికలోనూ, వాట్సాప్ సమూహాల్లోనూ ఈ ఏఐ తో సృష్టించిన ఫోటోలు, వీడియోలు గింగిరాలు కొడుతున్నాయి. అవి కొన్నిసార్లు నవ్వు తెప్పించినా చాలా సార్లు ఇతరులను ఇబ్బంది పెట్టేవి గానూ, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను కొల్లగొట్టేవిగానూ ఉంటున్నాయి.
ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఏఐ వల్ల సృష్టించే వీడియోలు, ఫోటోల తాలూకూ ప్రయోగాలూ, వాటి ప్రభావాలూ విపరీతంగా వుంటాయి. చాలాసార్లు వీటి సృష్టికర్తల సృజనాత్మకతకు సంతోషించాలా… లేక అవి సృష్టించే కృత్రిమ, అబద్ధపు సమాచారానికీ, దాని వల్ల ఏర్పడే గందరగోళానికీ బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది.
సినిమా, టీవీ తారలు, రాజకీయ నాయకులు, క్రికెట్ ఆటగాళ్లు….వీళ్ళకు జనంలో ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. యువతలో వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ ను ఆధారం చేసుకుని కొందరు యూ ట్యూబర్స్ ఏఐ ఆధారంగా వాళ్ళు పాల్గొనకపోయినా పాల్గొన్నట్టుగా ఉన్న పాటలను, ఆటలను, సన్నివేశాలను కొన్ని సార్లు మాటలను కూడా జత చేసి సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు.
ఉదాహరణకు సినీ తారలను తీసుకుంటే… ఒక హీరో, మరో హీరోయిన్ తో కలిసి తెరమీద జంటగా నటించిన సినిమాలు వరుసగా విజయవంతమయితే.. వాళ్ల గురించి ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి.అలా విజయవంతమైన ఓ జంట తెరమీద చాలా మంచి కెమిస్ట్రీని పండించారు. వారి జంటను చూసి ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులు అయ్యారు. అయితే, అంతటితో అది అక్కడే ఆగిపోతే బాగుండేది. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను తెగ ప్రచారం చేసారు. కొన్నాళ్లు ఊరుకున్నా, వారిద్దరూ ఆ వార్తను తరువాత ఖండించారనుకోండి. అయినా సరే, వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే బావుంటుందని అభిమానులు నిర్ణయించేసారు. ఇక ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సాయంతో వారికి పెళ్లి కూడా చేసేసారు. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే నిజమేనా అన్నట్టున్నాయి. కొన్నాళ్లు ఆగి మరో హీరోయిన్ తో ఆ హీరోగారి పెళ్లి జరిగినట్టు మళ్లీ ఫోటోలు, వీడియోలు! దానికి ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినట్టు వాళ్ల ఫోటోలు, వీడియోలు….అంతా మాయ!
సెలబ్రిటీస్ కి వ్యక్తిగత జీవితాలు వేరే ఉంటాయి. ఆ విషయం ఈ దొంగ వీడియోల సృష్టికర్తలకు తెలియకపోవటం విచారకరం.వారు తెరమీద చూపించేది నటన మాత్రమే. ఆయా పాత్రల్లో వారు జీవించి ఉండవచ్చు, మన మనసులకు చాలా దగ్గరగా వచ్చి ఉండవచ్చు, వారి మీద మన అభిమానం కోటలు దాటవచ్చు. కానీ, వారికి కూడా ఒక వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతమైన ఇష్టాలు, అభిరుచులు ఉంటాయని గ్రహించుకోకపోవడం చాలా పొరపాటు. వారి పెళ్లిళ్లు, కుటుంబం, విడాకులు వారిష్టం. అందులోకి దూరి ఎవరు ఎవర్ని చేసుకుంటే బాగుంటుందో నిర్ణయించడానికి మనమెవరం?
ఇక వ్యక్తిగత ఛానల్స్ వాళ్ళకు, రీల్స్ చేసే వాళ్ళకు, వాళ్ళు పంచే అబద్ధాలకు అంతే లేదు. ఆ మధ్య ఓ సీనియర్ హిందీ సినిమా హీరో చనిపోయాడని ఓ అయిదారు సార్లు వార్తలు వచ్చాయి. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టూ, పక్కన భార్యా పిల్లలు ఏడుస్తున్నట్టూ ఫోటోలు, వీడియోలు! ఆయన ఫ్యామిలీ అది చూసి ఎంత బాధపడ్డారోగానీ, ‘ఆయన చనిపోలేదు, బతికే వున్నాడని’ మీడియాలో ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. తీరా ఆయన మొన్నీ మధ్యనే పోయాడు. అప్పుడు ‘అదిగో పులి’ కథలాగా నిజమా అబద్ధమా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతా చేస్తే ఆ సీనియర్ నటుడు ఒకప్పుడు ప్రముఖుడే గానీ, ప్రస్తుతం పెద్దగా ఫాలోయింగ్ లేని విశ్రాంత నటుడు. అయినా ఎందుకిదంతా?
కొన్నాళ్ల క్రితం ‘ ప్రముఖ సీనియర్ నటి మృతి… శోక సముద్రంలో ఇండస్ట్రీ ‘ అని ఆ నటి హాస్పిటల్లో ఉన్న ఫొటోతో ఓ వార్త వచ్చింది. ఒంటి నిండా దండలతో ఆవిడ పడుకుని ఉన్న ఫోటో, పక్కన కొందరు నటీనటులు సంతాప సూచకంగా నిలబడ్డ ఫోటోలు ఓ ప్రైవేటు ఛానల్ లో వచ్చాయి. ఆ నటి నిజానికి ఆరోగ్యంగానే ఉన్నారు. మరోసారి ఓ సీనియర్ హిందీ నటి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనీ, ఆమె మాజీ ప్రేమికుడు, సహనటుడు హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్ళాడనీ, పక్కన కూర్చుని పరామర్శిస్తున్నట్టు ఫోటోలు, వీడియోలు సిద్ధం! హాస్పిటల్ డ్రెస్ కాకుండా పట్టు చీరతో, నగలతో ఐ సీ యూ లో ఎవరైనా వుంటారా? అనే ఆలోచన రానివాళ్ళయితే ఇదంతా నిజమని అనుకునేంత సహజంగా వుంటుంది ఆ వీడియో. ఇలా ఫేక్ న్యూస్ రాకుండా నియంత్రించే మార్గం ఉండదా? ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే ఏమీ శిక్షలుండవా? అ నటి గానీ, నటుడు గానీ చూసి కంప్లైంట్ ఇవ్వాల్సిందేనా?
ఇలాంటి ఏ ఐ సృష్టికి సెలబ్రిటీలే కాదు, మామూలు మనుషులు కూడా బలవుతూ వుంటారు. ఇటీవల ఒక రీల్ లో ఓ యువకుడి ఫోటో పెట్టి ‘ చిన్న వయసులోనే అందర్నీ వీడిపోయిన మిత్రమా! నీకు శ్రద్ధాంజలి ‘ అని వచ్చింది. అది పెట్టింది అతడి ఫ్రెండ్ అట! అదేం స్నేహమో మరి! ‘ ఎవరో పాపం! చిన్న వయసులో పోయాడు, ఏమయిందో!’ అనుకునే లోపల మరో కామన్ ఫ్రెండ్’ ఎందుకురా? అట్లాంటి వీడియో పెట్టావు, వాడిని ఇంతలా ఆట పట్టించి ఏడ్పించాలా ? అది తీసేయ్! ‘ అని మెసేజ్ పెట్టాడు. ఆ ఫోటోను వాళ్ల తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు? ఇవేం సరదాలు?
సాంకేతికత రెండువైపులా పదునైన కత్తిలాంటిది. దాన్ని పైన చెప్పిన విధంగా చెడ్డవాటికి వాడితే దుష్ఫలితాలు ఖాయం. ఏ సరికొత్త ఆవిష్కరణైనా మానవ సౌకర్యానికి, వికాసానికి ఉపయోగపడాలి గానీ, మనస్తాపానికి, విషాదానికి కారణం కాకూడదు. ఎన్నో రంగాలలో కృత్రిమ మేధస్సుతో మానవులకు ఉపయోగపడేవాటిని ఎన్నో సృష్టించవచ్చు. నిజానికి ఫోటోలు, వీడియోలు ఒకప్పుడు నిజనిర్ధారణకు తోడ్పడిన గొప్ప అంశాలు. ఇప్పుడు ఏ ఫోటో నిజమో, ఏది అబద్ధమో తెలియడం లేదు.
మంచి నీళ్లను తాగితే దాహం తీరుతుంది గానీ, చూస్తే కాదు. ఏ ఐ తో ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు గానీ, కళలను, కలలను దోచుకునేంత సాంకేతికత మనకు అవసరమా? ఆత్మ లేని కళ….వర్ణం, పరిమళం లేని పువ్వు లాంటిది. మాయాబజార్ ను సినిమాగా ఇష్టపడతాం గానీ, జీవితంలో మాయ అవసరం లేదు.

నెల్లుట్ల రమాదేవి