
శ్రీశుభమస్తు! శ్రీకల్యాణమస్తు! శ్రీ అవిఘ్నమస్తు!
ఆదిత్యాది గ్రహస్సర్వే స్వనక్షత్ర స్వరాషయా
కుర్వంతు మంగళం తాభ్యాం యయారుద్వాహ పత్రిక
ఇర్రోళ్ళ లగ్గం పిలుపు
లగ్గం మార్చి 7 వ తారీఖు ఐతారం పట్టపగలు 12 గంటలు గొట్టంగ
మా చివరాఖరి పిల్లగాడు
చి॥ నర్సయ్య
లగ్గం
చి॥ల॥ సౌ ॥ చెంచులచ్మి తో
[అందుగుల లో ఉండే ముత్తయ్య – కాంతమ్మల తొలి సూలు బిడ్డ ]
జరంత యాది పెట్టుకోని ముసలోల్లు, ముతుకోళ్ళు , పడుచోళ్ళు, శిన్న – పెద్దలందరొచ్చి , అచ్చంతలేసి , బుక్కెడు బువ్వ తిని పోండ్రి ! గప్పుడే మేమందరం మస్తు సంబరపడతం!
లగ్గానికి పిలుస్తున్నదెవరంటే
నర్సింహ అమ్మ- నాయన !
వూరు… పాఖాల
**********
ఇర్రోండ్ల శుభపత్రిక చూసిన దయామయి ఆశ్చర్యంతో – ఆనందంతో పత్రికను అటుఇటూ తిప్పిచూసింది. ఎక్కడైనా నర్సింహ నంబర్ ఉందా? అని చూసి, కనిపించకపోయేసరికి
నిరాశగా శుభపత్రికను జాగ్రత్తగా టీ.వీ.స్టాండుపై పెడుతూనే ఆలోచనలలోకి జారుకుంది! దయామయి.
నర్సింహ తమ ఇంటికి వచ్చిన రోజు గుర్తుకు వచ్చి, ముసిముసిగ నవ్వుకుంది…
సద్దుల బతుకమ్మ ఆట ఆడుకోని, పక్కింటి ఆమెతో
చెరువుకట్ట దిగి వస్తున్నారు. పోతు రాళ్ళు , ముళ్ళపొదలతో దారి సరిగ్గా లేదు. చెట్లగుబురులతో చీకటి చిక్కపడుతున్నది. చీరకుచ్చిళ్ళు కొంచెం పైకెత్తి పట్టుకుని, దారి జాగ్రత్తగా చూస్తూ కట్టదిగువకు నడుస్తున్నది! ఇంతలో ధభిల్లు మనే చప్పుడు, సన్నటి వెక్కిళ్ళతో కాళ్ళ దగ్గర ఒక పూలమూట విసిరేసినట్టు పడింది. ఏమిటా? అని చూస్తుండగానే ఆ మూటను తరుముతూ ఓ ఆకారం. అకాలవృద్ధాప్యం మీద పడ్డట్టున్న ఆడమనిషి. రవికకు చేతులు లేకపోవడం తో భుజాలు ఆ చీకటిలోనూ నూనే పూసినట్టు నల్లగా మెరుస్తున్నాయి. చేతిలో సన్నటి బెత్తంతో… నడక వేగానికి రొప్పుతూ… “వారీ ! నర్సింహా! మనమేవన్నా పైసలున్న గొప్పోల్లమా? మనకు పండగేందిరా? పరమాన్నంగావల్నా? రాత్రికి మీ నాయన పైసలు తెస్తె బువ్వ ! లేకుంటే లేదు! ఏందిరో బర్రెరాగాలు పెడ్తే పరమాన్నం వస్తదనుకుంటున్నవా? ఇగ రా!” అని వాడిని లేవనెత్త బోయింది! కానీ వాడు అనుకోకుండా దయామయి కాళ్ళు దొరకడం వల్లనేమో ? ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు తనకు తెలియకుండానే!
దయామయి సుకుమారంగా వాడిని లేవనెత్తి, ఆమెవైపు చూస్తూ…” ఏమమ్మా ! వాడిని కొట్టకు! ఇప్పుడు నా వెంట గడీకి తీసుకొని పోతాను! రేపు పొద్దున వచ్చి తీసుకొచ్చుకుందువు గాని! ఇవాళ పండగని పరమాన్నం వండిన అది తింటడు! ” అని చెప్తుంటే ఏమనాలో తోచక కొంగుతో ముఖం తుడుచుకొని , మీరు మాట్లాడక తడికెల గుడెస లోపలికి వెళ్ళిపోయింది.
వాడు తల్లివైపు నిజమేనా? అన్నట్టు అమాయకంగా చూసి, అమ్మగారు తనను లేవనెత్తుతుంటే… సిగ్గుతోనూ .. మొహమాటంతో ఒంటికంటిన దుమ్ము దులుపుకొని, అంగితో ముక్కుతుడుచుకొని, పెద్ద కళ్ళతో దయామయి వైపు చూస్తున్నాడు. ఇంతలో దయామతితో పక్కింటి పారిజాతం చీకటైంది పోదామా ? అనడంతో వాడిని రమ్మన్నట్టు చూస్తూ కదిలింది దయామయి. నిక్కరుకూ అంగీకి మధ్య వాడి చిరుబొజ్జను దాచేందుకు చాలీచాలని అంగీ! ఆ అంగీని కిందకు లాక్కుంటూ అంగీ బట్టను ముద్దలాగా చేసి పట్టుకొని, నడుస్తున్నడు.
ఇల్లు చేరగానే బట్టలు మార్చుకునేందుకు బంగ్లా మీదకు వెళ్ళింది దయామతి. వాడికేంచేయాలో తోచక అటూ ఇటు చూస్తున్నడు. వాడెప్పుడూ చూడని పెద్ద పెద్ద దర్వాజాలు, చెక్కడాలు చెక్కిన ఎత్తైన గుంజలు, చెక్క దూలాలు, మధ్య పెద్ద గచ్చు, పక్కనే నీటి ఇత్తడి గంగాళం- చెంబు , దండెంమీద చేనేత తువ్వాలు ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలో కచ్చేరీనుండి దొరవారు వచ్చి, కాళ్ళు కడుక్కుంటూ వాడిని చూసి “ఎవరునువ్వు? ఇక్కడ ఎందుకు నిలబడ్డవు?” అని గద్దించినట్టు అడిగిండు. బిక్క ముఖం వేసుకొని, ఏడుస్తూ ,”మేం ఎరుకలోళ్ళం “అన్నడు.
“మరైతే నడిమింట్లకు వస్తావురా? “అని ఆయన అంటూంటేనే..
ఇంతలో “నేనే తీసుకొని వచ్చిన! వాడిని ఏమనకండి! అని, “నీపేరేంది? “అని అడిగింది దయామయి.
బిక్క మొహంతో.. న..న.. నర్సింహ్మ అన్నడు.
ఇంటెనకకు పోయి మొఖం- కాళ్ళు కడుక్కోనిరా! అని ఒక తుండుగుడ్డ, కొడుకు అంగీ ఇచ్చింది. ఇంటి వెనుక నుండి నర్సమ్మ వచ్చాడు. వేలాడే టీషర్ట్ లో తలమాత్రం కనపడుతూ వచ్చిన వాడిని మురిపెంగా చూస్తూ…
అన్నం – పప్పు, పచ్చడి వేసిన విస్తరి వాడిముందు పెడితే వాడి కళ్ళు దేనికోసమో వెతుకుతుంటే… “ముందు అన్నం తిను! పరమాన్నం పెడతాను… “అన్న దయామయి మాటలకు మారు మాట్లాడకుండా తినడం మొదలు పెట్టినా… పరమాన్నం మొదలు తింటే బాగుండు అన్నట్టు మొహం పెట్టిన వాడి మనసు గ్రహించిందా? ఆమె అన్నట్టుగానే మోదుగు ఆకు దొప్ప నిండ పరమాన్నం తెచ్చి యిచ్చింది దయామయి.తిని ఇక్కడ నిద్రపో ! అని బొంత ఇచ్చింది.
దొర లక్ష్మణ్ రావుకిదంతా ఇష్టం లేకపోయినా…
భార్య మాట తీసేయలేక .. అప్పటికి ఊరుకున్నా…
భార్య కాస్తా ఉదాసీనత నుండి బయటపడినట్టనిపించి, అందుకే ఊరుకున్నడు.
తెల్లవారి పొద్దున్నే నరసింహ తండ్రి ఎఱుకల సాయిలు వచ్చి, దొరా! నర్సింహులును వాళ్ళ అమ్మ తీసుకరమ్మన్నది అని వచ్చిండు. భార్య వైపు చూసిండు దొర!
సాయిలూ! పిల్లవాడిని ఇక్కడ వదిలిపెట్టు! మాతోనే ఉంటడు అన్నది దయామయి. భార్యకు ఏం చెప్పాలో తెలియక… దొరసాని మాట కాదనలేక పేడతట్టలు ఎత్తుకొని వెళ్ళిపోయిండు సాయిలు.
మొదట నచ్చక పోయినా దొరవారికి నర్సింహులు చేతికింద చిన్న చిన్న పనులు చేస్తుండడం బాగానే ఉంది…
రెండుజతల బట్టలను, తెప్పించి పలక – సంచీ నరసింహానికిచ్చి సాతాను జీయరుస్వామిని పిలిపించి, ఈ పిల్లవాడు చాలా తెలివైన వాడనీ వాడికి శ్రద్ధగా చదువు చెప్పమని చెప్పింది దయామయి.
అది దొరగారికి నచ్చక వాడికి చదువెందుకంటాడు కానీ ఆపలేదు.
నరసింహ బడినుండి రాగానే …
“ఇర్రోడా! మీ నాయనకు చెప్పినవా? ఎడ్లకు దాణాపెట్టే బుట్టలు తెచ్చి ఇమ్మని… ” అని అడుగుతడు.
“పెద్దయ్యా ! నిన్న నే చెప్పిన! పొరక నానపెట్టిండు…అంగడి నాటికి తెస్తనన్నడు మా అయ్య… ” అన్నాడు నరసింహ.
“ఇఱ్ఱోడా! అట్లనే వడ్లుపోసే గుమ్ములకు ఎలుకలు రంధ్రాలు చేసినాయి. కొత్త గుమ్మి అల్లుకొని రమ్మని చెప్పు! మీ అయ్యకు…”
మరో రోజు “ఇర్రోడా! ఇవ్వాళైనా తడికలు తెచ్చి నీళ్ల పాకకు కట్టమని చెప్పు!, నీళ్ల పాక మరుగు లేక ఆడోళ్ళు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నరు…. అట్లనే రెండు తడికలు మరుగుదొడ్డికి కట్టమని చెప్పు!”అన్నాడు.
ఒకనాడు నర్సింహను పిలిచి, ” ఒరేయ్! ఇర్రోడా! గుమ్ముల పాక కప్పు వానకు కురిసి, వడ్లు పాడై పోతాయ్! కొడిశె పొరక తెచ్చి కప్పమని చెప్పు!
ఇలా దొరవారు ఏదో పని చెప్తూనే ఉంటారు నరసింహకు…
భర్త పిల్లవాడి మీద ఇలా అధికారం చలాయించడం ఇష్టం ఉండదు దయామయికి.
నరసింహ తండ్రి -తాతల కాలం నుండి బుట్టలు, తడకలు, అల్లి అమ్ముకోవడమే వారి జీవనాధారం. అలా అల్లడంకోసం ఊరినానుకొని ఉన్న అడవికి వెళ్లి కొడిష పొరక, ఈతచెట్టు ఆకు, అడవి ఖర్జూరాకులు పొదల నుండి వెన్నెముకలను సేకరించి ఉదయాన్నుండి సాయంత్రం దాకా ఎండనకా -వాననకా…
తిరిగి- తిరిగి కొడిశె పొరకను గుట్ట మీద ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గుడి పక్కనుండి సెలయేటి దొన పారుతుంటే అందులో నానేసి, నానిన కట్టెలతో కావలసిన ఆకారంలో రకరకాల తడకలు, పేడబుట్టలు, గుమ్ములు, జల్లి బుట్టలు అల్లి అమ్ము కొని జీవిస్తారు. ఈ కట్టెలుకత్తులవలె చాలా పదనుగా ఉండి కాస్త ఏమారితే గాయాలౌతాయి.
ఈ మధ్య అడవులు నరికి, కంపెనీలు పెట్టడంతో అడవిలో చాలా దూరం పోతేగానీ ఆకులుగానీ, పొరకగానీ దొరకడం లేదు! మైళ్ళు- మైళ్ళు నడిచి, కొండ కోనల్లో బండ రాళ్ళల్లో తిరిగి తిరిగి కాళ్లు రక్కుకుపోయినా లెక్క చేయక జానెడు పొట్ట కోసం కష్టపడుతూనే ఉంటారు. నరసింహ తల్లి అందరికీ చెయ్యి చూసి- సోది చెప్పి వారిచ్చే పదో పరకో సంపాదించి, ఇంటి చిల్లర ఖర్చులు వెళ్ళదీస్తుంది. గూడెంలో ఎవరైనా గర్భిణీ స్త్రీలకు పురుడు పోయడానికి రమ్మని పిలిస్తే వెళ్లి ప్రసూతి చేసి, క్షేమంగా ఆ పసిగుడ్డును ఆ కుటుంబానికి అందించి వారిచ్చే తృణమో- ఫణమో ఇస్తే తీసుకొని వస్తుంది. అది కూడా సంసారంలో ఏ మూలకూ సరిపోదు!
ఇదంతా చూసి దొరసాని నరసింహకు మంచి చదువు చెప్పించాలనే నిర్ణయించుకొని దొరవారికి తెలవకుండా పక్క ఉన్న ఊరిలో వాడిని డిగ్రీ వరకు చదివించింది.
కాలేజీలో స్నేహితులు చెప్పగా విని నరసింహ
IAS పరీక్ష రాసాడు. అందులో నెగ్గినందుకు పక్క జిల్లాలో కలెక్టర్ గా ఉద్యోగం వచ్చంది .
ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల నడుమ ఊరికి రావడానికి కుదరలేదు. కానీ అతనికెప్పుడూ దయామయి గుర్తకు వస్తూనే ఉంటుంది. ఆమె వల్లనే తమకొడుకు పెద్ద ఉద్యోగస్తుడయ్యాడని ఎంతో కృతజ్ఞతగా ఉంటారు సాయిలు దంపతులు.
దయామయి దంపతుల్ని ఆశ్చర్య పరచాలనే నర్సింహ తాను స్వయంగా వచ్చి శుభపత్రిక ఇవ్వకుండా అలా పోస్ట్ లో పంపిండు.
దయామయికి నర్సింహ పెళ్ళిచూడాలని ఎంతో కోరిక . భర్త ఎలాగూ వద్దంటారు . ఎలా? ఎలా పెళ్ళి చూడడం అని భర్తకు తాను తమ్ముడింటికి వెడుతున్నానని అబద్దం చెప్పి, బయలుదేరుతుంది.
నర్సింహ తన పెళ్ళికి రమ్మని దొరవారింటికి కారు పంపించాడు. తన చేతులలో పెరిగిన పిల్లవాడని, వెళ్ళక తప్పదనీ , ఒక్కడే పెళ్ళికి వెళ్లి, ఎంతో వేడుకగా జరుగుతున్న పెళ్ళినీ, అందంగా ఉన్న పెళ్ళి కూతురును చూసి ఓహో! అనుకుంటాడు.
దయామయి ఎవరూ తనని గుర్తుపట్టకుండా ఉండేందుకు కొంగు తలనిండా కప్పుకొని మండపంలోనికి వచ్చి మనఃస్పూర్తిగా కొత్తజంటను దీవిస్తున్నది…!
ఎవరూ తనను చూడలేదనుకుంటుంది కానీ… చూడవద్దనుకున్నవారు చూడనే చూసారు. మెల్లిగా వధూవరుల దగ్గరకు వచ్చి దీవిస్తూ, “ఇర్రోండ్ల పెళ్లికి వచ్చినం- సంబరమేనా? “అని కొంటెగా అల్లరి పెట్టినట్లు అడిగారు దొరవారు. పెళ్ళిపెద్ద తమనే అడిగారు అనుకొని “అయ్యా! దండం పెడతున్నం! మీరొచ్చుడు శాన సంబరం ! “అని వంగి వంగి దండాలు పెడుతుంటే…
ఆ మాట తననే అడిగారని”మరి తమరు కూడా ఇర్రోండ్ల పెండ్లికి వచ్చిండ్రు! సంబరమేనా? అచ్చింతలు యేసిండ్రా? బువ్వ తింటరా? “అని అంతకంటే కొంటెగా అడుగుతున్న దయామయి మాటలు విన్న నర్సింహ ప్రేమగా వారిద్దరి కాళ్ళకు నమస్కరించాడు.
నరసింహ పెండ్లి చూసి భార్యాభర్తలిద్దరూ మౌనంగా కారులో ప్రయాణిస్తూ వస్తూంటే… దయామయికి ఎన్నో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి . నర్సింహ ఇంటెడు చాకిరీ చేస్తూనే వినయంగా తన చదివేదో తాను చదువుకొని ఈనాడు ఈ స్థాయికి వచ్చాడు.
తన కొడుకేమో తండ్రి గారాబం వల్ల అటు చదువుకోక, ఇటు కరణీకం నేర్చుకోక, వ్యవసాయ మెలుకువలు తెలుసుకోక ఊరికే స్నేహితులను వెంటేసుకొని కాలక్షేపం చేస్తున్నాడు. ఎంతో సమయం దుర్వినియోగం చేస్తున్నానని అనుకోడు… చివరికి ఇటువంటి అబ్బాయికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఎవరికి వారికే చదువుకోవాలనే శ్రద్ధ; బాగు పడాలనే కాంక్ష ఉండాలి తప్ప! ఎవరో చెప్తే వృద్ధిలోకి రారు ఎవరూ… ఎదిగిన పిల్లవాడు ఇంటి ముందట ఊరికే గోళ్ళు గిల్లుకొంటూ కూర్చుంటే చాలా బాధనిపిస్తుంది… ఏదో ఒకటి చిన్నదో బొన్నదో ఉద్యోగం అంటూ చేస్తే… క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే నేర్పరితనం వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం చేయమని చెవినిల్లుకట్టుకుని పోరాడినా… పెద్ద ఉద్యోగం వస్తే చేస్తానే తప్ప ఇలాంటి చిన్నా చితకా పనులు చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. వీడి చదువుకు ఆ పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది? ఈ మాత్రం ఆలోచించడా? ఈ లోపు వయసు పరిమితి దాటి పోతే ఇక ఏ ఉద్యోగమూ రాదని నిట్టూర్చింది దయామయి. ఆ నిట్టూర్పు కొడుకు భవిష్యత్తు గురించేనని అర్ధంచేసుకొని తన వల్లే ఇదంతా జరిగిందనీ, ఇక ఇప్పుడు తానేమీ చేయలేననీ అనుకుంటేనే ఎంతో బాధ! వేసింది దొరవారికి… మెల్లిగా భార్య పక్కకు జరిగి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని
“ఔను! ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలి! కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని వాపోయిండు దొరవారు.
కొంత కాలానికి నర్సింహకు కొడుకు పుట్టిండంని బారసాలకు రమ్మని పిలుపు వచ్చింది ఆ దంపతులకు. దొరవారికి కనువిప్పు కలగడంతో ఏమీ అనకుండా భార్యతో కలిసి బారసాలకు వెళ్ళారు.
మాటల సందర్బంగా నర్సింహ దయామయితో
* అన్న* ఏం చేస్తుండు? అని అడిగితే..
“ఏంచెప్పను నాయనా! చిన్నప్పటి నుంచి జులాయిలాగా తిరిగి మంచి చదువు చదవలేక పోయాడు. దాంతో ఏ నౌకరీ లేక సోపతోండ్ల తోటి అవారాగా తిరుగుతున్నాడనీ, వాడి తలరాత అట్లా ఉంది “అన్నది.
నర్సింహ ఆలోచనలో పడ్డాడు. తన ఎదుగుదలకు ముఖ్య కారకులైన ఈ ఇద్దరూ ఇలా రంధి పడవద్దని
అమ్మా! మీరు ఒప్పుకుంటే అన్నకు ఏదైనా చేయగలను..
అనగానే నీ దయ నాయనా!
అంటుంటూంనే తన వ్యక్తిగత కార్యదర్శిని పిలిచి మెల్లగా ఆఫీసులో ఖాళీగా ఉన్న ఉద్యోగానికి ఆర్డర్ రాయించి తెమ్మని చెప్పగానే క్షణంలో తెచ్చిచ్చినాడు. వెంటనే దయామయి చేతిలో ఆ కవరును పెట్టి నమస్కరించాడు. ఆమె దాన్ని చదివి ఆనందంతో కళ్ళు మెరిసిపోతూ కన్నీటితో మసకలు కమ్మగా నర్సింహ వైపు ప్రేమగా చూసింది దయామయి!!
రంగరాజు పద్మజ .
—-*—