కాగితం పడవ – భాగం 2

ధారావాహిక నవల

జరిగినకథ

ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టని కారణంగా ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్,వనజా “గీత“ హాస్పిటల్స్ కి వస్తారు

 అక్కడ రేవతి డాక్టర్ ని కలిసాక వాళ్లలో ఆశ చిగురిస్తుంది. వాళ్లుపెట్టుకున్ననమ్మకమే“ఇందు”రూపంలోఎదురయింది 

అనేక కారణాలవల్ల సరోగసి(ivf) కి ఒప్పుకున్న “ఇందు”  బిడ్డని కన్నాక ఇచ్చేయడానికి  ఒప్పందం జరిగింది..

ఒప్పందం ప్రకారం ఆ పిల్లని వాళ్ళకి అప్పగిద్దామని అనుకుంటుంది. కానీ ఆ రోజు జరిగిన కారు ప్రమాదం వల్ల వాళ్ళిద్దరూ హాస్పిటల్లో గాయాలతో స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్లు రాలేని పరిస్థితులలో “నయనిక “ఇందుదగ్గరే పెరుగుతుంది.. 20 ఏళ్ల తర్వాతవచ్చిన శ్రీకాంత్ ని చూసి ఆశ్చర్య పోతుంది…

ఇంకకథలోకి వెళదాం…..

 

అధ్యాయం 1

మరునాడు ఉదయం.

సుధీర్, నయనిక ఇద్దరూ తమ తమ కాలేజీలకు వెళ్లిపోయారు. నేను కూడా బయలుదేరబోతుంటే, శ్రీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది.శ్రీకాంత్: “మీరు కాలేజీ నుంచి రాగానే, నేను వచ్చి పిక్‌అప్ చేసుకుంటాను.”

నేను: “సరే…” (అని ఫోన్ పెట్టేశాను.)కాలేజీలో ఉన్నంతసేపు నా మనసులో ఆలోచనలు మాత్రం వనజ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.

‘ఎలా ఉందో చూడాలి… ఆరోగ్యం బాగుపడితే నయనికని దగ్గరకు పంపమంటే ఏం చెయ్యాలి?’అప్పడే మళ్లీ నాలో మరో ప్రశ్న – ‘దేనికి ఇంత బెంగ? అపురూపంగా పెంచుకున్న నయనిక పరాయిది అనుకుంటేనే నా మనసు ముక్కలవుతోంది అనుకుంటే,నేను అందించబోయేతమ పిల్ల కోసం ఎన్నో రిస్కులు తీసుకున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో! ఒక్కసారి ఆలోచించు, అర్థం చేసుకో’ అంటూ మనసు గట్టిగా మందలించింది.

అలా ఆలోచనలు గజిబిజిగా, ఒకదాని కి మరొకటి పొంతన లేకుండా విసిగిస్తుంటే… ఇంక లాభం లేదని ప్రిన్సిపాల్‌కి చెప్పి, కాలేజ్ నుంచి ఇంటికొచ్చేశాను.

సాయంత్రం నాలుగు గంటలకు సమయానికి వచ్చాడు శ్రీకాంత్.

నయనికకి ఫోన్ చేసి, “బయటికి వెళ్తున్నాను” అని చెప్పి, అతడి కారులో కూర్చున్నాను.కొద్దిసేపటికి శ్రీకాంత్ కారు ఒక బంగ్లా ముందు ఆగింది. బంగ్లాలోకి అడుగుపెట్టబోతుంటే, ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టుకున్నాయి!‘ఈ ఇంటికి నేను, రవి ఎన్నిసార్లు వచ్చామో కదా! అప్పుడు వాళ్లు చూపించిన ఆత్మీయత, అనుబంధం మరచిపోలేనిది. నేను వాళ్ల పిల్లని కని ఇస్తానని, నా గర్భాన్ని అద్దెకిస్తూ డబ్బులు కూడా తీసుకున్నాను! కానీ వాళ్లు నన్ను ఇప్పుడు అలా చూడలేదు! వనజ, శ్రీధర్ ఒక స్నేహితుల్లా ప్రవర్తించారే గాని, డబ్బుతో ఏనాడూ మమ్మల్ని కొలవలేదు. అందుకే వనజ, శ్రీకాంత్ అంటే నాకు అంత అభిమానం.’

అధ్యాయం 2…..

నేను ఆ బంగ్లాలోకి అడుగుపెట్టగానే, ఎదురుగా సోఫాలో కూర్చున్న వనజని చూసి ఆశ్చర్యపోయాను.

రెండు జడలేసుకొని, రిబ్బన్లు కట్టుకొని… 14–15 ఏళ్ల అమ్మాయి లాగా ఉంది!వనజ (నవ్వుతూ): “రండి… రండి…” అంటూ చేతులు ఊపుతున్న వనజను చూస్తూ,

అలా రాయిలా నిలబడి పోయాను.‘ఏమిటిది?’ అంటూ ఆశ్చర్యంగా శ్రీకాంత్ వైపు చూశాను.

అతని చూపులు చాలా నిర్లిప్తంగా, “పరిస్థితిని గమనించు” అన్నట్టుగా ఉన్నాయి.ఇంతలో వనజ:

“అంకుల్! ఈమె ఎవరు? నీ భార్యా? ఎప్పుడూ కనిపించలేదు కదా?”శ్రీకాంత్ (తడబాటు లేకుండా):

“కాదు… నా స్నేహితురాలు. ఇవాళే కలిశాను. నిన్ను ఒకసారి చూడాలని అనుకుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను.” అన్నాడు చాలా కూల్‌గా.వనజ (నవ్వుతూ, నా వైపు):

“ఓహో! అలానా! రా, కూర్చో!”నేను పక్కన కూర్చోగానే…వనజ:

“ఆంటీ! నాకు నయమైపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశాను గదా! నాకు ఏమీ కాలేదు. కానీ ఈ అంకుల్‌, వాళ్ల అమ్మ, ఆ పని అమ్మాయి రాధమ్మ… వాళ్ళంతా పట్టి బంధిస్తున్నారు. నువ్వు చెప్పు ఒకసారి, నాకు ఏమీ కాలేదని!”అలా వనజ చెబుతుంటే, నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.అప్పుడు శ్రీకాంత్ నాతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు:

“ఇందు… యాక్సిడెంట్ తర్వాత వనజ ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ మెదడుకు గాయం అయింది. ఆమె జ్ఞాపకాలు 14–15 ఏళ్ల దగ్గరే ఆగిపోయాయి. అదే మైండ్‌సెట్‌లో ఉంది ఇప్పుడు. డాక్టర్లు కూడా చెప్పారు—ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా చెప్పలేమని. కొన్నేళ్లు వేచి చూడండి! ఇప్పుడైతే ఏమి చెప్పలేము! ఏమో… ఎప్పుడైనా హఠాత్తుగా తన పాత జ్ఞాపకాలు తిరిగివచ్చి, మళ్లీ మామూలు మనిషి అయిపోవచ్చు అన్నారు. ఎప్పటికైనా అలాంటి రోజు వస్తుందన్న ఆశ!ఆ మంచి రోజులు కోసమే ఎదురు చూస్తున్నాను! ఆ ఆశే నన్ను బతికిస్తోంది ఇందు! అమెరికాలో ఇంకా మంచి ట్రీట్మెంట్ ఉంటుందేమో అని వెళ్లాను. కానీ అక్కడ డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పేసరికి… ఆ పరిస్థితిలో నీ దగ్గర నుంచి పిల్లని తీసుకెళ్లి నేను పెంచగలను? నా పరిస్థితిని అర్థం చేసుకో. రాలేకపోయాను. మరోవైపు నయనికకి మంచి జీవితం ఇవ్వలేకపోతానన్న భయం కూడా పట్టుకుంది…”అతని కళ్ళల్లో నిండిన నిరాశ, నిట్టూర్పుతో మిళితమైపోయింది.

“నన్ను క్షమించు ఇందు” అంటూ నా చేతులు పట్టుకున్నాడు.ఆకస్మిక ఉద్రిక్తత వాతావరణంలో…

“ఎందుకలా అనుకుంటున్నారు శ్రీకాంత్? మీరు రాక ముందు, నాకు మీ మీద కోపం ఉండడంమాత్రం నిజమే! అప్పటి నా పరిస్థితి కూడా పూర్తిగా అయోమయంగా ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నాన్నకి మీ దయ వల్ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ అయి, ఆరోగ్యంగా తిరుగుతున్నారు. మీ దయ వల్ల రవి కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డాడు! ఆ కృతజ్ఞతా భావంతోనే మీకు మీ అమ్మాయిని ఇచ్చేయాలని చాలా అతృతంగా ఎదురుచూస్తున్న నాకు, మీరు రాకపోవడం ఒక పెద్ద అగాధంలా తోచింది! నయనిక ఒక పక్క పెరిగిపోతూ పెద్దది అయిపోతుంది! ఆ సమయంలో మీరు వస్తే—సమాజానికి, నాకూ నేనేం చెప్పుకోవాలి అన్న వేదన నిలువనివ్వలేదు. అందుకే మీ మీద చాలా కోపం వచ్చింది!” అని చెబుతుండగానే…ఇంతలో వనజ నా దగ్గరికి వచ్చి:

“నీ పేరేమిటి?” అని అడిగింది.

నేను: “ఇందు…” అన్నాను.

వనజ: “నువ్వు ఇక్కడే ఉంటావా?” అంటూ అడిగింది.

నేను: “లేదు, నేను మా ఇంట్లో ఉంటాను” అన్నాను

వనజ (చిన్నపిల్లలాగే):

“మరైతే నేను నీకు రహస్యం చెప్పనా?”అందినాచేవిలో

నేను: “చెప్పు, నీకేం భయం లేదు” అన్నాను.

వనజ: “నాకు ఈ శ్రీకాంత్ అంకుల్ అంటే భయం వేస్తుంది…”నేను అయోమయంగా శ్రీకాంత్ వైపు చూశాను.

శ్రీకాంత్ నిశ్శబ్దంగా వింటూ, నిశ్చలంగా కూర్చున్నాడు. ‘ఇదంతా మామూలే’ అన్నట్టుగా.

నేను (అసంకల్పితంగా): “మా ఇంటికి వస్తావా?” అని అడిగాను.

వనజ: “వస్తాను! ఇక్కడే ఉండు, నేను బట్టలు సర్దుకుని వచ్చేస్తాను…” అని లోపలికి పరిగెత్తింది.అప్పుడే ఒక పెద్దావిడ గదితలుపులు తీస్తూ బయటకు వచ్చారు.

పెద్దావిడ: “ఎవరు వచ్చారు?” అని.

శ్రీకాంత్: “మా అత్తగారు. ఈమె ఇందు… మన నయనికని జాగ్రత్తగా పెంచుతున్నారు.” అని పరిచయం చేశాడు.అత్తగారు (చిరాగ్గా, నా వైపు చూసి): “ఓహో! ఈమెనా? డబ్బు కోసం గర్భాన్ని పెళ్లి కాకుండానే అమ్ముకున్నది!”

శ్రీకాంత్ (ఆందోళనగా): “అమ్మా… ఇలాంటి మాటలు అనొద్దు. ఆ అమ్మాయి బాధపడుతుంది.”

అత్తగారు (గట్టిగా): “నిజమే కదా? నేను కల్పించి మాట్లాడలేదు కదా?” అంటుండగానే…ఇంతలో, బ్యాగ్ పట్టుకుని వనజ గదిలోంచి బయటకు వచ్చింది.

అత్తగారు: ఆమె చేయి పట్టుకుని ఆపుతూ, “ఎక్కడికి బయలుదేరావు?”అన్నారుకోపంగా(అసలేవనజనిచూసినచిరాకులోఉన్నారు)

వనజ (ఆవిడ చేయి విడిపించుకుంటూ): “నేను ఈ ఆంటీ ఇంటికి వెళ్ళిపోతాను!”అంటుంటే, కిచెన్‌ గదిలో నుంచి కాఫీ ట్రే తో వస్తూ, పని అమ్మాయి రాధమ్మ, “వనజమ్మగారు! ఎక్కడికి?” అంటూ కంగారుగా అడిగి, కాఫీ కప్పులు పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, వనజ చేయి పట్టుకుంది….

ఇద్దరూ చెరోరెక్కా పట్టుకుని వనజని లోపలికి ఈడ్చుకుపోయారు. తలుపు వేసి బంధించారు.ఆ దృశ్యం చూస్తున్న నా మనసు నిండా విషాదం అలుముకుంది.

అప్పుడే మేడమీద నుంచి కిందికి వస్తున్న వనజ తండ్రి:

“ఏమైపోయింది? ఎందుకీ అరుపులు? ఏం జరిగింది?” అంటూ కంగారు పడ్డాడు

శ్రీకాంత్అత్తగారు: అతని వైపు చూసి, “అదే… మన వనజ పేచీ పెడుతోంది. ఈ అమ్మాయితో వాళ్లింటికి వెళ్ళిపోతానంటోంది. అందుకే నేను, రాధమ్మ కలిపి ఆ గదిలో వేసి తలుపు వేసాం. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు?” అని ఆత్రంగా అడిగాడుఅతనుఅత్తగారు (కొనసాగిస్తూ):

“మనవరాలిని పెంచుతోంది. అద్దె గర్భంతో కన్నది ఈ అమ్మాయే! మన అమ్మాయిని చూడడానికి వచ్చింది. వనజ ఈమెతో వెళ్ళిపోతానంటోంది. అందుకే నేను పెద్దగా అరవాల్సి వచ్చింది.”అతను నన్ను పరిశీలిస్తూ వ్యంగ్యంగా:

“ఓహో! ఈమెనా..?” అంటూ ఇంకా ఏదో అనబోతుంటే,

శ్రీకాంత్ పరిస్థితి అర్థం చేసుకొని,ఇందుపదవెళదాము

అంటూనన్ను బయటకు తీసుకునిరాగానేనేనుపరుగు లాంటి నడకతో వెళ్లి కారులో కూర్చున్నాక గాని, మనసు స్థిమితపడలేదు.

కారులో మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు

.ఇంటికి చేరుకున్నాక—

నేను: “కాఫీ తాగుదురు గాని, రండి లోపలికి” అంటూ ఆహ్వానించాను.

శ్రీకాంత్ (సోఫాలో వాలుతూ): “తాగుతాను… ఇవ్వు…” అంటూ కళ్లు మూసుకున్నాడు.గదంతా అలసట, నిశ్శబ్దం, గందరగోళం నింపేశాయి.ఇంతలో…..

(సశేషం)

Written by Renuka Ayola

రేణుక అయోల
పూర్తి పేరు :
రేణుక అయ్యల సోమయాజుల
కవయిత్రి, రచయిత్రి.
కలం పేరు: రేణుక అయోల
పుట్టిన ఊరు: కటక్
నివాసం: హైదరాబాద్

1. కవితా సంపుటాలు - 4 పడవలో చిన్ని దీపం(2006 ), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు ( 2019), రవిక (2025) కవితా సంపుటాలు
2. కథా సంపుటి : 1 .
రెండు చందమామలు( 2008 )
3. దీర్ఘ కావ్యాలు : - 2
మూడవమనిషి దీర్ఘ కావ్యం
(2015 - హిజ్రాల హృదయ వేదన )
పృధ ఒక అన్వేషణ ( 2021)
4. అంతః తీరాల అన్వేషణ
రేణుక అయోల:
రచన సౌభాగ్య : 2018
( రేణుక అయోల రచించిన పూర్తి కవిత్వ సంపుటాల పైన విశ్లేషణ )
5. They long poem :2022
(మూడవ మనిషి దీర్ఘ కావ్యనికి ఆంగ్ల అనువాదం)
అనువాదకులు:
T. S.chanadra mouli

ప్రస్తుతం " కాగితం పడవ " నవల - తరుణి పత్రిక లో ధారావాహిక గా ప్రచురిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్యం

కనకాభిషేక గ్రహీత పసుపులేటి రంగరాజమ్మ