గులాబీల పిల్లవాడు

రోడ్డు వారగా
ఎర్రని
గులాబీలు అమ్ముతున్నాడు

ఒక్కొక్కటె అమ్ముతారవి
పువ్వులా నవ్వే వాళ్ళు
వాళ్ళ హృదయంలో ఒక్కరే ఉన్నారని
చెప్పడానికి కావచ్చు

ఒకసారి ఇలాటి పువ్వే
బహుమతిగా వచ్చింది
పువ్వంత చోటివ్వ లేని
ఇరుకు
భవిష్యత్తులో
ప్రేమికులు అపరిచితులయ్యారు

కలవరపడ్డ కలలు
నెలవంకల పెదవుల్ని
ముడివేసి జీవితాలని
విడదీసాయి

ప్రేమ ఓడిపోలేదు
గెలవలేదు
ప్రేమికులు మాత్రం మరణించారు

పిల్లవాడి చేతిలోని గులాబీ
ఎర్రని ఎరుపుతో
రెండు తపించిన హృదయాల
మధ్య ఉదయించడం కోసం
ప్రేమ గెలవాలని
ఘాడంగా కోరుకుంటుంది

అది
తెలుసుకున్న వాళ్ళు దాన్ని
బహుమతిగా ఇవ్వరు
తామే బహుమతిగా మారాలని
నిశ్చయించుకుంటారు
వారి చేతిలోని గులాబీ
ముళ్ళు విదిలించుకొని
ఉంగరం వేలికి అళ్ళుకుపోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కవులు

“శుభ ముహూర్తం”-2