“ఛోటా (హిమాలయన్) చార్ థామ్ యాత్ర”

హిందువులు జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలనుకున్న యాత్రలలో, అతి ముఖ్యమైనది  ఛోటా చార్ థామ్ (హిమాలయన్ చార్ థామ్) యాత్ర ఒకటి. ఇందులో హిమాలయ పర్వతశ్రేణులలో వుండే బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ దర్శనాలుంటాయి. అక్షయ తృతీయ నుండి, దీపావళి వరకు (ఆరు నెలలు) మాత్రమే ఈ చార్ థామ్ యాత్ర తెరిచి ఉంటుంది. మిగిలిన ఆరునెలలు, మంచుతో కప్పబడి, ఆ ప్రాంతం ఆవాసయోగ్యంగా ఉండదు. [ఆదిశంకరాచార్యుల వారి చార్ థామ్ అంటే నాలుగు దిక్కులా ఉండే నాలుగు థామాల దర్శనం: అవి తూర్పున పూరీ (జగన్నాథ్), దక్షిణాన రామేశ్వరం (రామనాథేశ్వర్), పశ్చిమాన ద్వారక (శ్రీకృష్ణ), ఉత్తరాన బదరి (బదరీనాథ్)]. ఈ యాత్రలో ఎక్కువ భాగం తలెత్తి చూడలేనంత ఎత్తులో మహోన్నతమైన మంచు శిఖరాలు. గలగల పారుతున్న హిమనదులు. త్రోవ పొడవునా ప్రకృతి రమణీయ దృశ్యాలే. ఎంత చూసినా తనివి తీరని అందం ఈ యాత్ర ప్రత్యేకం. త్రోవ పొడవునా, ఒకవైపు మహోన్నత పర్వతాలు. ఇంకొక వైపు, ఒళ్ళు జలదరింపజేసే లోయలు. కళ్ళను కట్టిపడేసే పచ్చదనం. పాము మెలికల్లా తిరుగుతున్న రహదారుల సొబగులు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నా తరగని అనుభూతినిస్తాయి. ఆ అనుభూతులను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాలే తప్పించి, కెమెరా కళ్ళకు కూడా పూర్తిగా అందవవి.          ఈ యాత్ర, యెన్నో సవాళ్లతో కూడుకొని వుంటుంది. ప్రతికూల పరిస్థితులు వుంటాయని తెలిసీ, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంటుందని తెలిసీ, యాత్రలో అనుక్షణమెదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ, యీ యాత్ర చెయ్యడానికి సంకల్పిస్తారు భక్తులు.  ఏ నిమిషంలో వాతావరణం మారిపోతుందో… కొండచరియలే విరిగి పడతాయో, కుండపోత వర్షమే కురుస్తుందో, మంచు తుఫానే ముంచుతుందో… ప్రకృతి ఏ రకమైన బీభత్సాన్ని సృష్టిస్తుందో చెప్పలేని పరిస్థితుంటుంది. అందుకని మన చేతిసంచిలో అవసరమైన అన్ని రకాల మందులు, మంచినీళ్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చలికి ఆగే దుస్తులు వుంచుకోవాలి. మార్గమధ్యంలో అవరోధమేర్పడితే, ముందుకు వెనుకకు వెళ్ళలేని పరిస్థితి, చాలా గంటలు రోడ్డుమీదే వుండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని మానసికంగా సంసిద్ధమై వుండాలి. ఎప్పుడెప్పుడా అని యెదురుచూస్తున్న మా చార్ థామ్ ప్రయాణం (ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి) మే 29న (2024), ఫ్లైట్లో ఢిల్లీ చేరుకోవడంతో మొదలైంది. ఢిల్లీనుండి బస్సులో, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. 30వ తేదీన, ఉదయాన్నే లేచి హరిద్వార్ లో గంగానది దర్శనం చేసుకుని, బార్కోట్ కు ప్రయాణమయ్యాం. బార్కోట్ చేరుకునే మార్గమధ్యంలో వెహికల్ పర్మిట్ తీసుకోవాలి. 31st May: బార్కోట్ -యమునోత్రి- బార్కోట్ బార్కోట్ నుండి 46 కిమీ దూరంలో వున్న యమునోత్రి జన్మప్రదేశం కాళింది పర్వతం. గంగానదికి అతి పెద్ద ఉపనది. మీదకు వెళ్లడానికి, నడకకు ఆరు గంటలు, గుర్రంమీద రెండు గంటలు పడుతుంది. వాలు తక్కువగా వుండి, యెత్తుగా వుంటుంది. అందుకని నడవడం కష్టం. ఇరుకైన దారి. దానికి తోడు పోనీల వాళ్ళు, డోలీల వాళ్ళు మనల్ని తోసేస్తూ వుంటారు. ఆలయంలో ప్రధాన మూర్తి యమునా దేవి. ఆమె వాహనం తాబేలు. యమునకు ఇరుప్రక్కల గంగ, సరస్వతి వుంటారు. అతి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక ప్రక్క మంచు పర్వతాలు.,.. ఆ మంచు కరిగి, జలమై, నదాలుగా మారి, మనకి అడుగుల దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలో చెయ్యి పెడితే జిల్లుమని, వేళ్లు కొంకర్లు పోతూ ఉంటాయి. ఆ శీతల నదాలకు చేరువలోనే, వేడి పొగలను వెలువరిస్తూ,  వేడి నీటిబుగ్గలుంటాయి. ఈ ఆలయ ప్రాంతంలో కూడా రెండు వేడినీటి బుగ్గలున్నాయి. ఒకటి ఆలయం కుడివైపున ఉంటే, ఇంకొకటి ఆలయం బయట ఉన్న సూర్యదేవాలయం దగ్గర ఉష్ణకుండం పేరుతో ఉంటుంది. ఇందులో బియ్యం మూట కట్టి ఐదు నిమిషాలుంచితే ఉడికిపోతుంది. దీని ప్రక్కన యమశిల వుంటుంది. అక్కడ సంకల్పం చెప్పించుకుంటారు. (యమున సోదరుడు యముడు). సూర్యదేవుని పిల్లలే యమున, యముడు. యమునోత్రి దర్శనమయ్యాక, ఉత్తర కాశి చేరుకోవాలి. కాని ఆలస్యమైనందున బార్కోట్ లోనే రెండవ రాత్రి కూడా వుండవలసి వచ్చింది. మేమున్న హోటల్ నుండి చూస్తే, ఎంతసేపు చూసినా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అందమైన లతలతో, పువ్వులతో అల్లుకున్న పచ్చని వృక్షాలు. ఎటు చూసినా పచ్చని కొండలే! వాటిమధ్య అక్కడక్కడ హోటల్స్, కంటికింపైన వర్ణాలతో. హిమాలయాలలో ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది. స్వచ్ఛమైన నీలి రంగులో ఆకాశం. ఆ నీలి రంగును ఆక్రమిస్తూ, అస్తమిస్తున్న భానుని కిరణాలు, ఆకాశాన్ని సింధుర వర్ణంలో మెరిపిస్తూ… ఏ చిత్రకారుడో చిత్రాన్ని గీసి ఇక్కడ మర్చిపోయాడేమోనని, చూస్తూ అలా మైమరచిపోతాం. 1st June: బార్కోట్-గంగోత్రి- పిపాల్ కోటి వేకువనే గంగోత్రికి బస్సులో బయలుదేరాం. త్రోవలో మెడికల్ కేంపుంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ, కొండల మధ్య పయనిస్తూ, అడవులను దాటుకుంటూ, మధ్యాహ్నం రెండు గంటలకు గంగోత్రి చేరుకున్నాం. గంగోత్రికి వెళ్లే త్రోవలో అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు, ఆర్మీ బేస్ లు, పవర్ ప్రాజెక్టులు కనిపిస్తాయి. త్రోవ కిరువైపులా పూలతో కూడిన పొదలు, చిన్న చిన్న చెట్లు. ప్రయాణం భారమనిపించదు. పగలు ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ప్రయాణమంతా ఘాట్ రోడ్డే కాబట్టి, బస్సులో ఏసీ వెయ్యరు. లోపల మనకి కాస్త వేడిగా ఉన్నా, క్రిందకి దిగేటప్పటికి చల్లగా ఉంటుంది. వెళ్తున్న కొద్దీ, ఉష్ణోగ్రతలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది మనకు. గంగోత్రిలో మన యాత్రా రిజిస్ట్రేషన్ ను చెక్ చేసి, ముందుకు పంపిస్తారు. వెహికల్ పార్క్ చేసి, కొంత దూరం నడవాల్సింటుంది. వీల్ చైర్స్ వుంటాయి. త్రోవలో షాపులున్నాయి. గంగోత్రి ఆలయం పాలరాతి నిర్మితం. గంగామాతను ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. కరుణతో నిండిన ఆ కళ్ళు, మనపై ఆశీస్సుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ గంగను భగీరథి అంటారు. దేవప్రయాగలో, అలకానందతో కలిసాక గంగ అవుతుంది. అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయం తెరిచివుంటుంది. ఆ తర్వాత, హర్షిల్ పట్టణానికి దగ్గర ముఖ్బా గ్రామంలో, గంగామాత పూజలందుకుంటుంది. ఆలయంలో అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి, ఆదిశంకర, భగీరథ విగ్రహాలున్నాయి. ఆలయం బయట శివాలయం, హనుమాన్ ఆలయం వున్నాయి. మెట్లు దిగి క్రిందకు వెళ్తే, భగీరథ శిల వుంది. ఈ శిల నుండి నీళ్ళు వస్తూనేవున్నాయి. ఇక్కడ భగీరథుని విగ్రహం కూడా వుంది. కొంచెం ముందుకెళితే, పరవళ్ళు తొక్కుతూ, ధవళ వర్ణంలో, ఉదృతంగా గంగ. ఉరవడి శబ్దం వింటూనే మనసు పులకించిపోతుంది. గంగా స్నానం చేయాలని వున్నా, స్నానం మాట దేవుడెరుగు, గంగను ముట్టుకుంటేనే వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. ఇక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో, గంగానది పుట్టిన స్థలం గోముఖం వుంటుంది. అక్కడికి వెళ్లడానికి రోజుకి 150 టికెట్లు మాత్రమే యిస్తారు. ట్రెక్కింగ్ చాలా కష్టం. గంగా ప్రవాహపు హోరుమంటున్న శబ్దం వింటుంటే మనసు పరవశించిపోతుంది. ఆ తల్లి పరవళ్ళను తిలకిస్తుంటే తనువు పులకాంకితమౌతుంది. వేళ్ళు కొంకర్లు పోతున్నా, గంగమ్మ తల్లిని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. అంతటి శీతల వాతావరణంలో కూడా అక్కడ నుండి కదలాలనిపించడం లేదు. గంగోత్రి నుండి కదలాలని లేకపోయినా, మారే శీతోష్ణ పరిస్థితులను జ్ఞప్తి పెట్టుకొని బలవంతంగా బయలుదేరాం. ఎంత తొందరగా, అక్కడినుండి బయటపడితే అంత మంచిది. కొండ చరియలు విరిగిపడినా, మంచు తుఫాను కురిసినా, కొండల మధ్య చిక్కుకుపోతాం. ఎటూ వెళ్లేందుకు వీలుండదు. బార్కోట్ నుండి బయలుదేరినప్పుడు వేడిగా వుంటే… ప్రయాణం సాగేకొద్దీ చల్లగా వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆ చల్లదనం ఎక్కువవుతుంది. మార్గమధ్యంలో వుండిపోవాల్సి వస్తే, చలికి గడ్డకట్టుకుపోతాం. అందుకని మనతోపాటు అత్యవసర మందులు, బలాన్ని, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, స్వెటర్, షాల్ వంటి వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పుడు యెక్కడ, యే అవసరం పడుతుందో చెప్పలేం. ఈ రాత్రికి మేం ఉత్తరకాశి చేరుకోవాలి. కాని సమయాభావం వలన మార్గమధ్యంలో, పిపాల్ కోటిలో బస చెయ్యాల్సి వచ్చింది. 2-6-24: పిపాల్ కోటి – ఉత్తరకాశి – సీతాపూర్ ఉదయాన్నే పిపాల్ కోటి నుండి బయలుదేరి, ఉత్తర కాశీ చేరుకొని, అక్కడ కాశీ విశ్వనాధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని, రాత్రికి సీతాపూర్ చేరుకున్నాం. 3-6-24: సీతాపూర్ – గౌరీకుండ్ – కేదారనాథ్ ఉదయం 3 గంటలకే సీతాపూర్ నుండి బయలుదేరి గౌరీకుండ్ మీదుగా కేదారనాథ్ చేరుకొని, కేదారనాథుని దర్శించుకుని, రాత్రికి కేదార్నాథ్లో ఉండి, మరుచటి రోజు గౌరీకుండ్ సీతాపూర్, ఋషికేశ్ ల మీదుగా జోషిమఠ్ చేరుకున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదైన కేదారనాథ్, ఉత్తరాఖండ్ లోని, రుద్రప్రయాగ జిల్లాలో, సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో, గర్వాల్ కొండల పైభాగంలో వుంటుంది. ఈ గుడిని యెప్పుడు, యెవరు కట్టించారో చారిత్రక ఆధారాలైతే లేవు గాని, ఆదిశంకరాచార్యులు వారు నిర్మించినట్లు విశ్వసిస్తారు. ఇక్కడ కేదారేశ్వరుడు స్వయంభువు. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి విముక్తి కోసం, మహాశివుని వెతుకుతూ హిమాలయాలకు వెళ్లిన పాండవులకు దర్శనమివ్వడం యిష్టం లేక, వృషభరూపంలో శివుడు మంచు లోపలికి చొచ్చుకుపోయాడని, అది తెలిసి పాండవులు వృషభం (శివుని) పృష్టభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు కథనం. పృష్టభాగం కేదారనాథ్లో వుంటే,  మంచులో కూరుకుపోయిన తలభాగం నేపాల్ లోని, ఖాట్మండులో పశుపతినాధునిగా పూజలందుకుంటున్నట్టు భక్తుల విశ్వాసం. గౌరీకుండ్ నుండి రోడ్డు మార్గం లేదు. కొండల మధ్య ప్రయాణించవలసి వుంటుంది. గౌరీకుండ్ చేరుకోవడానికి వున్న మార్గాల్లో, మేం సీతాపూర్ నుండి చేరుకున్నాం. కేదార్ నాథ్ కు  హెలికాప్టర్ సదుపాయమున్నా టికెట్లు దొరకకపోవచ్చు. దొరికినా, మనం వెళ్లే సమయానికి వాతావరణం సరిగ్గా లేకపోతే, హెలికాప్టర్ క్యాన్సిల్ చేస్తారు. ఒక్కోసారి, మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతామనగా కూడా, హఠాత్తుగా వాతావరణం మారిపోయి, హెలికాప్టర్లు వెనక్కి వచ్చేస్తాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రీపెయిడ్ పోనీ స్టేషన్ నుండి పోనీలుంటాయి. అక్కడ ఫిక్స్డ్ రేటు ఉంటుంది. నలుగురు మనుషులు మోసే డోలి, ఒక్క మనిషి వీపున మోసే పిట్టూ… వీటికి ప్రీ పెయిడ్ స్టేషన్ ఉండదు. డిమాండ్ బట్టి రేటు మారుతుంది. గౌరీకుండ్ నుండి కేదార్ నాథ్ కు నడిచి వెళ్లవచ్చు. (21 కి.మీ.) ప్రయాణంలో చలిని తట్టుకునే దుస్తులు వేసుకొని, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్, రెయిన్ కోట్, ఎమర్జెన్సీ మందులు తప్పనిసరిగా వెంట వుంచుకోవాలి. త్రోవంతా రాతి పలకలతో వేసిన మెట్లుంటే, కొన్ని దగ్గర్ల మెట్లు లేకుండానే వుంటుంది. కొండల మధ్య నుండి, కొండలమీద నుండి ప్రయాణముంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి. త్రోవలో అక్కడక్కడా జలపాతాలు. వీక్షించాలేగాని, త్రోవంతా కళ్ళను తిప్పుకోనివ్వని ప్రకృతి సోయగాలు. గలగల కదిలే జలపాతాలు, మన పాదాలనంటి ప్రవహిస్తాయి. లోయల్లో నదులు ప్రవహిస్తూ, ముచ్చట గొలుపుతూ ఉంటాయి. అధిరోహించే కొండలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. చల్లనిగాలి ముఖానికి స్వాంతన చేకూర్చుతుంటే, ప్రకృతి సోయగాలు మనసును మైమరిపిస్తుంటే, కాళ్లు వాటంత అవే ముందుకు సాగుతాయి. హఠాత్తుగా క్లౌడ్ బరస్టై, జలపాతాలు మార్గాన్ని ముంచెత్తే సందర్భాలు, కొండ చరియలు విరిగిపడి, మార్గం మూసుకుపోయే పరిస్థితులు, మంచు తుఫానులు, విపరీతమైన వర్షాలు… యిటువంటి ప్రతికూల పరిస్థితులు యెన్నో ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాలలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తారు. మన ప్రయాణం యెక్కడైనా ఆగిపోవచ్చు. మానసికంగా సిద్ధపడాలి. కేదారేశ్వరుని నిజరూప దర్శనం మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అప్పుడు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. 12-2pm మధ్యలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత బంగారు తొడుగుతోనే మనకు స్వామి దర్శనమిస్తారు. ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం. ఎదురుగా నందీశ్వరుడు. అక్కడ నుండి చూస్తే, చుట్టూ పచ్చని కొండలతో, మంచు శిఖరాలతో, మంచు కరుగుతుంటే జాలువారే జలపాతాలతో, ప్రకృతి ఆహ్లాదకరంగా వుంటుంది. నీలి రంగులో స్వచ్ఛంగా ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యుడు. మేఘాలు లేకపోతే, సూర్యకిరణాల తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుంది. దర్శనమెప్పుడవుతుందా అన్న ఆతృత ఒకవైపు. ఆ పరిసరాలలోనే ఉండిపోవాలనే కాంక్ష ఇంకొక వైపు. భలే చిత్రంగా ఉంటుంది ఆ అనుభూతి. దర్శనమయ్యాక, అక్కడి ప్రకృతిలో లీనమైపోతాం. కదలాలనిపించదు. గాని, మరుక్షణం ఏమౌతుందో ఊహించలేం. హఠాత్తుగా మేఘాల విష్పోటనం సంభవించవచ్చు. నదులు పొంగి పొరలవచ్చు కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోవచ్చు. మరల మార్గం సుగమమావటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. అందుకని, దర్శనం చేసుకున్నాక, ఆ అనుభూతులను మూట కట్టుకుంటూ, క్రిందకు చేరుకోవడం ఉత్తమం. గర్భగుడి ముందున్న మంటపంలో భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు, ద్రౌపది, లక్ష్మీనారాయణుల విగ్రహాలు చిన్న చిన్న గూటిలో వున్నట్టుంటాయి. ఇక్కడ శివుడు లింగాకారంలో కాకుండా, అసమానంగా ఉన్న పెద్ద రాయి ఆకారంలో వుంటారు. పురాణ కథనం ప్రకారం, వృషభపు వెనుక భాగమది. కేదారేశ్వరుని దర్శనం చేసుకుని బయటికొస్తే, అక్కడొక చిన్న ఆలయముంటుంది. అదే అసలైన కేదారేశ్వర ఆలయమంటారు. కేదారేశ్వర ఆలయం వెనక భీమశిల వుంటుంది.  2013లో వచ్చిన వరదల్లో కొట్టుకొని వచ్చి, ఆలయానికి వెనక ఉండి వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చి, ఆలయాన్ని కాపాడిందని… అలాగని అది ఆలయాన్ని కాపాడేంత పెద్ద శిలైతే కాదు. ఆ కొండల మీద అంత పెద్ద శిలలున్న ఆనవాళ్లేమీ కానరాలేదు. అంతవరకు ప్రవాహంతో పాటు కొట్టుకొని వచ్చి, సరిగ్గా ఆలయం వెనకే కాపు కాసినట్టు యెలా వుండిపోయిందన్నది ఆశ్చర్యకరమే? ఆలయం వెనక కొండమీద క్షేత్రపాలకుని ఆలయం. దగ్గరలో ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా వుంటుంది. ఇక్కడే వారు శివసాన్నిధ్యం చెందారు. ఈ చార్ ధామ్ యాత్రలో ప్రయాణమెక్కువగా, దర్శన సమయం తక్కువగా వుంటుంది. అంతా ఘాట్ రోడ్ ప్రయాణమే.  పైకి వెళుతున్న కొద్ది మౌంటైన్ సిక్ నెస్ వచ్చే అవకాశమెక్కువ. ప్రయాణమెంత కష్టమనిపించినా, కేదారనాథుని దర్శనం కాగానే, ప్రయాణ బడలిక మాయమై, తనువు పులకితమౌతుంది. దేవదేవుని సన్నిధిలోనే వుండిపోవాలనిపిస్తుంది. ఎన్ని జన్మల భాగ్యమో, సశరీరంగా యీ పవిత్రభూమిపై కాలూనామని తలుచుకోగానే, మనసు అలౌకిక ఆనందాన్ని పొందుతుంది. ఉద్విగ్నతకూ లోనవుతుంది. ఆ మధురక్షణాలను వర్ణించలేం. అనుభవించగలమే తప్ప. అనంతమైన ఆ హిమవత్పర్వతాల మధ్య, ఆలయ సన్నిధిలో నిల్చున్నామన్న భావనే మధురం. ఆ అనుభూతులనన్నిటినీ మదిలో పదిల పరుచుకొని, ఇంకొకసారి దర్శించుకునే అవకాశమొస్తే బాగుండునని, శివుని ప్రార్ధించుకుంటూ వెనుదిరిగాం. 4-6-24: కేదారనాథ్- గౌరీకుండ్ – సీతాపూర్ – ఋషికేశ్ – జోషిమఠ్ రుషికేశ్ (హృషికేశ్) యోగాకు పుట్టినిల్లుగా కొలవబడుతుంది. ఎన్నో ఆశ్రమాలు ఇక్కడున్నాయి. 2015లో, రుషికేశ్, హరిద్వార్ నగరాలు దేశ వారసత్వసంపదగా పేర్కొనబడ్డాయి. ఇక్కడే గంగానదిపై రామ్ జూలా, లక్ష్మణ జూలా వంతెనలున్నాయి. ఇది దాటాక టెహ్రి డ్యాం వస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ డ్యామ్ చుట్టూ రెండు మూడు గంటలు పైనే తిరిగినట్టున్నాం. డ్యాముని దాటేసామని అనుకునేలోగా మరలా కనిపించేది. 5-6-24: జోషిమఠ్ – బదరీనాథ్ ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో జోషిమఠ్ (జ్యోతిర్ మఠ్) ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన పీఠాలలో (మిగిలినవి- శృంగేరి, పూరి, ద్వారక, కంచి) ఒకటి. ఈ మఠము అధర్వణ వేదానికి ప్రతీక. 108 దివ్యదేశాలలో ఒకటి. ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్టించిన నరసింహస్వామి యిక్కడ ఆలయంలో కొలువు తీరారు. అమ్మవారు పరిమళవల్లి. ఇక్కడ నరసింహ స్వామి వారి ఎడమ చేయి సన్నంగా ఉంటుంది. ఆ చెయ్యి పడిపోయిన నాడు బదరీనాథ్ ఆలయం మాయమైతుందని, సాలగ్రామ ఆకారంలో, యిక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రిలో ప్రత్యక్షమవుతుందని యిక్కడి వారి నమ్మకం. బదరి ఆలయాన్ని ఆరునెలలు మూసి వేసినప్పుడు, బదరీనాథుడు యిక్కడికి వచ్చి పూజలందుకుంటారు. ఈ ఆలయం వెనక దశావతారాలు, శివ, అమ్మవార్ల ఆలయాలున్నాయి. మఠంలో బదరి నారాయణ, రాజరాజేశ్వరి దేవి ఆలయాలు, ఆదిశంకరాచార్యులు వారి ప్రతిమ యిక్కడ నిత్యం పూజలందుకుంటాయి. శంకరాచార్యుల వారు వాడిన సామాన్లు, తపస్సు చేసిన గుహ కూడా యిక్కడ చూడవచ్చు. ఇక్కడ ఆర్మీ మిలటరీ కంటోన్మెంట్ (ఘర్వాల్ రైఫిల్స్ వారి స్థావరం) కూడా యిక్కడే వుంది. ఇక్కడికి 10 కి.మీ. దూరంలో తపోవన్ వుంది. ఇక్కడ వేడి నీటి బుగ్గలుంటాయి. ఇక్కడి నుండి మనం ధవళగంగను చూడవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఔలి రోప్ వే, గారి భవాని ఆలయాలున్నాయి. ఉత్తరాఖండ్లో 2021 లో వచ్చిన వరదల తరువాత, ఇక్కడి నేల కొద్దిగా కృంగిపోయి, యిల్లులు బీటలు వారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ఇక్కడి నుండే బదరీనాథ్ యాత్ర మొదలవుతుంది. జోషిమట్ దాటాక విష్ణు ప్రయాగ్ హైడల్ ప్రాజెక్ట్, తపోవన్ విష్ణుజాడ్ హైడెల్ ప్రోజెక్ట్ లు మార్గమధ్యంలో కనిపించాయి. బదరీనాథ్:   సాయంకాలనికి బద్రీనాథ్ చేరుకుని, దర్శనం చేసుకున్నాం. ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో, అలకానంద నదీతీరంలో, ఘర్వాల్ పర్వతశ్రేణుల్లో, 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన, ప్రముఖ వైష్ణవ ఆలయం, బదరీనాథ్. ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి వేదాలలో, భాగవతంలో, స్కంద పురాణంలో, పద్మ పురాణంలో  వివరించబడింది. బదరికా (రేగు) వనం వలన యిక్కడ స్వామికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని ఒక కథనం. అశోకుని కాలంలో బౌద్ధ క్షేత్రంగా, తర్వాత ఆదిశంకరాచార్యులచే హిందూ క్షేత్రంగా పునరుద్ధరించబడిందన్న చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయం వెనుక ఉన్న రెండు కొండలను నరనారాయణులంటారు. ఈ స్థలానికి వున్న ప్రాముఖ్యతను బట్టి ఇక్కడ చాలా మఠాలున్నాయి. దక్షిణాదిలో ఉన్నట్లు ఉత్తరాదిలో ఆలయాలు పెద్దగా వుండవు. శిల్పకళా నైపుణ్యం కూడా యెక్కువగా కనిపించదు. ఎత్తైన మెట్లెక్కి, ప్రవేశద్వారం, మంటపం దాటి, ఆలయం లోపలికి ప్రవేశిస్తే, ఒక అడుగు ప్రమాణంలో, నల్లరాతిలో ఒదిగి, రెండు చేతుల్లో శంఖు చక్రాలతో, మరో రెండు చేతులు యోగముద్రలో, పద్మాసనం వేసుకొని, బదరీనాథుడు, బదరీ వృక్షం క్రింద దర్శనమిస్తాడు.  సంవత్సరానికి ఆరునెలలు మాత్రమే యిక్కడ కొలువై, తర్వాత జోషిమఠ్ కు చేరుకుంటాడు. ఆలయంలో పైకప్పు బంగారు తాపడంతో, స్తంభాలు, గోడలు వివిధ రకాల డిజైన్లతో అలరారుతున్నాయి. ఆలయంలోపల కుబేర, నారద, ఉద్ధవ, నరనారాయణుల మూర్తులుంటే, ఆలయం చుట్టూ  లక్ష్మి, గరుడ, నవదుర్గ, లక్ష్మీనరసింహ, ఆదిశంకరాచార్య, ఘంటకర్ణల ఉపాలయాలు వున్నాయి. మేము వెళ్లిన సమయానికి చాలా పెద్ద లైన్లు వున్నాయి. సెక్యూరిటీ బాగుంది. మొబైల్ ఫోన్స్ ఎలౌ చేశారు. చక్కగా ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ పచ్చి శనగపప్పు ప్రసాదంగా యిస్తున్నారు. ఆలయానికి సమీపంలో, కొద్దిగా క్రిందకు దిగితే, అలకానంద నదిని ఆనుకొని, తప్తకుండ్ వేడినీటి బుగ్గలున్నాయి (నారద కుండ్, సూర్య కుండ్). ప్రక్కనే వున్న అలకానంద నదిలో నీళ్లు మంచులా చల్లగా వుంటే, యిక్కడి నీళ్లు పొగలు చిమ్ముతున్నాయి. స్త్రీలు స్నానాలు చేసేందుకు వీలుగా, ఒక దాని చుట్టూ గదిలా కట్టారు. అది చిన్నగా వుండడంతో, అక్కడ రద్దీగా వుంది. మగవారు వేరే బుగ్గల్లో స్నానాలు చేసి, పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ వైపు తీరమంతా సిమెంటుతో గచ్చు చేసి వుండడంతో, పితృ కార్యాలు చేసేవాళ్లకి సులభంగా వుంది. ఆలయం చుట్టూ చిన్న చిన్న వీధులు, అందులోనే దుకాణాలు, భోజనాలయాలు, చిన్న చిన్న యిల్లులున్నాయి. ఈ ప్రదేశం సంవత్సరానికి ఆరునెలలు మూసి వుంటుంది కాబట్టి, ఇళ్ల నిర్మాణాల మీద పెద్దగా ఖర్చు పెట్టరు. ఆలయానికి 300- 400 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు, హోటళ్లు, లాడ్జిలు, దుకాణాలు, మఠాలు చాలా వున్నాయి. 6-6-24: బదరీనాథ్ – హరిద్వార్ వయా ఋషికేశ్ ఉదయాన్నే మరల దర్శనం చేసుకుని తప్తకుండ్ నీటిబుగ్గలను చూసాం. మాతో వచ్చిన కొంతమంది పితృకార్యాలు చేసుకున్నారు. బద్రీనాథ్లో మేము జీయర్ స్వామి మఠంలో వున్నాం. వసతిసౌకర్యం బాగుంది. అక్కడున్న సత్రంలో ఉచిత భోజనసదుపాయం కూడా వుంది. మధ్యాహ్న భోజనాలయ్యాక బయలుదేరి, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ వెళ్లే త్రోవలో, అలకానంద నది మధ్యలో వుండే ధారీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. అమ్మవారి ముఖం మాత్రమే పూజలందుకుంటుందిక్కడ. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. చార్ థామ్ ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది ఈ అమ్మవారు. 7-6-24: హరిద్వార్ అమృతభాండాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చే సమయంలో, అమృతం చిందిన నాలుగు ప్రదేశాలలో, హరిద్వార్ ఒకటని పురాణ కథనం. (ప్రయాగ్, ఉజ్జయని, నాసిక్- మిగిలిన మూడు క్షేత్రాలు). ఈరోజు హరిద్వార్ లోనే బస. ఇక్కడ కూడా చాలా ఆశ్రమాలున్నాయి. వసతి సదుపాయం బాగుంది. ముందుగా దక్షమహాదేవ్ ఆలయాన్ని దర్శించుకున్నాం. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, సతి దేవి యజ్ఞగుండంలో దూకిన ప్రదేశమిది. ఆ తర్వాత బిల్వ పర్వతం మీదున్న వున్న మానసా దేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. పైకి వెళ్లడానికి, మెట్ల మార్గంతో పాటు, రోప్ వే కూడా ఉంది. కొద్ది దూరంలో నీలపర్వత శిఖరంపై చండీదేవి ఆలయముంటుంది. ఇదొక శక్తిపీఠం. సమయం లేక దర్శించుకోలేకపోయాం. ఆ రాత్రి గంగాహారతి చూసాం.  వారణాసిలో, గంగాహారతి చూశాక, యిక్కడ గొప్పగా అనిపించలేదు. కాని విపరీతమైన జన సందోహం. 8-6-24: హరిద్వార్- ఢిల్లీ – విశాఖపట్నం ఉదయాన్నే బస్సులో ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్లో విశాఖపట్నం చేరుకున్నాం. ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ చార్ థామ్ లను సందర్శించుకుని, ఆ లౌకిక ఆనందాన్ననుభవించి, జీవితకాలానికి సరిపడా మధురానుభూతులను మూట కట్టుకొని,  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్వేత ప్రపంచం

కలలే కన్నీళ్ళుగా