డాక్టర్…డాక్టర్!

హాస్య నాటిక

అది ఒక పాలీ క్లినిక్. రకరకాల డాక్టర్లు ఉంటారు. ఒక జనరల్ ఫిజీషియన్, ఒక ఆర్థోపెడిక్, ఒక ఇఎన్టి స్పెషలిస్ట్, ఒక ఆప్తాల్మలజిస్ట్ వేరు వేరుగా కూర్చొని వుంటారు. పేషెంట్లు బయట కూర్చుని ఉంటారు. ఒక్కొక్కళ్ళని లోపలికి పంపడానికి అసిస్టెంట్స్ ఉంటారు.

పాత్రలు: మొత్తం 10 లేదా ఎక్కువ
డాక్టర్స్ : ఇద్దరు మగ, ఇద్దరు ఆడ
పేషెంట్స్: ఇద్దరు మగ, ఒక ఆడ
అసిస్టెంట్స్: ముగ్గురు లేదా నలుగురు

ముందుగా ఒక లావాటి ఆయన భారంగా లోపలికి వస్తాడు. అసిస్టెంట్ అతన్ని జనరల్ ఫిజిషియన్ వద్దకు పంపుతాడు.

డా. ఆ….చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ?
పేషెంట్ 1. : నాకు లేవగానే ఆకలి అవుతుంది సార్ !
డా: అవునా! లేవగానే ఆకలా? అయినా… ఆకలి అవడం ఆరోగ్య లక్షణమే కదా! లేవగానే అంటే మీరు ఉదయం ఎన్ని గంటలకి లేస్తారు ?
పే: ఎప్పుడు లేస్తానంటే….నేను ఒక్కోసారి ఆరుగంటలకు లేస్తాను, ఎప్పుడైనా ఏడు గంటలకు కూడా లేస్తాను. ఎప్పుడు లేచినా లేవగానే ఆకలి అవుతుంది.
డా: సరే, మరి అప్పుడు ఏం తింటారు?
పే: అప్పుడు బ్రష్ చేసి కాఫీ తాగుతాను డాక్టర్!
డా: ఓ కె, ఉత్త కాఫీయేనా?
పే: ఉత్త కాఫీయేనా అంటే కాదండీ! దానితో బాటు ఏదైనా తింటాను.
డా: ఏం తింటారు?
పే: బ్రెడ్ జామ్ గానీ, ఏవైనా కరకరలాడే తినుబండారాలు గానీ, లేకపోతే లైట్ గా చిప్స్ గానీ, అవీ లేకపోతే బిస్కట్స్ గానీ…ఇలా కొద్దిగా తింటాను డాక్టర్! లేకపోతే కాఫీ తాగినట్టు వుండదు.
డా: ఊ…కొద్దిగా….చిప్స్ గానీ, కొన్ని ..బిస్కట్స్ గానీ తింటారు. తరువాత? ( కొద్ది, కొన్ని అనేటప్పుడు వత్తి పలకాలి)
పే: ఆ తర్వాత మళ్లీ నిద్ర వస్తుంది.
డా: ఆ…మళ్లీ నిద్రా? రాత్రి పూట నిద్ర సరిగా పోరా?
పే: పోతాను డాక్టర్! బాగానే పడుకుంటాను.
డా: మరి అంత బాగా నిద్రపోయిన తర్వాత పొద్దున్నే మళ్ళీ నిద్ర ఎందుకు వస్తుంది?
పే: అదే డాక్టర్! మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఇంకా చాలా ఉంది.
డా: ( ఆసక్తిగా ముందుకు వంగి) ఓ కే, ఓ కే, చెప్పండి.
పే: అట్లా ఏడున్నర….ఎనిమిది గంటలకు మళ్ళీ నిద్ర పోతాను డాక్టర్.
డా: మళ్ళీ నిద్ర నుండి ఎప్పుడు లేస్తారు ?
పే: ఎప్పుడు లేస్తానా….తొమ్మిదిన్నరకు లేస్తాను సార్ !
డా: ఆ..లేచి?
పే: లేవంగానే మళ్ళీ ఆకలి అవుతుంది డాక్టర్ ! బ్రేక్ ఫాస్ట్ టైం కదా !
డా: అవునా! ఏడున్నరకు ఆల్రెడీ ఫాస్ట్ ను బ్రేక్ చేసారుగా? మళ్లీ బ్రేక్ ఫాస్ట్ ఏంటీ? సరే, సరే…మరి అప్పుడు ఏం తింటారు ?
పే: అప్పుడు ఇడ్లీ, వడ, దోశ, పూరీ, ఊతప్పం, పెసరట్టు, ఉప్మా లాంటివి ఏవైనా సరే, లైట్ గా తింటాను డాక్టర్!
డా: లైట్ గా…( అతన్ని ఎగాదిగా చూసి) మీరు? తిన్న తర్వాత మీ దినచర్య ఎలా ఉంటుంది ?
పే: తిన్న తరువాత కొంచెం టీం తాగుతాను డాక్టర్!
డా: ఓ…నాకర్థమయింది, ( ఉత్సాహంగా) నిద్ర రాకుండా వుండడానికి టీ తాగుతారు కదా!
పే: కాదు డాక్టర్! టిఫిన్ తినగానే టీ తాగడం పద్ధతి కదా!
డా: ఆ..ఆ..అవును కదూ! మరిక అప్పుడు మీ పనిలోకి జొరబడతారు, అంతేగా?
పే: లేదు డాక్టర్! అప్పటికే నా కళ్ల మీదికి నిద్ర ముంచుకొస్తూంటుంది.
డా: ఓ మై గాడ్! మరి ఏం చేస్తారు?
పే: ఏం చేస్తాను సార్…పడుకుంటాను.
డా: ఆ…పడుకుని? మళ్లీ ఎప్పుడు లేస్తారు?
పే: మధ్యాహ్నం 12:30 కి లేస్తాను డాక్టర్!
డా: లేచాక మళ్ళీ ఆకలి అవుతుంది గదా?
పే: అవును కదా సార్!
డా: ( వెటకారంగా) మరి అప్పుడు ఏం తింటారు సార్ ?
పే: అప్పుడు భోజనం చేస్తాను డాక్టర్ !
డా: అదే, భోజనంలో ఏం తింటారని?
పే: ఏముంటుంది సార్! అన్నంలో కూర, పప్పు, చారు, చెట్నీ, పెరుగు, అప్పుడప్పుడూ చికెన్, మటన్, ఫిష్..ఇంకా ఏమైనా ఉంటే తింటాను డాక్టర్! ( హోటల్ మెనూ లాగా చెపుతాడు)
డా: ఓ కె, ఇక అప్పుడయితే మళ్లీ పడుకోరు కదా!
పే: అయ్యో! అలా కాదు డాక్టర్ ! మధ్యాహ్న భోజనం తరువాత ఎవరైనా నిద్రపోతారు గదా! నేనూ ఒకటిన్నరకు పడుకుంటాను.
డా: మళ్లీ ఎప్పుడు లేస్తారండీ?
పే: మళ్ళీ ఎప్పుడు లేస్తానంటే నాలుగు గంటలకు లేస్తాను సార్!
డా: ఓ…అప్పుడు బయటికి వెళ్తారా కాసేపు?
పే: అప్పుడు వెళ్ళను డాక్టర్! కాసేపాగి వెళ్తాను.
డా: అవునా! మరి అప్పుడేం చేస్తారు?
పే: అప్పుడు మళ్లీ ఆకలవుతుంది కదా సార్! అది టీ టైం కూడా!
డా: అ…వు…ను…కదా! మరి?
పే: ఏవైనా స్నాక్స్ తిని, ఓ కప్పెడు టీ తాగుతాను డాక్టర్!
డా: కప్పెడంటే….ఈ కప్ అంత వుంటుందా? ( అక్కడ షో కోసం వుంచిన ఓ పెద్ద కప్పును చూపిస్తాడు)
పే: అరె ! ఎగ్జాక్ట్లీ ఇదే డాక్టర్, ఇదే కప్పు! అన్నట్లు ఈ సైజ్ కప్పులో నేను టీ తాగుతానని మీకెలా తెలుసు?
డా: ఊహించాను లెండి!! ఇంతకూ అప్పుడు ఫ్రూట్స్ ఏవైనా తింటారా?
పే: లేదు డాక్టర్! నాకు పళ్లు తినడం పెద్దగా ఇష్టం వుండదు. అయినా, అది స్నాక్స్ టైం కదా!
డాక్టర్: అవును కాబోలు! ఇక అప్పుడు కరకరలాడే కారప్పూసలూ, చురు చురులాడే చేగోడీలూ, జిరజిరలాడే జంతికలూ, బురబురలాడే బూందీ, మురమురలాడే మూంగ్ దాల్ లాంటివి తింటారు, అంతేగా ?!
పే: అంతే డాక్టర్! అంతే…అంతే! నేను ఏం తింటానో కూడా ఎలా చెప్పగలుగుతున్నారు సార్!
డా: తెలుసుకోవాలిగా మరి! డాక్టర్ని గదా! ఇంతకూ ఆ తరువాత ఏం చేస్తారో తమరు?
పే: సాయంత్రం అలా పక్క వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిదాకా వెళ్తాను డాక్టర్!
డా: ఓ…పక్క సందే కదా! ( సంతోషంగా) నడుస్తారన్న మాట!
పే: లేదు డాక్టర్! నేను అంత దూరం నడవలేను. ఆటోలో వెళ్తాను.
డా: ఓస్…అంతేనా? నేనేదో ఉత్సాహపడ్డాను. మరి ఆలయానికి మెట్లు వున్నాయా? అవైనా ఎక్కుతారా?
పే: అయ్యో, ఎక్కలేను డాక్టర్! ఆ గుడి మెట్లకు కొంచెం పక్కగా రంగయ్య అని ఒకాయన బండి పెట్టుకొని మిర్చి బజ్జీలు చేస్తుంటాడు. సూపర్ గా చేస్తాడు సార్! అసలు పునుగులు, మిర్చి బజ్జీలు, మైసూర్ బోండాలు, పప్పు గారెలు తింటే అతని దగ్గరే తినాలి. ( లొట్ట వేస్తాడు) అంత రుచిగా చేస్తాడు డాక్టర్! అవి కొనుక్కుని అక్కడే కొన్ని తింటాను, కొన్ని ఇంటికి తీసుకు వస్తాను.
డా: ఆ సరదా కూడా ఉందన్నమాట తమరికి!
పే: అన్ని రుచులు తెలుసుకోవాలి కదా డాక్టర్ !
డా: అవునవును, అన్నీ రుచి చూడాలి తప్పకుండా! మరి ఇంటికి వచ్చాక ?
పే: ఇంటికి వచ్చాక కాస్త ఫ్రెష్ అయ్యి ఓ కునుకు తీసి లేచి ఎనిమిదింటికి భోజనం చేస్తాను.
డా: భోజనం!అదెలా ఉంటుందో తెలుసుకోవచ్చా?
పే: అంటే రాత్రిపూట లైట్ గా ఉండాలని అన్నం తినను డాక్టర్ ! చపాతీలుగాని, జొన్న రొట్టెలు కానీ దాంట్లోకి ఉల్లికారం వెల్లుల్లి కారం లేదా పప్పు, కూరతో తింటాను.
డా: సుమారుగా ఎన్ని తింటారో ?
పే: ఎన్ని తింటాం డాక్టర్ ! ఎక్కువగా ఏమీ తినను. నాలుగో, అయిదో తింటాను లైట్ గా.
డా: లైట్ గా?! ఆ తర్వాత ?
పే: ఆ తర్వాత కొంచెం మజ్జిగ తాగుతాను డాక్టర్ !
డా: ఇంకా ఏం చేస్తారు ?
పే: కాసేపు టీవీ చూద్దామనుకుంటాను డాక్టర్ ! కానీ, టీవీ చూస్తుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. ఇక పడుకుంటాను.
డా: ఇంతేనా,ఇంకేమైనా ఉందా ? మధ్య రాత్రి లేచి ఆకలేస్తే తినడం అలాంటిదేదైనా ?
పే: అలాంటిదేమీ లేదు డాక్టర్ ! ఎప్పుడైనా ఆకలేస్తుంది కానీ, మళ్ళీ నిద్ర ముంచుకొస్తుంది.
డా: ఓకే , ఇంతకూ మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఏం ప్రాబ్లం ఉంది మీకు?
పే: ఈ మధ్య నిద్ర సరిగా పట్టడం లేదు, డిస్ట్రబెన్స్ వుంటోంది. అట్లాగే పొట్టలో బాగా ఆయాసంగా వుంటోంది. మునుపటిలా తినలేకపోతున్నా! అందుకని మీకు చూపించుకుందామని వచ్చాను.
డా: మీరు ఇదివరకు ఏం పని చేసేవారు? ఐ మీన్ ఉద్యోగం?
పే: నేనా డాక్టర్? లైబ్రేరియన్ గా చేసేవాణ్ణి.
డా: మీ అభిరుచికి….అదే…మీ నిద్రకు సరైన ఉద్యోగం! మరి, ఆస్తిపాస్తులున్నాయా?
పే: మా నాన్న కట్టించిన ఇండ్ల రెంట్స్ వస్తాయి డాక్టర్.
డా: ఓ..అర్థమయింది.
పే: ఇప్పుడు ఏమైనా టెస్టులు అవీ రాస్తారా డాక్టర్?
డా: మీకిప్పుడు టెస్టులు అలాంటివి ఏమీ నేను రాయను. మిమ్మల్ని చూస్తే నాకు చిన్నప్పుడు చూసిన పౌరాణిక సినిమాల్లోని ఒకటి రెండు పాత్రలు గుర్తొస్తున్నాయి.
పే: ఏ పాత్రలు డాక్టర్?
డా: వద్దు లెండి. చెబితే బాగుండదు. ( కుర్చీ లో నుంచి లేచి) మీరు చెప్పింది అంతా విన్నాక నాకు అర్థమయింది ఏమిటంటే మీరు రెండు పనులు మాత్రం చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. ఒకటి తినడం, రెండవది నిద్రపోవడం. ఇలా అయితే ( పేషెంట్ పొట్టను తాకుతూ) వంద సంవత్సరాలు వారెంటీ వుండే మీ గ్రైండర్ తొందరలోనే పూర్తిగా పాడవడం గ్యారంటీ! మీరు చాలా తొందరగా జీవితకాలమంతా కలిపి తినే అంత ఆహారం ఇప్పటికే తిని ఈ గ్రైండర్ ని చాలా ఎక్కువగా వాడేశారు. ఇక రిపేర్ అవసరం!
పే: ఇప్పుడెలా డాక్టర్?
డా: అదే, మీకు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను…(అని డాక్టర్ పేపర్ మీద ఏదో రాస్తాడు)
పే: ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి సార్? ( అంటూనే పేపర్ అందుకుని చూసుకుంటాడు) ఇదేంటి డాక్టర్ ఇలా రాశారు ?
డా: అవును మీరు పొద్దున్నే లేచి మీ ఇంటి ముందు నడుస్తూ ఈ మ్యాథమెటికల్ టేబుల్స్ వంద సార్లు చదవండి.
పే : నేను ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం డాక్టర్ !
డా: సరే ఒక్క ఎక్కం ఒకటి… ఒక్క రెండు రెండు….ఒక్క మూడు మూడు…ఇలా వంద సార్లు నడుస్తూ చదవండి, సరేనా !
పే: డాక్టర్!
డా: ఇక బ్రేక్ ఫాస్ట్ చేసాక మళ్ళీ ‘కాకి ఒకటి నీళ్ళకు…కావు కావు మనుచును’ అనుకుంటూ చిట్టి పాటలో, ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అంటూనో చిన్నప్పటి సుమతీ వేమన పద్యాలో… న్యూస్ పేపర్ పట్టుకొని పెద్దగా పైకి చదువడమో అలా నిద్ర రాకుండా చదువుతూనే వుండండి.
పే: డాక్టర్! డాక్టర్!
డా: చెప్పేది వినండి, అడ్డు రాకండి. లంచ్ అయ్యాక బయటికేం వెళ్తారు లెండి?
పే: సరే…డాక్టర్! ( సంతోషంగా)
డా: అప్పుడే సంతోషపడకండి…నిద్రపోకుండా…టీవీ పెట్టి నిలబడే చూడాలి. టాక్ షోలే చూస్తారో, ఫోక్ సాంగ్సే చూస్తారో, సిన్మాలే చూస్తారో నిలబడో, అటూ ఇటూ తిరుగుతూనో చూడండి. వీలైతే పాటలొస్తుంటే మీరూ పెద్దగా పాడండి. ఆ సమయంలో ఏమీ తినొద్దు!
మీరు భోజనం చేసేటప్పుడు అయితే పదే నిమిషాల్లో, మిగతా ఏది తిన్నా అయిదే నిమిషాల్లో తినాలి. సరేనా?
పే: సరే డాక్టర్! ( నీరసంగా)
డా: చదవడానికో, మంచినీళ్లు తాగడానికో మాత్రమే మధ్యలో నోటిని వాడాలి. ఇలా చేశాక నెల రోజుల తర్వాత నా దగ్గరికి రండి. అప్పటికి కూడా మీకు ‘ తినగానే నిద్ర…లేవగానే ఆకలి’ అనే ఈ అలవాటు తగ్గకపోతే నా దగ్గరే అడ్మిట్ అయితే,మీ చేత ఆ పనులన్నీ మా స్టాఫ్ చేయిస్తారు. ఓ కె?
పే: లేదు డాక్టర్! ట్రై చేస్తాను.
డా: లాస్ట్ పాయింట్…మీకు వంటొచ్చా?
పే: అస్సలు రాదు డాక్టర్! అలవాటు లేదు.
డా: మరీ మంచిది. మీ అమ్మగారిని ఓ నెలరోజులు తీర్థయాత్రలకు పంపి, మీ మిసెస్ ని హాయిగా పుట్టింటికి వెళ్ళమనండి.
పే: మరి?
డా: మీరే వండుకుని తినండి. బయటి ఫుడ్ తెచ్చుకోవద్దు, ఎవరింటికీ తినడానికి వెళ్ళొద్దు. ఓ కె. మీలో మార్పు మీరే చూస్తారుగా! రమేశ్! ( అంటూ అసిస్టెంట్ ని పిలుస్తాడు)
ఈయన్ని లిఫ్ట్ లో కాకుండా మెట్లు దిగి వెళ్లేలా చూడు!
పే: నమస్తే డాక్టర్! వస్తాను!
( డాక్టర్ మంచినీళ్ల బాటిల్ తీసుకుని గటగటా తాగుతాడు)
***
( కళ్ల డాక్టర్ కూర్చుని వుంటుంది/ వుంటాడు. అసిస్టెంట్ పేషెంట్ 2 ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. పేషెంట్ 2 . చేతిలో మొబైల్ వుంటుంది)

డా: చెప్పండమ్మా, ఏమిటి మీ సమస్య?
పే: కళ్లు మండుతున్నాయి డాక్టర్!
డా: అవునా! ఎవర్ని చూసి? ( ఇంతలో పేషెంట్ ఫోన్ మోగుతుంది)
పే: ( ఫోన్ ఎత్తి) హలో… హలో.. ఓ ..సరోజనా? ఆ…చెప్పు సరోజా! ఎక్కడున్నావు? ….ఆ…ఆ…. సరే….నీకు మెసేజ్ పెట్టాను చూడూ…దాంట్లోనే..వుంటుంది క్లియర్ గా.. అదే..అదే..
( డాక్టర్ చిరాగ్గా చూస్తుంటుంది. అసిస్టెంట్ పేషెంట్ భుజం మీద చెయ్యేసి)
అసి: అమ్మా! ఇట్లా ఇక్కడ ఫోన్ మాట్లాడొద్దమ్మా! మీ కోసం డాక్టర్ గారు చూస్తున్నారు. ఇంకా చాలా మంది పేషెంట్స్ వెయిటింగ్ లో వున్నారు.
పే: సరే…సరే..( అంటూనే రెండు నిమిషాలు ఆగమన్నట్టు అసిస్టెంట్ కి సంజ్ఞ చేస్తుంది) ఆ..నేను..ఇక్కడ బయట వున్నాను… బయటంటే ఎక్కడా అంటావా? …అదే..కళ్ళ డాక్టర్ దగ్గర వున్నాను. సరే..సరే…మళ్లీ మాట్లాడుతాను…పెట్టేస్తున్నా ( ఫోన్ పెట్టేసి డాక్టర్ వంక చూస్తుంది)
డా: ఇప్పుడు చెప్పండి.
పే: కళ్లు బాగా మంటలు డాక్టర్! ( నులుముకుంటుంది). అప్పుడప్పుడూ కళ్లు గిర్రున తిరుగుతుంటాయి. ( తిరుగుతున్నట్టు చూపిస్తుంది) తలంతా దిమ్ముగా, బరువుగా వుంటుంది.
డా: ఇంకా?
పే: ఇంకా మెడంతా..( మళ్లీ ఫోన్ మోగుతుంది. ఎత్తుతుంది.) ఆ…హలో..హలో..అవును..నేనే…మాట్లాడుతున్నా..ఏంటీ..పార్సెల్ వచ్చిందా. ఓ..అప్పుడే వచ్చేసిందన్న మాట. ఎంత ఫాస్ట్ గా వచ్చిందో! ఏంటీ, ఓటీపీ చెప్పాలా? సరే సరే, చెప్తాను. స్పీకర్ ఆన్ చేసి మెసేజెస్ లోకి వెళ్లాలిగా! ఆ.. వచ్చింది.. టూ సెవెన్ వన్ నైన్…ఎక్కడివ్వాలంటారా? ఇంట్లోనే మిడిగుడ్లేసుకుని టీవీ చూస్తూ వుంటుంది ఒకావిడ. ..ఆ..ఆ..మా అత్తయ్యే! ఆవిడకివ్వండి. కొంచెం గట్టిగా పిలవండి. పెద్ద సౌండుతో టీవీ వినీ వినీ ఆమెకు చెవుడొచ్చింది. ఆ..సరే..సరే..( డాక్టర్ తల పట్టుకుని కూర్చుంటుంది అసిస్టెంట్ మళ్లీ పేషెంట్ ను భుజం తట్టి హెచ్చరిస్తుంది)
అసి: అమ్మా! మీరు ఫోన్ ఎత్తకండి. దాన్ని ఆఫ్ చేయండి, లేదా సైలెంట్ లో పెట్టుకోండి. డాక్టర్ గారి టైం విలువైనది. ఆ విషయం తెలుసుకోండి.
పే: సరే, సరే…అయిపోయింది లెండి. ఏం చెబుతున్నాను? ఆ….మెడంతా నొప్పి, తల కిందికి దించితే చాలు, విపరీతంగా లాగుతుంది. భుజాలు, చేతులు కూడా నొప్పిగా వుంటాయి డాక్టర్!
డా: ఆ…ఇంకా?
పే: చెవుల్లో జోరీగలు దూరినట్టు ఒకటే హోరు. ఒక్కోసారి ఏమీ వినిపించదు. కొన్ని సార్లు అలాంటప్పుడు కళ్లు మసకబారుతాయి. ( ఫోన్ వైబ్రేషన్ రావడంతో దాని వైపు చూస్తుంది)
డా: ఒద్దొద్దు..మళ్లీ ఫోన్ ఎత్తకండి. మరో అయిదు నిముషాలు వేస్ట్ అవుతాయి. ఇంకా ఏమేం అవుతుందో చెప్పండి.
పే: ఆ.. అప్పుడప్పుడూ తలనొప్పి కూడా వస్తుంది.
డా: ఓకే ఓకే ..
పే: నా కళ్లు ఇప్పుడు పరీక్ష చేసి చెబుతారా డాక్టర్!
( డాక్టర్ లేచి వచ్చి పేషెంట్ కళ్ళ రెప్పలు ఎత్తి పరీక్షిస్తుంది.)
డా: మీ ఫోన్ ఆన్ చేసి ఇలా ఇవ్వండమ్మా! ( పేషెంట్ ఫోన్ ఇస్తుంది. దాన్ని తిప్పి చూస్తుంది )
డా: మీ అసలు సమస్య కళ్ళది కాదమ్మా!
పే: మరి… నా కళ్లు మంటలు, మసకలు… ఇంకా..( మధ్యలోనే ఆపుతాడు)
డా: మీ సమస్య ఇదే! ( ఫోన్ ని చూపిస్తూ) ఈ ఫోనే! ఎన్ని కాంటాక్టు నెంబర్లు, ఎన్ని వాట్సాపులూ, ఇంస్టాగ్రాములూ, ఎన్ని యూ ట్యూబ్ ఛానల్సూ, ఎన్నెన్ని రీల్సూ, ఫేస్ బుక్, టెలిగ్రాం..వామ్మో! గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు ఇంత ఊహించి వుండడు పాపం! మొబైల్ లో ఎన్ని ఫీచర్స్ వుంటాయో అవన్నీ మీ ఫోన్ లో వున్నాయి. ఈ మొబైల్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. వారానికి రండి. మీరు చెప్పిన సమస్యలన్నీ తగ్గిపోతాయి.
పే: వామ్మో! ఫోన్ లేకపోతే నాకు తోచదు డాక్టర్! పిచ్చెత్తుతుంది.
డాక్టర్: మరి మీరు ఈ మొబైల్ వాడడం తగ్గించకపోతే మీకు నాలాంటి కళ్ళ డాక్టర్ మాత్రమే కాదు, ఈ ఎన్ టీ స్పెషలిస్టు, న్యూరాలజిస్టు, ఆర్థోపెడీషియన్ తోబాటు కొన్నాళ్ళకు సైకాలజిస్టు కూడా అవసరమవుతారమ్మా!
పే: మరేం చేయమంటారు డాక్టర్!
డా: చెబుతున్నాను కదా! ఈ ఫోన్ పోయిందనుకుని ఓ చిన్న ఫోన్…మాట్లాడేందుకు మాత్రమే పనికొచ్చేది కొనుక్కోండి. రోజుకు పథ్యం లాగా ఏవైనా మూడంటే మూడు కాల్స్ మాత్రమే మాట్లాడండి. మీకు ప్రిస్క్రిప్షన్ అదే సరేనా! ముందు ఒక వారం రోజులు ఈ మందులు వాడండి. ఆ తరువాత నేను చెప్పింది చేస్తే చాలు. ఇక వెళ్ళండి. ( అంటూ అసిస్టెంట్ వైపు చూసి)నెక్స్ట్ పేషెంట్ ని పిలువమ్మా!
@@@@@@@@@

( ఆర్థోపెడిషియన్ కూర్చుని వుంటాడు. అసిస్టెంట్ ఒక పేషెంట్ ని పంపుతాడు. పేషెంట్ చాలా బాధగా నడువలేక నడుస్తూ వుంటాడు. అసిస్టెంట్ తీసుకు వచ్చి ఒక కుర్చీలో కూర్చోబెడుతుంది.)

డా: అయ్యో! చాలా బాధ పడుతున్నట్టున్నారు. మీ సమస్య ఏంటీ చెప్పండి.
పే: మోకాలు చాలా నొప్పి, అబ్బా…అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను డాక్టర్!
డా: చాలా నొప్పిగా వుందా! ఎన్నాళ్లనుండీ? ( కాలు పరీక్షిస్తాడు)
పే: ఆరు నెలల నుండీ డాక్టర్!
డా: మరి ఆలస్యం చేసారేం? కొంచెం ఉన్నప్పుడే చూపిస్తే అవస్థ ఇంత ముదిరిపోకుండా వుండేది. మీ వయసు కూడా అరవై దాటింది కదా! మోకాళ్ల నొప్పులు సహజం!
పే: మా బావమరిదిది కూడా నా వయసే! వాడికే నొప్పులూ లేవు. మా ఇంటి పక్కన మోహన్ ది దాదాపు నా వయసే, తనకు కూడా మోకాళ్లు బాగానే ఉన్నాయి. గిరాగిరా ఇంటికీ, బయటికీ బొంగరంలా తిరుగుతూనే వుంటాడు. మా కొలీగ్ వీరేశం కూడా రిటైర్ అయ్యాక బ్రహ్మాండంగా టూర్లకు వెళ్తున్నాడు. మా ఎదురింట్లో….
డా: ఆగండాగండి, ఓటరు లిస్టులోని అందరి పేర్లూ చెప్పేటట్టున్నారు. మీ బావమరిదికి షుగర్ వుందా?
పే: ఉంది డాక్టర్! మందులేసుకుంటాడు.
డా: మరి, మీ రిపోర్ట్స్ లో చూస్తే మీకు షుగర్ లేదు కదా! మీ ఇంటి పక్క మోహన్ కి, మీ కొలీగ్ వీరేశం కు ఇంకేవో ప్రాబ్లెమ్స్ వుండొచ్చు. మీకు అవి వుండకపోవచ్చు. ఎవరికైనా కొన్ని జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి. కొన్ని లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. కొన్ని ఓల్డ్ ఏజ్ వల్ల వస్తాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో చూడాలి కానీ, వాళ్లకు లేదు, నాకే ఎందుకుంది అనుకోకూడదు.
పే: డాక్టర్! మరి నా కుడి కాలుకీ, ఎడం కాలుకీ ఒకటే ఏజ్ కదా! కుడికాలికే ఎందుకు ఇంత నొప్పి? ఎడం కాలుకేం లేదు.
డా: ( నెత్తి కొట్టుకుంటాడు) ఆ కాలుకు కూడా నొప్పి రావాలనా మీ ఉద్దేశ్యం?
పే: అయ్యో! అలా కాదు డాక్టర్! జస్ట్ అనుమానం…అంతే!
డా: సరే, మీ మోకాళ్లలో కార్టిలైజ్ అనే గుజ్జు అరిగిపోయింది. నేను కొన్ని మందులు రాస్తాను, ఒక నెల రోజులు వాడండి. రిలీఫ్ వస్తుంది. అప్పుడు మళ్లీ టెస్ట్ చేద్దాం. ( పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ రాస్తాడు)
పే: ( అది చూసి) ఆయింట్మెంట్ గానీ, ఏదైనా తైలం గానీ రాసారా డాక్టర్?
డా: ఎందుకు? ఈ టాబ్లెట్స్ వాడండి.
పే: నాకు నొప్పి ఎక్కడుందో టాబ్లెట్ కు ఎట్లా తెలుస్తుంది డాక్టర్? అక్కడికి టాబ్లెట్ ఎట్లా చేరుతుంది? ( ఆ…అంటూ డాక్టర్ నెత్తి కొట్టుకుంటాడు) ఆయింట్మెంట్ అయితే మోకాలి మీదనే రాసుకుంటా గదా!
డా: సరే, మీకు ఏదైనా గాయం అయిందనుకోండి. కళ్ళ నుంచి ఎందుకు కన్నీళ్లు వస్తాయి? దెబ్బ తగిలిందగ్గరి నుండి ఎందుకు రావు చెప్పండి? ఇదీ అంతే! ఆయింట్మెంట్స్ టెంపరరీ రిలీఫ్ కి! అంతే, మీ దగ్గరుంటే వాడండి. ఓ కె ?
పే: సరే డాక్టర్! వస్తాను, హమ్మా….హబ్బా…( అంటూ లేచి వెళ్ళిపోతాడు)
@@@@@@@@

( ఒక జనరల్ ఫిజిషియన్ (మళ్లీ గానీ/ పిల్లలు సరిపోను లేకపోతే మొదటి డాక్టర్ గానీ ) వుంటాడు. ఓ భర్త, భార్య వస్తారు. భార్య చాలా నీరసంగా షాల్ కప్పుకుని దగ్గుతూ వుంటుంది. భర్త కూడా కొంచెం కుంటుతూ వుంటాడు)
డా: చెప్పండి, పేషంట్ ఎవరు ?
పే: తనే డాక్టర్!
డా: సరే…సరే కూర్చోండి. ఏంటి ప్రాబ్లం ?
భ: మొదటినుంచి చెప్పమంటారా డాక్టర్ ?
డా: మొదటి నుంచీ అంటే మీ చిన్నప్పటినుంచీ కాదు, మీకు ప్రస్తుతం ప్రాబ్లం మొదలైనప్పటి నుంచే చెప్పండి. అయినా, మీరు చెప్పండమ్మా!
భార్య: ( సిగ్గు పడుతుంది)
డా: పర్వాలేదు…చెప్పండమ్మా! డాక్టర్ దగ్గర మొహమాటపడితే ఎలా?
భార్య: పది రోజుల క్రితం కడుపులో నొప్పి, బాగా కాన్ స్టిపేషన్ అయింది డాక్టర్ ! మోషన్ ఫ్రీ లేకుండా ఉంది.
డా: పదిరోజుల కింద జరిగింది, అంతేనా? ( పేపర్ మీద రాసుకుంటాడు)
భార్య: ఓ పూట చూసి గోరు వెచ్చని నీళ్ళల్లో త్రిఫలా చూర్ణం వేసుకుని తాగాను డాక్టర్!
డా: మరి సెట్ అయిందా?
భర్త: ( భార్య చెప్పేలోపే) నువ్వాగు, నేను క్లియర్ గా చెప్తాను. నాకు హెల్త్ కేర్ చాలా ఎక్కువ డాక్టర్! నేను వెంటనే తనకు డెల్కోలాక్స్ టాబ్లెట్స్ ఇచ్చాను డాక్టర్ …ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి ! జింటాక్ టాబ్లెట్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి వేసాను. ఇంకా చప్పరించడానికి డైజిన్ టాబ్లెట్స్ ఇచ్చాను.
భార్య: నేను వద్దని చెప్తూనే ఉన్నాను డాక్టర్! అయినా కూడా వేసుకునేదాకా వదల్లేదు.
డా: మరి ఏమైంది?
భార్య: ఆ తరువాత విపరీతమైన లూజ్ మోషన్స్ మొదలయ్యాయి. చాలా బాధపడుతూ కూడా ఈయనకు చెప్పకుండా సరే…తగ్గకపోతుందా అని, మెంతులు పెరుగు వేసుకున్నాను. దాంతో కొంచెం కంట్రోల్ అయింది.
భర్త: నాతో చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను డాక్టర్! నాకు హెల్త్ కేర్ చాలా ఎక్కువ. నాకు అన్నీ తెలుసు కదా, ఏదో తెలియని వాళ్ళయితే వేరు. నేను వెంటనే స్పోర్ లాక్ టాబ్లెట్స్ రెండు, అండియాల్ టాబ్లెట్ ఒకటి చొప్పున రెండు పూటలూ ఇచ్చాను.
డాక్టర్: ఆ…చెప్పండి…ఇంకా చెప్పండి.
భార్య: మోషన్ మొత్తం రాకుండా ఆగిపోయింది డాక్టర్! ఆ మర్నాడు వాంతులు మొదలయ్యాయి.
డా: అయ్యో! మరి అప్పుడేం చేశారు ? మీ వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారా?
భార్య: లేదు డాక్టర్! నేనేదో వంటింట్లో చిట్కా చేస్తే సరిపోతుందని కాస్త జీలకర్ర వేయించి ఓ చెంచాడు తేనెలో కలిపి తిన్నాను డాక్టర్ !
డా: మరి కంట్రోల్ అయిందా?
భార్య : కొంచెం తగ్గింది గానీ, ఈయన ఊరుకుంటారా?
భర్త: నేను అట్లా ఊరుకోను డాక్టర్! ఎవరికైనా సరే బాలేదంటే నేను….
డా: మీరు డాక్టరయి పోతారు..అంతేనా?
భర్త: ( కొంచెం సంతోషపడుతూ) మీకు చెప్పాను కదా, వెంటనే వాంతులు కంట్రోల్ అవడానికి వామిటాబ్ టాబ్లెట్ వేసాను.
డా: మరి కంట్రోల్ అయ్యిందా?
భార్య: రెండు మూడు రోజులు బాగానే ఉంది డాక్టర్ ! ఆ తరువాత కొంచెం జలుబు చేసింది. జలుబే కదా, ఓ రెండు రోజులకు తగ్గిపోతుంది అని నేనేదో తులసి, పుదీనా ఆకులు, మిరియాలు వేసుకొని కషాయం తయారు చేసుకొని తాగాను డాక్టర్!
డా: ఓహో! అప్పుడు ఎలా ఉంది మరి ?
భార్య: కొంచెం తగ్గింది డాక్టర్! అయినా వినలేదు.
భర్త: ఎలా ఊరుకుంటాం డాక్టర్! పాపం..ఒకటే దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం…పెద్ద బాధ, హింస కదా!
భార్య: ఈయన నస ఇంకా చిత్రహింస! అబ్బో!
భర్త: నేను అట్లా ఊరుకోను డాక్టర్ ! వెంటనే కోల్డ్ ఆక్ట్ టాబ్లెట్లు వేశాను. దానితో తగ్గకుంటే కోల్డరిన్ కూడా వేశాను. తలనొప్పి అని బాధపడుతుంటే డార్ట్ టాబ్లెట్ రోజూ రెండు వేశాను.
డా: మీరెందుకు ఊరుకుంటారు లెండి, అర్థమయింది.
భార్య: తలనొప్పే కదాని కొంచెం అమృతాంజనం రాసుకున్నాను డాక్టర్ ! జలుబు మరీ ఎక్కువగా ఉంటే వేడి నీళ్లలో జిందా తిలిస్మాత్ ఆవిరి పట్టాను. కొంచెం బానే ఉంటుందనుకున్నాను. తను ఊరుకుంటేనా?
భర్త: అలా ఎలా ఊరుకుంటాం డాక్టర్ ? ఏదో ఒకటి చేయాలిగా?
భార్య: ఆ మర్నాడు జ్వరం వచ్చింది. నడుం నొప్పి, ఒళ్లంతా నొప్పులు. జ్వరంతో అసలే మాత్రం చేతకాకుండా అయ్యాను. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాను. ‘ఇంత చిన్న దానికి డాక్టర్ ఎందుకు ? ఏం పర్వాలేదులే నేనున్నానుగా’ అని అన్నారు.
భర్త: బాడీపెయిన్స్ కి ఒక బ్రూఫెన్ టాబ్లెట్ ఇచ్చాను డాక్టర్! ఆ తర్వాత కూడా జ్వరం తగ్గలేదు. క్రోసిన్ టాబ్లెట్ వేశాను. పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సరిపోదని డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వేశాను. కొంచెం పర్వాలేదనుకోండి. ఇంతకూ ఈమెకు ఐ బీ ఎస్ అంటారా?
డా: ఐ బీ ఎస్ అని మీరే డిసైడ్ అయ్యారా? ఇంతకూ ఐ బీ ఎస్ అంటే ఏంటి?
భర్త: ఊరుకోండి డాక్టర్! మీకు తెలీదా? ఐ బీ ఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కదా! ఈమెకు అదేననుకుంటా!
డా: మరి దానికి కూడా ట్రీట్ మెంట్ మీరే ఇవ్వకపోయారా?
భార్య: ఇంతలోకి ఈయనకి కూడా జ్వరం వచ్చింది డాక్టర్!
డాక్టర్: అయ్యో! ( వెటకారంగా) అలా రాకూడదే మరి డాక్టర్ గారికి?
భర్త: ( పట్టించుకోకుండా) డాక్టర్! మెడంతా నొప్పి…నేనైతే స్పాండిలైటిస్ కావచ్చుననుకుంటున్నా. సి వన్, సి టూ, సి త్రీ ల్లో గ్యాప్స్ వచ్చి వుండొచ్చా? లేక ఎల్ వన్, ఎల్ టూ, ఎల్ త్రీ నా? విపరీతమైన నడుం నొప్పి…భరించలేకపోతున్నా…కిడ్నీలు వుండేది ఇక్కడే కదా…( వెనుక చూపిస్తూ) రీనల్ ఫెయిల్యూర్ అయి వుండొచ్చా? ఎముకల్లో ఒకటే నొప్పి, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ…అబ్బా! భరించలేని నొప్పి…ఆస్ట్రియో ఫోరోసిస్ కావొచ్చంటారా?
డా: నేనేమీ అన్లేదే! అన్నీ మీరే అంటున్నారు.
భర్త: ఎలాగైనా మీరే ట్రీట్ చేసి నయం చెయ్యాలి డాక్టర్…ప్లీజ్!
డాక్టర్: మీ ఇంట్లోనే చిన్నపాటి మందుల షాపు వుందా ఏంటి?
భర్త: షాపు కాదు డాక్టర్! బేసిక్ మందులన్నీ తెచ్చి పెడతాను.
డాక్టర్: చూడండమ్మా! మీ పతికి అలోపతి, హోమియోపతి, నేచురోపతి..అన్నీ తెలుసు. ఇక మీకేమో వంటింటి చిట్కాలు, ఆయుర్వేదం, యునానీ…ఒకటేమిటి? మీరిద్దరూ డిగ్రీలు లేని డాక్టర్సే! పైగా ఏ పార్ట్ కైనా, ఏ జబ్బుకైనా మీరే ట్రీట్ మెంట్ ఇచ్చుకుంటున్నారు.
అన్నట్టు..( భర్త వైపు తిరిగి) మీకు సర్జరీలు కూడా తెలుసా? అవి కూడా చేసారా ఏవైనా?
భర్త: అయ్యో! లేదు డాక్టర్!
డాక్టర్: రక్షించారు. చిన్న వాటికి చిట్కాలేమో గానీ, ప్రతిదానికీ ఇలా ప్రాబ్లెమ్ ఏంటో లోతుగా పరీక్షించకుండా, టెస్టులో, డయాగ్నోసిసో చేయకుండా ఎడాపెడా మందులు వాడటం వల్ల మీ బాడీ ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కొన్ని సార్లు ప్రాణానికే ముప్పు రావచ్చు కూడా!
భార్య: అయ్యో! నేను చెప్తూనే వున్నాను. వింటేనా?
డాక్టర్: మీ జబ్బు ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ మేనియా! యూ ట్యూబ్ డాక్టర్లు, వాట్సాప్ యూనివర్సిటీలు, దొంగ మందులతో చాలా ప్రమాదం.
భార్య, భర్త: అవునా!
డా: ఏవో రెండు టాబ్లెట్ల పేర్లు తెల్సినంత మాత్రాన చిన్న దానికీ, పెద్ద దానికీ టాబ్లెట్స్ మింగెయ్యొద్దు. వికిపీడియానో, గూగులో చూట్టం, ఏవో లేనిపోనివి ఊహించుకోవడం అస్సలు మంచిది కాదు. మీరే కాదు, చాలా మంది ఇలానే చేస్తుంటారు.( ఆడియన్స్ వైపు తిరిగి) మేము ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుని మెడిసిన్ చదువుతాం. నాలుగేళ్లు మెడిసిన్, ఒక ఏడు హౌస్ సర్జన్ చేసాక గానీ, డాక్టర్లమయ్యాం. మళ్లీ బోలెడంత కష్టపడి పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీటు సంపాదించి పీజీ చేసి, ఫిజిషియన్ గానో, సర్జన్ గానో స్పెషలైజేషన్ చేసి, కొందరమైతే ఇంకా సూపర్ స్పెషలైజేషన్ చేసి,కొన్నాళ్లు అనుభవం గడించి అప్పుడు మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నాం. మీలాగా కన్నూ, కాలూ, కడుపూ అన్నీ ఒక్కళ్ళమే చూడం. మరి, మీకు నయం చేయడానికే మేమున్నప్పుడు మీరే తోచిన మందులు వేసుకోవడం కరెక్టేనా? ఏమంటారు?
భర్త: సారీ డాక్టర్! ఇంకెప్పుడూ అలా చేయం లెండి!!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

“వైట్ డిస్చార్జ్ – స్త్రీలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య”