28)”వంటింటి కుందేలు” అంటే పూర్తి అర్థం తెలుసుకోవాలని ఉందా…?
అయితే ఇప్పుడు చదవండి.
ఆడవాళ్ళని గడప దాటని “వంటింటి కుందేలు” అంటారు.ఎందుకో మీకేమయినా తెలుసా…?!
తెలియకపోతే తెలుసుకుందాం రండి..
“అదొక వంటింటి కుందేలు.ఎప్పుడు అడిగినా,ఎక్కడికీ రానంటుంది.” అని స్నేహితురాళ్లు..
“ఈ వంటింటి కుందేలును మనం మాయమాటల ఉచ్చు వేసి పడదాంరా” అంటూ అమాయక స్త్రీల గురించి పోకిరీలు మాట్లాడుకుంటూ ఉంటారు.
కుందేలు పిరికి జంతువే కాని, దాన్ని ఉచ్చు వేసి పట్టాల్సిందే.చాలా వేగంగా ఎగురుతూ,గెంతుతూ,దూకుతూ పరిగెత్తుతుంది.దొరికిన కుందేలును చెవులు పట్టుకుని లేవదీస్తారు.పరమ సుకుమారమయిన దాని పొట్టను నొక్కితే,అది చచ్చిపోతుంది.కుందేలును పట్టుకున్న వేటగాడు దాన్ని నేలమీద పెట్టి చుట్టూ అరంగుళమెత్తున మట్టికుప్ప వేసినా సరే-ఆ ‘కోటగోడ’ ను దూకి అది పారిపోదు!చిన్నపుల్లతో ఆ మట్టికుప్పలో కాస్త దారి పెడితే చాలు,చెంగున ఎగిరి దూకి,పారిపోతుంది!అది దాని ‘స్వభావం’,’బలహీనత’ కూడా.దొరికిన తరువాత ఏ కాస్త అడ్డున్నా సరే,అది పారిపోదు,పోలేదు.ఇక వంటింట్లో బంధిస్తే,అది తప్పించుకోవటమనే ప్రశ్నే లేదు.అందువల్ల మనకు దొరికిపోయి,తప్పించుకోలేని వ్యక్తిని “వంటింటి కుందేలు” గా వ్యవహరిస్తారు.
ఉద్యోగం, సంపాదన,విడాకులను గురించి ఆలోచనలేవీ లేకుండా,కేవలం వంటమనిషిగా మాత్రమే బ్రతికే ఆడవాళ్ళను అందుకే వంటింటి కుందేళ్లతో పోలుస్తారన్నమాట!
29)”రోకటి పాట”
“అంతసేపటినుంచీ అదే సొద-ఆపు
ఇక నీ రోకటిపాట”
“ఆ రోకటిపాట ఆపితే,నేను నీకో
ముఖ్యమైన విషయం చెప్పాలి”
ఇలాంటి సంభాషణలు పాతకాలంలో ఎక్కువగా వినబడేవి,అమ్మలక్కల
ముచ్చట్ల మధ్య.
గ్రైండర్లు వచ్చిన ఈ కాలంలో వాటిని వాడే సుకుమారులకు ఈ మాటకున్న అర్థం తెలియదు.రోళ్లు రోకళ్ళు కనుమరుగైపోతున్నా,మాటల్లో మాత్రం నిలిచే వుందింకా.రోకలితో దంచే శ్రమను మరిచిపోవటానికి “ఆహూ…ఊహూ..” అంటూ వారు పాటలు పాడేవాళ్ళు.
అయితే,వీటన్నింటి బాణీ ఒకే మోస్తరుగా ఉంటుంది.దంచే పదార్థం మారినా,ఆ వ్యక్తి శరీర సౌష్టవం మారినా,ధోరణి మాత్రం మారదు. లయబద్ధత ఉంటుందిగానీ,అది సణుగుడుగా,ఆయాసంతో సాగుతుంది.
యుగాలు మారుతున్నా,రూపం మారి-ఇంటా,బయటా ఆడవారి శ్రమ అధికమౌతుందే తప్ప, వారి స్థితి మారనట్లు!
చెప్పిందే చెప్తున్నా,ధోరణి మారకపోయినా ‘ఏమిటీ రోకటిపాట’ అనటం అలవాటయింది.ఈ పాట స్త్రీలకు మాత్రమే పరిమితం-‘దంపుడు పని వారిదేగా మరి’!
30)”అడకత్తెరలో పోకచెక్క”
“ఆమె పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా వుంది-అటు భర్తకు,ఇటు కొడుక్కీ నచ్చచెప్పలేక!”
“అటు చేసిన అప్పులు,ఇటు వచ్చిపడే జబ్బులతో అతని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అయింది!”
ఇలా కథల్లోని సంభాషణల్లో ఎక్కువగా చదువుతుంటాం.
పూర్వం పోకలను వక్కలుగా కత్తిరించుకోవడానికి వాడే గృహోపకరణమిది. ఇప్పుటి కాలంలో వివాహ సమయంలో వరుడి చేతిలో పెట్టినప్పుడు మనకు అది కనపడుతుంది.(సంసారంలో రాబోయే కష్టాలకు సూచనగా- తల్లికి,భార్యకు మధ్య నలిగిపోబోయే స్థితికి సూచనగా కాబోలు!అలాగే మెట్టినింటిలో వధువు ఎదుర్కోబోయే పరిస్థితులకు సూచనగా కూడా కావచ్చును!)
ఒకవైపు కలిపివుండే ఈ కత్తెరకు రెండు అంచులూ పదునైనవే. రెండువైపులనుంచీ బాధలూ, ప్రమాదాలూ ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ల పరిస్థితిని అడకత్తెరలో పోకచెక్కతో పోలుస్తారు.
మరికొన్ని జాతీయాల విశేషాలు మరలా తెలుసుకొందాం.
**************
చంద్రకళ.దీకొండ
హైదరాబాద్