సాగర్ సౌదామిని అలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా అలేఖ్య దగ్గర విషయం దాచలేక ఇలా జరిగిందని చెప్పాడు…
ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది సౌదామిని…
” సాగర్! సుధీర్ అన్నయ్య అలాంటివాడు కాదు ఎక్కడైనా పొరపాటు జరిగిందా ఎందుకంటే నా చిన్నప్పటినుండి నేను చూస్తున్నాను.. ఆడవాళ్లు అంటే ఎంతో గౌరవం ..పెద్దలంటే భక్తి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళింట్లో కూడా అందరూ మంచి ప్రవర్తన కలిగిన వాళ్లు, అన్న ఇలా చేస్తాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను” అన్నది సౌదామిని.
” నేను కూడా నమ్మలేక పోతున్నాను సౌ” అన్నాడు సాగర్.
” వాళ్ల మధ్యలో పొరపొచ్చాలు తొలగించాల్సిన బాధ్యత తమ్ముడిగా నీ పైన ఉంది, అలాగని భార్యాభర్తల మధ్య ఎక్కువ కలగజేసుకోవడం కూడా మంచిది కాదు …కానీ దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది! అసలు సమస్య ఎక్కడ మొదలైంది! ఇది నిజమా! కాదా! ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.. అది నీవల్లనే సాధ్యమవుతుంది, కాబట్టి అక్కడే కొన్ని రోజులు ఉండి అలేఖ్య వదినకు సపోర్టుగా ఉండు” అని చెప్పింది సౌదామిని.
” నేను కూడా అదే అనుకుంటున్నాను మరో వారం రోజులు ఇక్కడే ఉంటాను.. కానీ నాకు చాలా పని ఉంది” అన్నాడు సాగర్
” కానీ ఇది ముఖ్యమైన విషయం కదా !ఈ సమస్యకు పరిష్కారం దొరకకుంటే మనం ఇంటిల్లిపాది బాధపడాలి.. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయిన అత్తయ్యకు మామయ్యకు తెలిస్తే వాళ్లు తట్టుకోగలరా ,ఒక్కొక్కసారి ఇలాంటివి అపోహ కూడా కావచ్చు.? పొగ మంచులా తొలగిపోవచ్చు కూడా.. వదిన అనవసరంగా అపార్థం చేసుకుందేమో! అన్ని కోణాల్లో ఒకసారి ఆలోచించి పరిష్కారం చూడు సాగర్” అని చెప్పింది సౌదామిని.
” సరే నేను అలాగే చేస్తాను కానీ నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు.. నేను అలేఖ్య అక్కకు కూడా చెప్పాను ఎవరికీ చెప్పనని కానీ నీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అన్నాడు సాగర్.
” నేనెవరికీ చెప్పను సాగర్ నువ్వు నిశ్చింతగా ఉండు” అని చెప్పి ఫోన్ పెట్టేసింది సౌదామిని.
అసలు సాగర్ కి నిద్ర పట్టలేదు ఈ సమస్యకి పరిష్కారం ఎలా మొదలుపెట్టాలి ఏం చేయాలి అని ఆలోచించాడు…
తెల్లవారి నిద్రలేచిన సాగర్ కి సుధీర్ మరియు అలేఖ్య ఎడమొఖం పెడముఖంగా ఉండడం గమనించాడు..
“గుడ్ మార్నింగ్ అక్కా బావా” అనుకుంటూ వచ్చాడు బయటకు సాగర్
అప్పటివరకు మాట్లాడుకోకుండా ఉన్న అలేఖ్య మరియు సుధీర్ సాగర్ ని చూడగానే లేని నవ్వు ముఖంలో తెచ్చుకొని “రాసాగర్ నువ్వు కూడా బ్రేక్ ఫాస్ట్ చేద్దువు గాని” అని పిలిచారు.
ఇదంతా గమనించిన సాగర్ తను ఏమీ చూడనట్టుగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు…
అప్పటికే తయారైన సుధీర్ ఇడ్లీ తింటున్నాడు…
” రెడీ అయ్యావా బావా! ఒక రెండు రోజులు నాకోసం లీవ్ పెట్టొచ్చు కదా” అన్నాడు సాగర్.
” ఈరోజు కుదరదు సాగర్ చాలా పని ఉంది రేపు ఎల్లుండి లీవ్ పెడతాను” అన్నాడు సుధీర్ ఎప్పటిలా నవ్వుతూ.
” సరే! నువ్వు కూడా ఆఫీస్ కి వెళ్ళాలా!” అన్నాడు సాగర్ అలేఖ్యతో
” వెళ్లడం లేదు సాగర్ పది హేను రోజులు లీవ్ తీసుకున్నాను.. సౌందర్య ఈ మధ్య సరిగా తినడం లేదు అందుకని ఇంట్లోనే ఉంటున్నాను” అన్నది అలేఖ్య సౌందర్యను ఎత్తుకొని.
సాగర్ అలేఖ్య చేతిలో నుండి సౌందర్యని తీసుకొని ఎత్తుకున్నాడు..
” మామా” అంటూ సౌందర్య సాగర్ వెంట తిరుగుతూ ఆడుకుంటుంది..
అలేఖ్య చేతిలో నుండి ప్లేట్ తీసుకొని సౌందర్యకి తానే స్వయంగా ఇడ్లీ తినిపించాడు..
” ఒరేయ్ నువ్వు ఎక్కువగా అలవాటు చేసుకుంటే మళ్లీ నీకోసం బెంగ పెట్టుకుంటుంది” అన్నది అలేఖ్య మురిపెంగా తమ్ముణ్ణి చూస్తూ.
” బెంగ పెట్టుకోవడం ఎందుకు? మనమందరం ఎలాగూ మన ఊరికి వెళ్ళిపోతున్నాం కదా! నేను రోజు చూస్తాను సౌందర్యను” అన్నాడు సాగర్.
” ఏంట్రా నాకు గోపాలపురం పుట్టిల్లు.. నేను మా అత్తవారింట్లో కదా ఉండాలి మొత్తం అక్కడే ఉంటానా ఏంటి! లేదంటే హైదరాబాద్లో ఏదైనా జాబ్ చూసుకుంటాము ” అన్నది అలేఖ్య..
“ఆవిషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ.. అక్కా! సౌందర్య ఎప్పుడు పడుకుంటుంది?” అన్నాడు సాగర్
” ఇప్పుడు పడుకుంటుంది ఒక గంట సేపు చక్కగా పడుకుంటుంది అంతలోపే నేను పనులన్నీ చేసుకుంటాను” అన్నది అలేఖ్య.
” ముందు సౌందర్యనీ పడుకోబెట్టు పనుల విషయం తర్వాత చూద్దాం.. నేను నీకు సహాయం చేస్తాను నీతో నేను మాట్లాడాలి” అన్నాడు సాగర్.
సౌందర్యని పడుకోబెట్టి వచ్చిన అలేఖ్యతో చాలాసేపు సుధీర్ గురించి మాట్లాడాడు సాగర్.. పెళ్లైన ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇలా చేశాడా! అతని ప్రవర్తనలో ఏదైనా తేడా ఉందా! ఇవన్నీ అడిగి తెలుసుకున్నాడు… ఇలా విపులంగా మాట్లాడిన తర్వాత సాగర్ కి ఒక క్లారిటీ వచ్చింది ఇది వాస్తవం కాకపోవచ్చు అని.. ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అర్థం చేసుకున్నాడు ..దీనిని పరిష్కరించడానికి మరొక ప్రణాళిక వేశాడు సాగర్…
సౌదామినికి సాగర్ చెప్పిన విషయం విన్నప్పటి నుండి చాలా ఆందోళనగా ఉంది… అసలు అందులో నిజం ఎంత ఉంది? సుధీర్ అన్నయ్య అలా చేసేవాడేనా! వదిన అపార్థం చేసుకుందేమో! ఇలా ఎడతెగని ఆలోచనలతో సతమతమవసాగింది…
సౌదామిని ఉదయం ఆలస్యంగా లేచింది…
లేచి బయటకు వచ్చిన సౌదామినికి నీలాంబరి తులసి కోటలో నీళ్లు పోస్తూ కనిపించింది…
చిన్నగా నవ్వుతూ నీలాంబరి “ఏంటమ్మా రాత్రి సరిగా పడుకోలేదా నిన్ను ఇంత ఆలస్యంగా లేవడం ఎప్పుడూ చూడలేదు. ఒంట్లో బాగుందా “అని ఆప్యాయంగా అడిగింది
” బాగానే ఉంది అత్తయ్య రాత్రి ఎక్కువసేపు సాగర్ తో మాట్లాడాను అందుకే ఎక్కువసేపు నిద్రపోలేదు” అన్నది నవ్వుతూ సౌదామిని.
” అవునా ఈరోజు బాలసదనం కి నేను కూడా వస్తాను” అన్నది నీలాంబరి.
“అలాగే అత్తయ్య మరి నేను తయారవుతాను” అంటూ స్నానానికి వెళ్ళింది సౌదామిని.
ఇంకా ఉంది