డైనింగ్ టేబుల్ మీద దాదాపు పది గిన్నెలు ఉన్నాయి. అన్ని సైజుల ప్రకారం చక్కగా అమర్చి మూతలు పెట్టి ఉన్నాయి.
ఒక్కొక్కటి మూత తీసి చూడసాగారు నీలాంబరి , సౌదామిని.
మొదటి గిన్నెలో ఆలూ , వంకాయ శాకం కనపడింది.కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర వాసనలు ఘుమఘమలాడుతున్నాయి.
రెండవ గిన్నెలో టమాటో పప్పు. చక్కగా పైన వేసిన పోపుతో ఇంగువ వాసన ఘుమఘమమడుతుంది.
మూడవ గిన్నెలో చారు కనబడింది.
మరొక గిన్నెలో నిమ్మకాయ పులిహోర కనిపించింది.
తర్వాత గిన్నెలో పొట్లకాయ పెరుగు పచ్చడి కనిపించింది.
ఇలా వరుసగా అన్ని గిన్నెలు మూతలు తీసిచూసి ఇద్దరు ముఖాలు చూసుకున్నారు.
” అత్తయ్యా! నిజంగా ఇవన్నీ మామయ్య స్వయంగా వండారా?లేక ఎవరితోనైనా వండించి తీసుకొని వచ్చారా ?అసలు ఇన్ని వంటలు వచ్చా? నాకైతే అర్థం కావడం లేదు” అన్నది.
” నాకు కూడా అనుమానంగానే ఉంది సౌదామిని! అసలు ఏ రోజు వంటింట్లోకి రాని మీ మావయ్య, ఇన్ని వంటలు ఎలా చేశారంటావు? నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి .
“ఏమండీ భూపతి గారు! మీరే వంట చేశారా? లేక ఎవరి చేతనైనా వంట చేయించుకుని తెచ్చారా? వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా?” అని ముసిముసిగా నవ్వుతూ అడిగింది.
” రామ !రామ! మీరు వచ్చేవరకు చక్కగా వంట చేసి పెడదామనీ ,మీరు ఆకలితో ఉంటారని నేను అనుకుంటే మొదటికే మోసం వచ్చిందా? ఎంతో కష్టపడి యూట్యూబ్ ఆన్ చేసుకుని వండాను తెలుసా? అందులో మొదటి నుండి వచ్చే గాయత్రి వంటిల్లు బాగుంటుంది అని నా స్నేహితుల సలహా మేరకు అది ఫాలో అయి చేశాను. ఇంత కష్టపడి వృధా అయిపోయింది” భూపతి చిరుకోపంగా అన్నాడు.
” సరే, సరే బాధపడకండి. మీరే చేశారని ఒప్పుకుంటాము. భోజనం చేద్దాం ఇంకా” అన్నది నీలాంబరి నవ్వుతూ.
ముగ్గురికి కంచాలలో వడ్డించింది సౌదామిని. ఓరకంట భూపతిని చూస్తూ
” నేనైతే నమ్మలేకపోతున్నాను” అన్నది చిలిపిగా.
” ఇలా కాదు నీ సంగతి చెప్తాను సాగర్ కి ఫోన్ చేసి,పెళ్లి కాకముందే నన్ను ఇలా ఏడిపిస్తుంది రా! అని ” అన్నాడు నవ్వుతూ.
” చేయండి చేయండి ఏమంటాడో విందాం” అని ఆమె అన్నది.
అలా ముగ్గురు నవ్వుకుంటూ భోజనం చేశారు. పదార్థాలన్నీ చాలా బాగున్నాయి అని నీలాంబరి, సౌదామిని మెచ్చుకున్నారు.
అక్కడ అలేఖ్య ఇంట్లో సాగర్ వాళ్ళిద్దరిని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వారి మధ్యలో ఉన్న పొరపొచ్చాలు తొలగించడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు.
తెల్లవారి సెలవు పెట్టుకుని ఇంట్లోనే ఉన్న సుధీర్ తో.
” బావా! ఈరోజు మనం నలుగురం బయటకు వెళ్దాం చాలా రోజులైంది ఎక్కడికి వెళ్లాక” అన్నాడు సాగర్.
” నేను ముందే ప్లాన్ చేశాను సాగర్ !ఇక్కడికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కి వెళ్దాము. అక్కడ పరిసరాలు కూడా చాలా బాగుంటాయి . దూరం ప్రయాణం పెట్టుకుంటే సౌందర్యలహరితో కష్టం కదా! అందుకే దగ్గర ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాను” అన్నాడు.
” అక్కకు తెలుసా బావా ఈ విషయం?” అన్నాడు సాగర్.
అక్కడే ఉన్న అలేఖ్య వెంటనే..
” చెప్పాడురా! ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసాము. పాపతో కష్టం కదా! అందుకే దగ్గరలో ఉన్న ప్రదేశానికి వెళదాం అని నేనే చెప్పాను” అన్నది.
విషయం సాగర్ గ్రహించాడు. అక్కతో చెప్పలేదు అనే విషయం అతనికి తెలిసిపోయింది. కప్పిపుచ్చుకోవడానికి అలేఖ్య అలా మాట్లాడిందని అర్థం చేసుకున్నాడు.
* * *
నలుగురు కలిసి జలపాతం చూడడానికి వెళ్లారు.
అక్కడ ఉన్న సుందర దృశ్యాలను తిలకిస్తూ మనసులో ఉన్న వేదన మరిచిపోయారు సుధీర్ , అలేఖ్య.
సౌందర్యని ఎత్తుకొని అక్క బావని గమనిస్తూ తాను కూడా ఆ ప్రదేశాలను చూస్తున్నాడు. ఒకసారి సౌదామినికి వీడియో కాల్ చేసి ఆసుందర దృశ్యాలను చూపించాడు. అప్పుడే అలేఖ్య, సుధీర్ తో కూడా మాట్లాడింది సౌదామినీ.
కొంత దూరం తిరిగాక అలేఖ్య అడిగింది,
” సౌందర్యకి ఆకలేస్తుంది ఎక్కడైనా కూర్చుని దీనికి తినిపిస్తాను” అన్నది.
” సరే అక్కా! ఆ దూరంగా కూర్చోవడానికి ప్లేస్ చాలా బాగుంది. పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. మనం కాఫీ తాగి సౌందర్య కి తినిపిద్దాం” అని సాగర్ అన్నాడు.
నలుగురు ఆప్రదేశానికి వెళ్లి కూర్చున్నారు.
అలేఖ్య ఇంటి నుండి తెచ్చిన ఆహారాన్ని సౌందర్యకు తినిపించ సాగింది .అక్కడే ఉన్న సుధీర్ ఆమెకు సహాయం చేస్తూ అక్కడే కూర్చున్నాడు.
ఇద్దరి ముఖాలు బాధతో వాడిపోయినట్లుగా ఉన్నాయి.
” అక్కా! నువ్వు సౌందర్యకు తినిపిస్తూ ఉండు. నేనూ ,బావ ఈపక్కన ఏవో చిన్న చిన్న మాల్స్ ఉన్నట్లున్నాయి. ఏవైనా అవసరం ఉంటే తీసుకుని వస్తాము” అన్నాడు.
“తొందరగా వచ్చేయండి సౌందర్యను ఒక్కదాన్ని మ్యానేజ్ చేయడం నావల్ల కాదు” అన్నది అలేఖ్య.
” తొందరగానే వస్తాము” అని ఇద్దరు కొంచెం దూరంగా వెళ్లి ఒక ప్రదేశం వద్ద ఆగారు.
” బావా! ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చుందామా! నీతో మాట్లాడాలి” అన్నాడు సాగర్.
విషయం అర్థం చేసుకున్న సుధీర్ “సరే” అంటూ అక్కడ వెళ్లి కూర్చున్నాడు.
“ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు బావా! మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఇన్నాళ్లు ఉన్నారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు . మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. మీరిద్దరూ మంచి భావాలు కల వ్యక్తులు. కానీ మీ మధ్య ఇలా అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయో చెప్తారా”? అన్నాడు సాగర్ బాధగా.
” నేను కూడా నాబాధను నీకు చెప్పుకోవాలని అనుకుంటున్నాను సాగర్!”
అంటూ ఒక్క క్షణం ఊపిరి గట్టిగా పీల్చి చెప్పడం మొదలుపెట్టాడు.
” అలేఖ్య నన్ను అపార్థం చేసుకుంది. అదే నాకు చాలా బాధగా ఉంది. ఎంతో సాంకేతిక విజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఫోటోల మార్ఫింగ్ ఎంతసేపు! ఆమాత్రం తనకు అర్థం కాలేదా”? అన్నాడు .
” ఏ విషయం గురించి” అన్నాడు సాగర్.
” లండన్ నుండి ఒక అమ్మాయి మా కంపెనీలో జాయిన్ అయింది. వచ్చినప్పటినుండి ఆ అమ్మాయి ప్రవర్తన అదోరకంగా ఉంది .ఎప్పుడు చూసినా నాతో ఆమె ప్రవర్తన అతిగా ఉండేది. నేను ఎక్కడ నిలబడ్డా చేతులు తాకించడము, భుజం మీద చేతులు వేయడం, ఇలాంటి పిచ్చి పనులు ఎన్నో చేసేది .అయితే అవన్నీ ఫొటోస్ తీసుకుంటుందని నాకు తెలియదు. నేను ఎంత ఆమెను నిరాకరించినా కూడా మరీ మరీ పిచ్చిగా ప్రవర్తించేది.l. అలా ఒకసారి మాటీం తో మేము టూర్ వెళ్ళాము .వెళ్ళినప్పుడు చాలా అసహ్యంగా ప్రవర్తించింది. సంస్కారం ఉన్న నేను ఆమెను గట్టిగా మందలించలేకపోయాను.,కానీ చివరగా ఆమెకు అర్థం అయ్యేటట్లుగా చెప్పాను. నాకు పెళ్లి జరిగింది పాప కూడా ఉంది ,నువ్వు ఇలా ప్రవర్తించకూడదు !అని అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు ,ఇవన్నీ కావాలని చేస్తుంది అని నాకు అర్థం కాలేదు .ఇలా అన్ని నాతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని టెక్నాలజీ ఉపయోగించి మరింత దరిద్రంగా తయారు చేసి అన్నింటిని అలేఖ్యకు పంపించింది అలేఖ్య ఫోన్ నెంబర్ ఎలా తీసుకుందో నాకు అర్థం కాలేదు. ఇవి చూసిన అలేఖ్య నన్ను అడగవచ్చు కదా? ఏం జరిగింది అని? అలా అడగకుండా నన్ను విపరీతంగా అవమానించి నీక్యారెక్టర్ ఇలాంటిదా !అంటూ నాపైన అసహ్యం చూపించడం నాకు చాలా బాధ కలిగింది. నేను ఎలాంటి వాడినో తనకు తెలియదా !ఒక్క మాట “ఏం జరిగింది “అని అడిగితే నేను అంతా వివరించేవాడిని. కానీ అంత సమయం నాకు ఇవ్వలేదు.అందుకని మాట మాట పెరిగి నేను కూడా కొన్ని మాటలు మొండిగానే మాట్లాడాను. కానీ కొంచెం సమయం తీసుకుని నేను అలేఖ్యకి విషయం చెప్పాల్సి ఉండేది .అలా జరిగితే ఇన్ని అపార్ధాలు వచ్చేవి కావేమో! ఇందులో నాపొరపాటు కూడా ఉంది సాగర్ !ఎందుకో నేను ఇలాంటి పని చేశానని. అలేఖ్య నమ్మడం నాకు నచ్చలేదు. మనసుని ఆ మాట కాల్చేస్తుంది .నువ్వు చెప్పు సాగర్ నన్నేం చేయమంటావో” అన్నాడు సుధీర్.
” ఇంత చిన్న విషయానికి కంగారు ఎందుకు బావా! నువ్వేంటో మాకు అందరికీ తెలుసు. నిజానికి అక్కకి కూడా తెలుసు. కానీ నీమీద ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల భరించలేకపోయింది. నిన్ను అడిగితే అదే నిజమైతే అనే సందేహం తనను పీడించింది? అందుకే తాను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ కుమిలిపోతుంది. నేను అక్కకు చెప్తాను.మీరు బాధపడకండి మీ ఇద్దరి విషయం ఇటు మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కాని తెలిస్తే చాలా బాధపడతారు.
” సరే! బావా! అక్కడ అక్క ఒక్కతి సౌందర్యని చూసుకోవడం కష్టం. పద వెళ్దాం” అన్నాడు సాగర్.
మరి కాసేపు కొన్ని ప్రదేశాలను చూసి ఇంటికి బయలుదేరారు.
సుధీర్ తెల్లవారి ఆఫీసులో పని ఉంది అని వెళ్ళిపోయాడు.
సుధీర్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక అలేఖ్య పాపను బేబీ క్రష్లో వదిలేసి వచ్చింది.
తాను కూడా ఆఫీసుకు మరో రెండు రోజుల్లో వెళ్లాలని నిర్ణయించుకుంది.
” అక్కా,! ఇలా వస్తావా! నేను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతాను నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు .
ఇద్దరికీ కప్పుల్లో కాఫీ పోసుకొని వచ్చి కూర్చుంది .
” నేను కాఫీ చేస్తే నీకు ఇష్టం కదా” అంటూ కప్పు చేతికిచ్చింది.
” అవును” అంటూ కప్పు చేతికి తీసుకున్నాడు.
“అక్కా! నువ్వుబావని పొరపాటుగా అర్థం చేసుకున్నావు. అయినా నీకు బావ గురించి తెలుసు కదా! అతను ఎలాంటి వాడో? ఇంత అపార్థం ఎలా చేసుకున్నావు?”అని అడిగాడు.
ఆమె కళ్ళనీళ్ళతో తలపైకెత్తి చూసింది .
‘ బావతో మాట్లాడాను. అతను చెప్పింది విని నాకు బాధ అనిపించింది” అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు.
ఒక్కసారిగా అలేఖ్య పశ్చాత్తా భావంతో గట్టిగా ఏడ్చేసింది.
అలేఖ్యను దగ్గర తీసుకొని సాగర్ “నీ విషయంలో నువ్వు చేసింది తప్పేం కాదులే ఆడపిల్లలకు ఎవరికైనా ఇలాంటివి జీర్ణించుకోవడం కష్టం కదా !నీకు బావ మీద ఉన్న ప్రేమతో ఇలా ప్రవర్తించావు. ఇక మీమధ్య ఎప్పుడూ ఇలాంటి డిఫరెన్స్ రావు సంతోషంగా ఉండండి అక్కా” అని చెప్పాడు.
ఆరోజు సాయంత్రం ఫ్లైట్ కి సాగర్ వెళ్లిపోయాడు..
ఇంటికి వచ్చిన సుధీర్ కి అలేఖ్య నవ్వుతూ కనిపించింది. తనకు ఇష్టమైన చీర కట్టుకొని తయారుగా ఉంది. ఒక్కసారి సుధీర్ మనసులో బాధ అంతా తీసేసినట్లుగా అయ్యింది.
లోపలికి వెళ్లి అలేఖ్య గ్లాస్ లో మంచినీళ్లు మరో చేతిలో జ్యూస్ తీసుకుని వచ్చింది.
సౌందర్యని ఎత్తుకొని ముద్దాడుతున్న సుధీర్ పక్కన వచ్చి కూర్చుంది.
అతని భుజం మీద తల వాల్చి” ఐ యాం సారీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను” అన్నది కళ్ళ నీళ్లు పెడుతూ.
” లేఖా! ఆ టాపిక్ మళ్ళీ మనం గుర్తు చేసుకోవద్దు. వదిలేసేయ్ సాగర్ వచ్చి మంచి పనే చేశాడు. మన మధ్యలో ఇలాంటి అపార్థం మరెప్పుడు రాకూడదు” అని అలేఖ్య భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు.
నవ్వుతూ సౌందర్యలహరి వచ్చి వీళ్ళిద్దరినీ చుట్టేసుకుంది. గోడ మీద ఫోటోలో ఉన్న గువ్వల జంట ” ఇన్నాళ్ళకి వీళ్లిద్దరూ ముచ్చటగా ఉన్నారు” అని అనుకున్నాయి.