ధర్మాచార్యులు

రేపటి తరానికి చదువుల
సారాన్ని బోధిస్తూ
బతుకుదెరువుకు బాటలు వేసే దిశా నిర్దేశకులు
అజ్ఞానపు చీకటిలో చిక్కిన
అంతేవాసిలో
సంస్కార సురభిళాలద్ది
జాతి రత్నాలుగా మార్చే శిక్షణాదక్షులు

పాఠాలలో జీవిత పాఠాలను రంగరించి
మంచీచెడుల మర్మాన్ని విప్పిచెప్పి విజ్ఞతను నేర్పే వర్ణప్రవక్తలు

ఎంతటి మేధావికైనా తొలి పాఠాలు నేర్పేది గురువని మరువకు

నైతిక విలువలు నేర్పాల్సిన గురువులే నైచ్యానికి చిరునామాగా నిలిచి
వెకిలి చేష్టలు వింత పోకడలతో భావి జీవితాలతో చెడుగుడాడుతూ గందరగోళంలో పడేసి
మొగ్గ తొడిగే అరవిందాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేస్తుంటే
మద్యంమత్తులో జోగుతూ చదువులమ్మ వాటికను అపవిత్రంపాలు చేస్తుంటే
ఆచార్యుల అడుగుజాడలే శిరోధార్యమన్న అభ్యాసకులను అయోమయంలో కి నెట్టొద్దు

అక్షరాలను శ్వాసిస్తూ జ్ఞానోపాసనతో కాంతులీనే
పుంభావ సరస్వతులున్న
భూమిఇది
గురువును బ్రహ్మను చేసి విద్యాపీఠంపై నిలిపిన
సంస్కృతి మనది
గురువు గుర్తొచ్చినంతనే
అసంకల్పితంగా ముడుచుకునే చేతులు సిరిజోతలై అలరించాలి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీలి మేఘం. నిరంతర యజ్ఞం..!

* ఉపాధ్యాయిని -ఉపాధ్యాయులే విద్యారథానికి చక్రధారులు*