నదీమతల్లి -6వ భాగం

జరిగిన కథ

కృష్ణమోహన్  కి తనకి వయసులో చాలా వ్యత్యాసం ఉందని భర్త రిటైర్మెంట్ కి పిల్లల చదువులు కూడా పూర్తి కావాలని గ్రహించిన రాధ కష్టపడి ప్రైవేటుగాబి.ఎ అటుపిమ్మట బి.ఎడ్.  చేసి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో టీచరుగా చేరింది. పట్టుదలతో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకులో ఆఫీసరుగా చేరింది. కృష్ణమోహన్ రిటైర్మెంట్ తర్వాత ప్రణవ్ మొండివైఖరి కుటుంబంలో అశాంతి రేపింది.ఇంటి పరిస్థితులు తారుమారయ్యాయి. కృష్ణమోహన్ ఆకస్మాత్తుగా హృద్రోగంతో  మరణిస్తాడు. రాధా భర్త మరణంతో కృంగిపోకుండా ధైర్యంతో ఉన్నది అంతా ఖర్చు పెట్టి రాగిణి కి పెళ్లి చేస్తుంది. పెళ్లయిన తర్వాత రాగిణి ని అత్త వారు తీసుకెళ్లకుండా  జాప్యం చేయటంతో మంచి రోజు చూసి రాగిణి ని అత్తవారింట్లో దింపుతుంది రాధ. రాగిణి ని దింపటానికి రాధ  అన్నవదినలను తీసుకెళ్తుంది. కొడుకు ఊళ్లో లేడని వియ్యపురాలు చెప్పటంతో రాధ,రాగిణి  నిరాశపడతారు. అయితే రాధ వదిన గదిలో రాగిణి భర్తని చూశానని  ఉన్నా లేనట్టు  అబద్ధం  ఎందుకు చెప్పాల్సింది వచ్చిందోనని అనుమానం వ్యక్తం చేస్తుంది.  

ఇక చదవండి…

బిజినెస్ ఏంచేయాలి?ఏ బేంక్లో లోన్ దొరుకుతుంది?ఎవరిని కలవాలి? అనే ధ్యాసలో ఉన్నాడు ప్రణవ్. పెద్దమ్మ జయలక్ష్మి ఇద్దరు కొడుకులు బెంగుళూరులో బిజినెస్లో ఉండటంతో అప్పుడప్పుడూ సలహా గురించి వెళ్ళివస్తూ ఉండేవాడు.

జయలక్ష్మికి ప్రణవ్ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన తెలిసి ఉండటంతో, ప్రణవ్ వచ్చినప్పుడల్లా బ్రయిన్
వాష్చేసేది.కుక్కతోక వంకర అన్నదానికి చక్కని తార్కాణం ప్రణవ్.

జయలక్ష్మి కొడుకులు రోహన్ ,రోహిత్ లు ప్రణవ్ కంటే ఆరేడేళ్ళు పెద్దవాళ్ళు.వాళ్ళకి చెల్లెలు లేకపోవటంతో రాగిణి అంటే స్వంత చెల్లెలు లాగునే ఉండేవాళ్ళు.రాగిణి ‘ అమ్మా’ అని అనంగానే ఏమైంది చెల్లీ అంటూ వచ్చేవాళ్ళు.వారికి పదేళ్ళ ప్రాయంలోనే రాగిణి పుట్టటం,రబ్బరుబొమ్మలా ఉండే రాగిణిని తాతగారింటికొచ్చినప్పుడు ఎత్తుకుని దింపేవాళ్ళుకాదు.

తండ్రి పోయినతరువాత తరచూ బెంగుళూరు వెళ్ళేది రాగిణి. పెదనాన్న చంద్రమోహన్ కూడా రాగిణిని తండ్రి తరువాత తండ్రిలా ఆప్యాయంగా చూసుకునేవాడు.
రాగిణి పెళ్ళయ్యాక అత్తగారు తీసికెళ్ళలేదని అందరూ చాలా ఆందోళన పడేవారు.

“అమ్మూకి ఏమంత వయసుందని ఉందని పెళ్ళి చేసారు? పిన్నికి చిన్నవయసులోనే పెళ్ళి చేయటం వలనే కదా ఎన్నెన్ని కష్టాలు పడుతోంది.అన్నీతెలిసి మళ్లీ అమ్మూకి చిన్నవయసులో పెళ్ళిచేసారు.” అంటూ తల్లి తో పోట్లాడేవారు రోహన్ రోహిత్ లు. వారికున్నంత ఆలోచన ప్రణవ్ కి లేదు.
కృష్ణమోహన్ పోయినతరువాత అక్క బావే పెద్ద దిక్కయ్యారు రాధకి.వారి సలహా సంప్రదింపు లేకుండా అడుగు వేయటం మానేసిందిరాధ. ★★★

రాగిణిని అత్తారింటిలో దింపి పది రోజులైంది. ఎలాఉందో తెలియదు రాధఫోన్చేస్తే మ్రోగుతుంది.ఎవరూ ఎత్తరు.వెళ్ళాలంటే మరీ పది రోజులకే వెళ్తే ఏమనుకుంటారో. ఏమో అన్న సంశయం.ఏదైతే అదయిందని వాళ్ళ ఇంటిదగ్గరుండే తనకు సన్నిహితుడైన క్లర్క్ రామారావు తన బ్రాంచ్ లో ఉండటంతో అతని ద్వారా పళ్ళుస్వీట్స్ ఇచ్చిపంపింది రాధ అమ్ము ఎలాఉందో తెలిసి కోవటానికని.అందరికీ రాగిణిపెళ్ళి రాధకష్టాలు తెలిసినవే.అర్ధం చేసుకుని రామారావు “అలాగే మేడం!సాయంత్రం మనింటికి వచ్చిమాట్లాడుతాను.” అంటూ రాధ ఇచ్చిన బేగ్ తీసుకున్నాడు.
‘హమ్మయ్య! ‘అనుకుంది రాధ.పనిచేస్తోందికానీ మనసు మనసులో లేదు.
‘పిల్లవాడు బాగున్నాడు చదువుకున్నాడు.వాళ్ళది విజయనగరం అవటంతో పెద్ద వివరాలు తెలియలేదు.గోత్రం కలిసింది.జాతకాలు పెద్దపట్టింపులేకపోవటంతో అన్నలూ, అక్క’ వదినలూ పెద్దలందరూ ఆమోదించారు.

ప్రణవ్ ప్రవర్తన బాధించడంతోఎలాఅయిన కూతుర్ని సేఫ్ గా ఒక అయ్యచేతిలో పెట్టాలనుకుంది. చూపులప్పుడుగాని పెళ్ళిలోగాని ఎటువంటి అనుమానం రాలేదు.’ అని ఆలోచిస్తూ సాయంత్రం ఎప్పుడవుతుందా!ఎంతతొందరగా ఇంటికెళ్ళాలా అని ఆలోచిస్తూగడిపింది.

సాయంత్రం ఐదుగంటలనుండి ప్రతి నిమిషం వాకిలివైపు చూస్తూ ఉంది. పోయిన భర్తగురించి ఆలోచించి కంటినిండా కన్నీళ్ళుకార్చడానికి కూడా టైముండటంల్లేదు.బ్రాంచిలో లోన్ సెక్షన్కి అసిస్టెంట్ మేనేజరవటంతో బాధ్యతలు రెట్టింపయ్యాయి.
ఎంతకష్టంలోనైనా మనఃపూర్తిగా నవ్వగల వరం రాధది.అందుకే ఎవరూ ఆమెకన్ని కష్టాలున్నాయంటే నమ్మరు.రాధ ఎక్కడుంటే అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళని నవ్విస్తూ ఎంతోమృదువుగా అవతలివాళ్ళని నొప్పించకుండా పని చేయించుకుంటుంది.అందుకే స్టాఫ్ అందరికీ రాధ అంటే చాలా గౌరవం.ఇష్టం.రాధ డైనమిక్ పర్శనాలిటీ యూత్ స్టాఫ్ కు ఆదర్శం.

రాధ ఆలోచనల్లో ‘మేడం’ అన్నపిలుపుకి ఉలిక్కి
పడింది.
“రండి రామారావుగారూ!”అంటూ ఆహ్వానించింది.

“ఏమిటి మేడమ్ ! లేటుగా వచ్చారా !బ్యాంకు నించీ.”అంటూ సోఫా లో కూర్చున్నాడు రామారావు.

“ఎందుకలా అడుగుతున్నారు?”అంటూ తనని తనుచూసుకుంది.
చెప్పుల స్టేండ్ లో వదలాల్సిన చెప్పులు కాళ్ళకలాగే ఉన్నాయి.
డ్రైవింగప్పుడు చేతికి వేసుకున్న గ్లోవ్స్ అలానే ఉన్నాయి.
హెల్మెట్ వళ్ళో ఉంది.
నవ్వుకుంది.

ఓ!”అదాఅండీ! ఏమిటో అమ్మూ గురించిఆలోచిస్తూ అలా కూర్చుండి పోయానండీ!”అంటూ నవ్వింది రాధ.

“టీ ఆర్ కాఫీ రామారావుగారూ!”అందిరాధ.

“కాఫీ మేడమ్.సాధారణంగా సాయంత్రాలు టీ తీసుకుంటా. కానీ మీకాఫీ చాలా బాగుంటుంది.” అంటూ నవ్వాడు.

ఫైవ్ మనిట్స్ అంటూ చెప్పులు,గ్లోవ్స్, హెల్మెట్ చెప్పుల స్టాండ్ దగ్గిర పెట్టి వంటింట్లోకి వెళ్ళింది.52

ఇల్లంతా కలయ చూస్తున్నరామారావు ముగ్ధుడయ్యాడు. ప్రతీ చిన్నవస్తువు అది ఉండాల్సిన ప్రదేశంలోఅందంగా అమర్చబడి ఉంది.

ఒకచిన్నకార్వింగ్ టేబిల్ మీద కృష్ణమోహన్ ఫొటోకి ఫ్రెష్ పూలదండ ,అటూ ఇటూ ఫ్లవర్వేజ్లో తెల్లటి కాగితంపూలు.రోజూ ధూపం దీపం పెట్తున్నదానికి చిహ్నంగా కాలిపోయిన అగరుబత్తి.ఆరిపోయిన దీపం.
కిటికీలకి అందమైన కర్టెన్లు.ఒక సోఫాలో మనిషెత్తు టెడ్డీబేర్.బహుశా రాగిణి చిన్నప్పటిది అయిఉండవచ్చు.
డైనింగ్ టేబిల్ మీద ఫ్రష్ ష్లవర్వేజ్,సాల్ట్,పెప్పర్ పిక్కిల్స్ జార్ ఎంతోనీట్ గా అమర్చి ఉన్నాయి. అన్నిటికంటే రామారావుని ఆకట్టుకున్నది ఒకటి వాళ్ళఫామిలీఫొటో ,రెండోది రాళ్ళు పొదిగిన వెంకటేశ్వరస్వామి.ఎంతపొందికగా ఉందో ఇల్లు.ఇంటినిచూసి ఇల్లాలిని చూడమన్న సామెత అందుకే వచ్చిందేమో అనుకున్నాడు రామారావు. ఇంతలో వేడి వేడి కాఫీతో వచ్చింది రాధ.

“ఆఁ చెప్పండి” కాఫీ అందిస్తూ ఇక ఆతురుత ఆపుకోలేక అడిగింది రాధ.

ఒక్కనిమిషం మౌనంగా ఉన్నాడు రామారావు.
“అమ్మూని చూసారా?ఎలాఉంది? “అంటూ రామారావు మొహంలోకి చూస్తూ అడిగింది.

“మనకి తగిన సంబంధం కాదు మేడమ్.అమ్మూని కలవనివ్వలేదు.వాళ్ళత్తగారే మీరిచ్చిన బేగ్ తీసుకుని థేంక్స్ అని తలుపు వేసేసింది.ఒక్కమాట మాట్లాడలేదు.కనీసం మంచినీళ్ళుకూడా అడగలేదు.ఇంకేం చెప్పను.”అన్నాడు రామారావు.

విస్తుపోయింది రాధ.
“వెళ్ళొస్తా మేడమ్. ఎందుకయినా మంచిది మీబ్రదర్స్ పోలీస్ డిపార్టమెంట్లో ఉన్నారుకదా!వారికి ఇమ్మీడియట్ గా ఇన్ఫామ్ చేయండి.వస్తాను.సెలవు.”
అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు.

‘కడుపులో బాధ చెప్పుకునేందుకు అమ్మా! అనే కూతురు సంగతే తెలియటంలేదు.ఇంటికి పెద్దకొడుకయిఉండి ‘అమ్మా ‘అంటూ దగ్గరకు రావడం మానేసాడు.
‘ఇక జ్యోత్స్నకే ఫోన్చేయాలి.’అనుకుంటూ జ్యోత్స్న కి ఫోన్ చేసింది.
“హలో రాధా! హౌ ఆర్ యు? అమ్మూ ఎలాఉంది.” అని అడిగింది.జ్యోత్స్న.
“అమ్మూ సంగతే జ్యోత్స్నా!” అంటూ జరిగిందంతా చెప్పింది.
ఓ!అలాగా నేనిప్పుడే విజయవాడ వెళ్తున్నా కేస్ పనిమీద.రెండు మూడురోజుల్లో వచ్చేస్తా!తేడా మనుషులనుకుంటా!మన అమ్మూకి ఏంకాదు. ధైర్యంగా ఉండు.”అంది జ్యోత్స్న.

“హుఁ ధైర్యం.అధైర్యపడిచేయగలచిందేముంది.” అనుకుంది.ఆరాత్రంతా నిద్రపట్టక పిచ్చిదానిలా సీలింగ్ కేసి చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.
★★★
‘దబదబా తలుపు చప్పుడు,కాలింగ్బెల్ చప్పడూ ఒకదాని వెంట ఒకటి వినిపించటంతో కళ్ళు తెరిచి టైము చూసింది.రాత్రి రెండుగంటలు దాటుతోంది. తలతిరుగుతోంది .చీరమార్చుకోలేదు.రామారావుతో తాగిన కాఫీ తప్ప ఏమీతినకుండా అలానే పడుకుందిముందు మంచినీళ్ళు తాగింది.ఇంతలో మళ్ళా తలుపుబాదిన చప్పుడు.టైములో ఎవరైఉంటారు బహుశా ప్రణవ్ బెంగుళూరు నుంచీ వచ్చుంటాడనుకొని ఎందుకైనా.మంచిదనుకొని ప్రక్క కిటికీ తెరిచి చూసింది.ప్రణవ్ కాదు చీకట్లో ఆకారం తెలియటంలేదు.ఎవరూ ?”గదమాయించింది రాధ.

“అమ్మా!నేను …నేను అమ్మూని.”
ఒక్కక్షణం ఆలోచించకుండా తలుపు తీసింది రాధ.

పులి పంజాని తప్పించుకొచ్చిన లేడి పిల్లలా భీతహరిణేక్షణయై ఎదురుగా ఉంది.గుండెలెగసి పడుతున్నాయి.
రెండుచేతులు చాచింది రాధ.గుండెలమీద పడి రోదించింది రాగిణి.
“అమ్మూ! అమ్మదగ్గర ఉన్నావురా!దా లోపలికి.”అని పొదివి పట్టకుని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
గబగబా హార్లిక్స్ కలిపి తెచ్చింది.

“ముందు హార్లిక్స్ తాగు.అంటూ హార్లిక్స్ బిస్కట్స్ ఇచ్చింది.అమ్మ ఉంది.నీకేంకాదు.అంటూ అక్కున చేర్చుకుంది.” రాధ.

తల్లివడిలో సేద తీరిన రాగిణి కి తను క్షేమం అనే ఆస్వాదన వచ్చింది.జరిగింది చెప్పింది.
అమ్మా! ఆరోజు మామ అత్త నువ్వు నన్ను దింపినప్పుడు అతను లోపలే ఉన్నాడమ్మా!
మీరెళ్ళంగానె నన్ను సోఫాలో కూచోమంది.ఆరాత్రి తినటానికి ఏదోపెట్టి సోఫాపక్కనే చాప వేసి పడుకోమంది.నేను మావారి గురించి అడిగాను.
“అంత మదపిచ్చా మీ అమ్మకి నీకు.మేం ముహూర్తం పెట్టి చెప్తాంఅంటే బుడబుడమంటూ తీసుకొచ్చి దింపారు.నేను చెప్పెదాక మావాడు నిన్ను కలవడు మాట్లాడడు.బయటకెళ్ళి చెప్పావంటే నాఅంత చెడ్డది ఎవరూ ఉండరు.”అంటూ వెళ్ళిపోయిందిమా అత్తగారు.

రాధ గుండె నెమ్మదిగా కొట్టుకుంటోంది.వెంటనే రాగిణికి తెలియకుండా ఫోన్లో రికార్డరు ఆన్ చేసింది.
కొంచెం ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది.
అమ్మా! టైముకి తినటానికి పిలిచేది.వంటింట్లోకి వెళ్ళి ఏదైనా పనిచేయబోతే విదిలించేది.
మా మామగారు మాత్రం నీకెందుకమ్మా ఈవంట పెంట.కొత్తపెళ్ళికూతురివి.హాయిగా కూర్చొన టి.వి చూడు.అంటూ ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు పెట్టి నా పక్కనే కూర్చునేవారు.రాను రాను ఆయన ప్రవర్తన
చాలాఅసభ్యకరంగా ఉండేది.
మా ఆయన కనబడట్టేకనబడి మాయమయ్యేవారు.

ఒకరోజు మా అత్తగారు పడుకున్నప్పుడు ఆయన గదిలోకి అడుగుపెట్టా!ఆయన సీరియస్గా పనిచేసుకుంటున్నారు.నన్ను చూడంగానే వణికిపోతూ,”అమ్మా!నాన్నా!” అంటూ గట్టిగా కేకలు పట్టారు.నేను ఆయన నోరు చేతులతో మూసి,”మీతో మాట్లాడాలి “అన్నా!
ఈ లోగా ఆయన అరచిన అరుపుకి మా అత్త,మామ వచ్చారు.నన్ను చూడంగానే ఇంతెత్తు లేచారు.
“సిగ్గులేనిదానా ఎంతకు బరితెగించావు.” అన్నారు.
నేను ఉక్రోషంతో సిగ్గెందుకండీ నాభర్త తో మాట్లాడటానికి అన్నా!”అతే అంటూ భయంకరంగా ఏడుస్తూ, వెక్కిళ్ళమధ్య
‘అమ్మా నువ్వుకాని,నాన్నకాని నన్ను ఒక చిన్న దెబ్బ వేయలెదమ్మా’ కానీ ఆరోజున వాళ్ళు నన్ను గొడ్డును బాదినట్టు బాదారమ్మా!నన్ను ఈడ్చుకెళ్ళి గదిలో పడేసి తాళం వేసారు.అన్నం మాత్రం తలుపు తెరిచిపెట్టి మళ్ళీ తలుపు తాళం వేసేవారు.
నిన్న మా అత్తగారు బయటకు వెళ్ళినప్పుడు మా మామగారు తాళంతీసి లోపలికి వచ్చారు.

“ఎందుకమ్మా మీ అత్త చెప్పినట్లువిను. నిన్ను నీ అందం చూస్తుంటే జాలి వేస్తోంది. మావాడు సంసారానికి పనికిరాడు.వాడీ పెళ్ళి చేసుకోన్నాడు.మేము విజయనగరం నించీ ఇక్కడికి పచ్చిందే వాడి గురించి ఎవరికీ తెలియగూడదని.బంధువులందరూ పెళ్ళిచేయరా మీ అబ్బాయికి అంటే ఈసంగతి చెప్తే పరువు పోతుందని మీసంబంధం కుదుర్చుకున్నాము.
మీఅత్తని చూడు బండమొహంది.నీది మీ అమ్మది ఏమందం ఏమందం.నేను.నీకు మామగారని కాదు మామని అనుకో.వాడివల్ల నీ కోరికలూ తీరవు. పిల్లలూ పుట్టరు.నావల్ల ఒక పిల్లో పిల్లాడో పుడితే ఎవ్వరికీ అనుమానంరాదు.నాలుగు తగిలిస్తే నీ అత్త నోరుమూసుకుంటుంది.నీకు ఈ బంధికానా ఉండదు.మీ అత్తనే ఈ రూములో తాళంవేసి మనిద్దరం స్వేఛ్ఛగా ఉందాము.రేపు రాత్రి తాళం తీసి ఉంచుతా.ఎలాగో ఆ బండది నిద్రమాత్ర లేకుండా నిద్దరపోదు.ఒకటికి.రెండు వేస్తే మొద్దునిద్ర పోతుంది. అంటూ న…….న్ను ము…..ద్దు అంటూ రేపు రాత్రి కి ‘ఓ.కే.’నాఅంటూ మళ్లీ తాళం వేసి వెళ్లి పోయాడు.” అంటూ శ్వాస తీసుకోలేక బాధ పడింది రాగిణి.కొంచెం ఆగి మరల చెప్పటం మొదలుపెట్టింది.

“అమ్మా! నువ్వెప్పుడూ అనేదానివి.’కష్టాలలో తలవంచుకు ఎదురీదాలని,ధైర్యేసాహసే లక్ష్మీ’అని ఆమాటలు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయమ్మా!
ఇవాళ సాయంత్రం రామారావు అంకల్ రావటం మాఅత్తగారు గేటుదగ్గరనించే అంకల్ని పంపించేటం కిటికీలోనించీ చూసానమ్మా!

మా మామగారు చెప్పినట్లు రాత్రి తలుపుకు తాళం వేయలేదు.మా అత్తగారు పడుకున్నారు.మామగారు బాత్రూమ్ లో ఉన్నారు. వాళ్ళరూము బయటనించీ నాగదికివేసిన తాళం వేసి బయటకు వచ్చా.లాస్ట్ బస్ ఎక్కి మంగాపురం వచ్చా.మంగాపురం వచ్చాక ధైర్యం వచ్చింది.హడావుడిలో పర్స్ లో డబ్బులు చూసుకోలేదు.ఆటోలో దగ్గరలో థియేటర్ వరకూ వచ్చా.అప్పుడే సెకండ్ షో వదిలారు కదా ఆజనంతో అక్కడినించీ నడచుకుంటూ వచ్చా అమ్మా!నీదగ్గిరికి వచ్చానమ్మా !అమ్మా నీదగ్గిరకి వచ్చేసానమ్మా! వచ్చేసానమ్మా! అంటూ హిస్టీరిక్ గారిపీటెడ్ గా అంటం మొదలు పెట్టింది.”అమ్మా వాళ్ళొస్తారు తలుపువెయ్యి”అంటూ వణికి పోయిందిరాగిణి.

ఎవ్వరూ రారు అమ్మూ! ఈ అమ్మనిదాటి నా అమ్మూమీద చేయివేసే ధైర్యం ఎవరికీ లేదు.అంటూ మళ్ళీ రెండు బిస్కట్లు తినిపించి మళ్ళీకాసిని పాలిచ్చి పడుకోపెట్టి దుప్పటి కప్పింది.

సశేషం
దేవులపల్లి విజయలక్ష్మి

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతలేఖీని రామభద్రాంబ 

ఒడిపిళ్ళు – 24 వ భాగం