రాబోయే వర్షానికి నమూనా లాగా డాన్స్ నడుస్తున్నది గిరగిర తిరుగుతున్న అమ్మాయిలు గొలుసు లాగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మైకంలో నాట్యం చేస్తున్నారు. వేగంగా కదిలే వారి అడుగులతో మెరుపు తీగల వలె కదులుతున్నారు. నృత్యం చేస్తూ ఒక్కసారిగా ఆగి చిన్న గుంపులుగా విడిపోయి మేఘాలు తేలినట్టు మళ్లీ కలిసిపోతున్నారు. గుంపులో సూచనల మేరకు ఊగుతూ లయకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. వారి చేతులు కాళ్ళు శరీరమంతా ఊగిపోతుంది. రుతుపవనాల వర్షపు తాకిడికి లతల్లాగా నడుములను వెనుకకు వంచి తలలను భూమికి తలిగిస్తున్నారు. పొలాల్లో వరినారులా వంగుతూ లేస్తూ ఊగిపోతున్నారు. డోలు డప్పులు మోగుతున్నాయి. నదులు తమ తీరాలను తెంపుకొని ప్రవహిస్తున్నాయి. ఎండిన అడవి ఒడిలో వర్షం జీవం పోసుకుంటుంది. నవ వధువు తన భర్త ఇంటికి వచ్చినట్టు, వర్షం వచ్చి పెద్దలందరికీ పాదాలు కడుగుతోంది. ఆ విధంగా వర్షం కొత్త జీవితాన్ని ప్రకటిస్తోంది. హేమ్లా గానంతో సాలీ వేడెక్కి నృత్యం చేస్తోంది. తనకు తాను నవ వధువుగా ఊహించుకొని ఊరేగింపు మధ్యలో ఉన్నట్టు అనుభూతిస్తోంది. వేగంగా సాగుతున్న నృత్యం నెమ్మదించింది కుండపోతగా కురుస్తున్న వర్షం చిరుజల్లుగా మారింది. అమ్మాయిలందరూ చెమటలో తడిసి పోయారు. వారి వక్షస్థలం ఎగిసిపడుతోంది. వారి నల్లటి ముఖాలు ఎర్రబడ్డాయి. వారి తలల్లో పువ్వులు జారీ కిందపడి కాళ్ల కింద పడి నలిగిపోయాయి. సాలీ స్పృహలోకి వచ్చింది.
అమ్మాయిలందరూ విరామంగా ఉన్నారు. ఒకరితో ఒకరు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ హేమ్లా ఆమె వైపు చూడనుకూడా లేదు. అతను గుంపు మధ్యలో ఉండి డాన్స్ చేసిన అమ్మాయిలందర్నీ ప్రశంసిస్తున్నాడు. ఆ గుంపులో కమ్లీ, సామ్లీ, సంబాలి , సన్యాదాన్ ఇంకా చాలామంది ఉన్నారు.
సాలీ అక్కడి నుండి నిశ్శబ్దంగా జారుకుంది. కనీసం మాలీని రమ్మని పిలవనైనా లేదు. ఆమె వెళ్ళిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ అమ్మాయిలు గొలుసులా మారి నృత్యం మొదలుపెట్టారు. ఆ నవ్వులు ఆ శబ్దాలు తనను వెక్కిరించినట్టుగా భావించి అక్కడి నుండి పారిపోయింది సాలీ.
రోడ్డు మూల మలుపు దగ్గర ఒక్కసారిగా కాక్లా ఎదురై “ఎక్కడికెళ్తున్నావ్ సాలీ ? ఇప్పటికే చాలా ఆలస్యమైంది” అని అడిగాడు.
పరుగులు పెడుతున్న ఆమె ఒక్కసారిగా ఆగి నెమ్మదిగా నడవడం మొదలు పెట్టింది. కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. వెనకకు తిరిగి చూడలేదు.
” నేను నిన్ను ఇంటి దగ్గర దింపనా” అన్నాడు మళ్ళీ అతను. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు, సమాధానం చెప్పలేదు. కానీ ఆమె వెనుక అతను నడుస్తున్నట్టు కర్ర దాటించిన శబ్దం వినపడుతోంది. అతను కొద్ది దూరంలో నడుస్తూన్నాడు. ఆమె తన ఇంటి వద్దకు చేరింది, మెట్లెక్కి వరండాలో తను తలుపు తీసింది,
” సరే అయితే నేను వెళ్తాను, నేను ఇక్కడ ఉండలేను. ఇప్పటికే చాలా ఆలస్యమైందని భయపడ్డాను” అంటూ వెళ్ళిపోయాడు.
సాలీ ఒంటరిగా చీకట్లో తనింట్లో నిశ్శబ్దంగా పడుకుంది.
………
వసంతోత్సవం ఎప్పుడూ అమావాస్య సమయంలో వస్తుంది చీకటి ఎక్కువగా ఉంటుంది. నెల పొడుపు రోజు పండుగ మొదలు అవుతుంది.
ఆరోజు రానేవచ్చింది. సోమ్లా కొడుకులతో కలిసి తన గొడ్డళ్ళను తీసుకుని ఇంటివైపు నడక మొదలు పెట్టాడు. ఆ సుదీర్ఘ ప్రయాణం వేకువనే మొదలైంది. ఆకాశం ఇంకా చీకటిగానే ఉన్నది. కొండ గాలి చల్లగా వీస్తూన్నది. వారి పాదాలు మంచు తగిలి మరింత తడి అయ్యాయి.
వారు గర్లీఘాట్ మార్గం చేరుకునేసరికి సూర్యుడు ఆకాశంలోకి పాకుతున్నాడు. దట్టమైన అడవిలో వారు నడుస్తుండగా ఎండ పెరిగిపోయింది. మేఘాలు కొండ శిఖరాల చుట్టుముట్టాయి. లోయ ప్రాంతాలు కొండ దిగువన ఎండకు మెరుస్తున్నాయి. సుదూరంగా పొలాలు గోధుమ రంగులో కనిపిస్తున్నాయి.
కొద్దిపాటి పొగ దూరంగా పైకి పాకుతూ చెట్ల చాటునుండి గ్రామాల ఉనికి తెలియజేస్తూన్నది. సమీప ఊర్లను చూస్తూ అరిచారు ఎవరో. అదిగో కనబడేది దండబాద్ దాని కుడి వైపున కొండబేడా పదార్ , పెడిసిల్ మిగిలినవానిలో సర్జిగూడ ఉన్నది.
కొండ దిగువకు వారు నడుస్తున్నారు. చిన్నపిల్లల వలె ఉత్సాహంగా అడ్డదారిన నడుస్తూన్నారు. ఈ మార్గం లో దండబాద్ ఎడమవైపున సర్జిగూడా నుండి నడుస్తున్నారు. అడివంతా కురియా పువ్వుల పరిమళంతో నిండిపోయింది.

ఒక చదునైన బండ మీద కొద్దిపాటి విరామం కోసం ఒక సరస్సు పక్కన జోడి చెట్టు కింద కూర్చున్నారు తండ్రీకొడుకులు. ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేసేవారికి అది ఎంతో ఇష్టమైన ప్రదేశం. కురియా చెట్టు కొమ్మను ఒకదానిని తెంపాడు భూక్యా. ఆ కొమ్మ బెరడును కత్తితో వలిచాడు దాని పక్కన చిన్న గుంటలాగ చేశాడు. ఇంకొక చిన్న కొమ్మను తీసుకొని నరికి, ఒక చివర కొచ్చెగా చేసి దాన్ని ఇంతకుముందు కర్రలో నిటారుగా ఉంచాడు. చేతితో తిప్పుతూ దాన్ని బిగించాడు. అదొక చల్ల చిలికే కవ్వం లాగా తయారయింది. కొద్దిసేపటికి అందులో నుండి పొగ రావడం మొదలైంది. ఆ తర్వాత మంట వచ్చింది. దానితో తన చుట్ట వెలిగించుకొని, తండ్రికి అందించాడు. వారు కూర్చుని పొగ తాగిన తర్వాత సోమ్లా ముఖం మీది నుండి తన కంటిలోకి జారుతున్న చెమటను తుడుచుకున్నాడు. అందరికీ ఒక్కసారిగా పండుగ గుర్తుకొచ్చింది. గత రాత్రి పండుగ మొదలైంది. తాము మాత్రం ఎటువంటి తయారీ చేయలేదు. వారిని ఒకరోజు ముందుగా వదలడానికి షావుకారు అంగీకరించలేదు. కనీసం వంటచెరుకు కూడా సమకూర్చుకోలేకపోయారు.
అట్లా అందరూ నిశ్శబ్దంగా లేచి నడవడం మొదలు పెట్టారు. మాలింగిజోడి మార్గము దాటితే వారి గ్రామం వచ్చింది. ఊరు వద్దకు వచ్చేసరికి సూర్యాస్తమయం మొదలైంది. పక్కన యువతీయువకులు గుంపులు గుంపులుగా చేరారు. అమ్మాయిలు తమ చీరలను పసుపులో ముంచి కట్టుకున్నారు. అది వారి వసంతోత్సవం సంప్రదాయ రంగు.
భూక్యా ఏదో గుర్తుకు వచ్చినట్టు “నాన్నా” అని పిలిచి, “మనం కమ్లీ వాళ్ల ఇంటికి ఈరోజు రాత్రి వెళ్లాలి. ఆమె తండ్రితో నేనేం చెప్పాలి” అని అడిగాడు.
టీక్యా నవ్వుతూ “అన్నా ! నీ కమ్లీ గురించి నువ్వు బాధపడకు, ఆమెను ఎవరు ఎత్తుకు పోరు” అన్నాడు.
సోమ్లా గంభీరంగా తలాడిస్తూ “సరే భూక్యా! నేను వాల్యాతో మాట్లాడుతాను” అన్నాడు. ఒక గంట తర్వాత వారు గ్రామాన్ని చేరుకున్నారు. ఊరంతా డప్పుల మోతలతో వాయిద్యాల శబ్దాలతో మునిగిపోయింది.
అది సూర్యోదయంనుండి జరుగుతూండవచ్చు రాత్రంతా కొనసాగుతుంది. అమ్మాయిలందరూ గుంపులు గుంపులుగా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ముఖం నిండా పసుపు రాసుకొని ఉన్నారు. పురుషులందరూ మద్యం మత్తులో ముచ్చట్లు పెడుతున్నారు.
తండ్రి కొడుకులు పరజ ఇళ్ళు దాటుకుంటూ తమ ఇంటికి వచ్చారు. సాలీ, మాలీ ఇద్దరు పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చారు.
సోమ్లా వారిని చేతులతో తడుముతూ “అయ్యో నా పిల్లలు ఎంత చిక్కి పోయారు” అని ప్రేమగా అన్నాడు.
భూక్యా – కమ్లీ గురించి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు సాలీని. ఆమె నవ్వుతూ ఉండగా హేమ్లా గురించి అడగడం మొదలు పెట్టాడు టీక్యా.
” సరే సరే ఆకలిగా ఉంది. మాకు తినడానికి ఏదైనా పెట్టండి” అని గట్టిగా అరిచాడు టీక్యా.
…………………
కమ్లీ తన గుడిసె బయట వరండాలో కూర్చున్నది. ఉత్సాహంగా పసుపును తడిపి ముఖానికి చేతులకు రాసుకుంటూన్నది. కానీ అది ఆమె చర్మానికి సరిగా అంటుకోవడం లేదు. అంతా జారి కింద పడిపోతోంది. తొందరగా ఆ పని పూర్తి చేయాలని ఆమె అనుకుంటున్నా కానీ అది పదే పదే రాలిపోతున్నది .
ఇంతలో ‘కమ్లీ’అన్న పిలుపు ఆమెకు వినపడింది. భూక్యా తన అందమైన నవ్వుతో కంచె పక్కన నిల్చుని ఉన్నాడు. అతని కళ్ళు ఆనందంతో మెరుస్తూ వున్నాయి. కమ్లీ తన పసుపు గిన్నె తీసుకొని ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు భూక్యా.
జోడి చెట్టు ఎండుటాకుల పైనుండి రాలుతున్నాయి. పందులు ముట్టెతో నేలను తవ్వుతూ పరిగెడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఎప్పటి వలెనే ఉన్నాయి.
కొద్ది సేపైన తర్వాత కమ్లీ తన చీరను సరిచేసుకుని మళ్లీ బయటకు వచ్చింది. భూక్యా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు.
” నువ్వు తిరిగివచ్చేసావా భూక్యా” అని బలహీనంగా అడిగింది కమ్లీ. ఆ తర్వాత చాలాసేపు వారిద్దరి మధ్యన మౌనమే నడిచింది.
” అవును నేను ఈరోజే వచ్చాను” అన్నాడతను.
“చాలా రోజుల తర్వాత ” అన్నది ఆమె.
” అవును” అని మాత్రమే అన్నాడతను.
ఆమె తలవంచి నేలను చూస్తూ నిలబడ్డది. అతను కొంచెం దగ్గరగా జరిగాడు. అయినా ఇద్దరి మధ్య కొన్ని గజాల దూరం ఉన్నది. అతడు ఆమెను ఆశగా చూస్తున్నాడు ఆమె తలపై నుండి. అక్కడే నిలబడి ఆమె ఆశగా వేచి చూసింది. కానీ అతను ఆమెను తాకను కూడా తాకలేదు.
“కమ్లీ నాతో డాన్స్ చేస్తావా !” అన్నాడు చివరికి. ఆమె నిష్టూరంగా చాలా తేడాగా నవ్వింది. గిరిజన స్త్రీలు తనకు కాబోయే జోడీతో సమ్మతిగా నవ్వినట్టు.
” సరే నేను నీతో డాన్స్ చేస్తాను. కానీ నువ్వు వెళ్లిపోయినప్పుడు నాతో ఎవరు డాన్స్ చేస్తారు. చివరికిప్పుడు కమ్లీ గుర్తుకొచ్చింది. అదీ వసంతోత్సవం దగ్గరికి వచ్చినప్పుడు ” అన్నదామె.
ఆమె ఏదోపని ఉన్నట్టు మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.
భూక్యా వరండాలో కూర్చున్నాడు కానీ చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఆమె మళ్లీ బయటికి వచ్చింది. ఇద్దరు కూర్చొని, ఇదీ అదీ మాట్లాడుకున్నారు. అతను జరగబోయే ప్రయత్నాల గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. డాన్స్ గురించి , వేట గురించి అతడు ఆతృతగా ప్రశ్నించడం చూసి కమ్లీ నవ్వింది. అతడు సరే నేను వెళ్ళాలి అన్నాడు.
ఉన్నట్టుండి అతడు “మీ నాన్న ఎక్కడ ఉన్నాడు” అన్నాడు.
” ఎందుకు” అన్నది ఆత్రంగా. ఆమె అలా అన్నప్పుడు ఆమె ముఖంలో భయం కనబడింది. “నాన్న ఊళ్ళోకి వెళ్ళాడు” అన్నది.
” ఏం లేదులే, అతనితో నీ గురించి మాట్లాడాలని అనుకున్నాను” అన్నాడు భూక్యా.
“దేని గురించి నీతో డాన్స్ చేయడానికా ?” ఆమె మధ్యలో ఆపింది ఆత్రుతగా.
“అవును కానీ దానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ఇంకా ఇంకా మంచి జరగబోతోంది నీకు” అలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భయపడిన బడి పిల్లాడి లాగా.
కమ్లీ తన పొడవైన వెంట్రుకలు ఒకసారి విడదీసి దులుపుకుంది. అన్యమనస్కంగా తన జుట్టుకు ఆముదం నూనె రాయడం మొదలు పెట్టింది.
ఆమె తనను తాను అద్దంలో పరిశీలనగా చూసుకుంది. పసుపు సరిగా లేదు చాలా పలుచగా అనిపించింది. ఆమె కూర్చుని కొద్దిసేపు ఆలోచించింది. ఆ తర్వాత పెదవులపై నవ్వు వికసించగా చిన్నగా కూనిరాగం తీస్తూ మళ్లీ ఒకసారి ముఖం పై పసుపు రాసుకోవడం మొదలు పెట్టింది.
……..
(సశేషం)