నదీమతల్లి-8వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ

రామారావు రాగిణి అత్తవారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, పోలీసు కంప్లైంట్ ఇవ్వటం మంచిదని సూచిస్తాడు.
అదేరోజు అర్ధరాత్రి రాగిణి తలుపు తట్టడంతోరాధ రాగిణిని చూసి ఆశ్చర్యపోతుంది.
రాగిణి ద్వారా రాగిణి అత్తమామల హింసాత్మక చర్యలు తెలుసుకుని అన్నగార్ల సహాయంతో వారి మీద ఫ్.ఐ.ఆర్ ఫైల్ చేస్తుంది.
పోలీస్ వారి ఇల్లు చుట్టుముట్టారు అప్పటికే వారు పరారీలో ఉండటంతో వారిపై గాలింపు చర్యలు చేపట్టారు.
స్తబ్దుగా ఉన్న రాగిణికి ధైర్యం చెప్తున్న రాధకి ప్రణవ్ మాటలు విరక్తి కలిగిస్తాయి.
ప్రణవ్ సమీరని గుళ్ళో పెళ్ళిచేసుకుని వస్తున్నా అనటంతో గుండె నిబ్బరం చేసుకుని నూతనవధూవరులని హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానిస్తుంది.

రాజారెడ్డి వెంటనే తమ్ముళ్ళిద్ధరికీ తెలిపాడు.

రాధ జ్యోత్స్నకి తెలిపి బయటకెళ్ళి కొబ్బరికాయ, పళ్ళు,పూలు, కావలసిన సరంజామా కొనుక్కుని వచ్చింది.ఇల్లు శుభ్రంచేసి హారతి ఎఱ్ఱనీళ్ళుసిధ్ధం చేసుకుంది.

ఏంజరగబోతోందో అన్నగుబులుతో ఉన్నారు రాగిణి, రాధ .
సాయంత్రం నాలుగున్నర కల్లాపసుపు బట్టలతో ప్రణవ్ సమీరలు ఇంటికి వచ్చారు.

రాగిణి చేత హారతిప్పించి సాదరంగా కోడలిని ఆహ్వానించింది రాధ.

‘పిల్ల కొంచెం ఛాయ తక్కువకాని లక్షణంగా ఉంది.’ అనుకుంది మనుసులో రాధ.

ఎందుకో ప్రణవ్ మీద కోపం రాలేదు రాధకి ఈపెళ్ళితోనన్నా వీడు సక్రమంగా ఉంటే చాలనుకుంది.

ఆరుగంటలకల్లా రాజారెడ్డి ,శ్రీ నివాసరెడ్డి, జ్యోత్స్న వచ్చారు.
ప్రణవ్ ఊహించిన ట్టుగానే రాఆత్రి ఎనిమిది ప్రాంతంలో ఒక పాతికమందితో గోవిందరాజు వాకిలి ముందు నుంచొని రంకెలేయసాగాడు.

రాజారెడ్డి,శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని మాకు ఈవిషయం కొన్నిగంటలముందే తెలిసింది.లోపలకు రండి మాట్లాడుకుందాం. రాత్రి పూట వీధిలో మీపరువు మాపరువు పోతుందని నచ్చచెప్పి ఇంట్లోకి తీసుకొచ్చారు.

విషయం ఏమిటంటే గోవిందరాజులు కోట్లకు పడగెత్తిన వ్యక్తి.మూడు రైస్మిల్లులు,గ్రౌండ్నట్స్ ఎక్సపోర్ట్ బిజినెస్ ఉన్నవ్యక్తి.కులవ్యవస్త మూర్ఖంగా నమ్మిన వ్యక్తి.

సమీర ‘లా’ లో గోల్డ్ మెడలిస్ట్.స్కూలు లోనుండే ప్రణవ్ సమీరల ప్రేమాయణం సాగుతోంది.అవతల సమీరకి మరుసటిరోజే నిశ్చయతాంబూలాలు. పెద్దలకి చెప్పలేక సమీర,ఇంట్లో అస్తవ్యస్తమైన పరిస్థితి వలన చెప్పలేక ప్రణవ్ గుళ్ళోపెళ్ళికి దారి తీయాల్సివచ్చింది.
విషయం తెలిసి ప్రణవ్ మేనమామలు , జ్యోత్స్న గోవిందరాజుని శాంతింపచేయటానికి ప్రయత్నించారు.

“చూడండి!గోవిందరాజులుగారు.ఇందులో మావాడి తప్పు,మీ అమ్మాయి తప్పు ఇద్దరిదీ ఉంది.ముఖ్యంగా ఇద్దరూ మేజర్స్.మనం అవునన్నా కాదన్నా న్యాయం వారినే సపోర్ట్ చేస్తుంది. మీరే ఆలోచించండి ప్రశాంతంగా.”అన్నాడు రాజారెడ్డి.

“హుఁ సమీరా! ఈరోజునించీ నాకూతురు చచ్చిన దానితో సమానం.ఎట్లా కట్టుగుడ్డలతో పారిపోయావో అదేకట్టుగుడ్డలు నీకు నీతండ్రి ఇచ్చే ఆస్తి .ఈ పెద్దమనుషులు న్యాయం ధర్మం అంటున్నారుగా, నువ్వుకట్టుకున్న ఆ తాడు బొంగరం లేనివాడు నీకు తిండి పెడతాడో లేక నేను చెప్పించిన చదువు నీకు తిండిపెట్టి వానికి కూడా తిండి పెడుతుందో నాకు తెలియదు.
ఈ ఇంట్లో నీకేం కష్టమొచ్చినా. నాకు సంబంధంలేదు .నా గడప త్రొక్కద్దు.ఏ భావో చెఱువో చూసుకో.నా ఆస్తి నా కష్టార్జితం. అంతా నీఅన్నకి చెల్లికి ఇవాళే రాసేస్తా.” అంటూ సరసరా వెళ్ళిపోయాడు గోవిందరాజులుగారు.

వెక్కివెక్కి ఏడుస్తున్న సమీరను తల్లిలా అక్కున చేర్చుకుందిరాధ .తనమెళ్ళో ఉన్న ఒక్క ఒంటివరస గొలుసుని సమీర మెళ్ళో వేసింది. ,ఒకజత గాజులు సమీర చేతికి వేసింది.రాగిణి గురించి చూసింది రాధ .

ఇంతలో రాగిణి సేమియా పాయసం రెండు కప్పులలో తెచ్చి ప్రణవ్ సమీరలకి ఇచ్చింది.

“అన్నా! వదినకి తినిపించు.”అంది రాగిణి.
అందరికీ ఫలహారాలు చేసింది.

అమ్మా అన్నావదినలచేత వ్రతం చేయించమ్మా! అని అడిగింది.

అందరూ ఆశ్చర్యపోయారు నెలల తరబడి మాటేమరచిన రాగిణిలో జీవంచూసి.

రాగిణి కోరిక మేరకు గుళ్ళో వ్రతం చేసుకున్నారు సమీరా ప్రణవులు.

ఇప్పుడు రాగిణికి చేతినిండా పని.సమీరకి, తల్లికి లంచ్ బాక్సెస్ రెడీ చేయటం.వాళ్లు రాంగానే కాఫీ టీలందించటం యాంత్రికంగా రోజులు గడచి పోతున్నాయి.

రాధకి రాగిణి సమీరకి సేవ చేస్తున్నప్పుడల్లా గుండెల్లో ముల్లుగుచ్చకున్నట్లనిపించేది.

ఒకరోజు రాధ రాగిణితో “అమ్మూ కంప్యూటర్స్ నేర్చుకో ఉపయోగపడుతుంది.”అంది.

“అమ్మా! నేను నీకు భారంగా ఉన్నానా?అంది రాగిణి.

“అమ్మూ !అర్ధం చేసుకో !అమ్మ ఎల్లకాల‌ం ఉండదు. నీకాళ్ళమీద నువ్వు నిలబడాలి తల్లీ!నాకు నువ్వు భారం ఎలా అవుతావు.అన్న వదిన అలాఉంటుంటే నీవిలా ఉంటే తల్లిగా నాకు గుండెలు పిండినట్లుంది.” అంది రాధ.
విని మౌనంగా తలదించుకుంది రాధ.
★★★
కట్టు గుడ్డలతో వచ్చిన సమీరకి కన్నతల్లి అయింది రాధ.రాధకి ఆర్ధిక భారం ఎక్కువైంది.అయినాకూడా తొణకలేదు .

ఇంతలోకి పిడుగులాంటివార్త తెచ్చాడు.తను బె‌ంగుళూరు షిఫ్ట్ అవుతున్నానని భార్యని
తీసుకొని.
జ్యోత్స్న ద్వారా సమీర తెలివి తేటలు విన్న రాధ సంతోషపడింది.ప్రణవ్ సంసారాన్ని సమీర నడపగలదని. ఇక్కడ ప్రాక్టీసు మానేసి బెంగుళూరు వెళ్ళటంతో ఆశ అడియాశ అయింది.

రాగిణి కోర్టు కేసు గెలిచింది. పధ్ధెనిమిది లక్షలు, బంగారం మాత్రం వెనక్కువచ్చింది ఏడాది తరువాత.

ఇప్పుడు రాధకి ముక్కుపచ్చలారని రాగిణికి పెళ్ళి చేయాలని సంకల్పం.అందరూ రెండో పెళ్ళి వాళ్ళు, ఒకళ్ళో ఇద్దరో పిల్లలున్నవాళ్ళే.వాళ్ళు డైవోర్సీ అయినా పెళ్ళికూతురు వర్జిన్ అయి ఉండాలి. నవ్వుకుంది రాధ.మగవాడు వర్జినా కాదా అని అడిగే వాళ్ళులేరు ఈ పురుషాధిక్య ప్రపంచంలో.

ఇంతలో హైదరాబాద్లో డైవోర్సీ పిల్లలు లేని పెళ్ళి కొడుకు మాట్రిమొనీలో తటస్త పడ్డాడు. మాటలయింతరువాత లాంఛనంగా పెళ్ళిచూపులు అయ్యాయి.

స్థబ్ధుగా ఉన్న రాగిణిలో చలనంచూసి ఎలాగైనా ఈ సంబంధం చేయాలనుకుంది రాధ.అయితే తొందరపడ దలచుకోలేదు.ఇరవై ఎనిమిదిఏళ్ళ వయసులో విడాకులకి కారణం తెలుసు కోవాలనుకుంది.పిల్లవాడి తరఫువాళ్ళు తప్పంతా పిల్లదే అన్నారు.

ఈసారి మోసపోదలచుకోలేదు రాధ.ప్రణవ్ని , ప్రణవ్ ఫ్రెండు ప్రదీప్ని తీసుకుని హైదరాబాద్ ప్రయాణమైంది.ప్రదీప్ బడ్డింగ లాయర్.డైనమిక్.

కారులో రాధ,ప్రణవ్ కూర్చొని ప్రదీప్ ని పెళ్ళి కొడుకు ‘సంతోష్ ‘అపార్ట్మెంట్ కి వెళ్ళి చూడమన్నారు .
అపార్టమెంటు వాచ్మెన్ ద్వారా భార్యాభర్తలు ఎప్పుడూ తగూ పడేవారని తెలుసుకున్నారు.

సంతోష్ తల్లిదండ్రి సంతోష్ అన్నదగ్గర ప్రక్కనే వేరే అపార్టమెంట్ లో ఉన్నారని ,అన్నిటి కంటే ముఖ్యంగా సంతోష్ మాజీ భార్య పనిచేసే కంపనీ పేరు ,మరియు సంతోష్ ఆఫీసు పనిమీద తిరిగే వాడని, ఇప్పుడు కూడా కొలికొత్తా వెళ్ళాడని తెలుసు కున్నాడు.

“అయితే మనం ఆ అమ్మాయి పనిచేసే ఆఫీసుకెళ్ళి డైరక్ట్గా ఆ అమ్మాయినే కలుద్దాం!” అంది రాధ ప్రణవ్ తో. బయట ఎండ మండి పోతోంది.తిండి తిప్పలు లేవు .అయినా రాధ మొహంలో అలుపు లేదు.

“సరే !అని ఆ కంపెనీ ఎక్కడుందో అంచెలంచెలుగా వెతుక్కుంటూ మొత్తానికి ఆ ఆఫీసు కనుక్కున్నారు.కానీ ఆ అమ్మాయి శలవులో ఉందని తెలిసి ఆఫీసు వాళ్ళకి తాము తిరుపతి నించీ వచ్చాం బంధువులమని చెప్పి ఇంటి ఎడ్రసు సంపాదించాడు ప్రదీప్.

సిధ్ధిపేటలోని ఆ అమ్మాయి ఇంటికెళ్ళారు.ఆఇల్లు కనుక్కోవటానికి పడరాని పాట్లు పడ్డారు.

ఇల్లు చిన్నదిగా చూడముచ్చటగా ఉంది. రాధ కాలింగ్ బెల్ కొట్టంగానే ఒక నడివయస్కురాలు తలుపుతీసింది.
“ఎవరూ?ఎవరు కావాలి?”అంటూ.
“ఆంటీ మీరు రజని తల్లిగారా?”అంటూ సౌమ్యంగా పలకరించిందిరాధ.
కూతురు పేరు వినంగానే కూతురికి బాగా కావలసినవాళ్ళని”లోపలకి రండి”అని ఆహ్వానించింది .
ఇల్లంతా కలయజూసిన రాధకి ఇల్లు ఎంతో పొందికగా కనిపించింది.ఇల్లంతా తన టేస్ట్ లోనే అలంకరించబడింది.
“అమ్మా!ఇల్లు చాలాబాగుందమ్మా!” అని రాధ మనఃస్పూర్తిగా.అంది .
ఆ కాంప్లిమెంటుకి పొంగిపోయింది.ఉండండమ్మా ఎండని పడి వచ్చారంటూ నిమ్మరసం అదిస్తూ ,
“మా అమ్మాయేనమ్మా ఇల్లంతా అలంకరించింది. దానికి తీసినవస్తువు తీసిన చోట పెట్టకపోతే చాలా కోపం .ఏమిటో దాని బ్రతుకు బుగ్గిపాలు చేసాడాదరిద్రుడు.ప్రేమ, దోమ అని వలలో వేసుకొని దాని జీవితం నాశనం చేసాడు.”అంది.
“ఎవరమ్మా!” ఏమీ తెలియనట్లే అడిగింది రాధ.

అదే ఆ ముం…….కొడుకు నా కూతుర్ని చేసుకున్న సంతోష్.అంది క్రౌర్యం అంతా మొహంలో నింపుకొని.
రజని కనపడటం లేదు పిలుస్తారా!”అంది రాధ

“రజని విజయవాడ వెళ్ళింది స్నేహితురాలి పెళ్ళికని.”అంది.

“అవునా అమ్మా !నేను నా కూతురుని సంతోషుకు ఇద్దామని,అసలు విడాకులు ఎందుకు తీసుకోవలసి వచ్చిందో తెలుసుకుందామని వచ్చాము ఆంటీ.” అంది రాధ.
ఒక్క ఉదుటున లేచింది రజని తల్లి.రాధ చేతులు పట్టుకుని , “ఆరాక్షసుడుకి నీ కూతురుని బలి ఇవ్వకు.సాటి తల్లివని చెప్తున్నా.” అంది .ఆకళ్ళల్లో పగ ,ద్వేషం ప్రస్ఫుటంగా చూసింది రాధ.

“అలాగే అమ్మా!ధన్యవాదాలు.”అంటూ శెలవు తీసుకుంది రాధ.
★★★

అడుగు ముందుకెయ్యాలో వెనకకు వెయ్యాలో తెలియని సందిగ్ధావస్తలో రాగిణి పరిష్కారం చూపింది.

ఇంటికి వచ్చేరికి రాగిణి ఫోన్లోమాట్లాడుతోంది. మొహం సంతోషంతో వెలిగిపోతోంది. ఎవరు ఫోన్ చేసినా ” అమ్మా! ఫోన్ అంటూ ఎవరో అడగకుండా క్రేడిల్ చేతికి అందించే రాగిణి అలా మాట్లాడటం చూసి రాధ సంతోషపడింది.రాగిణిలో జీవం పోసిన వ్యక్తి ఎవరా అని.
“ఎవరు అమ్మూ ! “అడిగింది రాధ.

“అదే మొన్న వచ్చేరే సంతోష్ అతనేనమ్మా!
మీరు హైదరాబాద్ వెళ్ళినప్పటినించీ రోజూ ఫోన్ చేస్తున్నారు .నేను అన్న దగ్గరకి బెంగుళూరు వెళ్ళారని చెప్పా.”అంది రాగిణి.

“బ్రతికించేవు దేముడా!”అనుకుంది రాధ. ఈ అమాయకురాలు నిజం చెప్పేస్తుందేమో అనిహడలి పోయింది.

“తనకి నేను నచ్చానుట. నీకు నేను నచ్చానా ?అని అడిగాడు.నేను మా అమ్భనిర్ణయమే నా నిర్ణయం.అని చెప్పానమ్మా ” అంది రాగిణి.

“ఆంటీ రాంగానే మాట్లాడతానన్నాడు.”అంది రాగిణి.

“తలపగిలిపోతోంది అమ్మూ కాఫీ తే అమ్మా!” అంది రాధ.

“అమ్మా !ఆడపిల్లమెళ్ళో పుస్తెల తాడు పడంగానే పెళ్ళైనది అన్నపేరు వస్తుంది.కాపురానికి వెళ్ళిందా ?కాపురం చేసిందా?అని ఎవరూ ఆలోచించరు.అది ఉద్యోగం చేసి ధైర్యంగా సమాజంలో నీలా నిలపడలేదు .అది ఒంటరిగా ఉండలేదు. ఈసంబంధం ఎందుకో ఫరవాలేదనిపిస్తోంది. వాళ్ళిద్దరూ విడిపోవటానికి అహంకారం అనిపిస్తోంది.”ఆలోచించమ్మా అన్నాడు ప్రణవ్.

‘నిజమే’ అనిపించింది రాధకి.
ఈ విషయం అక్కాబావలకి చెప్పింది రాధ.
కారణం వారిద్దరూ ఎనిమిదేళ్ళు హైదరాబాద్ లో పనిచేసారు.చాలా మందితో పరిచయాలున్నాయి.
ఏమంటారో అని .

వెంటనే చంద్రశేఖర్ తెలిసిన వాళ్ళద్వారా ఎంక్వయిరీ చేయించి పిల్లవాడు చేసేది మంచి కంపెనీ అని నిదానస్తుడని సర్టిఫికేటిచ్చారు.
‘హమ్మయ్య !’అనుకుంది రాధ .
సరే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆలోచించవచ్చని శ్రీనివాసుని ప్రార్ధించి ప్రశాంతంగా ఉంది రాధ.

వారం రోజులతరువాత రాధ బ్యాంకు లో ఉన్నప్పుడుసంతోష్ ఫోన్ చేసాడు.

“ఆంటీ!నేను ఆఫీసు పనిమీద తిరుపతి వచ్చాను.మిమ్మల్ని కలవాలనుకుంటున్నా!” అన్నాడు సంతోష్.
“అలాగే ఆరున్నరకి రా బాబూ! “అని ఫోన్ పెట్టేసి రాగిణికి ఫోన్చేసి చెప్పింది సంతోష్ వస్తున్నట్లు.

సంతోష్ ని ఏమేంఅడగాలి?అని మనస్సులో క్వశ్చనైర్ తయారుచెసుకుంది మైండ్లో రాధ.ఏది ఏమైనా ఈసారి మోసపోగూడదని .

అనుకున్నట్లే సాయంత్రం ఆరున్నరకల్లా సంతోష్ ఒక పుల్లారెడ్డి స్వీట్ బాక్స్ తో వచ్చాడు.

“రా !బాబూ! “అనిఆహ్వానించింది రాధ .

అమ్మూ ! మంచినీళ్ళు టీ తీసుకురా తల్లీ.అంటూ పిలిచింది .రాగిణి టీ బిస్కట్స్ టీ పాయ్ మీద పెట్టింది .ఒద్దికగా తల్లిని ఆనుకుని కూర్చుంది .కాళ్ళు చేతులు వణుకుతున్నాయి .అది గమనించిన రాధ అమ్మూ చేతులు గట్టిగా పట్టుకుంది.

ముగ్గురూ ఎవరి ఆలోచనలలో వారున్నారు.

నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ,”ఆంటీ మీరు హైదరాబాద్ మా ఇంటికి వచ్చినట్లుమా వాచ్మేన్ చెప్పాడు.”అన్నాడు సంతోష్.

పచ్చివెలక్కాయ గొంతుకలో పడ్డట్టయింది. రాధకి. అయినా తొణకకుండా అవును బెంగుళూరెళ్ళి అక్కడనించీ నేను ప్రణవ్ ఒక పెళ్ళికి సికింద్రాబాద్ వచ్చాం.అక్కడనించీ మీఏరియా దగ్గరంటే కలుద్దామని మీ అపార్టమెంట్ కి వచ్చాముఅంది రాధ.

“ప్రక్క అపార్టమెంట్ లో మాపేరెంట్స్ ఉన్నారు కలిసి వెళ్ళాల్సింది.కానీ మీరు రజని ఆఫీసు ఎడ్రస్ అడిగారుట.”అన్నాడు సంతోష్.

రాధకి నవనాడులు కుంచించుకు పోయాయి.

“ఆంటీ! నేను దెబ్బతిని ఉన్నాను.మీరూ దెబ్బతిని ఉన్నారు.మీరు నాకంటే పెద్ద దెబ్బ తిని ఉన్నారు. మీరు ఎంక్వయిరీ చేయటంలో నాకు తప్పేమీ కనిపించలేదు.కాకపోతే వాచ్మన్ ని కాకుండా మా ఆఫీసుకెళ్తే నేను హ్యాపీ గా ఫీల్ అయ్యెవాడిని.ఎనీవే అది పెద్ద చర్చనీయాంశంకాదు.

నామీద ఇంటెరెస్ట్ ఉండబట్టే మీరంతదూరం వెళ్ళారు.అది నాకు చాలా సంతోషం ఆంటీ.
అందుకే నేను మీదగ్గర ఏదీ దాయతలచు కోలేదు .నాతల్లీతండ్రి ఎనభై ఏళ్ళవాళ్ళు. వాళ్ళు వాళ్ళనారోగ్యాలతో మొదటి పెళ్ళే పట్టించుకోలేదు. నేను నా మొదటి భార్య విడి పోవటానికి ముఖ్యకారణం ఆమె తెలివితేటలకి అందానికి నేను తగని వాడనని,నాది చిన్నఉద్యోగమని
ఆమె అభిప్రాయం. ఆమెకి స్వేఛ్ఛ కావాలనుకుంది రోజూ గొడవలతో వేసారి పోయాను.అయినా విడాకుల ప్రస్తావన ఎత్తలేదు.నాకు వివాహబంధం మీద చాలా నమ్మకం.కానీ నన్ను వదిలి వెళ్ళిఏడాది పాటు తల్లిదగ్గరే ఉంది.ఎన్నిసార్లు కలవబోయినా ఎవాయిడ్ చేసింది.లాయర్ నోటీసు పంపించింది.
మావాళ్ళు ఆడపిల్ల అయిఉండి ఆ అమ్మాయి ఛీ కొడితే నీకు సిగ్గు లేదా అని నన్నే అన్నారు.తప్పని సరి పరిస్థితిల్లో విడాకు లిచ్చాను.

మళ్ళీ పెళ్ళి వద్దు అనుకునే పరిస్థితి లో మాట్రిమోనిలో రాగిణి ఫోటో చూసాను.రాగిణి అమాయకమైన కళ్ళు నామనసుకు తనతో నాజీవితం ప్రశాంతంగా ముగుస్తుందని అనిపించింది.అందుకే ధైర్యం చేసి రాగిణికి ఫోన్చేసాను.నేనూహించినదానికన్నా ఎంతో అమాయకురాలని రాగిణి తెలిసింది.ఆంటీ నేను మీకురాగిణిని ఆఖరి శ్వాస వరకూ పదిలంగా చూసుకుంటానని చెప్పేధైర్యం ఉంది.

మా అన్నపిల్లలే పెళ్ళీడుకొచ్చారు. నేను ఇంట్లో ఆఖరివాడిని.నాసంసారం ఇలా అయిందంటే ఒక్కరోజు ఏదోబాధపడి అందరూ మరచి పోయారు.రాగిణితో పాటు మిమ్మల్ని అత్తగా కాదు తల్లి స్థానంలో ఊహించుకుంటున్నా.”అంటూ తలవంచి నమస్కారం చేసాడు.
‘ఎన్నోఅనుమానాలతో క్వస్చనైర్ తయారు చెసుకున్న రాధకి అన్నిటికీ సమాధానం దొరికిందనిపించింది.’ రాధకి.

“డిన్నర్ చేసి వెళ్ళు బాబూ సంతోష్!.” అంది అనుమానాలు పటాపంచలవ్వగా.

★★★

రాగిణి పెళ్ళయి హైదరాబాదు వెళ్ళి పోయింది. స్మార్ట్ ఫోనుల పుణ్యమా అని రోజుకి రెండు సార్లన్న రాగిణి తల్లికి ఫోన్చేసి సంతోషంగా ఉన్నానని చెప్పేది.

ప్రణవ్ పోరు పడలేక పిత్రార్జితంగా వచ్చిన ఇంటిని అమ్మేసి మొత్తం ప్రణవ్ కి ఇచ్చి ఇక తన దగ్గిర తన సంపాదన తప్ప ఇంకేమీ లేదని తననింక డబ్బు గురించి వత్తిడి తేవద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది.
ఛీఫ్ మేనేజర్గా తిరుపతి నించీ నెల్లూరు ట్రాన్సఫర్ అవటంతో తిరపతిలో అపార్టమెంటు అద్దెకిచ్చి నెల్లూరులో ఎపార్టమెంట్ అద్దెకి తీసుకుంది.రాధకి గూడా మార్పు కావాలనిపించింది.

ప్రణవ్ కి ఇద్దరు కూతుళ్ళు శ్రుతి,లయ.ఇద్దరూ చదువులో హేమా హేమీలు.
ప్రణవ్ బిజినెస్ లో నష్టపోవడం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటం . నష్ట పోయినప్పుడల్లా రాధ సేవింగ్స్ ఊడ్చి పెట్టుకు పోవటం పరిపాటయ్యింది. ఎన్ని బ్యాంకులకి పంగనామాలు పెట్టాడో అన్నబెంగ రాధని క్రుంగ తీస్తూ ఉంటుంది.

బెంగుళూరులో అ‌రవైవేలు పెట్టి ఇల్లు అద్ధెకి తీసుకున్నాడు ప్రణవ్ బిజినెస్ చేసేటప్పుడు ఆమాత్రం హంగుండాలని.
సమీర చదివిన చదువు మూలపెట్టింది.లక్షల లక్షలు పెట్టి నగలు చీరలు పార్టీలతో కాలక్షేపం చేస్తోంది.

“సమీర అంత చదువు చదువుకొని ఖాళీగా ఉండటం ఎందుకు?ప్రాక్టీసు పెట్టవచ్చుకదా!”అందిరాధ.

“మీరేమీ మమ్మల్ని పోషించటం లేదుగా అంటూ ఈసడించింది.”సమీర
బిజినెస్ లో లాస్ వచ్చినప్పడల్లా నీభర్త నాదగ్గిరకొచ్చి తిండికి గూడా డబ్బుల్లేవు. డబ్బులిస్తావా!లేకపోతే నలుగురం విషంతాగి చస్తామని బెదిరిస్తాడు. నాకంటూ సేవింగ్స్ ఉంచుకోలేదు.

మీ మొహాలు చూసికాదు.పిల్లల మొహంచూసి డబ్బులిస్తున్నా.ఇద్దరాడపిల్లలు,వాళ్ళని చదివించాలి పెళ్ళి పేరంటంచెయాలి.మీ భార్యాభర్తల కేమైనా బాధ్యత ఉందా!అరవై వేలుపెట్టి ఇంత ఇల్లు అద్దెకి అవసరమా! లక్షలల్లో బట్టలు ఎందుకు? “అనేసరికి పెద్ద.గొడవ అయింది అత్తా కోడళ్ళమధ్య.

సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు -శ్రీమతి పి.బి.టి.సుందరి

మన మహిళామణులు – నాగచంద్రిక