మన మహిళామణులు – నాగచంద్రిక

నాగచంద్రిక క్రీడల అధ్యాపకురాలు.కానీ ఆమె ప్రవృత్తి జ్యోతిషం,వాస్తు! ఆశ్చర్యంగా లేదూ? మరి చదవండి ఆమెను గురించి…

నాగచంద్రిక 1982 సంవత్సరంలో సీతారామాంజనేయ శాస్త్రి,వరలక్ష్మి దంపతులకు భాగ్యనగరంలో జన్మించారు.మదర్స్ హైస్కూల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1997 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్నారు.సిద్దిపేటకు చెందిన త్రివిక్రమ శర్మతో 2000 సంవత్సరంలో వివాహం జరగగా వివాహానంతరమూ తన చదువును కొనసాగిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2005 సంవత్సరంలో ఎం.కాం పట్టాను అందుకున్నారు.ఫిజికల్ ఎడ్యుకేషన్ పట్ల తనకున్న మక్కువతో 2013 సంవత్సరంలో మహారాష్ట్రలోని జాల్నాలో భారత్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి బీపీఈడి పట్టాను అందుకున్నారు.2017 సంవత్సరంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థలలో పీఈటి పోస్ట్ కోసం పరీక్ష రాయగా ఫలితాలు అనంతరం ఉత్తీర్ణురాలైనప్పటికీ కోర్టు కేసుల ద్వారా పోస్టింగ్ ఆలస్యమైంది.కాలం వృధా చేయకుండా వాస్తు జ్యోతిష శాస్త్రాలలో ప్రావీణ్యం పొంది జ్యోతిష్కురాలిగా సేవలందిస్తుండగా 2024 సంవత్సరంలో కోర్టు కేసులు తొలగి హైదరాబాద్ లోని నాగారం గర్ల్స్ గురుకుల స్కూల్లో ఉద్యోగం లభించగా ప్రస్తుతం అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.


ఆ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఉన్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు చంద్రిక పాఠశాలకు చేరుకొని యోగా తోని దినాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు రకాల వ్యాయామాలు పిల్లలతో చేయిస్తారు. శారీరక దృఢత్వం కోసం చంద్రిక విద్యార్థులకు ఎన్నో విధాలైన వ్యాయామాలు,ఆహార నియమాలు,సలహాలు,సూచనలు అందజేస్తూ ఉంటారు. ఆ తరువాత పర్యవేక్షణలో భాగంగా విద్యార్థులందరూ క్రమశిక్షణతో నడుచుకునేలా చూసుకుంటారు. ఈలోగా విద్యార్థులందరూ కాలకృత్యాలు తీర్చుకొని పాఠశాలకు వెళ్లడానికి సిద్ధపడతారు.అల్పాహారం చేసిన తర్వాత పాఠశాలకు చేరుకొని అసెంబ్లీలో పాల్గొంటారు. తదుపరి యధాతధంగా పాఠాలు కొనసాగుతాయి. సాయంత్రం పాఠాలు పూర్తయిన తర్వాత క్రీడా శిక్షణ మొదలవుతుంది. విద్యార్థుల ఆసక్తి మేరకు వివిధ రకాల క్రీడల్లో చంద్రిక శిక్షణ అందిస్తారు. నియమాలు, సూచనలు అందజేస్తూ వారి వారి క్రీడల్లో రాణించేందుకు తోడ్పడతారు.
చంద్రిక అద్భుతమైన శిక్షణకు చిహ్నంగా తన విద్యార్థులు ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో మొదటి స్థానాన్ని సంపాదించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీల్లో సత్తా చాటారు.

విద్యార్థులకు క్రీడలు నేర్పడం వారిని ప్రోత్సాహపరచడం జీవితంలో ముందుకు సాగేలా ఉత్సాహాన్ని ఇవ్వడం తనకు ఆనందాన్ని ఇస్తాయని చంద్రిక అంటూ ఉంటారు. తన జీవితం క్రీడలకే అంకితం కాకుండా సరి సమానంగా వాస్తు జ్యోతిష శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యం పొందారు. తన తాతగారైన పోతు కూచి కృష్ణమూర్తి శాస్త్రి గారు జ్యోతిష శాస్త్రంలో గొప్ప పండితులు కావడంతో తన పూర్వీకుల వైభవాన్ని తెలుసుకున్న చంద్రిక మనసులో ఆ శాస్త్రాన్ని ఎలాగైనా సరే నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది. తన ఉద్యోగం గురించిన కేసు కోర్టులో ఉండగా వివిధ రకాలైన జ్యోతిషశాస్త్ర పుస్తకాలు చదువుతూ భాగ్యనగరంలో శిక్షణ ఇస్తున్న కొంతమంది గురువుల దగ్గర ఈ జ్యోతిష శాస్త్రాన్ని లోతుగా తెలుసుకున్నారు. తన అద్భుత నైపుణ్యం శాస్త్ర చతురత తనకు మంచి పేరును సంపాదించి పెట్టింది. ఆ నోట ఈ నోట పాకడంతో ఎంతోమంది వారి వారి జాతక చక్రాలు పరిశీలన చేయించుకున్నారు. ఈ అనుభవం తన జ్ఞానానికి మరింత తోడ్పడింది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన ఉద్యోగ సమయాలు ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి 9 గంటల వరకు ఉండడంతో పగలు మిగతా సమయంలో తన పూర్వ జ్ఞానాన్ని మరచిపోకుండా నెమర వేసుకుంటూ తనను సంప్రదించిన వాళ్ల జాతక చక్రాలు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు పరిహారాలు ఇస్తూ ఉంటుంది. క్రీడా విభాగంలో తన విద్యార్థులను నేషనల్ స్థాయిలో ఆడించడమే తన లక్ష్యంగా, జ్యోతిష విభాగంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తూ ఆనందంగా జీవితం గడపాలి అనేదే చంద్రిక కోరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నదీమతల్లి-8వ భాగం

వంటిల్లు – వొడవని ముచ్చట