నేను రాసింది కవిత్వమని మీరంటే
నేనొప్పుకోను !
చెమట చుక్కకి, కన్నీటి చుక్కకి మధ్య
ఆవిరైపోతున్న వ్యధార్థ గాథలను
అక్షరాల ఆలంబనతో ఓదారుస్తున్నానంతే !
ఆకలి రక్కసికి, ధన పిశాచికి మధ్య
నలిగిపోతున్న జీవిత చక్రాలను
అక్షరాల శక్తితో ఆపుతున్నానంతే !
బతుకు పోరాటానికి, ఆయుష్షు ఆరాటానికీ మధ్య
బిగుసుకుపోతున్న కష్టాల సంకెళ్లను
అక్షరాల ఆయుధంతో ఛేదిస్తున్నానంతే
మానవ బంధానికి, ఆర్ధిక బంధానికీ మధ్య
ఛిద్రమైపోతున్న మానవత్వ చిరునామాను
అక్షర యుక్తితో కనుగొంటున్నానంతే !
స్వార్థానికి, సౌహార్ద్రానికీ మధ్య
గుర్తించలేకపోతున్న అజ్ఞాన తిమిరాలను
అక్షర కిరణాలతో తరిమి కొడుతున్నానంతే !
మనోదౌర్బల్యాలకీ, క్షణికానందానికీ మధ్య
పెరిగిపోతున్న నిర్లిప్త ధోరణులను
అక్షరాల జ్వాలలతో కాల్చేస్తున్నాను అంతే!
హక్కుల చైతన్యానికీ,బాధ్యతల నిర్లక్ష్యానికి మధ్య
ఊగిసలాడుతున్న ఉదాసీనతను
అక్షరాల కొరడాతో అదిలిస్తున్నానంతే !
నేనురాసింది కవిత్వమని మీరంటే
నేనొప్పుకోను!
అక్షరాలను ప్రజ్వలింపజేస్తే
దగ్ధం కానిదేదీ లేదని చెబుతున్నానంతే !