తేది: 27-8-24 కిందటి భాగం తరువాయి …
నిన్న యంగ్ఫ్రావ్యోచ్ (Jungfraujoch), ఇంటర్లాకెన్ (Interlaken) అనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలోని Kursaal Park, అక్కడ ఉన్న యాష్ చోప్రా శిల్పాన్ని చూసాక, అప్పటికే డిన్నర్ టైమ్ అయిందని మమ్మల్ని దారిలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళారు. సాయంత్రం ఆరున్నర ఏడు సమయంలో భోజనం చేయటం అప్పటికే అలవాటైనా… ఏదో ఇబ్బంది. తప్పదని తిన్నామనిపించు కున్నాము. ఆరోజు కృష్ణాష్టమి. ఉన్నవాళ్ళంతా ఉత్తరాది వాళ్ళు, జన్మాష్టమిని బాగా జరుపుకునేవారు. అందుకని వైదేహి ఆ రాత్రి స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. హోటల్లో రూంకెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎనిమిదిన్నరకల్లా హోటల్ కిందకి వచ్చేయమంది. అందరం హోటల్ ముందు చేరుకున్నాము. ఆరోజు కృష్ణాష్టమి అని హోటల్ వాళ్ళతో గర్బా ఆడటం కోసం పర్మిషన్ తీసుకున్నానని వైదేహి అనటంతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేసింది. మ్యూజిక్ సిస్టమ్ లో గర్భా డాన్స్ మ్యూజిక్ పెట్టింది. అందరికీ గర్భా ఆడటం రాకున్నా వాళ్ళ ఆటలో పాలుపంచుకున్నాము. చాలా సరదా అనిపించింది. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. రొటీన్ ఉరుకుల పరుగుల దినచర్యకు భిన్నంగా, చాలా రోజుల తర్వాత తమ ఇష్టానుసారంగా డాన్స్ చేయటం వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేసింది. పిల్లలంతా గర్భా డాన్స్ ని చివరకు తీన్ మార్ చేసేసారు. కొత్తగూడెం నుంచి వచ్చిన రాణి గారు జ్వరంతో ఉన్నా మాతో పాటు ఆడారు.

మరునాడు ఉదయమే 8 కల్లా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి 9 గంటల కల్లా టిట్లీ పర్వతం వెళ్ళటానికి రెడీ అవాలని వైదేహి ముందు రోజు రాత్రే మెసేజ్ పెట్టింది. నిన్న మౌంటైన్ పైకి వెళ్ళగానే నాకు తలతిరిగి ఇబ్బంది పడ్డట్టే ఇక్కడ కూడా అవుతుందని బాయిల్డెగ్, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్ కడుపు నిండుగా తినేసాను. లేట్ కాకుండా పదిన్నర వరకు టిట్లి చేరుకున్నాము. దారి పొడుగునా పచ్చికబయలు, వాటిలో నల్లమచ్చల ఆవులు, గడ్డిమేస్తున్నప్పుడు లీలగా వాటి మెడలో గంటల సవ్వడులు, నీటి వాగులు, దూదిపింజాల్లా ఎగురుతున్న మేఘాలు చాలా అందంగా అనిపించింది. బస్సు దిగగానే చల్లటి గాలి వణికించింది. అక్కడకూడా పైకి వెళ్ళటానికి కేబుల్ కార్ ఫెసిలిటీ ఉంది.
స్విట్జర్లాండ్‌లోని ఎంగెల్బర్గ్ అనే ఊరికి దగ్గరగా ఈ పర్వతాలు ఉన్నాయి. మౌంట్ టిట్లి సముద్ర మట్టానుంచి 3,238 మీటర్లు (10,623 అడుగుల) ఎత్తుఉంది. ఇవి యూరి ఆల్ప్స్ (Uri Alps) పర్వత శ్రేణికి చెందినవి.
దీన్ని 1744లో మొదటగా ఇద్దరు పర్వతారోహకులు అధిరోహించారు. ఒకరు ఇగ్నాజ్ హెస్ (Ignaz Hess), మరొకరు జె.ఈ. వాసెర్ (J.E. Waser). ఇది పర్వతారోహణ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా గుర్తించబడింది, ఎందుకంటే అప్పటికి ఈ ప్రాంతాలు పూర్తిగా కనుగొనబడలేదు. ఆరోహణకు సంబంధించిన మొదటి వ్రాతపూర్వక ఆధారాలు ఎంగెల్బెర్గర్ డాక్యుమెంట్లో కనుగొనబడ్డాయి. 1744లో నలుగురు వ్యక్తుల బృందం శిఖరాగ్రానికి చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు. జనవరి 21, 1904న జోసెఫ్ కస్టర్ మరియు విల్లీ అమ్ర్హెయిన్ టిట్లిస్ యొక్క మొదటి స్కీ ఆరోహణను చేశారు. మార్చి 1967లో క్లైన్ టిట్లిస్ (3,032 మీ)కి కేబుల్ కారు ప్రారంభించబడింది. డిసెంబర్ 2012లో, ఎంగెల్బర్గ్–గెర్ష్నియల్ప్ కేబుల్ వే యొక్క 110వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టిట్లిస్ క్లిఫ్ వాక్ ప్రారంభించబడింది. క్లైన్ టిట్లిస్ ఒక ముఖ్యమైన టెలికమ్యూనికేషన్ సైట్ ఉంది, ఇది అధిక సామర్థ్యం గల పాయింట్–టు–పాయింట్ మైక్రోవేవ్ రేడియో లింక్‌లు, VHF/UHF రిపీటర్ల కోసం ఉపయోగించబడుతుంది. లైసెన్స్ పొందిన బ్యాండ్ రేడియో లింక్‌లను స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ నియంత్రిస్తుందిట. మొదట దీన్ని గ్రాస్ టిట్లిస్ (Gross Titlis) అని పిలిచేవారు. తరువాత ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 1913లో ఎంగెల్బర్గ్–గెర్ష్నియాల్ప్ ఫునిక్యులర్ రైలు ప్రారంభమైంది. 1937లో ట్రుబ్సీకి కేబుల్ కార్ ప్రారంభించారు. 1992లో ప్రపంచంలో తొలి 360° తిప్పే కేబుల్ కార్ అయిన టిట్లిస్ రోటైర్ ప్రారంభించబడింది. టిట్లిస్ రోటైర్ ప్రపంచంలోనే మొదటి 360 డిగ్రీలు తిప్పే కేబుల్ కార్. స్టాండ్ (Stand) నుంచి టిట్లిస్ శిఖరానికి వెళ్తుంది. చుట్టూ ఉన్న ఆల్ప్స్, గ్లేసియర్లు, లోతైన పగుళ్లు అన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి
ఇక్కడి ప్రధాన ఆకర్షణలు టిట్లిస్ క్లిఫ్ వాక్ – యూరప్‌లోనే అత్యంత ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జి (100 మీటర్లు పొడవు), గ్లేసియర్ కేవ్ – మంచు లోపల ఉన్న 150 మీటర్ల సొరంగం, ఐస్ ఫ్లైయర్ చైర్లిఫ్ట్ – గ్లేసియర్ పైన క్రేవేస్లపై ప్రయాణించేందుకు, స్నో పార్క్ లో వేసవి కాలంలో కూడా మంచు ఆటలు, ట్రుబ్సీ సుందరమైన సరస్సు, నడకలకు, విశ్రాంతికి అద్భుతమైన ప్రదేశం. దీన్ని చేరుకోవటానికి లూసెర్న్ నుంచి ట్రైన్ ద్వారా ఎంగెల్బర్గ్ కు వెళ్ళాలి. సుమారు 1 గంట ప్రయాణం. అక్కడినుంచి టిట్లిస్ ఎక్స్‌ప్రెస్ కేబుల్ కార్ – ట్రుబ్సీ వరకు అటుపై స్టాండ్ నుంచి టిట్లిస్ రోటైర్ ద్వారా శిఖరం చేరవచ్చు. టాప్‌లో గ్లేసియర్ ఉండే కారణంగా ఏకంగా సంవత్సరం పొడవునా మంచు ఉంటుంది. అక్టోబర్ నుంచి మే వరకు స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి శీతాకాల ఆటలు జరుగుతాయి. మౌంట్ టిట్లిస్ యొక్క చారిత్రక విశేషాలు (Historical Highlights) మనకు పర్వత యాత్రల అభివృద్ధి, ఆవిష్కరణలు, స్విట్జర్లాండ్‌లో పర్యాటక వికాసాన్ని వివరంగా తెలియజేస్తాయి. ఇది కేవలం ఒక మంచు పర్వతమే కాకుండా, పర్వతారోహణ, శాస్త్రీయ అన్వేషణ, ఆధునిక పర్యాటక సదుపాయాల చారిత్రక కేంద్రంగా గుర్తింపు పొందింది. తరువాతి కాలంలో రవాణా అభివృద్ధి చెందింది.

1913: ఎంగెల్బర్గ్ నుంచి గెర్ష్నియాల్ప్ వరకు మొదటి ఫునిక్యులర్ రైలు (funicular railway) ప్రారంభమైంది. 1937: ఎంగెల్బర్గ్-ట్రుబ్సీ కేబుల్ కార్ ప్రారంభమై, పర్యాటకుల ప్రవర్తన మారింది. టిట్లిస్ చేరడం సులభమయ్యింది. 1967: స్టాండ్ నుంచి కేబుల్ కార్ ప్రారంభం – మరింత ఎత్తుకు ప్రయాణం. 1992: ప్రపంచంలో తొలి 360° తిప్పే కేబుల్ కార్ అయిన టిట్లిస్ రోటైర్ (Titlis Rotair) ప్రారంభించబడింది. ఇది టిట్లిస్ను అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా మార్చిన మైలురాయి. 2012 టిట్లిస్ క్లిఫ్ వాక్ నిర్మాణం – యూరోప్‌లో అత్యంత ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జ్ (3,041 మీ. ఎత్తులో) ఈ నిర్మాణాలు పర్వత పర్యాటకాన్ని సాంకేతికంగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. టిట్లిస్ క్లిఫ్ వాక్ – సగటున 3,041 మీటర్ల ఎత్తులో ఉన్న యూరోప్‌లోనే ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జి, 100 మీటర్లు పొడవు – “100 m long suspension bridge… 3,041 m above sea level” ఇవి అక్కడి అద్భుత నిర్మాణాలు. గ్లేసియర్ కేవ్ (Glacier Cave) ప్రకృతి రూపొందించిన మంచు గుహ. దీన్ని టిట్లిస్ టాప్ స్టేషన్ దగ్గర ఓపెన్ చేశారు. ఇది కనిష్ఠంగా 5,000 ఏళ్ల నాటి మంచుతో ఏర్పడినదిగా భావిస్తున్నారు.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టిట్లిస్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటి. భారతీయ సినిమాల్లోనూ టిట్లిస్ ప్రాచుర్యం పొందింది (ఉదాహరణకు: దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలో). టిట్లిస్ చరిత్ర అనేది మానవ సంస్కృతి, సాహసయాత్ర, సాంకేతిక పురోగతికి ప్రతిబింబంగా నిలుస్తుంది. 360° రోటైర్ కేబుల్ కార్ ప్రయాణం, మంచుతో నిండిన శిఖరం వైపునుంచి తీసిన స్మరణీయ దృశ్యాలు. గ్లేసియర్ కార్జ్ (తొలచబడిన గుహ) నిర్మాణాలు, మంచుతో నిండిన హాల్ మరియు స్టేషన్ ప్రాంతాలు. కొన్ని ఇతర చారిత్రక, ప్రకృతి ఆధారమైన విశేషాలు గ్లేసియర్ గుహలో సుమారు 5,000 సంవత్సరాల వయసున్న మంచు ఉంది. ఒరలోను, చిప్పలుగా ఆడతుంది – “dim turquoise-blue light… 5,000-year-old ice”
టిట్లిస్ అనేది ఉరి ఆల్ప్స్ పర్వతం, ఇది ఓబ్వాల్డెన్, బెర్న్ ఖండాల మధ్య సరిహద్దులో ఉంది. సముద్ర మట్టానికి 3,238 మీటర్లు (10,623 అడుగులు) ఎత్తులో, ఇది బెర్నీస్ ఒబెర్లాండ్, సెంట్రల్ స్విట్జర్లాండ్ మధ్య, సస్టెన్ పాస్‌కు ఉత్తరాన ఉన్న శ్రేణిలో ఎత్తైన శిఖరం. ఇది ప్రధానంగా ఉత్తరం వైపున ఎంగెల్బర్గ్ (OW) నుండి ప్రారంభం అయిందని చెబుతారు. ప్రపంచంలోని మొట్టమొదటి తిరిగే కేబుల్ కారు ఉన్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. కేబుల్ కార్ వ్యవస్థ ఎంగెల్బర్గ్ 996 మీ (3,268 అడుగులు) నుండి క్లైన్ టిట్లిస్ 3,028 మీ (9,934 అడుగులు) శిఖరానికి గెర్ష్నియల్ప్ 1,262 మీ (4,140 అడుగులు), ట్రూబ్సీ 1,796 మీ (5,892 అడుగులు), స్టాండ్ 2,428 మీ (7,966 అడుగులు) ల మూడు దశల ద్వారా కలుపుతుంది. 2016లో, గెరాష్నియల్ప్ను దాటవేసి, నేరుగా ట్రూబ్సీకి వెళ్లే ప్రత్యక్ష మార్గం సృష్టించబడింది. కేబుల్ కారు చివరి భాగం హిమానీనదం పైన ఉంటుంది. క్లైన్ టిట్లిస్ వద్ద, కేబుల్–కార్ స్టేషన్‌లోని ప్రవేశ ద్వారం నుండి ప్రకాశవంతమైన హిమానీనద గుహను సందర్శించడం సాధ్యమవుతుంది, ఇందులో దుకాణాలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఐరోపాలో ఎత్తైన సస్పెన్షన్ వంతెన అయిన టిట్లిస్ క్లిఫ్ వాక్ ఆల్ప్స్ అంతటా దృశ్యాలను అందిస్తుంది. చాలా మంది ప్రజలు యంగ్ఫ్రావ్యోచ్ కంటే చౌకైన సులభమైన ఎంపికగా టిట్లిస్ను ఉపయోగిస్తున్నారు.

టిట్లిస్ ఓబ్వాల్డెన్, బెర్న్ మధ్య సరిహద్దును దాటుతుంది. టిట్లిస్ (కొన్నిసార్లు గ్రాస్ టిట్లిస్ అనే పేరుతో గుర్తించబడుతుంది). క్లైన్ టిట్లిస్ రెండూ ఉత్తరాన ఎంగెల్బర్గ్ దక్షిణాన గాడ్‌మెన్ మునిసిపాలిటీల మధ్య ఉన్నాయి. టిట్లిస్ మాసిఫ్ కూడా పాక్షికంగా నిడ్వాల్డెన్లో ఉంది, ఇక్కడ ఆ ఖండంలోని ఎత్తైన ప్రదేశం కనిపిస్తుంది. రోట్స్టాక్లి (2,901 మీ). టిట్లిస్ అనేది ఓబ్వాల్డెన్లో ఎంగెల్బర్గ్ లోయలో ఎత్తైన ప్రదేశం. టిట్లిస్కు తూర్పున గ్రాసెన్ ఉంది, ఇక్కడ ఓబ్వాల్డెన్, బెర్న్ ఉరి ఖండాల మధ్య సరిహద్దులు కలుస్తాయి. స్విట్జర్లాండ్ భౌగోళిక కేంద్రం పర్వతానికి పశ్చిమాన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సస్టెన్ పాస్‌కు ఉత్తరాన ఉరి ఆల్ప్స్ భాగంలో టిట్లిస్ ఎత్తైన పర్వతం. వరుసగా ఆరే, రౌస్ బేసిన్ల జలాలను వేరు చేస్తుంది. ఉత్తరం వైపున, ఎంగెల్బర్గ్ (ఎంగెల్బెర్గెర్టల్) లోయ లూసెర్న్ సరస్సు యొక్క ఉపనది అయిన ఎంగెల్బెర్గర్ ద్వారా పారుతుంది. ఈ లోయ లూసెర్న్ సరస్సు నుండి దక్షిణం వైపున ఉంది. మాసిఫ్ ఉత్తర భాగం టిట్లిస్ హిమానీనదం (జర్మన్: టిట్లిస్గ్లెట్షర్) చేత కప్పబడి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీనదం తగ్గింది. ఇది దాదాపు ఇరవై సంవత్సరాలలో అదృశ్యమవుతుందని భావిస్తున్నారు. వెండెన్ హిమానీనదం పైన దక్షిణ నిటారుగా రాతి ముఖం పెరుగుతుంది. తూర్పు వైపు ఫిర్నాల్పెలిగ్లెట్షర్ అనే హిమానీనదం కనిపిస్తుంది. పూర్వ కాలంలో, టిట్లిస్ను వెండెన్స్టాక్ లేదా నోలెన్ అనే పేర్లతో పిలిచేవారు. రీసెండ్ నోలెన్, వెండెన్స్టాక్ పర్వతానికి సమీపంలోని పశ్చిమ పొరుగు ప్రాంతాలు, టిట్లిస్ కంటే కొంచెం దిగువన, కానీ పదునైన కఠినమైన శిఖరాలతో ఉన్నాయి. 1435 నాటి పత్రంలో ఈ పర్వతాన్ని టుట్టెల్స్బర్గ్ (టుటిలోస్ పర్వతం) అని పిలుస్తారని, ఇది టుటిలోస్ అనే వ్యక్తిని సూచిస్తుందని, (అతను బహుశా స్థానిక రైతు అయి ఉండవచ్చు) రాసి ఉన్నట్టు చెబుతారు. టుటిలోస్ బెర్గ్ నుండి వచ్చిన ఈ పేరు టిట్లిస్బర్గ్ తరువాత టిట్లిస్గా మారింది. టిట్లిస్ శిఖరం మంచు రేఖకు పైన ఉంది, అందువల్ల ఇది శాశ్వత మంచు కవచం, ఘనీభవన ఉష్ణోగ్రతలతో చల్లని, మంచు వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
వైదేహి ఇవన్ని వివరిస్తూ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రతలు తీసుకోవాలని చెప్పింది. నిన్న యంగ్ఫ్రావ్యోచ్ పైన నాకు తలతిరిగినట్టుగా ఇక్కడ అవుతుందని భయపడ్డాను. కాని పొద్దుట కాస్త హెవీగానే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల అంతగా బాధపడలేదు. కేబుల్ కార్ లో పైకి వెళ్ళి చూస్తే, ఎక్కడ చూసినా మంచు. అందరూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసారు. అక్కడ దిల్వాలే దుల్హనియా లేజాయింగే లోని కారెక్టర్స్ కాజోల్ షారుఖ్ ల నిలువెత్తు కట్అవుట్స్ పెట్టారు. దాని పక్కన నిలుచుని అందరూ ఫోటోలు తీసుకున్నారు. చల్లటి గాలి చర్మాన్ని మంట పుట్టించింది. మాస్క్ లతో ముఖం కప్పుకున్నాము. అక్కడనుంచి క్లిఫ్ వాక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. రెండు ఎత్తైన శిఖరాల మధ్య వేయబడిన ఇనుప నెట్ తో తయారు చేయబడింది. పక్కనున్న ఇనుప తాళ్ళను పట్టుకోని నడిచాము. అందరి నడక అదుపుకు వంచన ఊగి కొంచెం భయం కలిగిస్తుంది. నెమ్మదిగా పట్టుకుని నడిచాను. మేము వంతెన మధ్యలో ఉండగా ఒక కొంటె కుర్రవాడు రెండువైపుల ఉన్న తాళ్ళను పట్టుకుని గట్టిగా ఊపటం మొదలు పెట్టాడు. అందరం కదిలి పోయాము. అంతా పెద్దగా కేకలు పెట్టారు. అందరూ ఆ అబ్బాయిని గదమాయించటం వల్ల ఊపటం ఆపాడు. మెల్లిగా 100 మీటర్ల పొడవున్న వంతెన ఆ చివరికి చేరుకున్నాము. ఎవరికి వారు వారి వారి కుటుంబాలతో విడివిడిగా తిరుగుతున్నారు. ప్రణయ్ ఎక్కడున్నాడో కనబడలేదు. కొత్తగూడెం పిల్లలతోనే ఎక్కువగా తిరుగుతున్నాడు. అందరూ దాదాపు ఒకే ఈడు వాళ్ళు. సహజం కదా. నేను ఒంటరిని అయి పోయాను. అయినా జ్యోతి, వాళ్ళ అమ్మగారు జూలీ నాతోనే ఉండటం కొంత సంతోషంగా అనిపించింది. మొదటినుండి జ్యోతి, నన్నూ వాళ్ళ అమ్మగారితో పాటు తీసుకెళ్ళుతుండటం, వాళ్ళతో పాటు నాకేం కావాలో చూడటం నాకు సంతోషం కలిగించింది. జూలీ గారితో మంచి స్నేహం ఏర్పడింది. మొదట ప్రణయ్ కి అమ్మమ్మని కాబట్టి అంతా దాది అని పిలిచినా తరువాత జ్యోతి మాత్రమే ఆంటీ అని, మిగిలిన అందరూ మేడమ్ అని పిలవటం మొదలు పెట్టారు. అక్కడ టికెట్ కౌంటర్ లో జ్యోతి మా ముగ్గురికి టికెట్స్ తీసుకుంది. కాస్త పక్కగా ఒక ఊయల లాగా ఉన్న సోఫాలో కూచున్నాము. అక్కడనుంచే పర్వతపు అందాలు చూడాలేమో ననుకున్నాను. ఒక్కసారిగా జుయ్ మంటూ ఆ ఊయల పర్వతపు అంచులవేపు బయలుదేరింది. అనుకోని ఆ ప్రయాణం వల్ల గుండే ఒక్కసారిగా కొట్టుకోవటం ఆగిందనిపించింది. జ్యోతి టికెట్స్ తీసుకున్నది దీనికోసమేనని అప్పుడర్థమయింది. అదే 360° తిప్పే కేబుల్ కార్ అయిన టిట్లిస్ రోటైర్. చూస్తుండగానే మేము ముగ్గురం కూచున్న ఆ సోఫా ఊయల కిందికి దూకుడుగా బయలుదేరింది. భయంకరంగా అనిపించింది. మాముందు పట్టుకోవటానికి ఉన్న హాండిల్ తప్ప ఏ ప్రొటెక్షన్ లేదు. నా భయాన్ని బయటకు ప్రదర్శించకుండా హాండిల్ గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. నాలుగైదు పర్వత శిఖరాల పైనుంచి కిందికి వెళ్ళి కాసేపు ఆగి మళ్ళి వెనక్కి తిరిగింది. మధ్యలో మేఘాలు తగులుతూ వెళుతున్నాయి. చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. అయ్యో ప్రణయ్ దీన్ని మిస్ అవుతాడేమో అనుకున్నా. తిరిగి క్లిఫ్ వాక్ బ్రిడ్జ్ పైనుంచి వచ్చాక అక్కడ కనబడ్డాడు ప్రణయ్. వాణ్ణి వెళ్ళమని చెప్పాను. జాగర్తగా పట్టుకోమని మరిమరీ చెప్పాను. వాడు తిరిగి వచ్చేవరకు నాకు కొంచెం కంగారు గానే ఉండింది. వాడికి ఆ రైజింగ్ చాలా నచ్చింది. తిరిగి కిందకు వెళ్ళటానికి కేబుల్ కార్ లో ప్రయాణం అయ్యాము. ఎందుకో నా బాగ్ కూడా ప్రణయ్ తీసుకున్నాడు. కేబుల్ కార్ దిగి బయటకు నడుస్తున్నప్పుడు నా బాగ్ ఇవ్వమంటూ ముందుకు నడిచాను. అప్పుడు చూసుకున్నాడు నా బాక్ బాగ్ వాడి దగ్గర లేదని, కేబుల్ కార్ లో మర్చి పోయాడని. వెనక్కి పరిగెట్టారు మగపిల్లలు. నాకు చెప్పలేదు. కేబుల్ కారు అసలు ఆగదు. తిరిగి వెనక్కి వెళ్ళి పోతుంది. అప్పుడు ప్రణయ్ ని వెనక్కి పిలిచింది కొత్తగూడెం ఫామిలీ రాణి గారు. మా వెనకాల కేబుల్ కార్ దిగుతూ సీటు దగ్గర పడి ఉన్న బాగ్ చూసి, అది నాదని గుర్తుపట్టి తీసుకొచ్చింది. ప్రణయ్ ముఖం భయంతో ఎర్రగా అయిపోయింది. “థాంక్యూ ఆంటీ. మీరు గుర్తుపట్టి తీసుకొచ్చారు. కారు ఎక్కేటప్పుడు విజయ దగ్గరనుంచి తీసుకున్నాను. ఎప్పుడు తన దగ్గరే ఉంచుకుంటుంది. నేను నాబాగ్ మాత్రమే కారీ చేస్తున్నాను. అందుకే నేను మర్చిపోయాను. ఇదికాని పోయిందో నన్ను చంపేస్తుంది. దాంట్లోనే పాస్‌పోర్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అమ్మో.” అన్నాడు. “అందుకే నేను ఎవరికి నా బాగ్ ఇవ్వను. రాణిగారు చూసి, తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేక పోతే మళ్ళీ ఆ కార్ ని వెతుక్కుంటూ పై వరకు వెళ్ళవలసి వచ్చేది.” అన్నాను. “ లేదు మేడమ్. ఇక్కడ ఏ వస్తువులు పోవు. తమవి కాని వస్తువులని ఎవరూ తీసుకుపోరు. వాటిని ఆర్గనైజర్స్ కలెక్ట్ చేసుకుని ఆఫీస్ లో సెక్యూర్ చేస్తారు. మనం కంప్లైంట్ చేస్తే మనకు తిరిగి ఇచ్చేస్తారు” అంటూ వైదేహి చెప్పింది. మంచి సిస్టమే. మనదగ్గర కూడా ఉంటే బాగుండునని అనుకున్నాము.

హోటలుకి బయలుదేరాము. అదే అందరం కలిసి ప్రయాణించే ఆఖరి బస్సు ప్రయాణం. ఆ వారం రోజులు అందరం ఒకే ఫామిలీ లాగా గడిపాము. మళ్ళీ జీవితంలో కలుస్తామనే గ్యారెంటీ లేదు. తల్చుకుంటే చాలా బాధనిపించింది. వైదేహి అదే విషయాన్ని చెబుతూ వోటఫ్ థాంక్స్ లాగా మాట్లాడింది. అందరికి పేరు పేరునా అభినందించింది. నా గురించి, ప్రణయ్ గురించి చెబుతూ ‘నేను చాలా భయపడ్డాను. బయలుదేరేముందు మేడమ్ వాళ్ళ అమ్మాయి నాతో మాట్లాడారు. మా అమ్మకి ఏ కష్టమూ కలగ కూడదు. ఆమెని, మాఅబ్బాయిని జాగర్తగా చూసుకొండి. అని జాగర్తలు చెప్పింది. కాని నేను విజయా మేడమ్ ను చూసుకోవలసిన అవసరమే పడలేదు. షి ఈజ్ సో ఆక్టివ్, వెరీ యనర్జిటిక్ అండ్ స్పోర్టివ్. షి ఓన్లి టేకెన్ కేర్ ఆఫ్ అదర్స్. షి ఈజ్ సో లవ్లి. థాంక్యూ సో మచ్ మేడమ్. ప్రణయ్ చాలా మంచి అబ్బాయి. మా రెండో అబ్బాయి కూడా అతని వయసే ఉంటుంది. కాని ప్రణయ్ కున్న మచ్యూరిటీ లేదు. వీలైతే ఒకసారి ప్రణయ్ ని మా అబ్బాయికి పరిచయం చేయాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫెనెట్లి ఐ విల్ మీట్ హిమ్. లవర్ బాయ్! థాంక్యూ వెరీ మచ్” అంటూంటే చాలా ఆనందంగా అనిపించింది. అదేమరి నలుగురితో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి. ప్రణయ్ గురించి భయపడ్డాను. కాని వాడు అందరితో తిరుగుతూ తల్లో నాలుక లాగా మెలిగాడు. అందరికి వాడంటే ఇష్టం ఏర్పడింది. అందరికి హోటల్ ల్లోనే రాత్రి డిన్నర్ ఏర్పాటు చేసారని, రూంకి వెళ్ళి బాగ్స్ పాక్ చేసుకుని పొద్దుట ఆరింటికల్లా మొదటి బాచ్ బయలు దేరాలని చెప్పింది. రెండో బాచ్ ట్వెల్వ్ కల్లా హోటల్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలని, ఫ్లైట్ నాలుగింటికి ఉంది. అందుకే లంచ్ ఏర్పోర్ట్ లోనే చేయాలని చెప్పింది.
తెల్లవారి అందరము తిరుగు ప్రయాణం. మేము, కొత్తగూడెం వాళ్ళు, అహమ్మదాబాద్ ఫామిలీ, కొయంబత్తూర్ తమిళ్ ఫామిలీ సాయంత్రం ఫ్లైట్. జ్యోతి, జూలి, మిథాలి మిగిలిన వాళ్ళతో కాసేపుగడిపి పొద్దుట వెళ్ళే వాళ్ళందరికీ బాధతో బాయ్ చెప్పి రూంకి వెళ్ళి పోయాము.
చివరి అంకం ఇండియా తిరుగు ప్రయాణం గురించి వచ్చే ఎపిసోడ్ లో చెప్పుకుందాం.