రమక్కతో ముచ్చట్లు 38

ఆడెక్క లెక్క ఏడ్సుడు…!

అందరికీ శేనార్థులు.
ఎట్లున్నరు.
ఈ రోజు ముచ్చట ఏడ్పు కత. అది సుత తమ్మీ…! మీ మొగోళ్ళ ఏడ్పు కత.
​”మొగోళ్ళు ఏడ్వద్దు”, “ఆడెక్కలెక్క ఆ ఏడుపేంది? – తరతరాలుగా మన సమాజంల ఇనిపిస్తున్న మాటలివి. ఒక మగపిల్లగాడు దెబ్బతగిలినా, బాధ కలిగినా వాడి కండ్ల కెంచెల్లి నీళ్లు వస్తే….వాడిని ఓదార్చుడు పోయి…అతన్ని ప్రశ్నించే ధోరణి మన సంస్కృతిల బలంగ నాట్కపోయింది. అసలు ఏడుపు అనేది కేవలం ఒక్కొక్క జెండరుకు సంబంధించినదా? లేక అది మనిషి తత్త్వమా? ఏడ్సినప్పుడు మన శరీరంల ఎసువంటి రసాయన మార్పులు జరుగుతయి? కన్నీళ్ల ఎనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం (Science) ఏం చెబుతది? ఈ విషయాలను సామాజిక, మానసిక, శాస్త్రీయ మరియు సాహిత్య కోణాల్ల సూద్దాం. అదే ఇయ్యాల్లటి ముచ్చట.
​. ఈ సామాజిక దృక్పథం గమ్మత్తు తయారైంది. మొగోడు ఏడ్వద్దు అని బ్రమల పెట్టింది. ఇది ఒక Social Construct. ​
మొగోడు ఏడ్వొద్దని యే శాస్త్రంల లేదు.
మన మూర్కత్వం అది.
పురాతన కాలం నుండి మగవాడిని కుటుంబానికి రక్షకుడిగ, కష్టాలను తట్టుకునే ఒక బండరాయిల సూపుడు అలవాటు జేస్కున్నరు.దీనిని సైన్సు
​టాక్సిక్ మస్క్యులినిటీ అంటది. అంటే….సమాజం మగతనానికి కొన్ని తప్పుడు నిర్వచనాలు ఇచ్చింది. భయము బాధ, దుఃఖం ఇవన్నీ దాసుకోవాలే. ఒట్టి కోపం సూపుడు మొగతనం అన్నట్టు తయారు జేసిన్రు.
దీనిని ఏ రాజ్యాంగం చేయదు. కుటుంబంలనే ఇట్ల మాట్లాడ్తరు. ఆడోళ్లే ఇట్ల అంటరు.ఒక చిన్న పిల్లగాడు కిందపడి ఏడిస్తే, అమ్మా అయ్యలు..”ఒరేయ్! మొగ పోరన్వి గట్లేడుస్తావురా…. ఆడెక్కలెక్క!” అంటరు. మస్తు మంది అనంగ ఇన్న నేను.
గిదేం లెక్క మీరే చెప్పుండి జెర.పాపం ఆ పొట్టెగానికి నొప్పి కాదా?!
ఇది ఎంత ప్రమాదం అని మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతదంటే…. వాళ్లకు తెల్వకుండనే, వాళ్ల భావోద్వేగాలను అణిచేస్తరు.
నువ్వు మొగోనివి ఏడ్వకు, ఆడిపిల్లోలే అని చెప్పుడు శానా తప్పు.
​కానీ, నిజానికి ఏడుపు అనేది బలహీనత కాదు. అది మనస్సు తన భారాన్ని దించుకునే ఒక సహజ ప్రక్రియ. బాధ వచ్చినప్పుడు ఏడ్వడం ఎవల్ల కైనా సహజం.
​ కన్నీళ్ల ఎనక ఉన్న విజ్ఞాన శాస్త్రం (Science of Tears) సూద్దాం ఓ పారి….
​శాస్త్రీయంగ సూస్తే, కన్నీళ్లు అన్నీ ఒక్కలెక్కనే ఉండవట ఎర్కనా…!
మనిశి శరీరంల మూడు రకాల కన్నీళ్లు తయారు అయితయట. ఒకటి
​బేసల్ కన్నీళ్లు ఇవి మన కండ్లను ఎప్పటికి తడిగ ఉంచుతూ, దుమ్ము ధూళి పడకుండ కాపాడుతయి.ఇగ రెండో రకం…
​రిఫ్లెక్స్ కన్నీళ్లు.. ఇదేందో తెల్సా ఉల్లిపాయలు గిట కోస్తం కదా, లేకుంటే కండ్లల్ల ఏదన్న పడుతే నలుస్తం అగో.. అప్పుడు వచ్చే కన్నీళ్లను రిఫ్లెక్స్ కన్నీళ్లు అంటరు. మంచిగున్నది కదా! ఏదో ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తయి అని ఎర్క గనీ, గిట్ల దానికి సుత ఒక పేరు ఉంది సూశిన్రా…ఇగ అసలు ముచ్చట.. మన శోకనాలది… అదే నబ్బా కుళ్ళి కుళ్ళి ఏడ్సుడు, ఎక్కి ఎక్కి ఏడ్సుడు,దొంగ కన్నీళ్లు పెట్టుడు, నిజంగ దుఃఖంతో ఏడ్సుడు, బాధతోని ఏడ్సుడు, కష్టంల పడి ఏడ్సుడు…. అమ్మో ఎన్ని రకాల ఏడ్పులో… ఇవన్నీ ఎమోషనల్ కన్నీళ్లు, అదే ​భావోద్వేగ కన్నీళ్లు.. బాధ, సంతోషం, కోపం, లేకుంటే ఒత్తిడికి గురైనప్పుడు సుత ఇవి వస్తయి.
​ఏడ్శినప్పుడు రకరకాల రసాయనాలు విడుదలయితయి.
​మనం తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఏడ్చినప్పుడు, మెదడులోని హైపోథాలమస్ మరియు లింబిక్ వ్యవస్థ ( ప్రేరేపించబడతయి. దీనితోని కండ్ల కెంచి నీళ్లతో బాటు శరీరంల కొన్ని అద్భుతమైన రసాయనాలు విడుదలవుతయి…
​ఎండార్ఫిన్లు & ఆక్సిటోసిన్లు వీటిని “ఫీల్-గుడ్” రసాయనాలు అంటరు. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్ల లెక్క పని జేస్తయి.ఇవి విడుదల అయితే ఏడ్చిన తర్వాత మనసుకు ప్రశాంతత లభిస్తది, శారీరక, మానసిక నొప్పి తగ్గుతది.
ఎవరింట్ల నన్న ఏదైనా ఆపతొచ్చి, లేదంటే ఎవరైన సచ్చిపోతే… ఇంకేదన్న ఆగమైతే.. ఏడుస్తుంటే ఏడవకు… ఏడవకని వచ్చినోల్లు అంటుంటే…” ఏడవని.. ఏడిస్తే దుఃఖమంత పోతది అని మన పెద్దోళ్ళు అంటుండే… గుర్తుకు వచ్చింద!
​అడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్ ACTH…ఇది ఒత్తిడిని పెంచే హార్మోను. మనం ఏడ్చినప్పుడు, ఈ ఒత్తిడి హార్మోను కన్నీండ్ల రూపంల శరీరం నుండి బయటకు పంపబడుతయంట. అందుకే ఏడ్చిన తర్వాత గుండె తేలికయితది.
​ప్రోలాక్టిను,ఇది ఒత్తిడిని నియంత్రించే మల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం సూపే హార్మోను. చూసిన్రా కన్నీళ్లు సుత ఎంత మంచి జేస్తయో మనకి.
ఆడోల్లు గాని, మొగోళ్ళు గాని వాళ్ళు ఏడ్చినప్పుడు వచ్చే..రసాయన పదార్థాలు అన్ని ఒకటే నంట. కాకపోతే ఆడోళ్ళు జర ఎక్కువ ఏడుస్తరు,మొగోళ్ళు జెర తక్కువ ఏడుస్తరు. సైన్స్ ఏం చెప్తుందో ఇంటే…పరేషాన్ అయితరు మీరు!
కంటి గ్రంథుల నిర్మాణం
​ మొగోళ్ళతోని పోలిస్తే ఆడోళ్ళల్ల కన్నీళ్లను ఉత్పత్తి చేసే గ్రంథులు మల్ల కన్నీటి నాళాలు జెర చిన్నగ ఉంటయి అట. దీనితోని..కన్నీళ్లు జెల్ది నిండిపోయి, బుగ్గల మీదికెంచి కారిపోతయి అట.మొగోళ్ళకు నాళాలు పెద్దగ ఉండి కన్నీళ్లను లోపల నిలుపుకుంటయంట.
ఇననీకి ( సదువుతుంటే) మస్తు అనిపిస్తుందిలే!

ఏది ఏమన్న గాని, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ​…!ఏడుపు అంటే అదేందో తాసిలి! మొగోళ్ళు ఏడవద్దు ఆడోళ్ళు ఏడవాలి… ఇగో గిసువొంటి ఎడ్డి ఆలోచనలు పెట్టుకోకుండి. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన డీటాక్స్ ప్రక్రియ. కష్టం తర్వాత రెండు కన్నీటి బొట్లు రాలిస్తే, పానం అల్క పడతది.

​సాహిత్యంల సుత కన్నీటికి అత్యున్నతమైన స్థానం ఉంది. కవిత్వం కన్నీటిని బలహీనతగ సూడదు, అదొక పవిత్రమైన భావవ్యక్తీకరణగ సూస్తది. కన్నీరు గుండె లోతుల్లోని ప్రేమకు, కరుణకు ప్రతీక. ​తెలుగు సాహిత్యంల ఎందరో కవులు కన్నీటి ఎనక ఉన్న ఆర్ద్రతను అద్భుతంగ వర్ణించిన్రు. “బాధల వెల్లువలోన కన్నీటి చుక్కే ఒక కాంతిరేఖ”
​మహాకవి శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ల సమాజంలోని పీడితుల కన్నీళ్లను విప్లవాగ్నిగ మార్చింరు. కన్నీరు కేవలం దుఃఖం కాదు, అది చైతన్యం సుత.
​ఇంకో దిక్కు, కన్నీటిని కేవలం ఆడోళ్ళకే ఆపాదించుడు తప్పు అని నిరూపించేల మన పురాణాలల్ల సుత పురుషులు ఏడ్చిన సందర్భాలు ఉన్నయి.
​రామాయణంల రాముడు సీతాపహరణం జరిగినప్పుడు రాముడు అడివిల చెట్లను పట్టుకుని, లక్ష్మణుడి ముందే ఎక్కి ఎక్కి ఏడుస్తడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సుత రాముడు కన్నీరు మున్నీరుగ ఏడుస్తడ. అక్కడ రాముని పౌరుషం తగ్గలేదు, మీదికెల్లి ఆయనలోని ఉత్తమ మానవీయ కోణం సుత బయటపడుతది.
​మహాభారతంల ధర్మరాజు, అర్జునుడు, అభిమన్యుడు సచ్చిపోయినప్పుడు ఇద్దరూ తీవ్రమైన శోకంల మునిగిపోతరు. శ్రీ కృష్ణపరమాత్మ సుత కన్నీండ్లు పెట్టుకుంటడు.సైన్సు, సాహిత్యం మరియు పురాణాలు సుత పురుషుల కన్నీళ్లను గౌరవించినయే తప్ప, వాటిని తక్కువ చేసి సూడలేదు. కన్నీరు అనేది లింగ రహితమైనది. ఇది యాది కుండని మనకు!

​ ఇంకొక ముఖ్యమైన ముచ్చట ఏందంటే…కన్నీళ్లను అప్పుకుంటే..ప్రమాదం అంట! గిట్ల మొగోళ్ళు ఏడ్వద్దు అని అందరూ… వాళ్ళను ఆగంచెయ్యకుండి. ఇట్ల ​సమాజానికి భయపడి వాల్లు తమ కన్నీళ్లను, బాధను లోపల్నే దాసుకుంటే… దానితోని తీవ్రమైన పరిణామాలు ఎదురవుతయి. ఒత్తిడి హార్మోన్లు లోపలనే ఉండిపోతే..డిప్రెషన్, గుండె జబ్బులు, మరియు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ అంటున్రు డాక్టర్లు. డిప్రెషన్లు, మానసికమైన రోగాలు పెరిగి కొందరు ఆత్మహత్య ప్రయత్నం సుత చేస్తరు. కన్నీళ్లు పెట్టుకోక, ఎవరికి ఏమి చెప్పుకోలేక…లోపలనే కుళ్ళిపోతరంట.
మార్పు మన నుంచే రావాలి.
​కన్నీరు అనేది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. అది కంటిని మాత్రమే కాదు, ఆత్మను కూడా శుభ్రపరుస్తది.
​ఇప్పటికైన సమాజం తన సంకుచిత ఆలోచనలను మార్చుకోవాలి. ఇంట్ల మగపిల్లగాడు ఏడిస్తే “ఆడోడిలెక్క ఏడుస్తున్నవ్” అనడం మానేసి, “నువ్వు మనిషివి, నీకు బాధ కలిగితే ఏడ్వడం నీ హక్కు, నేనున్న నీకు ” అనే భరోసా ఇయ్యాలి. లింగ బేధాలు లేని, భావోద్వేగాలను గౌరవించే ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి.
శివరాకర్న ఒక ముచ్చట. అందర్నీ ఎయిడ్స్కుంట కూసోండి అని చెప్తలేను నేను. ఏదన్న బాధ, దుఃఖమొస్తే…ఏడుపు ఆపు కోకుండి. మనిషికి -మనిషి ఆసర గావాలె. సోపతి ఉండాలే. అని చెప్తున్న గంతే!

ఉంట మరీ… పైలం
మీ
రమక్క.

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

​Where We Bloom

“ప్రకృతే ఒక ప్రేమ గీతం”