రమక్క తో ముచ్చట్లు -16

నీకు షాపింగు నాకు షాకింగు

అందరికీ శనార్థులు
మంచిగున్నరా!

ఈసారి ముచ్చట్లది టైటిల్ చూస్తేనే అర్థమయిపోయి ఉంటది అందరికీ.కత ఏంది అని!

చెల్లె..గుస్స చెయ్యకుండి మనల్ని మనం అనుకునుడు ఏంది అక్కా అని!
‘ఆడోళ్ళకు ఆడోళ్లే శత్రువు’అన్నమాట నాకు కూడా నచ్చదు! నేను దాన్ని నమ్మ!
కాకపోతే మనకు గూడ ఇగురం ఉండాల్నా వద్ద. మా పక్కింట్ల ఒక మొగుడు పెళ్ళామ్ ఫుల్ కొట్లాడుకుంటుర్రు. ఏమైందో అరుసుకోనికి పోతే ఆ పిల్లవాడు చెప్పింది విని పరేషాన్ అయినాఇగ! ఆ లొల్లి ఏందో.. ఆ కత ఏందో జెర మీకు గుడ చెప్త ఇనుండి.

రమాదేవి కులకర్ణి

మా ఇంటికి నాలుగిండ్లు అవతల ఒక పెద్ద మనిషి చచ్చిపోయింది.
వాళ్ల కోడలు దానాలు చేయాలి అని చీరలు కొననీకి ఈ పక్కింటి ఆమెను తోడు తీసుకొని షాపింగ్ మాల్కు పోయింది.
ఆమె 10 చీరలు కొంటే తక్కువకు వచ్చినయ్ అనిఈమె గుడా నాలుగైదు తెల్ల చీరలు తెచ్చుకున్నదంట, ఇప్పుడే ఎందుకే అని పెనిమిటి అడుగుతే… ఇంకో ఎనిమిది నెలల ఎండకాలం రాదా.. ఏంది సాయంత్రం పూట కట్టుకుంటా అన్నదట.
ఎనిమిది నెల్ల తర్వాత వచ్చే… ఎండాకాలంకు, చచ్చిపోయిన వాళ్ళ ఇంట్ల బట్టలు కొననీకి తోడుపోతే నువ్వెందుకు బట్టలు కొనుడు అని, భర్త అంటే అది లడాయి అన్న మాట!
” చూడక్కా… ఒక నాలుగు చీరలు కొనే స్వతంత్రం లేదా నాకు” అని ఏడుస్తుంది పిల్ల. ఎవల్లకు చెప్పాలే, ఏం చెప్పాలే మీరే చెప్పుండి.
మన తల్లులందరికీ ఒక్కటే మాట చెప్త నేను, స్త్రీ అంటెనే సౌందర్యము, స్త్రీ అంటెనే దేవి స్వరూపం.
మనకు ఉన్నంతల మంచిగ అందంగ నీట్ గ ఉండాలె మనం. కానీ అవసరం ఉన్న లేకున్నా బై వన్ గెట్ వన్ అన్నరని, ఆషాడమని, ఎదురింటిల పెండ్లని
ఆ పక్కన గల్లీల సచ్చిపోయిండ్రని, నీ పక్కన వాళ్ళ ఇంట్ల పిల్ల పెద్దమనిషి అయ్యిందని చీరలు కొనుడు ఏంది??! గిట్ల అవసరం ఉన్నా లేకున్నా.. బట్టలు కొని, షాపింగ్ చేసి ఇల్లు మొత్తం చీరలతోనే బట్టలతోని డంపు యార్డ్ మాత్రం చేయకుండి! గిదే మనకు షాపింగు వాళ్లకు షాకింగు అంటే
ఇక ఇంకొక తీరు షాపింగులుంటయ్ ఆడోళ్ళయి, వాటిని విండో షాపింగ్ లు అంటరు, అంటే ఏంది కిటికీలో కెళ్ళి తొంగి చూసుడు అన్నమాట! కోనుడు లేదు, పాడు లేదు, పాపం షాపింగ్ మాల్ పోరగాడు జుట్టు అంతా పీక్కోని వాడు సన్యాసులల్ల కలిసేటట్టు చీరలు మొత్తం పీకి పీక కుప్ప వోసి ఒక్కటి కూడా కొనకుండా తిరిగి వస్తరు వీళ్ళు! గిట్ల ఒక నలుగురు ఆంటీల బ్యాచ్ పోతరో లేదో ఇంకో నలుగురు ఆంటీల బ్యాచ్ వచ్చేస్తది. నిజంగా బట్టల షాప్ ల, ఆ పోరనికి దండం పెట్టాలె.
సహనానికి ఏదన్న జ్ఞానపీఠ అవార్డు గిట ఉంటే ఇయ్యాలే పాపం!
ఏంది చెల్లె చదువుతుంటే
నవ్వొస్తుందిలే.. వస్తది.. వస్తది మరీ! ఇది మన కతనే గదా!
దేనికైన ఒక లిమిటి ఉండాలె.
ఒక్కర్ల ను చూసి ఒక్కళ్ళు ఇట్ల అలవాటు పడుతున్నరు.మంచి ఏదన్న ఉంటే నేర్చుకోవాలె. గింతగానం బట్టలు కొనుడు ఏమంత మంచి లెక్క కాదు.
చానా మటుకు మన ఆడవాళ్లు ఇట్లనే చేస్తరు. యే కొందరో షాపింగ్ చెయ్యనోళ్లు!! ఇంకోటి గమనించిన గిట్ల షాపింగ్ లు చేయనోళ్లకు,సీరియల్ చూడనోళ్లకు, ముచ్చట్లు పెట్టనోళ్లకు దోస్తులే ఉండరు. లేకపోతే పోనీతీ..!
టైము పైసలు ఖరాబ్ అవుడు కన్న ఏదన్న మంచి పుస్తకం సదువుకుంట ఉండుడు నయ్యం.
షాపింగ్ లు చేసి కొంటే పైసలు మనయి ఖర్సు అయితయి గనీ షాప్ వాళ్లకి ఇంత లాభం అయితది.
విండో షాపింగ్ అనేది మాత్రం అట్ల గాదు. చానా మందికి ఆనందం, జెర దిల్ఖుష్ చేసే విషయం. కొందరు కొత్త వస్తువులను చూడడం, ట్రెండ్స్ తెలుసుకునుడు కోసం పోతరు. పిలిచిన ప్రతివాళ్ళ ఎంబడి తోడుకని పోతే ఇది జర ఎక్కువైనట్టే లెక్క!
ఇట్ల పొయ్యేటోళ్లను
compulsive behavior అంటరంట.
ఇట్లాంటప్పుడు తాము ఎందుకు విండో షాపింగ్ చేస్తున్నము, ఏమన్న ప్రయోజనం ఉందా అని ఆలోచించుకొని, కొత్త వస్తువులు కొత్త ఫ్యాషన్ లు చూస్తే ఏం కాదు కానీ.. అదే పని గట్టుకొని మాత్రం తిరుగొద్దు. ఏమంటరు చెప్పండి.
అక్కలకు చెల్లెళ్లకు జర కోపం వస్తదో ఏమో గానీ అన్నదమ్ములకైతే మస్తు కుష్ అయితది ఈ ఆర్టికల్ చదివితే కదా..!
కోపమొస్తదని నిజం మాట్లాడకుండ ఆగుతమా ఏంది.
మనల్ని మహాలక్ష్మి అంటరు.
మంచిగ ఉండలి కళకళలాడుకుంట. కానీ జేబులు ఖాళీ చేసేటట్టు అవసరంలేనివి అన్ని కొన్క రావద్దు. గిదే ఇయ్యాల నేను మీతో చెప్పే ముచ్చట.

ఉంట మరి పైలం

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అర్పిత

కనుపర్తి వరలక్ష్మమ్మ