కథలు కాలక్షేపానికే కాదు, అవి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఆలోచింప చేస్తాయి, సమస్యలకి పరిష్కారం సూచిస్తాయి. కొన్ని కథలు చదువుతుంటే ‘అరే, ఇది నా జీవితమేనా ‘ ‘ఇది మా ఇంటి కథేనా’ అనిపిస్తాయి. అలాంటి కథలు రాసే వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు.
అలాంటి వారిలో శ్రీపతి లలిత గారు ఒకరు. బ్యాంకు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించి, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా మలచుకున్న వీరి కథల్లో మనందరి జీవితాలు కపడతాయి. వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యాల వంటి కొన్ని కథలని “లలిత కథా సుమాలు” పేరుతో పుస్తక రూపంలో మనకందించారు లలిత గారు.
“ఇవే నా జ్ఞాపకాలు” అనే మొదటి కథలో, భర్తని అమితంగా ప్రేమించే భార్య, భర్త చనిపోగానే, ఆ దుఃఖంతో, నిరాసక్తతతో, ఒంటరితనంతో, పిచ్చిదానిలా బ్రతుకుతూ,అతని వస్తువుల్ని అలా చూస్తూ ఉంటుంది. అయితే భర్త తనని ఎలా ఉండాలని కోరుకునేవాడో ఆ రకంగా ఉండటమే అతని ఆత్మకు సంతోషం కలిగించే విషయం, అనే సత్యాన్ని కొడుకు ద్వారా తెలుసుకుంటుంది.
“కవచం ” అనే కథ చదువుతుంటే కళ్ళ వెంట నీళ్ళు రాకమానవు. ఆటిజం కలిగిన కొడుకుని, భర్త, అత్త పిచ్చివాడిగా జమకట్టి అనాధాశ్రమంలో చేర్పించమన్నప్పుడు, కన్నబిడ్డ కోసం, భర్తని, ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి, వాడి కోసమే బతికిన ఓ తల్లి కథ. వాడికి ఎందులో ఆసక్తి ఉందో గ్రహించి, అందులో శిక్షణ ఇప్పించి, వాడు అందులో నిష్ణాతుడైనరోజున ,తన కొడుకు తెలివి తక్కువ వాడు కాదు అని ఆ తల్లి పొందిన ఆనందం, ఆమె మానసిక స్థితి కథలో చదువుతుంటే ఎవరికైనా కంటనీరు రాక మానదు.
ఈ కాలంలో సహజంగా ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే తరాల అంతరం “ఓ నాన్న కథ” లో బాగా చెపుతారు.
మంచి వాళ్ళు అనే పేరు కోసం తాపత్రయ పడితే ఒరిగేదేమీ ఉండదు. ఆ అతి మంచితనంవల్ల ఇటు ఆఫీస్ లోనూ,ఇంట్లోనూ మానసికంగా, శారీరకంగా నలిగిపోతున్న ఓ మహిళకి, పై అధికరిణి చూపించిన మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే “నాకొద్దీ మంచితనం బాబూ” కథలో తెలుసుకోవచ్చు.
ఊహలతో ఎన్ని కథలైనా అవ్వవచ్చు. కానీ అవి ఎన్ని అపార్ధాలకి దారి తీస్తాయో “గాలి కబుర్లు” కథలో చక్కగా వివరిస్తారు లలిత గారు.

