ఎప్పటినుంచో నాసిక్ చూడాలని కోర్కె. గోదావరి నది జన్మస్థానమైన త్రయంబకం వెళ్ళి ఆ త్రయంబకేశ్వరుని దర్శిస్తే సకల దోషాలు నశిస్తాయి అని చెపుతారు.
దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 2007 లో షిర్డీ వెళ్ళి , అక్కడ నుంచి నాసిక్ వెళ్ళాము. మేము నాసిక్ వెళ్ళేసరికి సమయం ఉదయం తొమ్మిది గంటలయింది. వానాకాలం కావటంతో ముసురుగా ఉంది. మొత్తం మీద ఒక వంద మంది మాత్రమే ఉన్నారు భక్తులు. చాలా ప్రశాంతంగా ఉంది. స్వామి వారిని తాకి ఆ జలం తలమీద చల్లుకుని వచ్చాం.
అలాగే, అంతే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ వెళ్ళిన మాకు ఆ జన సందోహం చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఒకప్పుడు తిరుమల ఒక్కటే భక్తులతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు ఏ క్షేత్రం చూసినా అదే తరహాలో ఉంటోంది.
భక్తి పెరుగుతోంది, మీరు ఎలా వచ్చారో,అందరూ అంతేకదా అని నన్ను అడగవచ్చు. నిజమే, కానీ అక్కడ నాకు ఆశ్చర్యం కలిగించినదీ, ఆలోచింప చేసినది మరొకటి ఉంది.
పితృదోషాలు ఉంటే త్రయంబకం లో పూజలు చేయించుకుంటే పోతాయి. దానికోసం ఈ స్థలం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి ఏ పూజ అయినా
ఇంటి పెద్ద చేయాలి, ముఖ్యంగా పితృకార్యాలు. కానీ తల్లిదండ్రులే స్వయంగా దగ్గరుండి స్మశానంలో తమ పిల్లల చేత ఈ కార్యక్రమాలు , (వాళ్ళకి ఇరవై ముప్పై సంవత్సరాల లోపే ఉంటుంది) చేయిస్తుంటే ఇది భక్తా, మూఢభక్తా ,మూఢ నమ్మకమా అర్ధం కావటం లేదు. ఇంటి యజమాని,ఇంటి పెద్ద ఈ పితృకార్యాలు చేయాలి. కానీ ఇంటి పెద్ద ఉండగా పిల్లలు చేస్తున్నారు. ఇంకో విషయం, గతజన్మ పాపకర్మ ఫలం పోవాలంటే ఈ జన్మలో పరిహారం చేసుకోవాలిట. అందుకే ఈ పూజలు.
నేను అడిగితే, ఒక పేరు మోసిన పేద్ద స్వామీజీ చెప్పారుట, తల్లిదండ్రులు ఉన్నా కూడా ఇలాంటివి చేయించవచ్చు అని. ఇది ఎంతవరకు సమంజసమో అర్ధం కాలేదు.
ఆ అబ్బాయి, అక్కడే తల్లిదండ్రుల మీద విసుక్కుంటున్నాడు. ఇంకొళ్ళయితే, ఏమాత్రం పరిచయం లేని మాతో వాళ్ళ అత్తమామల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఫలానా దోషం మీకు ఉన్నది అని తెలిసినప్పుడు, దాని నివారణకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, కానీ దానితో పాటు పెద్దల్ని , తల్లిదండ్రులని గౌరవించడం,మంచి వాక్కు ,పరోపకారం, దైవభక్తి వీటిని ఎందుకు అలవరచుకోరు.
విఘ్నేశ్వరాధిపత్యం లో కూడా మనం చూస్తాం, అసమర్ధుడైన వినాయకుడు తల్లితండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేయగానే వాళ్ళు సంతుష్టులై అతనికి విఘ్నేశ్వరాధిపత్యం ఒసగుతారు. అంటే తల్లిదండ్రులకి చేసే ఒక నమస్కారం ఎంతో పుణ్యఫలం ఇస్తుంది.
కానీ నోటీకి ఎంతవస్తే అంత, పెద్దాచిన్నా లేకుండా మాట్లాడుతూ ఉంటే భగవంతుడు హర్షిస్తాడా? ఇప్పుడు తప్పుచేసి, గతజన్మ ఫలం అనుకోవటం అవివేకమే కదా!
తప్పుచేసి పరిహారం చేసుకునేకంటే అసలు తప్పు చేయకుండా ఉండటం.
చివరిగా నేను చెప్పేది ఏమంటే , సత్ప్రవర్తన, సద్బుద్ధి, వినయం, మంచి మాట కలిగి ఉంటే కర్మఫలం ఏమీ చేయదు. ఈ పుణ్య ఫలమే మనిషిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదద్దుతుంది.
ఈనాటి ఈలోకాభిరామాయణం మీకు ఎంతవరకూ నచ్చుతుందో మరి.