చిన్నప్పటి నుంచి పురాణ కథలు , చరిత్రకి సంబంధించిన కొన్ని కథలు, ఘటనలు ప్రతి ఒక్కరూ కాస్తో కూస్తో వింటూనే ఉంటారు. అసలు ఐదు సంవత్సరాల వయసు పిల్లలకి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు నీతి కథలు చెప్పటం పరిపాటి. వీటిలో నీతి ఉంటుంది, సమస్యలు ఉంటాయి. సమస్యా పరిష్కారం ఉంటుంది. జీవిత సత్యాలు ఉంటాయి.
పెద్దవుతున్న కొద్దీ పాఠ్యపుస్తకాల్లో ఇవి పాఠాలుగా చదువుతూ ఉంటాం. హైస్కూల్ చదువు పూర్తి అయిన తర్వాత కొంతమంది వీటిని ప్రధాన సబ్జెక్టు గా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వీటి మీద ఇంట్రెస్ట్ తో పుస్తకాలు కొని చదువుతారు.
ఏదైతేనేమీ, మొత్తం మీద చాలామంది చరిత్ర,పౌరిణిక అంశాల పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇవి చదవటం వల్ల ఏమైనా సార్ధకత ఉందా అనుకుంటే, వీటి నుంచి మనం కొంతైనా గుణపాఠం నేర్చుకోగలిగి నప్పుడే చదివిన దానికి సార్ధకత లభిస్తుంది. అయితే, ఎంతమంది చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకమే.
పర స్త్రీ వ్యామోహం వల్ల ఎంతో జ్ఞానసంపద కలిగిన రావణాసురుడు, రాముని చేతిలో హతమయ్యాడు. అలాగే ద్రౌపదిని అవమాన పరిచిన దుర్యోధన, దుశ్శాసనాదులు కురుక్షేత్ర సంగ్రామంలో అశువులు బాసారు.ఈ నిజాలు తెలిసినా నేటికీ అత్యాచారాల, పర స్త్రీ వ్యామోహం పోవటం లేదు.
రాజ్యం కోసం పోరాటం ఒక పెద్ద కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది. ఎన్నో యుధ్ధాల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినా కూడా నేటికీ ఆస్తి తగాదాలు తగ్గటం లేదు.
ఐకమత్యమే బలం అంటాం. కానీ ఈ ఐకమత్యం లోపించిన కారణంగానే ఎన్నోసార్లు మన దేశం దురాక్రమణకు గురయింది. చరిత్రలో ఎన్నోసార్లు ఈ విషయం చదువుకున్నాం. బ్రిటీష్ వాళ్ళు మనదేశానికి వచ్చారు, రెండు శతాబ్దాలు పరిపాలించారు అంటే కారణం ఐకమత్యం లేకపోవటమే.
అంతేకాదు నమ్మకద్రోహం కూడా చరిత్రలో కనపడుతుంది. కానీ ఈ రోజుకీ ప్రాంతాలు, కులాలు, మతాలు,వర్గాల పేరుతో మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయంగా,ఇతరత్రా ఎదుగుదలకు ఎంతోమంది నమ్మకద్రోహానికి పాలుబడటం మనం చూస్తూనే ఉన్నాం.
తక్షశిల రాజు అంభి, పురుషోత్తముడి మీద కోపంతో,విదేశీయుడైన అలెగ్జాండర్ ని జీలం నది దాటి భారతదేశంలోకి అడుగుపెట్టటానికి సహాయం చేసి, భారతదేశానికి మొదటి దేశద్రోహిగా చరిత్ర కెక్కాడు.
పర్యావరణ పరిరక్షణ, పకృతి సమతుల్యత లోపిస్తే జరిగే అనర్ధాలు కళ్ళముందు చూస్తూనే ఉన్నా, ప్రకృతిని కాపాడటంలో విఫలమవుతూనే ఉన్నాం.
ఇవన్నీ కేవలం దేశం, సమాజం గురించే కాదు. వ్యక్తిగతంగా కూడా మనకి ఎంతో అవసరం. ఇంట్లో భార్యని గౌరవించటం, కుటుంబంలోని వ్యక్తులు ఆస్థి పెంచుకోవటం కోసం కాకుండా, ప్రేమాప్యాయతలు పెంపొందించుకోవడం, తన తనకి తోచిన విధంగా పర్యావరణం కాపాడటం అనే అంశాలపై దృష్టి సారించాలి.
ఇక వ్యక్తిగతంగా కూడా నమ్మకద్రోహం మనల్ని అథఃపాతాళానికి నొక్కేస్తుంది. నిన్ను నమ్మిన స్నేహితుల, కుటుంబవ్యక్తుల, నీవు పనిచేసే కంపెనీ లేదా సంస్థ లోని లోటుపాట్లుని బయటికి చెపితే నీ అంత నమ్మకద్రోహి మరొకరు ఉండరు. వాళ్ళందరూ నిన్ను క్షమించినా, నీ అంతరాత్మ నిన్ను క్షమించదు. చివరికి ఒంటరి వాళ్ళు కావటం తధ్యం.
ఒక ఘటన జరిగితే దాని నుండి ఒక ఫలితం పొందుతాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇది భావితరాలకి ఒక పాఠం , గుణపాఠం రెండూ నేర్పుతుంది. వాటిని గ్రహించి, చరిత్ర ఏం చెపుతోంది నేర్చుకుని మనల్ని మనం మార్చుకుంటే , మనం పరిపూర్ణ వ్యక్తులుగా మిగిలిపోవటమే కాకుండా, దేశ చరిత్రలో కీర్తి శేషులుగా మిగిలిపోతాం.