విలువైన వజ్రం

సూరత్ కి దగ్గరలో హరిపురం అనే గ్రామంలో కిషణ్ లాల్, జాన్వి దంపతులు నివసిస్తూ ఉండేవారు. కిషణ్ చిన్న వజ్రాల వ్యాపారి. ఆ దంపతులకు లేకలేక కలిగిన ఏకైక సంతానం హీరా. కొడకు పైనే ఆరుప్రాణాలు పెట్టుకు జీవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వజ్రాలు నగిషీ చేయడం, వాటి విలువ కట్టడం ఇటువంటి పనుల్లో కిషణ్ నిపుణుడు. తమ ఇంట్లోనే వసారాను కొట్టు గదిగా మార్చుకున్నాడు. మొదట్లో వ్యాపారం చురుగ్గానే ఉండేది. కానీ చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో ఎందరో ఇదే వృత్తిని చేపడుతూ ఉండటం వల్ల పోటీ ఎక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉండేది.

తనకు వచ్చే కాస్త ఆదాయంతోనే తన కుటుంబంతో సంతృప్తిగా జీవిస్తున్నాడు అతను.

జాన్వి అన్నగారు గోపాల్ అక్కడికి దగ్గరలోనే ఇచ్చాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతనికి చెల్లి మీద అమితమైన ప్రేమ. మేనల్లుడు హీరా అంటే ఎంతో ఇష్టం. వారిని చూసేందుకు తరచూ హరిపురం వస్తూ ఉండేవాడు. తన చెల్లి, బావగారు అతిగా గారాబం చేసి అల్లుడిని అసమర్థడిగా చేస్తున్నారేమో అని బాధపడే గోపాల్ ఉండబట్టలేక ఒకసారి బావగారితో, “బావా మన హీరాకి పదిహేను సంవత్సరాలు వచ్చాయి. తనని కూడా మీతో పాటు దుకాణంలో కూర్చోబెట్టుకొని మీ వృత్తిలో తర్ఫీదు ఇవ్వచ్చు కదా! అతను తెలివైన వాడు, ఇట్టే మెళకువలు నేర్చుకుని మీకు వ్యాపారంలో సాయంగా ఉంటాడు,” అన్నాడు.

“భళే వాడివి గోపాల్, వాడింకా చిన్న పిల్లవాడు. ఇప్పుటినుంచీ కష్టపడటం అవసరమా? హాయిగా తన బాల్యాన్ని ఆనందంగా గడపనీ. వయసు వచ్చాక తనే స్వయంగా వచ్చి నేర్చుకుంటాడులే,” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు కిషణ్. దాంతో గోపాల్ మౌనంగా నిష్క్రమించాడు.

“అది కాదండీ, మా అన్నయ్య చెప్పిన మాట కూడా నిజమే కదా! అబ్బాయి పెద్ద వాడౌతున్నాడు. మీరు వాడికి తర్ఫీదు ఇవ్వడం మొదలెడితే మంచిదే కదా,” భర్తతో తన మనసులో మాటను నెమ్మదిగా చెప్పింది జాన్వి.

“సర్లే, నువ్వు కూడా అదే మాట, సమయం వచ్చినప్పుడు అలాగే చేస్తాలే, ఐనా ఇప్పుడు ఈ వ్యాపారం ఎంత మాత్రం లాభసాటిగా లేదనే విషయం నీకు తెలీదా? ” భార్య మాటను కొట్టిపారేశాడు కిషణ్.

“అలాకాదు, పోనీ ఈ వ్యాపారం ఒద్దు అనుకుంటే పై చదువుల కోసం నగరానికైనా పంపిద్దామండీ, ఏదీ కాకుండా అలా వదిలేస్తే వాడి తెలివితేటలు పక్కదారి పట్టే అవకాశం ఉంది, ఆలోచించండి,” బ్రతిమాలుతున్నట్లు చెప్పింది జాన్వి.

మౌనమే సమాధానంగా ఇచ్చాడు కిషణ్.

*********************

కొంత కాలానికి అనుకోకుండా కిషణ్ కి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఇంతకాలంగా దాచుకున్న సొమ్మంతా వైద్యానికి ఖర్చైపోయింది. తన ఒంటి మీద బంగారం కూడా భర్త కోసం తాకట్టుపెట్టి అతడిని ఎలాగైనా బ్రతికించుకోవడం కోసం భార్య జాన్వి చేసిన పోరాటం వృధా అయ్యింది. దురదృష్టవశాత్తు కిషన్ మరణించాడు. ఆ సమయంలో చెల్లెలి కుటుంబానికి ఎంతో అండగా నిలిచాడు గోపాల్. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతూ చెల్లి చేతికి కొంత డబ్బు ఇచ్చాడు.

“జాన్వీ నీకు కూడా తెలుసు కదా, మా వ్యాపారం కూడా అంతంత మాత్రమే. నేను చేయగలిగినంత సాయం చేశాను. ఇకపై కుటుంబం ఎలా గడుస్తుందో ఆలోచిస్తే బాధగానూ, భయంగానూ ఉంది. హీరాని చూస్తే పదహారు సంవత్సరాలు దాటినా ఇంకా చిన్న పిల్లవాడిలా ఏ బాధ్యతా తెలియకుండా ఉన్నాడు. ఎలా గడుపుతావో మరి,” అంటూ భారంగా కదిలాడు.

అన్న వెళ్లిన వైపు చూస్తూ నిట్టూర్చింది జాన్వి. ఆనాడు తన అన్న గారు చెప్పినట్టు విని తన భర్త కొడుకు హీరాకి పని నేర్పించి ఉంటే ఈనాడు అక్కరకు వచ్చేది. కానీ ఇప్పుడు? భగవంతుడి పైనే భారం వేసింది ఆమె.

అన్నగారు ఇచ్చిన డబ్బుతో ఒక నెల గడిచింది. ఆపై ఇంట్లో ఉన్న కొన్ని విలువైన వస్తువులు తాకట్టు పెట్టడం, అమ్మడం ద్వారా కొంత డబ్బు గడించి మరో మూడు నెలలు గడిపింది. మధ్య మధ్యలో అన్నగారు వచ్చినప్పుడు చిన్న చిన్న మొత్తాలు ఇచ్చేవాడు.

ఇకపై ఏ ఆధారమూ లేదు, తప్పనిసరిగా తన కొడుకుకు బాధ్యత అప్పగించాలి అనుకుంది ఆమె. ఈలోగా ఇన్నాళ్ళూ పట్టించుకోకుండా వదిలేసిన  కొట్టుగదిని శుభ్రం చేసి, మరెవరికైనా ఇవ్వడం వంటిదేదో చేయాలని భావించింది. భర్త స్నేహితుడు రమణ్ లాల్ ఎంతో కొంత బాడుగ వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అలాగే అందులో ఏదైనా విలువైన వస్తువు దొరుకుతుందేమో అనే ఆశతో గది మొత్తం ఆమూలాగ్రం వెతుకుతూ శుభ్రం చేసింది. ఎక్కడా ఏమీ లేదు. నిరాశగా నిట్టూరుస్తూ, తన భర్త కూర్చునే బల్ల తుడుస్తోంది ఆమె యాంత్రికంగా. ఆ టేబుల్ కి ఉన్న సొరుగుని తెరిచి శుభ్రం చేసింది. ఆఖరి అర తుడుస్తుండగా, అప్పుడు జరిగిందది. ఆమె చేతికి ఏదో గట్టిగా తగిలింది. ఆ వస్తువును బైటికి తీసి చూసిన ఆమె కళ్ళు ధగధగా మెరిసాయి. దాన్ని చేతులతో తడిమింది. తాను వెదకబోయిన తీగె కాలికి తగిలింది అనిపించింది ఆ క్షణం.

సూర్యకాంతి తో మెరిసిపోతున్న ఆ రాయిని చూసి మురిసిపోయింది జాన్వి. తన అరచేతిని మించి పెద్దగా ఉన్న ఆ రాయి తప్పకుండా మంచి విలువైన వజ్రం అయి ఉండాలి. అదే కనుక నిజమైతే ఇక తమ కష్టాలు తీరిపోయినట్లే. జాగ్రత్తగా దానిని తీసి లోపల దాచింది. బైట స్నేహితులతో ఆడుకుంటున్న కొడుకు ఇంటికి రాగానే అతడికి అది చూపించింది. అది చూడగానే హీరా కళ్ళు మెరిసాయి.

“అమ్మా ఏమిటిది? ఎక్కడిది?” ఆశ్చర్యానందాలను ఆపుకోలేకపోయాడు.

“మీ నాన్నగారి గదిలో దొరికింది. నువ్వు దీనిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మామయ్యకు చూపించు. ఖచ్చితంగా ఇది చాలా విలువైనదే అయి ఉంటుంది. మా అన్నయ్య అయితే దీని విలువని అంచనా వేయగలడు. ఇది అమ్మేసి వచ్చిన డబ్బుతో నువ్వు మరేదైనా వ్యాపారం చేద్దువు గాని. నీకు మీ నాన్నగారి వ్యాపారం చూసుకునే మెలకువలు తెలియవు కదా. ఏదైనా చిన్న కిరాణా దుకాణం వంటిదైతే నీకు నేను కూడా సాయం చేయగలను. ఇద్దరం కలిసి కుటుంబాన్ని గాడిన పెట్టుకోవచ్చు.”

“అలాగే అమ్మా రేపు ఉదయమే మావయ్య దగ్గరికి వెళ్తాను,” అంగీకరించాడు హీరా.

*******************

మరుసటి ఉదయం ఆ రాయిని జాగ్రత్తగా బట్టలో చుట్టి, ఒక సంచిలో మరికొన్ని బట్టల మధ్యలో పెట్టి కొడుకుకి అందించింది జాన్వి. దానిని తీసుకుని ఇచ్చాపూర్ వెళ్ళాడు హీరా.

మేనల్లుడిని చూడగానే, “రావోయ్, ఏంటి విషయం ఇలా వచ్చావు? సర్లే, ముందు కాళ్ళు కడుక్కుని రా, భోజనం చేద్దాం,” అంటూ ఆత్మీయంగా ఆహ్వానించాడు గోపాల్.

“మావయ్యా అదీ…,” అంటూ విషయం చెప్పబోతున్న హీరా మాట పట్టించుకోకుండా, “ఏమోయ్ దీప్తీ,  మేనల్లుడు వచ్చాడు మా ఇద్దరికీ భోజనం వడ్డించు,” భార్యకి చెప్పాడు.

హీరా అంటే చిన్నప్పటినుంచి ఆమెకు కూడా ఎంతో ఇష్టం. ప్రీతిగా ఇద్దరికీ భోజనం వడ్డించింది దీప్తి. తృప్తిగా భోంచేసి ఆపై హాయిగా నడుము వాల్చుకుని, “ఇప్పుడు చెప్పు హీరా, ఇందాక ఏదో చెప్పబోయావు?” మేనల్లుడిని అడిగాడు గోపాల్.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా గబుక్కున తన సంచిలోంచి అమ్మ తనకిచ్చిన రాయిని మామయ్యకు చూపించాడు హీరా.

“ఏమిటిది? ఎక్కడిది?” అడిగాడు గోపాల్

“అమ్మ, నాన్నగారి కొట్టుగది సర్దినప్పుడు అక్కడ దొరికింది. వెంటనే మీకు చూపించమని చెప్పింది. దీని విలువ ఎంత ఉంటుందో అంచనా వేసి దాని ప్రకారం నాకు ఆ సొమ్ము ఇస్తే, ఆ డబ్బుతో నేను ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని ఇకముందు మీపై ఆధారపడకుండా జీవిస్తాను మావయ్యా,” ఎంతో ఆశగా చెబుతున్న మేనల్లుడు కళ్ళలోకి చూశాడు గోపాల్.

“చూడు హీరా ఇది చూస్తే ఎంతో కొంత విలువైన దాని లాగానే కనిపిస్తోంది. కానీ ఆ వజ్రాలకి విలువ కట్టడం మీ నాన్నకి తెలిసినట్లుగా నాకు తెలియదు. నువ్వు ఒక పని చెయ్, ఈ ఊర్లో నాకు నలుగురు స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరి దగ్గరికి వెళ్లి ఇది చూపించి నేను పంపించానని చెప్పి ఎంత డబ్బు ఇవ్వగలరో అడిగి మళ్లీ నా దగ్గరికి రా, ఈలోగా నేను చిన్న కునుకు తీసి లేస్తాను,” అంటూ తన స్నేహితుడి పేరు, అతని దుకాణం పేరు హీరాకు చెప్పి పంపించాడు గోపాల్.

********************

“నమస్కారం రామ్ లాల్ గారూ, నా పేరు హీరా.  మీ స్నేహితుడు గోపాల్ గారి మేనల్లుడ్ని. మావయ్య మీకు ఇది చూపించి దీని విలువ ఎంత ఉంటుందో కనుక్కొని రమ్మని చెప్పారు. ఇదిగోండి ఈ వజ్రాన్ని పరికించి దీనికి మీరు ఎంత డబ్బు ఇవ్వగలరో చెబుతారా,” వినమ్రంగా అడిగాడు హీరా.

ఆ రాయిని పరీక్షగా చూసిన రామ్ లాల్ , “ఇదిగో బాబూ, నేను దీనికి ఈ 30 వరహాలు ఇవ్వగలను. సరే అంటే ఇప్పుడే ఆ రాయిని ఇచ్చి నీ డబ్బు పట్టుకెళ్లవచ్చు,” చెప్పాడు హీరాతో.

“లేదండీ మామయ్య దీని ఖరీదు కనుక్కొని రమ్మని చెప్పారు, మళ్లీ వస్తాను,” అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు హీరా.

“ఏమైంది, ఏం చెప్పాడు రామ్ లాల్?” ఇంటికి వచ్చిన మేనల్లడిని అడిగాడు గోపాల్.

“ దీనికి 30 వరహాలు ఇస్తానని చెప్పాడు మావయ్యా,” కొంచెం దిగాలుగా సమాధానం ఇచ్చాడు హీరా.

“ఫర్లేదు దిగులు పడకు. ఇప్పుడు నా మిగతా ముగ్గురు స్నేహితుల దగ్గరికి వెళ్ళు. వారందరి వద్ద కూడా ఇలాగే దీని విలువ కనుక్కుని వచ్చేసేయ్. ఆ తర్వాత ఆలోచిద్దాం,” అతనికి ధైర్యం చెప్పి పంపించాడు గోపాల్.

“అలా ఆ మిగిలిన ముగ్గురి దగ్గరికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు హీరా. ఇప్పుడు అతని మొహంలో కాస్త సంతోషం కనిపిస్తోంది అనే విషయం గమనించాడు గోపాల్.

“చెప్పు ఏమన్నారు మా స్నేహితులు?” అడిగాడు.

“ఉత్తమ్ లాల్ గారు 50 వరహాలు, పన్నాలాల్ గారు 100 వరహాలు చెప్పారు మావయ్యా. కానీ ప్యారేలాల్ గారు సరిగ్గా చెప్పినట్టు ఉన్నారు. ఇది విలువైనదని, దీనికి తాను 200 వరహాలు ఇవ్వగలనని చెప్పారు. అతనికి ఇచ్చేసి ఆ డబ్బు తీసుకుందామా మామయ్యా? అలాగైతే నాకు పచారీ కొట్టు పెట్టుకునేందుకు పెట్టుబడి సరిపోతుందా?” ఉత్సుకతతో అడిగాడు హీరా.

“నువ్వు చెప్పింది నిజమే హీరా. కానీ నాకెందుకో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు చెప్పారు? ఒకవేళ దీని ఖరీదు ఇంకా ఎక్కువ అయితే మనం మోసపోయినట్లు అవుతుంది కదా! పోనీ ఒక పని చేస్తావా? ఈ ఇచ్చాపూర్ మొత్తంలో ఆ ప్యారేలాల్ గారి దుకాణమే పెద్దది. అక్కడ నువ్వు కొన్నాళ్లు వజ్రాలకి సానపట్టడం, విలువ కట్టడం వంటి పనులు నేర్చుకో. అప్పుడు కొన్నాళ్ల తర్వాత మనకే దీని విలువ ఎంతో తెలుస్తుంది కనుక దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఏమంటావ్?” మావయ్య మాటలతో కాస్త నిరాశ పడ్డాడు హీరా.  వెంటనే తమాయించుకుని, “సరే మావయ్యా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఆ రాయి నిజంగా చాలా విలువైనదేనేమో. లేదంటే నాన్నగారు అంత జాగ్రత్తగా ఎందుకు దాచి ఉంటారు? మీ మాట ప్రకారం నేను ప్యారేలాల్ గారి దుకాణంలో పని చేస్తూ, వజ్రాల నగిషీ, వాటి విలువ కట్టడం ఇంకా మిగతా మెలకువలు నేర్చుకుంటాను. అప్పటివరకు ఈ రాయిని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు,” సంచిలోంచి ఆ రాయిని తీసి మావయ్యకి ఇచ్చాడు హీరా.

“శభాష్ మంచి నిర్ణయం తీసుకున్నావు. సాధ్యమైనంత త్వరగా నువ్వు ఆ పనులు నేర్చుకో. కానీ ఆ రాయి మాత్రం నీ వద్దే ఉంచు. నువ్వు మా ఇంట్లో నుంచే ఉద్యోగానికి వెళ్లొచ్చు, కానీ ఊర్లో అమ్మ ఒక్కతే అవుతుంది కదా. కనుక రోజూ అక్కడి నుంచే వచ్చి వెళ్తూ ఉండు. ఇబ్బందేం లేదు కదా?” అడిగాడు గోపాల్.

“ఫర్లేదు మావయ్యా అలాగే చేస్తాను. ఒకటి రెండు నెలలు, అంతే. ఆ లోగా నేను అన్ని పనులూ నేర్చేసుకుంటాను. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్తాను,” బయల్దేరాడు హీరా.

“లేదులే బాబూ, ఇప్పుడు పొద్దుపోయింది కదా. రేపు ఉదయం నేను ప్యారేలాల్ తో మాట్లాడి నిన్ను పనిలో పెడతాను. ఏకంగా రేపు సాయంత్రం వెళ్దువు గానీ, ఇప్పుడు హాయిగా భోంచేసి పడుకో.”  మామయ్య మాటలకు తలొగ్గాడు హీరా.

******************

మామయ్యతో చెప్పినట్లుగానే చాలా తక్కువ సమయంలోనే పనిలోని నైపుణ్యాలన్నీ నేర్చుకుంటున్న హీరా గురించి ఎప్పటికప్పుడు స్నేహితుడు గోపాల్ కి చేరవేస్తున్నాడు ప్యారేలాల్.

“నువ్వు చెప్పింది నిజమే గోపాల్. కుర్రాడు చాలా చురుకైన వాడు. కేవలం నెల రోజుల్లోనే వజ్రాలకు నగిషీ చేయడం పరిపూర్ణంగా వచ్చేసింది. ఇక రేపటి నుంచి వజ్రాలకి విలువ కట్టే పని నేర్పిస్తాను,” స్నేహితుని మాటలకు మనసులోనే పొంగిపోయాడు గోపాల్.

మరో రెండు నెలల్లో ఆ పనిలో తాను కొంతవరకూ నిష్ణాతుడిని అయ్యానని అనిపించిన రోజున సంతోషంగా ఇంటికి వచ్చాడు హీరా.

“అమ్మా, ఏదీ, నువ్వు దేవుడి గదిలో దాచిన ఆ వజ్రాన్ని తీసుకు వస్తావా? నేనో సారి దాన్ని పరీక్షిస్తాను,” ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న కొడుకును చూసి ఎంతో ఆనందంగా ఉంది జాన్వికి. గబగబా వెళ్ళి ఆ రాయిని అపురూపంగా తెచ్చి అతని చేతిలో పెట్టింది.

దానిని జాగ్రత్తగా పరిశీలించిన హీరా అవాక్కయ్యాడు.

“ఏమైంది హీరా? అలా మౌనంగా ఉన్నావేంటి? దీని వెల నీకు తెలిసిందా?” తల్లి ప్రశ్నల పరంపరను అడ్డుకుంటూ,

“అమ్మా నేను ఇప్పుడే మామయ్య ఇంటికి వెళ్ళి వస్తాను,” అంటూ బయల్దేరాడు.

“ఇప్పుడేమిటి? ఉండైతే నేనూ వస్తాను,” కొడుకుతో పాటు బయల్దేరింది.

*******************

అంత రాత్రివేళ ఇంటికి వచ్చిన చెల్లిని, మేనల్లుడిని చూసి ఆశ్చర్యపోయాడు గోపాల్. ఏం జరిగింది అని అడిగేంత సమయం కూడా ఇవ్వలేదు హీరా.

తన సంచి లోంచి తాను ఇన్నాళ్లుగా దాచుకున్న విలువైన రాయిని బైటకు తీసి, “మావయ్యా ఎందుకిలా చేశావు?” అన్నాడు.

“ఓ, అయితే నీకు వజ్రాన్ని విలువ కట్టడం తెలిసిపోయిందనమాట. చాలా సంతోషం,” నింపాదిగా అన్నాడు గోపాల్.

“నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు,” రెట్టించాడు హీరా.

“ఏం చెప్పాలి? నీకు అర్థం కాలేదా?” ప్రశ్నకు ప్రశ్న  సమాధానంగా ఇచ్చాడు.

“కాలేదు నేను ఈ రాయిని తీసుకు వచ్చినప్పుడే నీకు తెలుసు ఇది ఏమాత్రం విలువ లేని రాయి మాత్రమే అని. కానీ నన్ను ఎందుకు భ్రమింప చేశావు? నువ్వు సరే నీ స్నేహితులు కూడా అలా చేశారేమిటి? దీని అంతరార్థం?” అడిగాడు.

“నువ్వు చెప్పేది నిజమే హీరా. నువ్వు దీన్ని తీసుకొచ్చిన రోజే నాకు తెలుసు దీని విలువ. కానీ నీకు తెలియనిది, నాకు మాత్రమే తెలిసినది నీ విలువ. నువ్వు చాలా తెలివైనవాడివి. ఏదైనా పనిమీద శ్రద్ధ పెడితే చాలా సులువుగా నేర్చుకోగలుగుతావు. ఆ విషయం మీ నాన్నతో కూడా చెప్పాను కానీ ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు వంశపారంపర్యంగా వస్తున్న ఈ అద్భుతమైన విద్యని వదిలేసి, పచారీ దుకాణం పెట్టుకుంటానంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? నేను నీ మామయ్యని. నీ ఉన్నతి నా బాధ్యత కూడా. అందుకే నీలో ఈ రాయి విలువ తెలుసుకోవాలనే కుతూహలం పెంచడం ద్వారా నీలో దాగి ఉన్న ప్రతిభ నువ్వు గుర్తించేలా చేశాను. ఇక నా స్నేహితులంటావా, వారు విలువ కట్టింది ఈ గాజు ముక్కకి కాదు నా స్నేహానికి. దానికి నేను వారికి సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఒక విలువ లేని రాయి కావచ్చు, కానీ దానిని పట్టుకున్న వాడు అతి విలువైన ఒక వజ్రం అనే విషయాన్ని నేను గుర్తించాను. నువ్వు కూడా గుర్తించు. నీవు నేర్చుకున్న ఈ విద్యతో నీ భవిష్యత్తు బంగారు బాట కాగలదు. అదే నేనూ మీ అమ్మా కోరుకునేది,” ఇంకా అతని మాటలు పూర్తికాకముందే మామయ్యని గట్టిగా కౌగిలించుకున్నాడు హీరా.

“అది సరే మావయ్యా కానీ ఆనాడే ఇది విలువ లేనిదని చెప్పి, నన్ను ఈ విద్య నేర్చుకోమని చెప్పి ఉండవచ్చు కదా? కుతూహలం ఆపుకోలేక మళ్ళీ అడిగాడు హీరా.

“మనిషికి ఆశ ఒక ఇంధనం లాంటిది, అది మనల్ని పరిగెత్తిస్తుంది. ఈ వజ్రం యొక్క విలువ తెలుసుకోవాలనే ఆశతో     నువ్వు మామూలుగా కన్నా వేగంగా ఈ విద్యను నేర్చుకోగలిగావు. అందుకే నేను అలా చేశాను. అదీ కాక ఆనాడే నేను ఇది విలువ లేనిది అని చెబితే నువ్వు నమ్మలేకపోవచ్చు. మావయ్య నన్ను మోసం చేస్తున్నాడు అనుకోవచ్చు. అలా కాక దానికి నేను ఎంతో కొంత డబ్బు ఇస్తే కూడా నీకు అదే భావన కలుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఆ రాయికి విలువ లేకపోవచ్చు కానీ మన బంధానికి చాలా విలువ ఉంది. అది మనం మర్చిపోకూడదు,” చెబుతున్న అన్నగారిని చూసి కళ్ళు చెమర్చాయి జాన్వికి. ఏమిచ్చి తాను అతని ఋణం తీర్చుకోగలదు?

“నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ హీరాని నాకు మేనల్లుడుగా కాక అల్లుడిగా ఇచ్చేయ్. నా కూతురు మోతి నీ కోడలిగా వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మీకు అంగీకారమేనా?” అతని మాటలు పూర్తి కాకముందే తల ఊపారు తల్లీ కొడుకులు.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనంతం-అద్భుతం- అపూర్వం.

అనుబంధాల్లో మేనత్త పాత్ర