శాలువా విలువెంత ?

కథ

రఘుపతి లోపలికి రాగానే ఆయన చేతిలో ఉన్న వస్తువులను అంది పుచ్చుకుంది రాగిణి. మెత్తని సిల్కు శాలువా! అందమైన కుచ్చులతో జరీ దారాల మెరుపులతో ఖరీదును చాటుతోంది. శ్రీ కృష్ణ దేవరాయల వెండి అచ్చు బొమ్మతో సభను ఏర్పాటు చేసిన వారి నామ ఫలకం తో జ్ఞాపిక స్వర్ణోత్సవం జరుపుకుంటోన్న సంస్థ వైభవాన్ని తెలుపుతోంది.
రఘు పతికి రోజూ సభలలో పాల్గొనడం తప్పని సరి అయిపోయింది. సభ లో అధ్యక్షుని గానో పుస్తక ఆవిష్కర గానో, లేదా సాహిత్య ప్రసంగ కర్త గానో ఆహ్వానాన్ని అందుకోడం పరి పాటిగా మారింది. రఘుపతి ప్రసంగం ఉన్న సభ ఒక వేడుకగా మారుతుంది. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి ఆద్యంతం ఆసక్తి కరం గా ఉపన్యసించి రఘుపతి సాహిత్య సభలకు జన ప్రియతను కలిగించాడు.
రఘుపతి సభా పరిశ్రమను చేసి సంపాదించిన శాలువలను రాగిణి జాగ్రత్తగా భద్ర పరుస్తుంది. జ్ఞాపికలను ప్రత్యేకమైన గాజు బీరువాలో అలంకరణగా ఉంచుతుంది
రఘుపతి ఆ రోజు పొందిన సత్కార శాలువాను మడత పెడుతూ, “నారాయణకు రమ్మని చెప్పండి, మంచి నమూనాలను సిద్ధం చేసాను. ఈ సారి నారాయణ జాతీయ స్థాయిలో ప్రశంసను పొందవలసినదే “అంది
నారాయణ ఇప్పుడు దర్జీ గా పేరు సంపాదించాడు. నారాయణ జీవితం బాగు పడింది. కష్ట పడి పని చేస్తాడు. సమయానికి బట్టలు కుట్టి అందజేస్తాడు….
మీరు చెప్పినదంతా నిజమే .. కాని నారాయణ బాగుపడినదంతా మన చలవే ! మన సహాయం వల్లనే తాను పేరు తెచ్చుకోవడం జరిగిందని వచ్చి నప్పుడల్లా కృతజ్ఞతలతో ముంచి వేస్తాడు.
సరేలే !అది వాడి అభిమానం –
మొత్తానికి మీకు మంచి మిత్రుడు దొరికాడు.
నారాయణ వచ్చినప్పుడు ఇవ్వవలసిన, సూచనలు, డిజైన్లు ప్రింట్ అవుట్ తీసి పెట్టాలి అనుకుంటూ కంప్యూటర్ తెరిచింది రాగిణి.

రఘుపతి ఉద్యోగం లో చేరడానికి వచ్చినప్పుడు కళాశాలకు దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గది గాలి వెలుతురు తో మనసుకు హాయినిచ్చేటట్లుగా ఉంది. ఊళ్ళో అతి కష్టం తో జీవన భత్యం గడుపుకుంటున్న టైలర్ నారాయణకు గదికి ఆనుకుని ఉన్న వసారాలో కుట్టు పనికి చోటును కల్పించాడు. తాము ఉండే గది కొంచం ఎత్తుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళ దృష్టికి ఆనుతూ ఉండడం వల్ల దర్జీ నారాయణను వినియోగ దారులు గుర్తించడం జరిగింది. నారాయణకు మంచి దర్జీ అని చుట్టు పక్కలవాళ్ళ మౌఖిక ప్రచారం ద్వారా చేతి నిండా పని దొరికింది.
నారాయణ తోడుగా ఉండడం రఘుపతికి సహాయకారి లభించినట్లయింది. నారాయణ కుట్టి ఇచ్చిన లాల్చీని వేసుకుని కళాశాలకు వెళ్ళిన రఘుపతి హుందాతనం పెరిగింది. తెలుగు ఉపన్యాసకునికి అభిమానులు అధికం అయ్యారు.
తరగతి గదిలో గంభీరంగా స్పష్టమైన ఉచ్ఛారణతో వివరంగా బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులతో గురు శిష్య అనుబంధానికి గల ప్రమాణాన్ని పెంచింది.
అంత చిన్న వయసులోఅతడుసంపాదించినపాండిత్యానికి,విషయపరిజ్ఞానానికి,వాక్చాతుర్యానికి . రఘుపతి కి వక్తగా పరంపరల ఆహ్వానాలు మొదలయ్యాయి.
సభ వాళ్ళు ఇచ్చిన శాలువాలకు సత్కార సామాగ్రికి, గదిలో ఉన్న చిన్న చెక్క బీరువా సరిపోలేదు.
రఘుపతికి వివాహం అయింది. భార్య రాగిణి దుస్తుల నమూనా లలో డిప్లొమా కోర్స్ చేసింది. చాలా చురుకుగా ఉంటుంది. ఆమెకు గృహ అలంకరణ నిర్వహణలలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
పెళ్ళి కాగానే రఘుపతి పెద్ద ఇంట్లోకి మారాడు. అతని కి ఆచార్య పదవి వచ్చింది. నగరం లో ప్రముఖ సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధి పొందాడు. స్వంత ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ పని కూడా . సంతృప్తికరంగా సాగుతోంది. .
కాల గడచిన కొద్దీ రఘుపతి నారాయణల స్నేహం మరింత దృఢమవుతూ వచ్చింది. నారాయణ కుట్టిన లాల్చీ ధరిస్తే రఘుపతికి మిత్రుడు భుజం మీద చేయి వేసి నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి కుటుంబం పెరిగింది. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. కుటుంబ వ్యయం పెరిగింది.
నారాయణ కూతురు డాక్టర్ కోర్సు చదవాలని. గట్టి పట్టుదలతో ఉంది. తన సంపాదనతో కొడుకు ఇంజనీరింగ్,కూతురు మెడిసిన్ లను చదివించ గలనా? అని సందేహించాడు నారాయణ. కష్ట సుఖాలను ముచ్చటించుకుంటున్న సమయం లో పిల్లల చదువులను గురించి ప్రస్తావించాడు నారాయణ
నారాయణ సమస్యను విని పూర్తిగా అర్థం చేసుకుంది రాగిణి. బాగా ఆలోచించింది.

మర్నాడు తను పిలిచిన వెంటనే వచ్చిన నారాయణ ను కూచోమని కాఫీ ఇచ్చింది.
ఇప్పుడే వస్తాను ఉండు అంటూ బీరువాలలో ఉన్న శాలువలను. కొన్నింటిని తెచ్చింది
నారాయణా ఇవన్నీ రఘుపతికి సభా కార్య క్రమాలలో సత్కారానికి వచ్చినవి, ఇంకా చాలా ఉన్నాయి
ఇందులో కాశ్మీరు నుండి ఖద్దరు వరకూ, అనేక రకాలున్నాయి. వాటిని బట్టి నేను నమూనాలను గీసి ఇస్తున్నాను. వాటిని నువ్వు చూసి నేనిచ్చిన డిజైన్ లకు అనుగుణం గా కత్తిరించి దుస్తులను తయారు చేయి.. బ్లౌజులు, కుర్తీలు, బ్రైడల్ దుస్తులను తయారు చేయి.అందమైన దుపట్టాలు, స్కార్ఫ్ ల నమూనాలను కూడా ఇచ్చాను.
అవన్నీ ఆధునిక యువతీ యువకులకు నచ్చే టట్లుం డాలి. ఇక వయసు పై బడిన వారికి భుజాల మీదనుండి జారిపోకుండా చేతులకు పట్టి వుండేటట్లు, ధారణకు అనుకూలంగా కుట్టాలి. అందమైన రంగుల దారాలను ఉపయోగించి ధరించే వారి విలువను పెంచాలి ..
ఇలా ఆమె రూపొందించిన నమూనాలకు నారాయణ నైపుణ్యం జోడించి తయారు చేసిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి.
ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా నారాయణ, అతని భార్య అహర్నిశలు కావించిన శ్రమ కు ఫలితం లభించింది.
కుట్టిన వెంటనే దుస్తుల కొనుగోళ్ళు జరిగాయి. నారాయణ ఎప్పటికప్పుడు రాగిణికి సమాచారం అందించడం తో ఆమె పేర్చి ఉంచిన శాలువాలు అన్నింటినీ విడతల వారీగా నారాయణకు అందించడం , అతడు తయారు చేసిన వస్త్రాలు స్థానికం గానే కాక ,వివిధ దేశాలకు ఎగుమతి కావడం తటస్థించింది.
నారాయణ తాను రూపొందించిన దుస్తులు ఎప్పటికప్పుడు కొనుగోళ్ళు కావడానికి కారణం రాగిణి గారు అని, ఆ శాలువాలను తమ బుద్ధి పరిశ్రమ తో సంపాదించిన వారు ఆచార్య రఘుపతి గారని, తాను సంపాదించిన డబ్బును వారికి చెల్లించ బోతాడు.
రాగిణి, రఘుపతి ఆ మాటను నవ్వుతూ తిరస్కరిస్తారు.
మాది ఆలోచన మాత్రమే! నీది ఆచరణ. మాది కొంత ఔదార్యం ,నీది ఔపచారికం ,జీవితావసరం, నీ సంతాన భవిష్యానికి సోపానం. నీ కూతురు డాక్టరయితే అనేక మందికి ఆమె సేవా భాగ్యం కలుగుతుంది. కొడుకు దేశ ప్రగతికి దోహదం చేస్తాడు. మా ఔదార్యం వల్ల ఇంతగా మేలు జరుగుతే అంతకంటె మాకు ఇతర కానుకలు ఎందుకు? అంటారు.—
ఆ రోజు రాగిణి డిజైనర్ షాపు ఆరంభ దినోత్సవం . అధునాతనమైన దుస్తుల తయారీలో సాటి లేని ప్రతిభను చూపిన రాగిణీ డిజైనర్ షాపు యజమాని రాగిణి ని చూడాలని వచ్చిన అతిథులు ఎదురు చూసారు.
ఆవిష్కరణ రఘుపతి చేతుల మీదుగా జరిగింది.
రాగిణి ఎవరు అన్న ప్రశ్న మిగిలింది.
విలువ ఇంత అని చెప్పలేని గౌరవం, ఆప్యాయత, మరియు సత్కారానికి ప్రతిబింబమే రాగిణి అని, ఈ దుస్తులను ధరించిన వారు సంప్రదాయానికి, ప్రత్యక్ష సాక్షులు గా ఉండాలన్నదే రాగిణి డిజైనర్స్ ధ్యేయం “అత్యుత్తమ మైన భారతీయ సంస్కృతి కి ఆధిపత్యం వహించిన శాలువా సభా గౌరవాలకు పరిమితం కాకుండా బీరువాలలో నలిగి ఉక్కిరి బిక్కిరి కాకుండా, సర్వ జన గణ వినుత మాధ్యమం లో విస్తృత విలువలను అందుకోవాలన్నదే రాగిణి ఆశయం” అంది సభలో అప్పటి వరకూ మౌనంగా రాగిణి గారిని ఆరాధిస్తున్న డా చంద్రిక , నారాయణ గారి కూతురు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓడి గెలిచే కలల స్నేహం

జాతీయం చేసుకున్న జాతీయాలు