సమయం ఆసన్నమైంది

వై సుజాత ప్రసాద్ లచ్చ పేట

విశ్రాంతిలేని
కన్నీటి జీవితంలో
అమ్మగా,భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా,
పాత్రలన్నీ పోషించి మెప్పిస్తున్నా
బతుకు
అశ్రు సముద్రం అవుతుండటం
అన్యాయమే !
అంతరిక్ష శోధనచేసే సత్తా
అణువణువునా నిండివున్నా..
అంతులేని సామర్ధ్యం
క్షణక్షణం నిరూపితమౌతున్నా ..
అడుగడుగునా వివక్షతతో
బతుకు కునారిల్లిపోతుండటం అన్యాయమే !
ఆటపాటల్లో ఘనాపాటివై
కీర్తి శిఖరాలధిరోహిస్తున్నా..
శక్తి యుక్తుల్లో సవ్యసాచివై
లక్ష్య సాధన చేస్తున్నా..
నిర్లక్ష్యపు నీడల్లో
బతుకు మసకబారిపోతుండటం
అన్యాయమే !
కష్ట నష్టాల్లో తోడునీడవైనా..
ఇష్టాయిష్టాల్లో భాగస్వామివైనా..
క్షణ క్షణం అణచివేత ఎదుర్కోవడం
అన్యాయమే !
కలిసి మెలిసి తిరుగుతున్నా..
నిస్వార్ధపు స్నేహం చేస్తున్నా …
వాంఛాపూరిత మృగ దాడికి
బలైపోతుండటం అన్యాయమే !
దుష్ట కీచకపర్వాలు
నికృష్ట నీచ ఘట్టాలు
ఇంకెన్నాళ్లీ అకృత్యాలు ?
సమయం ఆసన్నమైంది
స్వీయ రక్షణ సంస్థాపనార్ధాయ
సమానత్వం సాధనార్ధాయ
సంభవామి యుగే యుగే అంటూ
ఇక నీవు అవతరించాల్సిందే
ఆదిశక్తి స్వరూపిణివై
అన్యాయాల్ని అంతమొందించాల్సిందే !

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సుధీర

విలువ