హరి చందన- 6 భాగం

సాంఘిక నవల

ఆ రోజు సాయంత్రం పార్క్ కి వెళ్లడం కుదరలేదు, శైలజ ఆఫీస్ కి వచ్చి, షాపింగ్ కి వెడదామని గొడవచ్చేస్తే, హరికి మెసేజ్ పెట్టి, శైలజతో బయలుదేరింది.
“మొద్దూ! లేడికి లేచిందే పరుగు అన్నట్లు అర్జన్ట్ గా ఈ షాపింగ్ ప్రోగ్రాం ఏమిటే?, ముందు చెప్పాల్సింది కదా,”! విసుక్కుంటూనే స్కూటీ స్టార్ట్ చేసింది చందూ.
ఎక్కి వెనుక కూర్చుంటూ చందన తలపై వెనుకనుంచి చిన్నగా మొట్టి “బుద్దూ!రేపు తారీకు ఎంతో గుర్తుందా? తమరి పుట్టినరోజు. అంకుల్ కాల్ చేసి నీకు డ్రెస్ కొనుక్కురమ్మన్నారు.ఫోన్ పే లో డబ్బులు కూడా పంపారు..నీకు చెప్తే వద్దన్నావటకదా .”అంది.
” ఓహో!నీకు చెప్పారా ! పాతికేళ్లు వస్తుంటే ఇంకా చిన్న పిల్లల్లా పుట్టినరోజులంటూ హడావిడి అవసరమా? ”
“ఎన్నేళ్ళొచ్చినా తల్లిదండ్రులకి చిన్నపిల్లలే.మేము ఉన్నంత కాలం మీరు చిన్నపిల్లలే అంటుంది అమ్మ”
ఇద్దరూ బట్టల షాప్ ki వెళ్లారు. తనకి, శైలజ కి ఒకేలాంటి డ్రెస్ లు తీసుకుంది చందన., ఇప్పుడు నాకెందుకే అని శైలజ వారిస్తుంటే “వచ్చే నెలలో నీ బర్త్ డే ఉందిగా అప్పుడు కట్టుకో “అని బిల్ పే చేసి ఇద్దరూ బయటికి వచ్చారు.ఇంటికి వస్తుంటే దారిలో పార్క్ దగ్గరకి వచ్చేసరికి హరి అప్పుడే పార్క్ లోనుంచి బయటికి వస్తున్నాడు.
చందనని చూసి హాల్లో అంటూ చెయ్యూపాడు.
బండి ఆపక తప్పలేదు. హరి చెయ్యి పట్టుకుని ఉన్న బంటి “ఆంటీ!మీరీ రోజు పార్క్ కి రాలేదేంటి?” అడిగాడు.
“నువ్వెప్పుడొచ్చావ్ ఊరునుంచి? ” అడిగింది.
” నిన్ననే అన్నయ్య ఊరు వెళ్ళాడు. వీడు వస్తానని వెంట పడితే తీసుకొచ్చాడు ” చెప్పాడు హరి.

బండి దిగి స్టాండ్ వేసి బంటిని ముద్దు పెట్టుకుని, “ఇది మా సిస్టర్ షాపింగ్ వెడదామంటే అటు వెళ్ళాను. అయినా రోజూ పార్క్ కి వచ్చే అలవాటు నాకు లేదు. ఇప్పుడు నిన్ను చూసి బండి ఆపాను ” అంది.
“తను శైలజ. మా పెద్దమ్మ గారమ్మాయి.శైలూ!హరిశ్చoద్ర ప్రసాద్ గారు.”ఇద్దరికీ పరిచయం చేసింది.
” బట్టల షాపింగ్…. తొందరగానే అయిపోయిందే.. మా వాళ్లు
షాపింగ్ కి వెడితే కూడా వెళ్లిన వాళ్ళు హాయిగా రెండు గంటలు నిద్రపోయి లేవచ్చు “, శైలజ చేతిలో ఉన్న షాపింగ్ మాల్ పేరున్న కవర్ చూసి నవ్వాడు.
“మా చందూ షాపింగ్ పదినిముషాల్లో అయిపోతుంది. నేను కూడా ఉన్నానని ఇవాళ గంట పట్టింది ” చెప్పింది శైలూ.
“అయితే మీ సిస్టర్ ని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడన్నమాట.”కళ్ళ చివరలనుంచి చందూని చూస్తూ అన్నాడు.
“టూ హడ్రెడ్ పర్సెంట్…దీనికి కోపం రాదు. ప్రత్యేకించి ఇష్టాలు అంటూ ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రేపు తన బర్తడే. మా బాబాయ్ బట్టలు కొనుక్కోమని వారం రోజులనుంచి చెప్తున్నారట. డబ్బులు వేస్ట్ చెయ్యడం ఎందుకూ అని వద్దందట. నాకు కాల్ చేసి చెప్పారు. నేను బలవంతంగా షాపింగ్ కి లాక్కెళ్ళానన్నమాట”
“చాల్లే నోరుముయ్యి. సందు దొరికితేచాలు డబడబా….”
“దబా దబా కాదే బాబు, దాన్ని బడ బడా అంటారు. ”
వాళ్లిద్దర్ని చూసి హరి పకపకా నవ్వేశాడు హరి
“ఓకే మేము బయలుదేరుతాం. బై బంటీ ” స్కూటీ స్టార్ట్ చేసింది చందన.
“తమరి పరిచయం చాలా దూరమే వచ్చినట్లుందే “వేళాకోళంగా అంది శైలజ.
“నాకు సెట్ అవుతాడంటావా? ”
“అంటే….”
“అంటే నీకు బావగా సూట్ అవుతాడా అని ”
“ఆర్ యూ జొకింగ్?”
“మొద్దూ!ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారా ఎవరైనా? ”
“ఆపు.. ఆపు బండి ఆపు ”
స్కూటీ సడన్ బ్రేక్ తో ఆగింది.
“ఏమైందే!”అడిగింది విసుగ్గా.
“మెల్లగా అడుగుతున్నావా! కరెంట్ షాక్ కొట్టినట్లయింది.”
“నీ మొహం “నవ్వేసింది చందన.
“నిజమేనే తల్లీ. అందరితో ఎంతో రిజర్వుడుగా, హుందాగా ఉండేనువ్వు ప్రేమలో పడడం.. వింతల్లో వింత కాదా ”
“ఏం నేనూ మనిషినే.కదా!.. వయసులో ఉన్న అమ్మాయినే కదా! ”
“అది.. ఇప్పుడే నమ్మకం కుదిరింది ”
“చాల్లే..ఎక్కు వెడదాం” స్కూటీ స్టార్ట్ చెయ్యబోతుంటే
“ఆగమ్మా.. ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. పద “చందన చెయ్యి పట్టుకుని ఎదురుగా ఉన్న ఐస్క్రీమ్ పార్లల్ లో కి లాక్కెళ్ళిoది. తనే ఇద్దరికీ ఐస్క్రీమ్ తీసుకుంది.
“ఇంతకీ అతనికి ఓకే చెప్పావా?”
” లేదు. అతను కూడా యింకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. పెద్ద ఉమ్మడి కుటుంబమట. అందులో అడ్జస్ట్ అయ్యే పిల్ల దొరక్క ఇన్నాళ్ళూ పెళ్లి చేసుకోలేదట. ఇన్నాళ్లు ఒంటరిగా పెరిగిన నేను, నీ ప్రేమ, స్నేహం లేకపోతే మెంటల్ అయిపోయేదాన్ని. పెద్ద కుటుంబం అంటున్నాడు ఓకే చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ”
“శైలూ!నాన్న ఎప్పుడూ బిజీ. అమ్మ.. సవతి తల్లి అయినా నన్ను అలా బాధలు పెట్టలేదు గానీ, నాకు అమ్మప్రేమలోని ఆత్మీయత దొరకలేదు. అందుకే ఉమ్మడి కుటుంబంలో నేనూ ఒకదానిగా, అందరి అభిమానం పొందాలనిపిస్తోంది. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు. చూద్దాం ”
“నేను ఒకసారి అతనితో మాట్లాడవచ్చా?
” వైనాట్?రేపు ఇవాళ వచ్చినట్లు ఆఫీస్ అయ్యే టైమ్ కి రా.
పార్క్ లో కలుద్దాం ”
“సరే! వన్ మోర్ థింగ్.. మనం ఒకసారి వాళ్ళ ఊరు వెళ్లి చూసి వచ్చాక డిసైడ్ చేసుకుంటే.. బాగుంటుందేమో… ఆ పరిసరాల్లో నువ్వు అడ్జెస్ట్ అవగలవో లేదో….”
“అదెలా?ముందే వెడితే ఏం బాగుంటుంది?” అసహనంగా అంది చందన.
“ప్చ్! నువ్వుండు. రేపు కలుస్తాం కదా! నేనూ మాట్లాడి ప్లాన్ చేస్తా.పద వెడదాం “తనే ముందు లేచి,చందన చెయ్యి పట్టుకుని స్కూటీ దగ్గరికి నడిచింది.
స్టార్ట్ చేస్తూ “ఇప్పుడే పెద్దమ్మా, పెదనాన్నకి చెప్పకు. నేనూ పూర్తిగా డిసైడ్ అయ్యాక చెబుదాం,”
“సరేలే.. ఆ విషయం నాకు తెలియదా?” నవ్వేసింది.
కొంత దూరం వెళ్ళాక “ఆపు. బండాపు” అరిచింది శైలజ.

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు – 29

ఇది చాలు