రమక్కతో ముచ్చట్లు-27

నోములు నోసుకుంటే…!

అందరికీ శనార్థులు.

మంచిగున్నర!

ఇయ్యాల ఇంకో మంచి ముచ్చట ఉంది. ఇంటికి పోతుంటే లిఫ్ట్ ల మూడో ఫ్లోర్ రుక్మిణి అత్తమ్మ కలిసి,అట్కాయించింది. “మంచిగున్నవా మేడం ఇప్పుడే వస్తున్నవా కాలేజీ కెంచెల్లి” అని. ‘ అవునత్తమ్మా..మంచిగున్నర ఏంది సంగతులు ‘ అని నేను సుత అర్సుకున్న. రుక్మిణి అత్తమ్మ చెప్పిన ముచ్చట్లు ఇని నాకైతే జెరంత బాధ అయింది. నవ్వు సుత వచ్చింది. ఇక ముచ్చట్లు అన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్న. దానికన్నా ముందు మిడుసులు మస్తు గుంజుతున్నయి. కాలేజీల పొరల తోని ఒర్లుడాయే మరి. జెర అల్లం ఛాయ్ తాగి ముచ్చట్లు పెట్టుకుందాం. మా దోస్తులు గిట బయటకు పోతే రెస్టారెంట్లకి కెపచీనో, కోల్డ్ కాఫీలు అని తాగుతరు. మరి మీకు కూడా అది ఇష్టమా… నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఏమైనా మన తెలంగాణల అల్లం ఏషి గట్టిగ చాయ్ చేసి, గరం గరం తాగుతే.. ఆ కిక్కే వేరుంటది ఏమంటరు?!
ఇగ మా రుక్మిణత్తమ్మ బాధ ఏందో ఒకసారి మనం ముచ్చట పెట్టుకుందాం. ఆమె రంది అంత శ్రావణమాసం సుట్టూ తిరిగే ముచ్చటనే!
మీరు ఏమన్నా చెప్పండి, దునియాల ఎన్ని దేశాలు తిరిగినా.. భారత దేశానికి బరాబర్ యే దేశం రాదు. భారతదేశంల చేసుకునే పండుగలు. మన సంప్రదాయాలు ఒకలంటే ఒకలకు ఉండే ఆదరణ, ఇజ్జతూ, మన దేశం గొప్పతనమే వేరే అబ్బా! ఏమంటరు.
పూర్వకాలం నుంచి మన దేశంల ఉన్న గొప్పతనము, మనం ఆచరిస్తున్న పద్ధతుల గురించి మాట్లాడుతున్న. ఇయ్యాల ఎవడన్న ఒక్కడు ఏదన్న ఖరాబ్ చేసిండ్రు అంటే, దానిని లెక్కలకు తీసుకొని మనం దేశం రీతిని లెక్క కట్టలేము గదా!
చెల్లె…! అక్క ఏమేమో చెప్తుంది, రుక్మిణత్త రంది చెప్తా అని ఏందేందో చెబ్తుంది అనుకుంటున్నర. ఇగ ఆడికే వస్తున్న.
రుక్మిణత్తమ్మకు ఇద్దరు కోడండ్లు.
ఒకామెనేమో బాగా పైసలు ఉన్నింటి నుంచి వచ్చింది. ఇంకొకామె బాగా సదువుకున్నది. ఇద్దరితోని రుక్మిణత్తమ్మకు యాష్టనే ఉంటది. ఈమె చెప్పేది వాళ్లకు నచ్చదు. వాళ్ల లొల్లి ఈమెకు జొర్రదు.ఈమె మాటలకు ఇజ్జత్ ఇయ్యరు అని పాపం ఈమె బాధ!
రుక్మిణత్త పూర్తిగ సదువురాని నిషాని ఏమీ కాదు, గప్పట్లనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాంక సదువుకుంది హెచ్చిసి గ్రూపుల. పూజలు వ్రతాలు సంప్రదాయము ఉన్న వాతావరణంల కెల్లి వచ్చిందామే. అత్తమామలు అంటే భయపడి సచ్చేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆ కతలేమి నడవవాయే.
శ్రావణ మాసం వచ్చిందంటే సాలు రుక్మిణత్త మనసు ఆనందంతో నిండిపోతది. పూజలు వ్రతాలు నోములు
మొత్తం భక్తిల మునిగితేల్తది. ప్రశాంతత నిరాడంబరము. నిండుదనము ఇవి రుక్మిణతమ్మ లక్షణాలు.
వరలక్ష్మీ వ్రతాలు, మంగళ గౌరీ వ్రతాలు, శనివారం వ్రతాలు, సోమవారాలు ఉపవాసాలు, శివునికి అభిషేకాలు, ఇట్ల శ్రావణమాసం అంతా ఆమె ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటది. ఆమె ఇంట్ల సుత అట్లాంటి వాతావరణమే ఉంటది.
పెద్ద కొడుకుకు బాగా పైసలు ఉన్న సావుకార్ ఇంట్ల నుంచి పిల్లని తీసుకొచ్చింది. ఆ పిల్లకు వ్రతాలు పూజలు అంటే డెకరేషన్లు చేసుడు, గిఫ్టులు కొనుక్కొచ్చు అండ్ల వాయినాలు పెట్టిచ్చుడు, రకరకాల ఆభరణాలు పెట్టుకొనుడు, తయారవుడు, సెల్ఫీలు, ఫోటోలు.. ఇదే హంగామ! పూజ ఎటుపోతదో.. అలంకరణలు, డెకరేషన్లకే మాపటేల రెండు మూడు అయితది. పూజ రెండు నిమిషాలు.
ఒక చిటికెడు కుంకుమేసి భక్తితో అమ్మవారికి పూజ చేసుకోవాలె గానీ.. గీ హంగామా అంత ఏంది? ఈ గిఫ్టులు కొనుక్కొచ్చి ఇచ్చుడెంది, ఏ కులమైనా ఏ మతమైనా చిన్నోలైనా.. పెద్దోల్లైనా ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇంత పసుపు కుంకుమ ఇచ్చి, వాళ్ళే అమ్మవారిని భావన చేసి, వాళ్ళ కాళ్ళకు పసుపురాసి నమస్కారం చేసి వాయనం ఇయ్యాలి. అని రుక్మిణత్త చెప్తది. ప్రిస్టేజ్ ఉంటది, మనం రిచ్, మా కిట్టి పార్టీల అందరికన్న నేనే బెస్ట్ చేయాలంటది వాళ్ళ పెద్ద కోడలు. ఇదే రుక్మిణత్తకు రంది! ఒక భక్తి లేదు, పూజ లేదు, గీ గొప్పలేంది. అమ్మవారి వ్రతం అంటే గిదా..!! అని నెత్తి కొట్టుకుంటది ఆమె!
ఈ సంవత్సరం చిన్న కొడుకు పెళ్లి జేసింది ఇగ ఆ పిల్లది ఇంకొక కథ. ఈ పూజలు వ్రతాలు ఆడవాళ్ళము మేమే చేయాల్నా మొగోళ్ళు ఆయుషు కోసం. మొగోళ్ళు మా కోసం ఏం చేస్తరు అంటది.
నేను వ్రతం చేస్తే ఆయన పానం దక్కుతదా? నేనేమన్నా సావిత్రిని, ఆయన సత్యమంతుడా!? యేకాలంల ఉన్నరు, ఏం కత? అని ఒక నవ్వు నవ్వి.. నేను వ్రతాలు చెయ్యపో అన్నది.
ఇస్వంటి సత్తెకాలపు రుక్మిణి అత్తకు యెడ్డెమ్ అంటే తెడ్డెమ్ అనే ఇద్దరు కోడండ్లు వచ్చినంక పాపం రంది లేకపోతే ఏమీ ఉంటది చెప్పుండి. వశ పడ్తలేదు ఆమెకు.
రుక్మిణత్త కోడండ్లు అనే కాదు ఈ కాలంల శానా మటుకు పూజలు నోములు, వ్రతాలు అనేవి ఒక ఫ్యాషన్ లెక్క అయిపోయినై. ఏమన్న తమకు ఎంత ఉన్నదో సూపిచ్చుకోవాలి. ఒకళ్ళకన్న ఒకళ్ళు గొప్పగ తమ అలంకారాలు గిఫ్టులు నగలు చూపించుకొనుడు ఇదే అయిపోయింది. దీన్ని షో ఆఫ్ అంటరు.
శ్రావణమాసం వచ్చిందంటే షో ఆఫ్ ఇగ! ఎగ్జిబిషన్లు పెట్టుకునుడు.
ఇది సరైన పద్ధతి కాదు మారాలి మనం. Divinity starts where there science ends అన్నరు స్వామి వివేకానందుల వారు. భక్తి మార్గం అంటేనే ఆధ్యాత్మికతకు దారి. ఆధ్యాత్మికత తెలిసిన వాళ్లకు జీవితం ఎంత ఆనందంగ ఉంటదంటే… ఎందుకు పుట్టినమో, జీవితం అంటే ఏంది, ఎట్ల అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుస్తయి కనకనే ఆధ్యాత్మిక తొవ్వ.. చిన్నపిల్లలుగ ఉన్నప్పుడే అలవాటు జెయ్యాలి. అట్ల భక్తి మార్గంలోకి నడిపించేవే ఈ వ్రతాలు పూజలు. ఈ ప్రపంచానికే తల్లి అయిన జగన్మాతను ఎందుకు కొలవాలి?! భర్త ప్రాణం కోసము భార్య చేసుడు కాదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ప్రాణమై, ఒకరి ప్రాణం కోసం ఒకరు నిలబడి ఉండాలి.
ఇక్కడ అందరికీ అర్థం కాని ఒక పెద్ద పరమార్ధం చెప్త. మా అమ్మమ్మ ఒకప్పుడు నాకు చెప్పింది.ఇప్పుడంటే అందరూ ఉద్యోగాలు చేసే చేస్తున్నాము. అందరము సంపాదించాలి. ఐతేనే జీవితాలు ఎల్లుతున్నయి. భర్త భార్య ఇద్దరూ సంపాదనపరులైనరు. ఉరుకులు పరుగుల దునియా అయిపోయింది. ఒకప్పుడు ఇట్ల లేకుండె. వృత్తి ప్రాతిపదిక మీద జీవితాలు నడుస్తుండె. అన్ని వృత్తులు గౌరవమైనవే, అందరూ తమ వ్యాపారాలు చేసుకోనీకి వేరే దేశాలకు పోయి అమ్ముకొని వచ్చేటోళ్లు. ఒకసారి ఇల్లు వదిలిపెట్టి మగమనిషి బయటకు పోతే ఇంటికి రానికి నెలలు పట్టేది. సంవత్సరాలు కూడా పట్టేది. తన కుటుంబం కోసం కష్టపడేటోడు అతను. ఆమె సుత ఏమీ తక్కువ కాదు ఇంట్ల ఉండి పిల్లల్ని, సంసారాన్ని సూసుకునేది. భర్త క్షేమంగ తిరిగిరావాలి అని దైవాన్ని ( అమ్మవారిని ) మొక్కుకునేది. ఆయన సముద్రప్రయాణం చేసినా, అడవి తొవ్వలపోయినా తన ఇంట్ల ఉన్న అమ్మా అయ్యల్ని,పెండ్లాం పిల్లల్ని కాపాడుమని తనను క్షేమంగ ఇల్లు చేర్చుమని దండం పెట్టుకునేటోడు. ఇదే కదా బంధం అంటే. ఇద్దరు కలిసి పిల్లల్ని సరిగ్గ పెంచడం,తమ సంసారాన్ని సక్కంగ నడుపడం కోసం మంచి తొవ్వల సాగేటోళ్ళు. భర్తకు పూజలు ఉండవు, భార్యలే ఎందుకు చెయ్యాలి అనే ఈనాటి ఆడపిల్లలు జెర సోయి పెట్టాలి ఇక్కడ.
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ముచ్చట కాదు. ఎవరి ధర్మం వారు చేయడమే మానవ జీవితం. ఇది అర్థం కావాలి.
భార్యాభర్తల బంధం అంటే జన్మజన్మల బంధము. అది ఎంతో పవిత్రమైన బంధము. అట్ల ఒకళ్లకు ఒకళ్లు ప్రాణమై తోడునీడగా ఉండడం కోసము, ఆ జగన్మాత ఆశీర్వాదం తీసుకోవడం పూజలు పునస్కారాల అర్థం. ఇదే నిజమైన ప్రేమ ఇదే నిజమైన బంధం. I die for you, i kill you అన్నది ఇప్పటి కత. సంపుడో సచ్చుడో కాదు బతుకు అంటే. బతుకుతూ.. బతుకు నిచ్చేది. అట్లా ఉన్నతంగా బతికే శక్తిని మనసుకు శరీరానికి, బుద్ధికి ఇవ్వమని అమ్మ వారిని వేడుకోవడం లేదా పరమాత్మను వేడుకోవడమే పూజల యొక్క నిజమైన అర్థం.. అట్లా ఒక్కొక్క మాసంల ఒక్కొక్క ఆరాధనలు చేస్తూ మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించేవే పూజలు- వ్రతాలు! వాటికి ఆడంబరత, గొప్ప చెప్పుకోవడం అవసరం లేదు. భక్తే ప్రధానము. నిశ్చలమైన మనస్సును ముఖ్యం!
నోములు నోసుకుంటే.. నిజంగ పుణ్యం వస్తది. పుణ్యం అంటే ఎట్ల బత్కాల్నో తెలుసుకునుడు సుత!

నోములు అంటే భయంతోని పాటించే శిక్షలు కాదు. అవి మన జీవితాన్ని నియమబద్ధంగా మార్చే సాధనలు.
పండుగల పేరుతో కుటుంబం కలిసి ఉండే సమయాలు పెరుగుతయి.
ఇది వర్షాకాలం కనుక ఆరోగ్యం క్షీణించే అవకాశాలు సుత ఎక్కువగ ఉంటై తలాభిషేకం అంటే నెత్తిమీద సానం, తులసి పూజ, ఉపవాసాలు ఇవన్నీ చిట్కాల లెక్క, మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. మంచి జేస్తయి.

శ్రావణ మాసం అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి వ్రతం, నోము ఎనుక వ్యక్తిగత ఎదుగుదల, కుటుంబ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు, ప్రకృతి రక్షణ, ధార్మికత అన్నీ ఇముడ్సుకోని ఉంటయి. ఈ నెల అంత భక్తితోని గడిపితే, మన జీవితం సార్ధకమయితది అని నమ్ముతరు.
మొత్తం మీద సంస్కృతి పరిరక్షణ ఒక జాతికి జీవనాడి లెక్క! గనుక అందుల భాగమైన ఈ పూజలు వ్రతాలను భక్తితోనే చేసుకుందాం. నలుగురం కలిసి ఒక దగ్గర జేరి మంచి మనసుతోని ఆడి పాడి భక్తితో పండుగలు జేసుకోవాలి. పండుగల అంటే ఆడంబరాలు, హెచ్చులు పోవుడు కాదు.
మీరేమంటరు చెల్లె! చెప్పుండి తమ్మీ!! మనిండ్లల్ల సుత అమ్మవారి పూజ భక్తితో చేసుకుందాం. ఈ లోకాలను కాపాడే సల్లని తల్లి అందరిని చల్లగ సూడాలని అందరికీ ఆమె దీవెనలు లభించాలని కోరుకుంటూ..

ఉంటమరి పైలం

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధరణి

ఆది నుండి ఆధునికం వరకు (కాలమ్)