“ఇచ్చట పుట్టిన చిగురుకొమ్మయిన చేవ” అని ఒక కవివరేణ్యులు చెప్పినట్లు,తెలుగు గడ్డపై జన్మించి తెలుగు నేలపై జన్మించి తేజోవిరాజితులైన మహిళా మణులు ఎందరో మరెందరో వారందరికీ వందనాలు..
తమ పాతివ్రత్య మహిమతో, మాతృత్వ, నేతృత్వ, కర్తృత్వ, శక్తి సామర్థ్యములతో భారత జాతికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహిళామణులు కొందరు. మార్గదర్శకులు గా నిలిచిన మాతృమూర్తులు కొందరు. దాస్యశృంఖలాలలో మగ్గుతున్న భరతమాత పునర్వైభవ ప్రాప్తి కోసం తమ శక్తి యుక్తులను నొడ్డి పోరాడిన మహిళా మణులు కొందరైతే, తమ సంతానాన్ని తీర్చిదిద్ది దేశ సేవ కోసం ధీశాలురుగా తయారుచేసిన వీరమాతలు కొందరు, కుటుంబ బరువు బాధ్యతలను తమ భుజస్కంధాల మీద మోస్తూ భర్తను స్వాతంత్య్ర సమరానికి సన్నద్ధులను చేస్తూ, వీరతిలకం దిద్ది విజయోస్తని పంపించిన మహిళలు కొందరు, ధన ప్రాణాలు తృణంగా భావించి దేశమాత దాస్య విముక్తి
కోసం తమ ఆస్తులను అర్పించి, ఆర్థికంగా స్వాతంత్ర్యోద్యమాన్ని బలోపేతం చేసిన మహిళామణులు కొందరు.
స్వయం ఉత్పత్తులను పెంచి, శ్రమించి తమ శ్రమ ఫలాన్ని దేశరక్షణ నిధికి అప్పగించిన మహిళా మూర్తులు కొందరు. స్వతంత్ర లక్ష్మీ పూజలు చేసి, పేరంటాలు పెట్టి, ఆ పేరంటం ద్వారానే స్వాతంత్ర్యానికి సంబంధించిన సమాచారాలను పంచుకొనేవారు కొందరు.. ఉద్యమాలను ఊపిరి నిచ్చిన రహస్య సమాచారాలను, ప్రభుత్వం కంట పడకుండా యుక్తిగా శుభకార్యాలలో కలుసుకున్నప్పుడు పంచుకుంటూ ఉద్యమాన్ని ప్రభావితం చేసేవారు కొందరు. మరికొందరు ఆహార పదార్థాలు పంచుతున్నప్పుడు, వాటిలో సమాచారాల చీటీలు పెట్టి అందజేసేవారు. జాతీయ నిధికి తమ నగలను అర్పించడంలో, రాట్నం వడకడంలో, ఖద్దరును ఉత్పత్తి చేయడంలో, విదేశీ వస్తు బహిష్కరణలో, జాతీయోద్యమాలతో ప్రభావితులైన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మహిళలు ఉత్సాహంగా స్వాతంత్ర్యోద్యమంలో కొందరు ప్రత్యక్షంగా పాల్గొంటే మరికొందరు ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు.
ముతక తెల్ల చీర ,ఖద్దరు రవిక ధరించి నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో మెడలో పసుపు తాడుతో సాదాసీదాగా కనిపించే ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి ఆకారం చూసిన వారెవరూ ఆమె అభ్యుదయ మహిళ అని, ఉన్నత భావాలు గల స్త్రీ అని, మహిళా జనోధ్ధరణ కోసం, స్వాతంత్య్రపోరాటం కోసం ఉరకలేసిన మహిళామణి అని ఏ మాత్రం అనుకోరు. లక్ష్మీబాయమ్మ గారు స్వాతంత్యోద్యమంలో భర్తతో పాటు పాల్గొడమే కాకుండా, భర్తను ఆంగ్ల ప్రభుత్వం చెరసాలలో బంధించినప్పుడు, ఆంధ్రదేశమంతటా పర్యటించి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రచారం చేయడం గొప్ప విశేషం. ఈమె గొప్ప వక్త. ఆమె ఉపన్యాసాలు స్త్రీలను చైతన్యవంతులను చేసేవి. ఆమె ప్రబోధాలతో చైతన్యవంతమైన వైద్య కళాశాల విద్యార్థులు, గాంధీ టోపి ధరించి కళాశాలలకు వెళ్లి సంచలనం సృష్టించారు.
సంఘ నిర్మాణంలో, జన సమీకరణలలో, నిధి సేకరణలో, ఆమె నైపుణ్యం, సామర్థ్యం గొప్పవి. గొప్ప దేశభక్తులుగా, ‘మాలపల్లి’ నవలా రచయితగా, లక్ష్మీనారాయణ గారు ప్రముఖులైనా, సంఘ సేవకురాలిగా, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలిగా, భర్తకు తీసిపోని మగువ ఉన్నవ లక్ష్మీబాయమ్మ.
దువ్వూరి సుబ్బమ్మ గారు “రండిరా ఎవరు వస్తారు రండి. నేను గంగా భాగీరథీ సమానురాలిని గాని, అందరినీ గంగలో కలిపేవరకు నిద్రపోన”ని బ్రిటిష్ సైనికులను ఎదిరించి స్వాతంత్య్ర పోరాటంలో, సాహసంతో దూసుకుపోయిన మహిళా మణి. అనంతపురం జిల్లాకు చెందిన ధ్రువమ్మ గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలు. 1930 కాలంలో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేశారు.
దుండి రాజమ్మ గారు ఆంధ్రదేశంలోని ప్రముఖ గాంధేయవాదులలో ఒకరు. మహిళలలో జాతీయ చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. టంగుటూరి ప్రభావతమ్మ. ప్రకాశం పంతులు గారి భార్య. ఆమె స్వయంగా ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు, అనేకమంది మహిళలను ఉద్యమంలోకి తీసుకురాగలిగారు .
అరుణా దేవి మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలిగా వేదికలపై ప్రసంగాలు ఇస్తూ జాతీయ భావాలను పంచారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లారు. బెజవాడ ఝాన్సీ రాణి
బెజవాడ గోపాల్ రెడ్డిగారి భార్య. ఆమె మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వడ్లూరి రామ చంద్రమ్మ “గోదావరి జిల్లా ప్రాంతంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహిళ. గొప్ప దేశభక్తురాలు.
వలేరమ్మ మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినవారు. ఉద్యమాల సందర్భంగా బ్రిటిష్ అధికారులను ఎదిరించి నిలబడ్డారు. రామలింగమ్మ గారు నిజాం పాలనపై తిరుగుబాటు చేశారు ఈమెను ‘వనదేవత’ అని పిలిచేవారు. బహుజన నాయకురాలు బాణోతు లక్ష్మీ బాయి ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశారు. స్వాతంత్ర్యంతో పాటు సామాజిక సమానత్వాన్ని కోరారు.
అచ్చంపేట మల్లమ్మ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆర్మూరు ప్రాంతంలో ఆమె చైతన్యం వల్ల అనేక పోరాటాలలో ఆమె ధైర్యం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. చాకలి ఐలమ్మ అత్యంత ప్రసిద్ధ మహిళా ఉద్యమ నాయకురాలు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె భూస్వాముల అన్యాయాన్ని ఎదిరించారు. ఆమె పేరు తెలంగాణ విప్లవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
రంగమ్మ బళ్లారి, వరంగల్ ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. భద్రమ్మ మహిళల్లో జాతీయ చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహించారు. మిత్రులతో పాటు పాల్గొన్నారు. ఆచంట రుక్మిణమ్మ చెన్నపురి తెలుగు తేజం. స్వాతంత్ర్యానికి పూర్వం మద్రాసులో ప్రజాజీవనంలో విశిష్టమైన భూమిక నిర్వహించిన మహిళామణి దీపం ఆచంట రుక్మిణమ్మ .
పొణకా కనకమ్మ “నెల్లూరు విప్లవ కణిక’ ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది”.అన్న గురజాడ వారి మాటను సార్ధకం చేస్తూ, ఆంధ్రదేశం ,దక్షిణ ప్రాంతంలో గొప్ప ఆత్మస్థైర్యంతో రాజకీయ చైతన్యంతో అలుపెరుగని పోరాటం చేస్తూ, చరిత్రను సృష్టించింది.
ఆమె భూస్వామ్య కుటుంబంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. మొక్కవోని కార్యదీక్షతో మాతృదేశ కళ్యాణానికి జీవితాన్ని ధారపోసిన కర్మయోగిని కనకమ్మ గారు. ఆమె నిండు జీవితమంతా విజ్ఞానవంతమైన జీవనయాత్ర చేశారు.
మాగంటి అన్నపూర్ణాదేవి తన శరీరంపై ఉన్న బంగారు నగలన్నిటినీ, స్వాతంత్య్రనిధికి సమర్పించిన ప్రథమ భారతమహిళ. ఆమె చనిపోయినప్పుడు “దేశంలో నా అదృష్టం కొద్దీ అనేకమంది పుత్రికలు నన్ను తండ్రిగా స్వీకరించారు. అలాంటి పుత్రికలలో చిన్నవయసులో అత్యుత్తమురాలైన ఒకరిని కోల్పోయానని శ్రద్ధాంజలి ఘటించారు గాంధీజీ. ఆమె తాను స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడమే కాకుండా విదేశాల నుండి వచ్చిన భర్తకు ఓడరేవు వద్దకు ఖద్దరు బట్టలు పట్టుకెళ్ళి దీక్షను ఇప్పించి, భర్తను కూడా స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజపరిచిన ఉత్తమ మహిళామణి. తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, రాత్రింబవళ్లు ఉద్యమంలో తిరిగి, ప్రకృతి వైద్యాన్ని నమ్మిన ఆమె, ఇంగ్లీష్ మందులు వాడలేదు. 27 ఏళ్ల వయసులోనే మరణించింది. క్షణక్షణం దేశం కోసం త్యాగబుద్ధితో జీవించిన ఆ మహిళామణి ఆదర్శమూర్తి .
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, తొలిమహిళా గవర్నర్, భారత కోకిల సరోజినీనాయుడు కుమార్తె పద్మజానాయుడు. ఈమె పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో గణనీయమైన కృషి సాగించారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో, నిజాం రాజ్యంలో నిషేధాజ్ఞలు ధిక్కరించి, గాంధీ జయంతి ఉత్సవం నిర్వహించినందుకు గాను నిజాం ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది. ఈమె జాతీయోద్యమంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రజలను ఉత్తేజపరిచారు. భారతీ దేవి రంగా రైతు ఉద్యమ మహిళా నేత. ఈమె తండ్రి చరిత్రాత్మకమైన శిస్తుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప కార్యకర్త. గుంటూరు బార్డోలిగా ఈ ఉద్యమం విఖ్యాతమైంది. ఈమె భర్త భారత రాజకీయాల్లో ‘రైతురంగా’ గా సుప్రసిద్ధులు. సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, పన్నుల నిరాకరణ మొదలైన ఉద్యమాల్లో, ఈమె గొప్ప కృషి చేసింది. జైలుశిక్షలు అనుభవించింది. విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ విజయవంతం కావడానికి అనేక ప్రదేశాలలో ఆమె శాంతి సైన్యాన్ని నడిపి, వారి శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది.
దుర్గాబాయి దేశముఖ్ చైతన్య శక్తి ప్రతీక. స్వేచ్ఛ వాదిగా, స్త్రీ విముక్తి వాదిగా చిరస్మరణీయురాలు. దేశాభ్యుదయం కోసం, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె ప్రదర్శించిన అంకితభావం, స్త్రీ జాతికి సర్వదా మార్గదర్శకం.ఈమె బాల్యం నుండి ఆట పాటలలో మేటి. ఆమె జీవితం దేశ సేవకే అంకితం. కాకినాడ కాంగ్రెస్ సభలకు 600 మంది దాకా మహిళా వాలంటీర్లకు తర్ఫీదులు ఇచ్చింది. టిక్కెట్ లేదని నెహ్రూ గారిని కూడా కాంగ్రెస్ సభల ప్రవేశానికి అనుమతించకుండా గేటు దగ్గర నిలిపివేసిన ధైర్యవంతురాలు. కర్తవ్య పరాయణురాలు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి గాంధీ గారి నుండి ప్రత్యేకంగా అనుమతి పొందింది. సముద్ర తీరమైన మద్రాస్ పట్టణంలో కూడా ఉప్పు సత్యాగ్రహం జరగాలని, టంగుటూరి ప్రకాశం పంతులుగారిని, కాశీనాధుని నాగేశ్వరరావుగారిని ఒప్పించిన దుర్గాబాయి సంకల్పం వల్లనే మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఆమె సత్యాగ్రహానికి నాయకురాలు అయింది. మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని సమర్థంగా నిర్వహిస్తూనే, రాజ్యాంగ నిర్మాణంలో గణనీయమైన పాత్ర వహించి ఆర్థిక సాంఘిక రాజకీయ నైతిక సమానత్వం స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమానమని నిరూపించే హిందూ కోడ్ బిల్లుపై వాద ప్రతివాదాల్లో ఆమె చేసిన ఉపన్యాసాలు విలక్షణమైనవి. దుర్గాబాయి 1955లో హైదరాబాదు లో ఆంధ్ర మహిళాసభ ప్రారంభించారు. ఈ సంస్థ ఆమె దీక్షాదక్షతల కీర్తి పతాక. అనంతమైన ఆమె శక్తి సామర్ధ్యాలు, ధైర్య సాహసాలు, కార్యదీక్షా సమన్వితమైన సేవాపరాయణత్వానికీ భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపసభాపతి వరకు ప్రస్థానం సాగించిన దేశభక్తురాలు, చోడగం అమ్మన్న రాజాగారుదేశభక్తితో నిస్వార్థంగా జీవితం సాగించారు.
మహిళా సంక్షేమ ప్రదాత మహిళా సంక్షేమ ప్రదాత సంగం లక్ష్మీబాయి.లక్ష్మీబాయి స్వాతంత్య్ర సమరయోధురాలిగా భారత ప్రభుత్వ తామ్ర పత్ర గ్రహీత. ఈమెకు సంతానం లేదు అత్తవారింటి నుండి తనకు సంక్రమించిన మొత్తం భూమిని ఇతర ఆస్తిని భూదాన ఉద్యమానికి సేవాసదనానికి అప్పగించడం ఆమె విశాల హృదయానికి సంఘసేవా తత్వతకు నిదర్శనాలు. మహిళా సంక్షేమానికి ఆమె సేవలు చిరస్మరణీయం.
సూర్యదేవర రాజ్యలక్ష్మి దేవి, సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, ఆరుట్ల కమలాదేవి, టీఎస్ సదాలక్ష్మి, పోరాటమే ఊపిరి గా బ్రతికిన మహిళా నేత మల్లు స్వరాజ్యం వంటి మహిళా మణులు స్వాతంత్య్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాక ఉద్యమానికి ఊపిరి పోసి, భరతమాతను తిరిగి గద్దెపై పునప్రతిష్టించడానికి తమ వంతు కృషిని జరిపి చిరస్మరణీయులయ్యారు. వారందరికీ పేరు పేరునా వందనాలు. అభినందన చందనాలు .