నీ జతగా నేనుండాలి

పుస్తక సమీక్ష

శ్రీమతి మాలా కుమార్ గారి కథామాల “నీ జతగా నేనుండాలి” సంపుటి ఒక కదంబ మాల.
మల్లెలు,కనకాంబరాలు, మరువం కలిపి కట్టిన పూలమాల లాగా ఈ కథా మాల వైవిధ్యమైన కథలతో అల్లిన కథామాల.
శ్రీమతి మాలా కుమార్ గారు (కమల పరచ) వ్రాసిన ఈ సంపుటి లో మొత్తం 53 కథలు ఉన్నాయి.
మల్లెలు,కనకాంబరం, మరువం లాగా కొన్ని ప్రేమ కథలు, కొన్ని మనసుని కదిలించే కథలు, కొన్ని మిలిటరీ కుటుంబాల కథలు,కొన్ని డయాస్పోరా కథలు ఇలా పూలదండలాగా, వేరు వేరు పూలకు ఉన్న పరిమళం లాగా, మనసుని మరిపిస్తూ,మురిపిస్తూ, గుండెని స్పృశిస్తూ సాగుతాయి.
పుస్తకం పట్టుకుంటే చివరివరకు చదివిస్తుంది కమలగారి కథనం, కథాంశం.

టైటిల్ కథ నీ జతగా నేనుండాలి లో చిన్నప్పటినుంచి అనుకున్న మేనబావతో, పెళ్లి జరగకపోవడంతో, డిప్రెషన్ లోకి వెళ్లిన గౌరికి పెళ్లి చేస్తే, పరిస్థితి నయమవుతుందని ఆశతో, ప్రకాష్ కి ఇచ్చి చేస్తే, ముందు ఆమె ప్రవర్తనకి ప్రకాష్ కి కోపం వచ్చినా, గౌరి తాతగారు అసలు విషయం చెప్తే అర్థం చేసుకుని గౌరిని నెమ్మదిగా మార్చుకుందామని, ఆమె చేతే నీ జతగా నేనుండాలి అనిపించాలి అనుకోవడం.
సున్నితమైన అంశాన్ని ఇంకా సున్నితంగా కథలో చెప్పారు మాలగారు.
ఇంకో కథ ‘శాంభవి’ లో ఆమె రూపం ఎలా ఉన్నా మంచి గొంతు ఉండడంతో, లాయర్ విమల సాయంతో, ఆత్మ విశ్వాసం తో పాటల పోటీలో గెలవడం, పంచవటి లో పిల్లలు తల్లికోసం అందరూ ఒక దగ్గర ఉండాలనుకోవడం, అలానే ఆత్మీయ బంధం, సహచరి లాంటి కథల్లో సున్నితమైన కుటుంబ అంశాలు తీసుకున్నారు.

ధీర, విధివిన్యాసాలు వంటి ఇంకొన్ని కథల్లో మిలిటరీ వారి జీవితాలగురించి వ్రాసారు. రచయిత్రి కమలగారి భర్త శ్రీ ప్రభాతకుమార్ గారు, మిలిటరీలో పనిచేయడంవల్ల,అక్కడ ఎక్కువ కాలం గడపడం వలన, వారి జీవనం పై అవగాహన ఉన్న మాలగారు, అక్కడి సాధక బాధకాలు, అనుభవాలు,కష్టాలు అన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు.

రాధామాధవీయం, రాజాకి ఆయేగి బారాత్ వంటి ప్రేమ కథలు చదివి పెదవుల మీద నవ్వు విరిస్తే, అలమరా లిఫ్ట్, అయినను పో…, అహో లక్ష్మణా లాంటి కథలు చదివితే ‘అరే! మనకి కూడా ఇలానే అయిందిగా!’ అనిపిస్తుంది.

డయాస్పోరా కథలు… హ్యూమన్ లైబ్రరీ , హై స్కూల్ స్వీట్ హార్ట్ వగైరా చదివితే, విదేశాల్లో ఉన్న వారిగురించి చదివితే ఏ దేశమైనా ప్రేమ, పెళ్లి అనుబంధాలు ఒకటే అనిపిస్తుంది.

అన్ని కథలు హాయిగా చదివి ఆనందించచ్చు. ఎక్కడా విలన్లు, ఏడుపులు ఉండవు.
కుట్రలు,కుతంత్రాలు ఉండవు.

ఈ కథామాలని చదివి, కథా పరిమళాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.

కొన్ని కథలు మళ్లీ,మళ్లీ చదివిస్తాయి. ఇంటి గ్రంథాలయంలో ఉండాల్సిన పుస్తకమని నా అభిప్రాయం.

ఈ పుస్తకం అన్ని పెద్ద బుక్ స్టాల్స్ లోనూ దొరుకుతుంది. లేదా ఈ కింది mail id కి మేయిల్ చేసినా పంపుతారు.
పుస్తకం వెల: పోస్టేజ్ కలిపి 20% తక్కువ.
prabhatakamalam@gmail.com

Written by Lalitha Kumari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆది నుండి ఆధునికం వరకు (కాలమ్)

శుభ ముహూర్తం -4వ భాగం