తయారు చేసింది..ఇంకెవరు మనమే.. మనమే అంటే మీకు ఎట్లా తెలుస్తుంది నేనేమన్నా సిఎం నా పిఎం నా! అదేనండి లక్ష్మీ మదన్ ను..
ఎన్ని వంటకాలు తిన్నా మామూలే.కానీ ఇలాంటి ఆవకాయలు పచ్చళ్ళు చూస్తేనే నోరూరుతుంది కదా! అబ్బ! రాస్తుంటేనే వెళ్లి తినాలి అనిపిస్తుంది.
మనము ఏదైనా టూర్ వెళ్లి వచ్చామనుకోండి. ఇంటికి రాగానే ఎప్పుడెప్పుడు కొంచెం అన్నం వండుకొని అందులో ఆవకాయ వేసుకుని తినాలని ఉంటుంది. అంతకుమించి ఇంకేముంటుంది!
సరే విషయానికి వస్తాను.
ఇప్పుడు టమాటాలు చాలా చవక. పాపం రైతులైతే గిట్టుబాటు లేక రోడ్లమీద పడేసి కూడా వెళుతుంటారు. రైతుకు భరోసా కల్పించాలి.
టమాటాలను కడిగి తడి లేకుండా తుడిచి లేదా ఆరబెట్టి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

ఒక దళసరి బాణీలో కొద్దిగా నూనె వేసి ఈ టమాటా ముక్కలు వేసి అందులో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి.
అవి ఉడుకుతుంటే మీరు మొబైల్ చూడటం టీవీ చూడటం చేయకండి. పని ఉంది చెప్తాను.
రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల ఆవాలను చక్కగా వేయించండి. వీటిని పొడి చేసి పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో టమాటాలను బట్టి కారాన్ని తీసుకోండి. ఉప్పు కారం సమానం కొలతలు. ఇప్పుడు పొడి చేసుకున్న పదార్థాన్ని అందులోనే కలపండి.
ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత నీరంతా పోవాలి. అప్పుడు చల్లార్చండి. అవసరం అనుకుంటే మిక్సీలో వేసుకోండి నేనైతే వేయలేదు. ఇప్పుడు ఆ కారం మిశ్రమంలో టమాటా గుజ్జు కలపండి.
ఆ తర్వాతే ఏంటి చక్కగా పోపు వేయండి. వెల్లుల్లి తినేవాళ్లు వెల్లుల్లితో వేసు కొండి. ఇంగువతో కావాలనుకుంటే ఇంగువ వేయండి. నేను ఇంగువ పోపు వేశాను. నూనె మీ ఇష్టం..
ఇది ఊరాల్సిన అవసరం కూడా లేదు. అయిన వెంటనే అన్నంలో కలుపుకొని తినేయవచ్చు. అసలు వేరే కూర అవసరమే లేదు. పెట్టిన రోజు మనకు అలా అనిపిస్తుంది.
మరి ఆవకాయ అన్నం తిందామా?