ఇంట్లోకి వచ్చిన నీలాంబరి వంటింట్లో మహేశ్వరికి వంటలో సహాయం చేయడానికి వెళ్ళింది …కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువగా నైవేద్యం ఇంట్లో చేసిన సేవలు పాయసం చేసి నైవేద్యం పెడతారు.. పాత రోజుల్లో ఇలా సేమియా ఉండేది కాదు. గోధుమపిండి తడిపి నెయ్యి వేసి ఒక గంట సేపు నాననిచ్చి దానిని తీసుకొని కొత్తకుండను శుభ్రంగా కడిగి దానిని బోర్లించి దానిపైన పిండి ముద్దను పెట్టుకుని చేయితో సన్నగా దారాలు లాగా చేసేవారు ఇవి ఎండిన తర్వా పాయసం చేసుకునేవారు.. తర్వాత రోజుల్లో యంత్రాలు వచ్చాయి పిండి ముద్దను యంత్రంలో పెట్టి తిప్పితే సేవలు దారాలుగా వస్తాయి… అది కొంచెం తొందరగా అయ్యే పని కానీ ఎక్కువమంది ఇళ్లల్లో కుండ సేవలు చేసుకునే ఆనవాయితీ.. ఇది తెలంగాణలో ప్రత్యేకమైన వంటకం.. దీపావళి నుండి కార్తీక మాసం మొత్తం ఎక్కువగా ఇవి తినేవాళ్లు.
పులిహోర ,సేవల పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది నీలాంబరి.
సౌదామిని బాలసదనముకు వెళ్ళింది… అక్కడ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు .లోపలికి వెళ్లి వంటలను కూడా పరిశీలించింది ..పెరట్లోకి వెళ్లి కూరగాయలు ఎలా కాస్తున్నాయో చూసి తోటమాలిని అడిగింది “ఏ విధమైన రసాయన ఎరువులను వాడటం లేదు కదా! అన్ని సేంద్రియ ఎరువులే వాడాలి. పిల్లల అనారోగ్యానికి కారణం మనం వాడే పురుగు మందులు పొలాల్లో చల్లే ఎరువులు ..అందుకని పాత పద్ధతిలో మాదిరిగానే సేంద్రియ ఎరువులు వాడితే చక్కని పంటలు రావడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది” అని వివరించింది మాలికి.
” లేదమ్మా అన్ని పాత పద్ధతిలోనే చేస్తున్నాము నీలాంబరి అమ్మ కూడా వచ్చి చెప్పారు మేము వేసే ఎరువులన్నిటిని ఎలా తయారు చేయాలో కూడా చూపించారు” అని చెప్పాడు తోటమాలి.
అంతా పర్యవేక్షించి సంతృప్తిగా లోపలికి వచ్చింది సౌదామిని.
మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ పిల్లల కోసం వండినది తాను కూడా తినేసింది.. ఆహారం యొక్క క్వాలిటీ తెలియడమే కాకుండా పll రుచి గురించి కూడా తెలుసుకోవచ్చు అని అనుకుంది సౌదామిని.
నాలుగు గంటల వరకు అక్కడే ఉన్న సౌదామిని స్కూటీ మీద ఇంటికి బయలుదేరింది.
దారిలో తనను శివాలయంలో కామెంట్ చేసిన అబ్బాయిని చూసింది… కొంచెం స్కూటీని స్లో చేసింది ఆ అబ్బాయి కూడా అక్కడ బైక్ ఆపుకొని మొబైల్ లో ఏదో మాట్లాడుతున్నాడు..
వీరు ఆగిన ఆ స్థలం ఊరికి మధ్యలో ఉన్న కూడలి ..అక్కడ ఒక పెద్ద చెట్టు చెట్టుచుట్టూ కట్టిన అరుగు.. రచ్చబండలా ఏర్పాటు చేయబడి ఉంది ఏ..వైనా పంచాయతీ తీర్పు చెప్పాలంటే అక్కడే జరిగేది. ఇప్పటికీ ఆ ఊర్లో అదే రచ్చబండ దగ్గర సమస్యలు పరిష్కరింపబడుతుంటాయి పోలీస్ స్టేషన్లోకి వెళ్లే అవసరం పడనే పడదు.
నెమ్మదిగా స్కూటీని ఆపేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి నిలబడింది. ఒక్కసారి వెనతిరిగి చూసిన అబ్బాయి భయంతో ఉలిక్కిపడ్డాడు. దూరం నుండి కామెంట్ చేయగలిగే యువకులు..ఆడపిల్ల ఎదురు తిరిగి ఒక చూపు చూస్తే తట్టుకునే ధైర్యం ఉండదు అది తెలియక చాలామంది ఆడపిల్లలు భయపడిపోతుంటారు.
” ఏ మిస్టర్” అని పిలిచింది సౌదామిని.
” ఆ ఏంటి చెప్పు” అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు కానీ అతని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనబడుతుంది.
” ఇందాక గుడిలో ఏమని కామెంట్ చేసావ్” అని అడిగాడు.
” నేనేమన్నాను… అయినా అంటే అన్నాను ఏం చేస్తావ్” అన్నాడు పొగరుగా..
” ఏం చేస్తాను నీ తల్లి తండ్రి నీకు నేర్పించిన సంస్కారం ఇంతే అనుకుంటాను అయినా మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు లేరు అనుకుంటాను ఉంటే ఇలాంటి ప్రవర్తన ఉండదు” అన్నది సౌదామిని కొంచెం గట్టిగా..
” ఎందుకు లేరు నాకు చెల్లెళ్లు ఉన్నారు ..కానీ ఇలా నీలా రోడ్లు పట్టుకొని తిరగరు” అన్నాడు పోకిరి అబ్బాయి..
” నేనెవరో నీకు తెలుసా నేను ఇక్కడ పనీపాటా లేక తిరుగుతున్న అనుకుంటున్నావా నువ్వు నన్ను గుడిలో చూసావ్ అది పవిత్రమైన స్థలమే కదా అక్కడ నీచమైన బుద్ధితో కామెంట్ చేశావ్.. మళ్లీ ఇప్పుడు నేను పిల్లల కోసం ఏర్పాటు చేయబడ్డ బాలసదనం నుండి వస్తున్నాను అక్కడ నేను డాక్టర్ని.. నేను రోడ్లమీద తిరిగే దానిలా కనిపిస్తున్నానా నీకు”? అన్నది కోపంగా ..
అప్పటికే అక్కడ గుమిగూడిన జనం సౌదామిని చూసి గుర్తుపట్టారు..
” డాక్టరమ్మ! ఏమైందమ్మా? వీడు ఏమన్నా అన్నాడా అంటే చెప్పు వీడి బొక్కలు ఇరగ కొడుతం” అన్నారు..
ఆ అబ్బాయికి కాళ్ళల్లో నుండి భయంతో వణుకు సాగింది…
ఇంకా తనని జనం కొడతారు అని భయపడిపోయాడు..
అతని భయాన్ని చూసి సౌదామిని “పోనీలే పాపం” అనుకుని…
“లేదు లేదు ఇతను నన్నేమీ అనలేదు.. బైకు స్పీడ్ గా నడుపుతుంటే అంత స్పీడ్ గా నడపవద్దు యాక్సిడెంట్స్ అవుతాయి అని కొంచెం గట్టిగా చెప్తున్నాను” అన్నది సౌదా మిని..
” అట్లనా మంచిది మేడం మీరు మెల్లగ ఇంటికి పోండ్రి.. పిల్లలను మీరు మంచిగ చూసుకుంటున్నరు” అని అందరూ కృతజ్ఞతగా చూశారు.
“మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను” అని వాళ్ళందరినీ పంపించేసింది.
అందరూ వెళ్లాక ఆ అబ్బాయి…” థాంక్స్ అండి నన్నుజనం నుండి కాపాడినందుకు.. సారీ ఇంకెప్పుడు అలా ప్రవర్తించను” అన్నాడు.
” ఇలాంటి తెలివితేటలు సక్రమమైన దారిలో వినియోగించుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి పోకిరి పనులు చేస్తే ఎవరు నచ్చరు ..నాలుగు రోజులు ఆగితే ఉద్యోగం దొరకక నీ బ్రతుకు అస్తవ్యస్తమవుతుంది ..ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు” అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
అప్పుడే పట్నం నుండి తిరిగి వస్తున్న భూపతి దూరం నుండి ఈ విషయం అంతా కారులో నుండి చూశాడు.. సౌదామిని వ్యక్తిత్వాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు… తెలివిగాతన సమస్యను ఎంత బాగా పరిష్కరించుకుందో కళ్ళారా చూశాడు. “ఆడపిల్లలకు అణకువ ఎంత అవసరమో ఇలాంటి ధైర్యం కూడా అంత అవసరం అవసరమైతే పోరాడగలిగే శక్తి ఉండాలి ఈ అమ్మాయి లక్షణాలన్నీ నీలాంబరిలో ఉన్నవే” అని అనుకుని నవ్వుకున్నాడు..
తానేం చూడనట్లుగా వేరే దారి నుండి వెళ్ళిపోయాడు భూపతి.
ఇంటికి వచ్చిన సౌదామిని మామూలుగానే ఉంది ..ఏమి జరగనట్లుగా నీలాంబరితో మాట్లాడుతూ కూర్చుంది..
లోపలికి వచ్చిన భూపతి సౌదామినినీ చూసి..
” సౌదామినీ! నీ పేరు నేను మార్చాలని అనుకుంటున్నాను మార్చనా’ అన్నాడు.
” ఎందుకు మామయ్య నా పేరు మీకు నచ్చలేదా” అని అడిగింది ఆశ్చర్యంగా.
” నచ్చింది కానీ నీ పేరు ‘ధీర ‘అని పెడితే బాగుంటుంది అనిపిస్తుంది” అన్నాడు భూపతి.
” అదేంటండీ సడన్గా అలాంటి నిర్ణయం తీసుకున్నారు సౌదామిని పేరుకి ఏమైంది? నాకు ఎంతో ఇష్టమైన పేరు” అన్నది ఆశ్చర్యంగా నీలాంబరి.
” సౌదామినిఅనే పేరు నాకు కూడా ఇష్టమే కానీ ఇందాకనే రచ్చబండ దగ్గర ఒక సంఘటన చూశానులే అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను” అన్నాడు నవ్వుతూ భూపతి.
” ఓహ్ ! మీరు చూశారా ఎప్పుడొచ్చారు అక్కడికి” అన్నది సిగ్గుపడుతూ సౌదామిని.
” ఎప్పుడు వస్తే ఏంటి లే విషయం అంతా చూసాను మరో నీలాంబరిని చూశాను ఈరోజు” అన్నాడు భూపతి.
” విషయం ఏంటో చెప్పకుండా మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు” అన్నది నీలాంబరి.
జరిగిన విషయం అంతా చెప్పాడు భూపతి. అది విని నీలాంబరి..
” అలా ఉండాలి ఆడపిల్లలంటే… భయంతో పారిపోతే మరింత తరుముతారు.. కోపంతో అలాంటి వాళ్ళని కొట్టడం తిట్టడం చేస్తే మరింత రెచ్చిపోతారు ..పెద్దవాళ్ల తో చెప్తే నానా రభస జరుగుతుంది కానీ నువ్వు అదేది చేయకుండా అతను మారేలా చేసావు ..నీవు చేసింది నూటికి నూరుపాళ్ల మంచిపని” అని పొగడ్తలతో ముంచెత్తింది నీలాంబరి.
ముగ్గురు చాయ్ తాగుతూ కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు… కాసేపు సౌందర్యలహరి ముచ్చట్లు చెప్పుకున్నారు దాదాపు సంవత్సరం కావస్తుంది మొదటి పుట్టినరోజు వస్తుంది అని అనుకున్నారు…
తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు…
ఇంకా ఉంది