ఎడారి కొలను

ధారావాహికం -55

(ఇప్పటి వరకు: చేయూత సంస్థని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది మైత్రేయి. జ్యోతి పాపా ని తా పాపగా పెంచుకుంటూ, రాంబాయమ్మ గారిని తనకి పేద దిక్కుగా తన దగ్గరే ఉంచేసుకుంది. ప్రసాద్ కి విడాకులు  వచ్చాయి. మైత్రేయి ని కలవటానికి వచ్చినప్పుడు అతని స్థితి మైత్రేయి కి బాధ కలిగిస్తుంది. అతను కోల్పోయిన జీవితాన్ని తానే అతనికి ఏర్పరచాలనుకుంటుంది.)

“హలో ప్రసాద్ గారు ! మీరెలా ఉన్నారు? ఏంటి విశేషం? ఇంత పొద్దునే ఫోన్ చేశారు ? రెండు నెల్ల తరువాత తీరిక దొరికిందా నాకు ఫోన్ చేయటానికి” అంది చనువుగా.

“ అలా ఏమి లేదండి. మీరే ఎక్కువ బిజిగా ఉంటారు నాకంటే. అందుకే మిమ్మలిని డిస్టర్బ్ చేయడమెందుకులే అని ఫోన్ చేయను,” అన్నాడు సిన్సియర్ గా.

“ ఇప్పుడు కాల్ చేసిన విషయమయితే చెప్పలేదు,” అంది.

“ మీరు కాలేజ్ కెళ్ళినప్పుడు ఇవాళ్టి ఈనాడు మెయిన్ ఎడిషన్ చూడండి,” అన్నాడు.

“అబ్బా! సస్పెన్స్ వద్దు ప్రసాద్ విషయం నువ్వే చెప్పు,” అన్నది. “ ఒకే, ఒకే!  మన సుబ్బారావు గారిని అయన పనిచేస్తున్న బ్యాంకు మానేజర్ని బ్యాంకు లో లోన్స్ వ్యవహారం లో స్కామ్ చేసారని, కోటి రూపాయలు డిపాజి ట్లు గల్లంతయ్యాయని, అందులో సుబ్బారావు ప్రధాన వ్యక్తి అని వివరంగా రాసారు. నాన్ బెయిలబుల్  వారంట్ కింద రిమాండ్ లో ఉంచారట,” అంటూ ఉత్సాహంగా చెప్పాడు.

“అవునా! అంటే మన ప్రభాకర గారు తలపెట్టిన పరిశోధన ఇప్పటికి బయటికి వచ్చినేరస్తుడు పట్టుపడ్డాడన్న మాట,” అంది సంతోషంగా.

“అవునండి సుబ్బారావు లాటి వాళ్ళు ఎప్పటికి తప్పించుకోలేరని ప్రభాకర్ గారు చెబుతుంటారు” అన్నాడు. “మరీ విషయం ప్రభాకర్ గారికి కూడా చెప్పారా ,” అడిగింది. “ ముందు గా న్యూస్ క్లిప్పింగ్ తో సహా ఆయనకీ మెయిల్ పెట్టాకే , మీతో మాట్లాడు తున్నాను,” అన్నాడు. “ ఇంకేమన్నా కబుర్లున్నాయా ప్రసాద్ గారు ,” అడిగింది.

“ మీకు ఇప్పుడే చెప్పనా లేక తరువాత చెప్పనా అని ఆలోచిస్తున్నాను,” అన్నాడు. “ త్వరగా చెప్పండి. మీ సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నాను,” అంది కాస్త అనుమానం గా.

“ నేను తెనాలి నుండి వెళ్లి పోతున్నానండి.”

“వ్వాట్? ఎప్పుడు?” అడిగింది ఉద్వేగంతో.

“ నెను వేరే కంపెనీలో జాయిన్ అయ్యానండి. చెన్నయ్ కె తిరిగివెళ్ళిపోతున్నాను.  ఇంకా మా హెడ్ ఆఫీస్ కి నోటిస్ ఇవ్వలేదు. రాత్రి నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. ముందుగా ఆ వార్త మీకే చెబుతున్నాను,” అన్నాడు.

“ గ్రేట్! కంగ్రాట్యులేషన్స్! వచ్చే శనివారమే గుంటూరు రండి, మీతోటి మాట్లాడాలి,” అన్నది నర్మగర్భంగా. “తప్పకుండ వస్తాను , ఒకే బాయ్,” అంటూ ఫోన్ పెట్టేసాడు.  వారం గిర్రున తిరిగి పోయింది. ప్రసాద్ గుంటూరు వెళ్ళాడు శనివారం సాయంత్రం. అతనికోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది మైత్రేయి.

ప్రసాద్ ని చూస్తూనే ,”రండి ప్రసాద్  గారు. మీకోసమే ఎదురుచూస్తున్నాను.” అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది. రాంబాయమ్మ గారు మైసూర్పాక్ తెచ్చి ప్రసాద్ నోటికి అందించి,”మైత్రేయి చెప్పింది బాబు నీకు ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చిందని. చాల మంచిది,” అంది సంబరంగా.

“ అవునమ్మా , అంటూ లేచి ఆమె కాళ్ళకి దణ్ణం పెట్టాడు. “సుఖీభవ ,” అంటూ దీవించింది.

“ ప్రసాద్ గారు బయటికెళదామా,” అంది మైత్రేయి. “అలాగే,” అంటూ లేచాడు. ఇద్దరు కిందకి వచ్చారు. పార్కింగ్ లో పెట్టి ఉన్న బైక్ చూస్తూ,” అరే! బైక్ మీద వచ్చారా,” అంటూ  బైక్ స్టార్ట్ చేయగా నే వెనక ఎక్కి కూర్చుంది  స్వతంత్రంగా. బైక్ ముందుకు ఉరికింది. హాట్ మిలియన్స్ దగ్గర ఆపాడు. ఇద్దరు లోపలికెళ్ళి కూర్చొని ముందుగా సూప్ కి ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు.

మైత్రేయి మౌనంగా ఉండడం చూసి,”మీరేదో మాట్లాడాలని అన్నారు. అలా మౌనంగా ఉన్నారేంటి,” అన్నాడు.

“ అదే ప్రసాద్! ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను,” అన్నది .

“మీరెలా చెప్పినా వింటాను  చెప్పండి,” అన్నాడు. “మా ఆశ్రమం లో జ్యోతి ని చూసారు కదా! అదే ఆశ కు తల్లి. తన గురించే ఆలోచిస్తున్నాను.”

“ఆ అమ్మాయి కేమండి, చూడ ముచ్చటగా ఉంటుంది, మీరు చదివిస్తున్నారు కూడా. మొదట్లో ఉన్న జ్యోతి కి ఇప్పటి జ్యోతి కి చాల తేడా ఉన్నట్టుగా ఉన్నది. మంచి సంస్కారం ఉన్న అమ్మాయిలాగా రూపుదిద్దారు. అలాటి అమ్మయి గురించి ఎందుకంత ఆలోచన,” అడిగాడు.

“ అన్ని ఉన్న,  జీవితం లో ఆమెకి కూడా ఒక తోడు ఉండాలికదా ప్రసాద్!” అన్నది.

“అవును! పెళ్లి చేయండి,” అన్నాడు సులువుగా.

“ అదంతా సులువుకాదు ప్రసాద్. ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తి ఆమెకేదో మేలు చేసినట్లు , ఆమెని ఉద్దరించినట్లు  చూడకూడదు. ఆమెనొక వ్యక్తిగా గౌరవించాలి. ఆమెకి సహారా కావాలే గాని, ఆమెని రుణగ్రస్తురాలిని చేయకూడదు. అలాటి ఆశయాలున్నా వ్యక్తి కోసం చూస్తున్నాను,” అంది.

“ దొరికాడా,” అడిగాడు. “ దొరికాడు. నా ఎదురుగానే ఉన్నాడు. జీవితం నేర్పిన పాఠాలతో తానే ఒక ఉపాధ్యాయుడిగా మారి, జీవితాన్ని తాను చదువుతూ ఇంకొకరితో కూడా చదివిస్తున్నాడు,” అంది ఎంతో భావుకతతో.

ప్రసాద్ కి అర్ధమయింది మైత్రేయి ఉద్దేశ్యం. గంభీరంగా మారిపోయాడు.

“మిమ్మల్ని బలవంతం పెట్టె ఉద్దేశ్యం లేదు నాకు. మీకు నా సలహా మంచిదనిపిస్తే  మీరు ఆలోచించుకోండి. మీరు వెళ్ళేలోపల మీ నిర్ణయం చెబితే చాలు. మిమ్మల్ని అలా నిరాశగా , ఒంటరి వాడిలాగా పంపించాలనుకోవటం లేదు నేను. నాకు కుటుంబం ఉన్నది. మీకొక కుటుంబాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఒక మంచి స్నేహితురాలిగా నా మీద ఉందనుకుంటున్నాను,” అంది.

“నాకొంచెం టైం కావాలి మైత్రేయి!” అన్నాడు. “ నేను నిన్నేమీ తొందరపెట్టను ప్రసాద్,” అన్నది.

మౌనంగానే ఇద్దరు తిరిగివచ్చేసారు. ప్రసాద్ ఆమెని ఆమె ఫ్లాట్ దగ్గర దింపి తెనాలి వెళ్ళిపోయాడు.

***********************

ప్రసాద్ నుండి ఏ  కబురు రాక పోవడం తో మైత్రేయి కి కాస్త భయమేసింది,” తానూ అతి చనువు చూపెట్టానా? ప్రసాద్ తో టి తన స్నేహం ఆగిపోతుందా అని.” పదిహేను రోజుల తరువాత ప్రసాద్ నుండి ఫోన్ వచ్చింది.

“ మైత్రేయి సారీ! నేను వెంటనే ఫోన్ చేయలేక పోయాను. హెడ్డాఫీస్ కెళ్ళి రిజయిన్  లెటర్ ఇచ్చి కొత్త కంపెనీలో జాయినింగ్ డేట్ తీసుకొని వచ్చాను,” అన్నాడు.

“ ఒకే పర్లేదు . అపూర్వ వాళ్ళ పేరెంట్స్ ని కూడా కలిసావా,” అడిగింది.”ఆ కలిసాను, సుమతి అంటి చాలా బాధ పడింది. ఇప్పటి వరకు వాళ్ళకి అపూర్వ మా విడాకుల విషయం ఏమి చెప్పలేదట.”

“ అయ్యో !”

“నువ్వే  మాకు పెద్దకొడుకు లాంటి వాడివి ప్రసాద్. నువ్వు మళ్ళి  పెళ్లి చేసుకో. మేము దగ్గరుండి జరిపిస్తామని అన్నారు. దానికి నేను మైత్రేయి కి చెప్పి డేట్ ఫిక్స్ అయ్యాక మీకు తెలియచేస్తానని అన్నాను,’ అంటూ మైత్రేయి చెప్పిన విషయానికి తన అంగీకారం తెలిపాడు. మైత్రేయి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ప్రసాద్ నువ్వు వెంటనే గుంటూరు వచ్చేయ్.  మనం ముందు సెలబ్రేట్ చేసు కుందాము. తరువాతే మిగిలినవన్నీ,” అంది సంతోషంలో.”సరే సరే , వచ్చేస్తాను వచ్చే ఆదివారం,” అన్నాడు.

ఆనందం పట్టలేక రాంబాయమ్మగారిని చుట్టేసి విషయం చెప్పింది. రాంబాయమ్మ గారు పదిరోజులలో ఉన్న ముహూర్తం పంచాంగంలో చూసి చెప్పింది.  మరునాడే గుంటూరు మ్యారేజ్  రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లి డేట్ తీసుకొని అప్లికేషన్ పెట్టి వచ్చింది. ప్రసాద్ పెళ్ళికి వప్పుకున్నాడన్న వార్త రమణమ్మ గారికి ,కమలమ్మ గారికి చెప్పింది. ఆశ్రమం లో పండుగ వాతావరణం నెలకొంది.

జ్యోతి కి అర్ధమయ్యే విధంగా రమణమ్మ గారు చెప్పటంతో , జ్యోతి పెళ్ళికి అంగీకరించింది, అది ప్రసాద్ తోటి తన వివాహం  అనగానే ఆమెకి మనసు ఆనంద తరంగితమే అయింది.

ప్రసాద్ కి డేట్స్ చెప్పింది. మైత్రేయి చేస్తున్న హడావిడి కి  ప్రసాద్ మనసెంతో తృప్తిగా ఉన్నది. సుమతి చంద్రమౌళి గారు వాళ్ళు వస్తామన్నారు.

పెళ్ళికూతురికి పెళ్లి బట్టలు కొన్నారు. మైత్రేయి నాన్నపరంధామయ్య గారు మైత్రేయి చెప్పిన విషయం విని చాల సంతోషించారు. తనే దగ్గరుండి వాళ్ళ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు.

ఆ సందడి రోజు వచ్చేసింది. ఆశ్రమం తరఫున విందు ఏర్పాటు చేయబడింది. సుమతి ప్రసాద్ తరఫున జ్యోతి కోసం కంజీవరం పట్టు చీర, ప్రసాద్ కి పట్టుపంచెలూ తెచ్చింది. పెళ్లికూతురు బట్టల్లో  మెరిసిపోతున్న జ్యోతిని చూస్తూ కళ్ళ లో నీళ్లు తిరిగాయి సుమతి కి . అది చూసి చంద్రమౌళి గారు ఆమె  బుజాల చుట్టూ చేయి వేశారు ఓదార్పుగా. పరంధామయ్యగారు, మైత్రేయి జ్యోతి తరఫున సాక్షి సంతకాలు పెట్టారు. సుమతి చంద్రమౌళి గారు ప్రసాద్ తరఫున సంతకాలు చేసారు. ఒక గంటలో ఆశ్రమం చేరాక పరంధామయ్య గారే ప్రసాద్ చేత మంగళసూత్రధారణ చేయించారు. ఆసందడిలో ఆశ ,” చిన్నమ్మ పెళ్లికూతురాయనే అంటూ ఎగరసాగింది. అందరు ఆ చిన్నారితో స్వరం కలిపారు.

*******************************

ప్రసాద్ అన్నాడు,” మైత్రేయి, ఆశ ను కూడా తీసుకొని చెన్నై వెళతాను,” అన్నాడు.

“వద్దు ప్రసాద్, మేము ఆశ ను జ్యోతి కూతురులాగా పెంచటం లేదు. అలాగే పాప పుట్టిన మొదటి రోజు నుండే ఆశ్రమం  ఆ పాప బాధ్యత తీసుకుంది. ఒక ఏడాది అయ్యాక నేను ఆ పాపను నా దగ్గరే పెంచుకుంటున్నాను. నన్ను పెద్దమ్మ అంటుంది, కానీ జ్యోతిని తానే చిన్నమ్మ అని పిలవటం మొదలుపెట్టింది. మేమెవ్వరం ఆ పిలుపుని మార్చాలనికోలేదు. జ్యోతి ఆశ ని ప్రేమిస్తుంది , ముద్దుచేస్తుంది. కానీ ఆ పాప కనిపించక పోతే బెంగపడదు. అంతలా ఆమె మనసు గాయపడిందనిపిస్తుంది. అయినా తనకేమి గుర్తురాలేదు. ఆ తరువాత తనతోటి ఏమయిందో కూడా గుర్తు లేనట్టు గానే ఉంటుంది. మేమెవరం ఆమెకి ఆ చేదు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు జ్యోతి చదువుకుంటున్నది. మన ప్రపంచంలోకి వచ్చేసింది. ఇంకా ఇంకా చదవాలని ఉన్నద ని అంటుంది నాతోటి. మీరిద్దరి జీవితాలలో సారూప్యత ఉన్నది. ఇద్దరి తోటి ఈ ప్రపంచం, ఈ మనుషులు ఆడుకున్నారు. తోలుబొమ్మలయ్యారు కాలం చేతిలో. ఆ అట ముగిసిపోయింది. మీరే విజేతలు. అందుకే ఆమె ఇప్పుడు తెల్లటి కాగితం. ఆమె మనసు మీద నువ్వు రాసె ప్రేమ గీతాలే నిలిచిపోతాయి.  కొత్తగా ప్రేమించు. ఆమె నీకు ఇప్పుడే పరిచయమయినదనుకో. ఆమె నీకు తన జీవితమే సమర్పిస్తుంది. విఫల ప్రేమకులులాగా కాదు, జీవితం లో పోరాడి గెలిచి ప్రేమని గెలిపించుకున్న జంట లాగా ఉండండి. నీకొక మంచి కుటుంబం ఉంటుంది. ఆమెకొక సంసారం ఏర్పడుతుంది. మీరిద్దరూ మరికొందరికి అవకాశం వచ్చినప్పుడు ఆసరా ఇవ్వండి,” అంటూ చెప్పుకుపోయింది.

“ ఇంకొక విషయం , జ్యోతి ఇప్పుడు నీ జీవన నౌకకి చుక్కాణి  అయితే , ఆశ నా భవిష్యత్తుకి ఆసరా,” అంది. ప్రసాద్ కి మైత్రేయి చెబుతున్న విషయం అర్ధమయింది.

“ అలాగే మైత్రేయి! నేను నీకు దగ్గరలో లేననుకోకు. ఒక ఫోన్ కాల్ దూరం లో ఎప్పుడు ఉంటాను,” అన్నాడు. “ ఏంటి అప్పుడే అప్పగింతలు చెబుతున్నావు,” అన్నది. “ అవును మైత్రేయి నాకు రిలీవింగ్ లీవ్ ఉంది కాబట్టి, నేను జ్యోతి ని తీసికెళ్లాలనుకుంటున్నాను. నేను పక్కనే ఉంటె కొత్తచోటుకి అలవాటు పడుతుంది. సుమతి ఆంటీ కూడా అన్నది’ జ్యోతి అక్కడ అలవాటయ్యే దాక తాను కూడా సాయం చేస్తానని,” అన్నాడు.

”గ్రేట్! మరయితే ఎప్పుడు ప్రయాణం,”    “ ఈ శనివారమే,” చెప్పాడు. అయితే జ్యోతి కి చెప్పావా?”

“ చెప్పాను, తాను కూడా నాతో  రావడానికి సంతోషంగా  సిద్దమయింది,” అన్నాడు.

“ మీరు ఇక్కడినుండే  జ్యోతి ని తీసుకెళ్ళు ప్రసాద్, తాను మా ఆడపిల్ల. సారే పెట్టి పంపిస్తాను,” అన్నది.

ప్రయాణం రోజు క్యాబ్ తీసుకున్నాడు అక్కడి నుండి నేరుగా చెన్నై వెళ్ళడానికి.

ప్రసాద్ ఆశ్రమ చేరేసరికి, ఆశ్రమ అంత సందడిగా హడావిడిగా కనిపించింది. అక్కమ్మ , రమాదేవి ఇద్దరు ప్రసాద్ తోటి కలిసి ఆశ్రమానికి వచ్చారు. మైత్రేయి ని చూస్తూనే  ఆనందం ఆపుకోలేక కళ్లనీళ్లు తిరిగేసాయి అక్కమ్మకి.  అక్కమ్మ ని అక్కున చేర్చుకుంది ఒక ప్రాణస్నేహితురాలిలాగా. రమాదేవి కూడా మైత్రేయి చేతిని పట్టుకొని గట్టిగా ఊపేస్తూ “మమ్మల్నందరిని మరిచిపోయావా మైత్రేయి,” అంటూ ఆప్యాయంగా కంటిపొరలలో దాగిన కన్నీటి చుక్కలని బయటికి రానీయకుండా నవ్వేసింది.

“ మైత్రేయి మాకు ప్రసాద్ భార్యని  చూపించు,” అంటూ హడవిడి చేసింది. తానే స్వయంగా వాళ్ళిద్దరిని జ్యోతి రూమ్ లోకి తీసుకెళ్లింది. కొత్తపెళ్ళికూతురల్లే తయారుచేసారు జ్యోతి ని రమణమ్మ, కమలమ్మ కలిసి. వాళ్లకి తమ సొంత బిడ్డని కాపురానికి పంపుతున్నట్లనిపిస్తున్నది. ఆశ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఆడుకుంటున్నది. అక్కమ్మ కి అనిపించింది ‘ప్రసాద్ బాబుకి మైత్రేయి అమ్మలాంటి వ్యక్తి దొరకటం ఎంత మంచిదయిందో. లేకపోతే ఏమయి పోయేవాడో అని. రమాదేవి అనుకుంది,” “మైత్రేయి ముందు తనకు నిలబడే అర్హతకూడా ఉందోలేదో. ఎంత తప్పుగా భావించేది. ఇప్పుడు ప్రసాద్ ని తానే స్వయం గా ఒక ఇంటివాడిని చేసింది. నువ్వు నాకంటే వయసులో చిన్నదానివయినా, వ్యక్తి గా  ఎంతో ఎదిగి పోయావు మైత్రేయి,” అనుకుంది మనసారా.

ముహూర్తం చూసారు వాళ్ళు బయలు దేరటానికి. సరిగ్గా 3. 32 నిముషాలకు వాళ్ళు బయలుదేరే  ఏ ర్పాటు చేసారు. సారె కింద రమణమ్మ , కమలమ్మ గారు చలిమిడి చేసారు, కాళ్ళకి పసుపురాసి, బొట్టు పెట్టి  కొత్త చీర  పెట్టారు. రమాదేవి కూడా జ్యోతి కి చీరపెట్టి ఆశీర్వదించింది.

అక్కమ్మ ప్రసాద్ ని జ్యోతి పక్కపక్కన నిలబెట్టి దిష్టి తీసింది. ఈ తంతు అంత మౌనంగా చూస్తూ నుంచుని ఉంది మైత్రేయి.  ఆమె లోని గంభీరత చూస్తే ప్రసాద్ కి అన్పించింది,” మైత్రేయి నువ్వు శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయావు. నీ వ్యక్తిత్వం ముందు నాలాటి వాళ్ళందరూ చాలాచిన్నవాళ్ళే.”

వాళ్ళ ప్రయాణానికి సమయం ఆసన్న మయింది.

జ్యోతి మైత్రేయి కాళ్ళకి దణ్ణం పెట్టి ,”అక్క , నాఇల్లెంటో  నాకు తెలియదు. నా వాళ్లెవరో కూడా గుర్తులేదు, అన్ని నువ్వే అయి ఇప్పటి వరకు నన్ను కాపాడావు, నువ్వు నాకు దైవమిచ్చిన ఆప్తురాలివి, నాకు రావాలనిపిస్తే ఇక్కడకు రావచ్చా,” అంది వెక్కుతూ

“పిచ్చి పిల్ల నువ్వెక్కడికి పోతున్నావని, మా ప్రసాద్ నిన్ను కంటిపాప లాగా చూసుకుంటాడు, నీకు ఇక ముందు జీవితమంతా ఆనందమయమే. ఇది నీ పుట్టిల్లే. ఎప్పుడయినా రావచ్చు,” అని అక్కున చేర్చుకుంది. ఇంతలో కార్ లో సామాన్లన్నీ పెట్టించారు. కారు బయలుదేరింది.

అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న చిన్నారి ఆశకి  కూడా ఎదో తెలియని బెంగ వచ్చింది. నెమ్మదిగా వెళ్లి మైత్రేయి చెయ్యి పట్టుకొని ఆశ్రమం  గెట్ దగ్గరే నిలబడి పోతున్న కార్ ని చూస్తున్నది.

ప్రసాద్ వెనక్కి తిరిగి చూసాడు , ఆశ్రమం గెట్ దగ్గర నిలబడి ఉన్న మైత్రేయి, ఆమె చేయి పట్టుకొని నిలుచుని ఉన్న పాప కనిపించారు.

మనసులో అనుకున్నాడు  “నీకు శతకోటి జొహారులు మైత్రేయి, ఎడారి బాటసారులకు ఒక నీటి గుంట  కనిపిస్తే వాళ్ళకి ప్రాణంలేచి వస్తుంది. ఆ ఎడారి ప్రయాణంలో ఆ కొలను చేరగానే తమ గమ్యానికి చేరినట్లుగా, పోతున్న ప్రాణాలు తిరిగివస్తునట్లుగా భావిస్తారు. నువ్వు అలాటి  దానివే. నువ్వొక ఫిలాసఫర్ వి, గైడ్ వి,  నీ చెంతకి చేరిన వాళ్ళకి నువ్వొక  ఆలంబన, విశ్వాసం, చేయూత…..”

“మైత్రేయి  నీ పయనం కొనసాగుతూనే ఉంటుంది. నీ కధకి ముగింపు ఉండదు. ఆ ప్రయాణంలో ఎందరిని కలుపుకుంటావో, ఎందరికి స్వావలంబనిస్తావో, ఈ ఆశ్రమానికి  చేరుతున్న బాధాసర్పద్రష్టులకు ఏమార్గం సూచిస్తావో …. “ కారు మలుపు తిరిగింది.

వసంత వచ్చి చెప్పింది,” మేడం , ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది, ఎవరో ఒకమ్మాయి అమాయకంగాను అనుమానాస్పద స్థితిలో  రైల్వే స్టేషన్ లో తిరుగుతుంటే, రైల్వే పోలీసులు పట్టుకొని,  వీళ్లకీ అప్పగించారట, మీరు పర్మిషన్ ఇస్తే మన చేయూత లో చేరుస్తామని అన్నారు , ఏమంటారు.”

“అలాగే” అంది నిశ్చలంగా.

ముగింపు 

మైత్రేయి ప్రయాణం మరొక మలుపు తిరిగింది. బాధాసర్పద్రష్టులయిన స్త్రీ లకి తానే చేయూత గా మారి, ఎడారిలో దారీతెన్నూ లేక అలమటిస్తున్న ఇలాటి వారికీ తానే ఒక స్వావలంబన గా మారి, సేదతీర్చే ఏడారికొలను మన మైత్రేయి. ఆమె ఒక స్ఫూర్తి .. ఆధారం… ప్రేరణ …

ఈ సామజిక బాధ్యతను స్వీకరించి మహిళాజనోద్ధరణకోసం పాటుపడుతున్న మహిళామణులకు సాదరంగా సమర్పించుకుంటున్న నా  ప్రధమ  నవలా  కుసుమాంజలి  ఈ “ఎడారి కొలను,” ఆదరిస్తారని ఆశిస్తూ….

మీ రచయిత

పద్మావతి నీలంరాజు

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేస్తమా!

దొరసాని