రోజులు గడుస్తూనే ఉన్నాయి… అమెరికా నుండి భారతదేశానికి రావడానికి సాగర్ మరియు సుధీర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు…
కానీ !అది అంత తొందరగా తేలే వ్యవహారం కాదని అనిపించింది… ఎందుకంటే అక్కడ ఉన్నతమైన పదవిలో ఉంటూ అవన్నీ వదులుకొని ఇక్కడ ఏదో ఒక ఉద్యోగంలో చేరాలంటే ఎవరికి మాత్రం మనసొప్పుతుంది…
సాగర్ ఒక రెండు రోజులు సెలవు తీసుకొని సౌందర్యలహరిని చూడడానికి వెళదామని అనుకున్నాడు… ఆఫీసు పనులు పూర్తి చేసుకొని బయలుదేరాడు… ఫ్లైట్లో దాదాపు ఆరు గంటల ప్రయాణం సాగర్ ఉండే ప్లేస్ నుండి అలేఖ్య ఉండే ప్లేస్ కి.. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండానే బయలుదేరాడు.
అలేఖ్య ఇంటికి చేరుకున్నాడు సాగర్.. కాలింగ్ బెల్ కొట్టగానే సుధీర్ వచ్చి తలుపు తీశాడు… అతని మొహం ఎప్పటిలా లేదు కొంచెం చిరాకుగా కొంచెం కోపంగా ఉంది.. సాగర్ ని అకస్మాత్తుగా చూసిన ఆనందం అసలే లేదు” ఈ సమయంలో వచ్చాడేంటి” అన్నట్టుగా మొహం పెట్టాడు..
” బావా! అందరూ బాగున్నారా అక్కని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను” అన్నాడు నవ్వుతూ సాగర్..
” ఆహా అలాగా “అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుధీర్..
” ఏదో తేడాగా ఉంది ఏంటి? ఎప్పటిలా బావ మొహంలో నవ్వు లేదు” అని అనుకున్నాడు సాగర్..
లోపలికి వెళ్ళగానే అలేఖ్య కళ్ళనీళ్ళతో కనిపించింది.. సాగర్ ని చూడగానే ఆమె దుఃఖం రెట్టింపు అయింది తమ్ముడిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది..
“అక్కా! ఏమైంది… ఎప్పుడు సంతోషంగా ఉండే దానివి ఎందుకు ఏడుస్తున్నావ్” అన్నాడు సాగర్ అక్క కళ్ళు తుడుస్తూ…
” ఇంతకీ నా బంగారు తల్లి ఎక్కడ! దానికి ఒంట్లో బాగుందా మరి ఎందుకు బావ గారు కూడా అదోలా ఉన్నారు నువ్వు ఏడుస్తున్నావ్” అన్నాడు సాగర్.
” ఏమీ లేదురా ఊరికే !సౌందర్య బాగానే ఉంది రా కూర్చో” అని కళ్ళు తుడుచుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేసింది అలేఖ్య.
ఇప్పుడేం అడిగినా బాగుండదని సాగర్ లోపలికి వెళ్లి సౌందర్య దగ్గర కూర్చున్నాడు అప్పుడే నిద్ర లేచిన సౌందర్య మామను చూసి బిక్కముఖం వేసి ఏడుపు మొదలు పెట్టింది..
” ఏంట్రా బంగారం నన్ను మర్చిపోయావా నేను రా మామని” అని ఎత్తుకున్నాడు సాగర్.
కొంచెం సేపు అయ్యాక సౌందర్య లహరి నవ్వుతూ మామ మెడని చుట్టేసింది.
అలేఖ్య తమ్ముడు కోసం కాఫీ తీసుకొని వచ్చింది..
అక్కని మాటలు డైవర్ట్ చేయడానికి “ఉత్త కాపీ నేనా నాకు బోలెడు ఆకలేస్తుంది వంటల ఎక్స్పరిమెంట్స్ చేస్తావు కదా అదేదో చెయ్యి.. ఎలా ఉందో చెప్తా “అని ఉడికించేట్లుగా మాట్లాడాడు సాగర్..
” సరే నీకు సేమియా ఉప్మా ఇష్టం కదా చేసుకొని తీసుకొస్తాను” అని లోపలికి వెళ్ళింది అలేఖ్య.
కాసేపటికి సుధీర్ కూడా బయటకు వచ్చాడు..
” సాగర్ ఏంటి విశేషాలు నువ్వు ఇండియా వెళ్లే ప్లాన్స్ ఎంత వరకు వచ్చాయి” అని అడిగాడు..
” ఇంకా టైం పడుతుంది బావా! అక్కడికి వెళ్ళాక ఏంచేయాలో కూడా ఆలోచించుకోవాలి కదా దాని గురించే టెన్షన్ గా ఉంది” అన్నాడు సాగర్.
” నేను కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను నాది అదే సమస్య ఇక్కడ ఉన్నలాంటి జాబ్ ఎక్స్పెక్ట్ చేయలేము చూద్దాం ఎలా జరుగుతుందో వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోదాం అంటుంది అలేఖ్య.. ఎలా కుదురుతుంది అసలు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు సుధీర్.
ఆ విషయంలో తను తలదూర్చకూడదనుకున్నాడు సాగర్..
సౌందర్యతో ఆడుకుంటూ కూర్చున్నాడు తన చిట్టి మాటలను వింటూ ఎంతో ఆనందిస్తున్నాడు…
ఇంతలో అలేఖ్య సేమియా ఉప్మా ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వచ్చింది..
” నీకు కూడా పెట్టనా సుధీర్?” అని అడిగింది.
“నాకు ఇప్పుడేమీ వద్దు” అన్నాడు సుధీర్.
సాగర్ లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి ఉప్మా తింటూ ఆలోచిస్తున్నాడు” ఏ విషయంలో వీళ్ళిద్దరికీ గొడవ జరిగి ఉంటుంది.. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు వీళ్లిద్దరూ ఇలా ఎడమొఖం పెడముఖంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు” అని అనుకున్నాడు సాగర్.
” సాగర్ నువ్వు సౌందర్యతో ఆడుకుంటూ ఉండు నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది చూసుకొని వస్తాను” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఇల్లంతా తిరుగుతూ సౌందర్య ఆడుకుంటూ ఉంది.
” దీని మొదటి పుట్టినరోజుకి కూడా నేను రాలేకపోయాను.. అమ్మ గోపాలపురంలో చేయాలని చాలా అనుకుంది.. కానీ అనుకున్నంత సులువుగా మనం వెళ్లడం కుదరదు కదా! దీ పుట్టిన రోజుకి చాలామందిని పిలిచావా ఎలా చేశారు అని అడిగాడు”..
” కొంతమంది పిల్లలున్నా ఫ్యామిలీస్నే పిలిచాను రా.. నీకు ఫొటోస్ పంపించాను కదా కానీ నువ్వు వస్తావని చాలా వెయిట్ చేశాను” అన్నది అలేఖ్య.
” చాలా ప్రయత్నం చేశాను అక్కా! కానీ కుదరలేదు సారీ నెక్స్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా మన ఊర్లో చేసుకుందాం” అన్నాడు సాగర్.
” చూద్దాంలే నెక్స్ట్ ఇయర్ వరకు” అన్నది అలేఖ్య.
ఎలాగూ బావ లోపల ఉన్నాడని ఇప్పుడే అక్కను విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు..
” అక్కా! ఏమైంది ఎందుకు అంతలా ఏడ్చావు నాకు కూడా చెప్పకూడదా” అన్నాడు సాగర్.
” ఏం చెప్పాలి సాగర్ అసలు ఆ విషయం తలుచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది” అన్నది అలేఖ్య.
” అంతా అసహ్యించుకునే విషయం ఏంటి అక్కా” అన్నాడు సాగర్.
” చెప్తాను సాగర్ నువ్వు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకూడదు అలా అని ప్రామిస్ చెయ్” అన్నది అలేఖ్య చేయి చాపి..
” చెప్పను ప్రామిస్” అంటూ చేయి తాకించాడు సాగర్..
” ఎప్పుడు ఇద్దరం అన్ని విషయాలు మాట్లాడుకునే మేము ఈ మధ్య ఎవరికి వారం అన్నట్లు అయిపోయాము… ముందుగా సుదీర్ మాట్లాడటం లేదు ఎప్పుడు చూసినా మొబైల్ లో మాట్లాడటం మొబైల్ పాస్వర్డ్ మార్చడం చేస్తున్నాడు… ఇంటికి వచ్చినా ముభావంగా ఉంటున్నాడు… సౌందర్యను కూడా ఎక్కువసేపు ఎత్తుకోవడం లేదు…
ఇంకా నాకు అనుమానం వచ్చింది ఒకరోజు ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు ఫోన్ లాక్ లో లేదు నేను వెంటనే ఓపెన్ చేసి చూశాను…
చూసిన తర్వాత నాకు నోట మాట రాలేదు..” అంటు గట్టిగా ఏడ్చేసింది అలేఖ్య
” అక్కా! ప్లీజ్ ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు అన్నింటికీ పరిష్కారం ఉంటుంది” అన్నాడు సాగర్.
” ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కనిపించాయి ఆతర్వాత వాట్సాప్లో మెసేజెస్ అన్నీ చదివాను అవన్నీ నాకు నచ్చలేదు.. అవి మామూలు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు.. నిలదీసి అడిగాను అప్పటినుండి ఇంకా కోపం ఎక్కువ అయిపోయింది అసలు జవాబు చెప్పడం లేదు” అన్నది అలేఖ్య.
” అక్కా! తొందరపడకు ఏం జరిగిందో నిదానంగా కనుక్కుందాం కొన్ని నిజాలుగా కనిపించే అపోహలు కూడా ఉంటాయి బావ అలాంటివాడు కాదు.. నువ్వు ఎప్పటిలా మామూలుగానే ఉండు” ఉన్నాడు సాగర్.
సరేనని తల ఊపింది అలేఖ్య తమ్ముడు వచ్చిన తర్వాత తన దుఃఖం తగ్గి మనసు తేలికగా అనిపించింది.. “తోబుట్టువుల అండ ఏ మనిషికైనా అవసరమే” అనిపించింది అలేఖ్యకు.
రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేశారు ఇప్పటిలా మామూలుగానే ఉన్నారు సుధీర్ కి కూడా సాగర్ రావడం కొంచెం రిలీఫ్ గా అనిపించింది..స్తబ్దుగా ఉన్న వాతావరణం కొంచెం సందడిగా మారింది.
ఏవేవో మాట్లాడుతూ సౌందర్యను ఆడిస్తూ సందడి చేస్తున్నాడు సాగర్.
తెల్లవారి ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు రెండు మూడు గంటలు బయట గడిపి ఇంటికి వచ్చారు అందరి మనసులు కొంచెం తేలికపడ్డాయి.
రాత్రి తన రూమ్లో పడుకున్న సాగర్ కి సౌదామినితో మాట్లాడాలనిపించింది..
మొబైల్ తీసి సౌదామినీకి వీడియో కాల్ చేసాడు.. అక్కడ ఉదయం కాబట్టి సౌదామిని స్నానం చేసి తల ఆరబెట్టుకుంటుంది ఇంటి పెరట్లో… అక్కడే మువ్వ కూడా పరుగులు తీస్తుంది.. దానితో పాటుగా అప్పుడప్పుడు పరుగులు తీస్తుంది సౌదామిని… సాగర్ కాల్ లిఫ్ట్ చేసి అక్కడే కూర్చుంది సౌదామిని..
” ఏంటి డాక్టర్ గారూ బిజీనా మువ్వతో ఆడుకుంటున్నావా నువ్వు కూడా మువ్వలా గలగల మంటూ” అన్నాడు సాగర్..
” అవును సాగర్ తల స్నానం చేశాను కదా కాస్త నీరెండలో ఆరబెట్టుకుందామని బయటకు వచ్చాను.. ఈ మువ్వ నన్ను చూసి ఆటలాడిస్తుంది” అన్నది నవ్వుతూ తన పొడుగాటి కురులను చేతులతో చిక్కులు తీసుకుంటూ..
” వావ్ నీ జుట్టు ఎంత అందంగా ఉంది ఇలా వదిలేసినప్పుడు నేనెప్పుడూ చూడలేదు నన్ను మొత్తం ఆ జుట్టుతో కప్పేయవచ్చు” అన్నాడు చిలిపిగా సాగర్..
సిగ్గుపడుతూ నవ్వింది సౌదామిని… ఆమె కట్టుకునే లావెండర్ కలర్ చీర ఆమెకు ఎంతో బాగా నప్పింది మెడలో చిన్న ముత్యాల గొలుసు వేసుకుంది ముఖానికి చిన్నగా కుంకుమ బొట్టు మాత్రమే పెట్టుకుంది అలా చూస్తుంటే మంచు ముత్యంలా అనిపించింది సాగర్ కి… అదే చెప్పాడు..
” ముత్యంలా మెరిసి పోతున్నావు” అని అన్నాడు… సాగర్
ఇంకా ఉంది