ఏడంతస్తుల మేడ ఇది – ఎన్నో గుండెల వ్యధ ఇది

చిత్రం : ఏడంతస్తుల మేడ (1980)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : పి. సుశీల
తారాగణం: అక్కినేని,సుజాత

పల్లవి:

ఏడంతస్తుల మేడ ఇది… వడ్డించిన విస్తరిది
ఏమీ లేక ఉన్నదొక్కటే…
నాకు మీరు….మీకు నేను..

ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన కథానాయక తండ్రి వ్యతిరేకించడంతో తనకు వారసత్వంగా సంక్రమించాల్సిన యావదాస్తిని వదులుకొని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, అత్యంత సాధారణమైన స్థితిలో కాపురం మొదలు పెడుతుంది.

అష్టైశ్వర్యాల్లో పుట్టిపెరిగిన ఆమెకు కనీస సౌకర్యాలు కూడా సమకూర్చలేకపోతున్నానీ, ఆమెకు ఈ స్థితి రావడానికి తానే కారణమనీ, బాధ పడుతున్న అతనికి ఈ భోగభాగ్యాలు, హంగు- ఆర్భాటాలు అశాశ్వతాలనీ వీటన్నిటికీ ఆవల ప్రేమ అనే ఒక అనిర్వచనీయమైన భావన ఉందనీ, అదే దాంపత్య బంధానికి పునాదిరాయి వంటిదని అనునయిస్తూ ఉంటుంది. ఇందులోని పల్లవి మాత్రమే కాకుండా, ప్రతి చరణంలోనూ ఇదే భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది.

వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నంతవరకు అతి సాధారణమైన ఆ ఇల్లే తనకు ఏడంతస్తుల మేడతో సమానమనీ, ఉడికిన బియ్యపు గింజలే తనకు వడ్డించి న విస్తరితో సమానమనీ ఓదారుస్తూ ఉంటుంది.

చరణం:

పడుచుదనకు…….. తినిపిస్తుంటే

గంజి నీళ్లు, కారపుమెతుకుల్లో కలగలిసిన అతని ప్రేమ తనకు షడ్రసోపేత భోజనంతో సమానమనీ

చాప కన్న చదరే మేలని…..
నిదుర పొమ్మంటుంటే…..

పట్టు పరుపులపై నిదురించిన తనను ఆ స్థాయిలో ఉంచలేకపోయానని బాధపడాల్సిన అవసరం లేదనీ, అతనికి తనపై ఉన్న ప్రేమే తనకు హంసతూలికాతల్పంతో సమానమనీ అనునయిస్తోంది

వెన్నెల మల్లెల మంచమిది….. ఎన్నో జన్మల లంచమిది…
మూడు పొద్దులు ముద్దు ముచ్చటే

తమ ఇద్దరి హృదయాల్లో కొలువై ఉన్న ప్రేమే వెన్నెలలోని చల్లదనమనీ, ఆ రెండు గుండెల్లో ఉన్న అనురాగమే మల్లెలలోని పరిమళమనీ అతడికి సాంత్వన నందిస్తోంది

పాయసాన గరిటైతిరిగే… పాడు బతుకులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే…. బంధం ఒకటి చాలును కడకు

భోజనాలబల్ల వద్దకు వచ్చి, పనివాళ్ళు పళ్లెంలో వడ్డిస్తూ ఉంటే, వంట చేయడం అనే ప్రక్రియపై ఏమాత్రం అవగాహన లేని, దాని వెనుక ఉన్న శ్రమ, నైపుణ్యం గురించి ఏమాత్రం తెలియని, ఆగర్భ శ్రీమంతుని ముద్దులపట్టి, అతనికి ఇల్లాలై, నూలు చీర ధరించి, కట్టెల పొయ్యి పై పొగ గొట్టంతో పొగ ఊదుతూ, ఒళ్లంతా చెమటతో తడిసిపోతూ ఉండగా, తన ఈ స్థితిని చూసి అతను ఎక్కడ బాధపడతాడోనీ, తన ఇబ్బందిని ఎక్కడ కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ, పొగతో కళ్ళనుండి నీళ్లు కారిపోతూ ఉంటే కూడా, ముఖానికి చిరునవ్వు పులుముకుని అతడిని ఓదారుస్తోంది

చావు కన్న బ్రతుకే మేలని…. తెలిసి కలిసి మసులుతూ ఉంటే
ప్రేమ కన్న పెన్నిధి లేదని తెలుసుకో…

చీకటి వెలుగులు, గెలుపు ఓటములు, కలిమి లేములు వంటి భిన్న పార్శ్వలతో కూడిన సంసార సాగరాన్ని ప్రేమ అనే నావపై సులువుగా దాటవచ్చునని చెబుతోంది

ఎండా వానల ఇల్లు ఇది…. ఎండని పువ్వు పూపొదరిల్లు ఇది

ఇందులో భాషాభిమానుల్ని ఆకట్టుకునే సాహిత్యం అంతగా లేకపోయినా , ఈ చరణం లోనికి వచ్చేసరికి అలతి పదాల్లోనే అయినప్పటికీ అందమైన భావాన్ని పలికించారు. సముద్రమంత ప్రేమను ఒలికించారు.

ఎండ తీవ్రత నుండి గానీ,వర్షపు జల్లు నుండి గానీ ఆ ఇల్లు వారికి పూర్తి రక్షణను ఇవ్వలేకపోవచ్చు, సౌకర్యంగా అనిపించకపోవచ్చు.

సర్వసౌఖ్యాల్లో పుట్టి పెరిగిన ఆ ఇల్లాలికి అది కష్టంగా అనిపించడం లేదు, ఆమె దానిని అసౌకర్యంగా భావించడం లేదు సరికదా కొత్త భాష్యం చెబుతోంది.

విత్తనం మొలకెత్తి ఆకులు, రెమ్మలు, కొమ్మలు వంటి పలు దశలు దాటి మొగ్గ తొడిగి, పుష్పించాలంటే ఎండ, వాన ఎలాగైతే అవసరమో అదే విధంగా తమ ఇరువురి హృదయాల్లో మొలకెత్తి , ఇద్దరినీ దాంపత్య బంధంతో ముడివేసిన ప్రేమ పత్రహరితమై తమ కాపురాన్ని కలకాలం పచ్చగా కాపాడుతుందంటూ అతడికి అభయమిస్తూ,అనునయిస్తోంది.

కథకు సంబంధించిన విషయాన్ని కాస్త ఇక్కడ వివరిస్తే గనుక ఈ పాట విశ్లేషణకు ఒక పరిపూర్ణత ఒ నగూడుతుందేమో అనిపించి……..

తన మాటను కాదని కూతురు ఒక నిరుపేదను వరించిందన్న కోపంతో ఒక వివాహ కార్యక్రమంలో అతిథి అభ్యాగతుల ముందే ఆ దంపతులను ఆమె తండ్రి తీవ్రంగా అవమానిస్తాడు.

ఆ అవమానాన్ని తట్టుకోలేని అతని హృదయం ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే పట్టుదలతో న్యాయమైన మార్గంలోనే ప్రయాణిస్తూ, కాసుల వేటలో మునిగిపోతాడు. ఆ ప్రయత్నంలో అతను నీతి నియమాలను ఏమాత్రం విస్మరించకపోయినప్పటికీ కూడా కుటుంబాన్ని అమితంగా ప్రేమించినప్పటికీ కూడా వారికి సమయాన్ని కేటాయించడంలో ఘోరంగా విఫలమౌతాడు.

సిరిసంపదలను గడ్డిపోచగా భావించి వచ్చిన ఆ ఇల్లాలికి మాత్రం అతని మనసులో తమపై
ఉన్న ప్రేమ విషయం పూర్తిగా అర్థమై ఉన్నప్పటికీ కూడా, అతను తమకు అందుబాటులో లేకపోవడం తీవ్రమైన విషయంగా పరిగణించి, మనస్థాపానికి గురై, అది క్రమేణా అనారోగ్యంగా పరిణమించి చివరికి ఆ వ్యధతోనే
కన్నుమూస్తుంది.

ఇక్కడ మూడు విషయాలను మనం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది.

1. వ్యక్తిని డబ్బుతో కొలిచే ఆమె తండ్రి

ఇక్కడ ఈ తండ్రి గురించి ఆలోచిస్తే అతని బాధలో న్యాయం ఉన్న మాట వాస్తవమే, అడిగిందే తడవుగా అన్నీ అమరి, అల్లారు ముద్దుగా పెరిగిన తన కూతురు ఒక నిరుపేదను వరిస్తే, రేపు ఆమె ఎదుర్కోబోయే పరిస్థితులకు ఆ తండ్రి మనసు తట్టుకోలేక, విలవిల్లాడుతుంది. నిజమే ,కానీ అది ఎంతవరకు? దేనికైనా ఒక హద్దు అనేది ఉండాలి కదా, డబ్బు లేని చోట విజ్ఞానం ఉండదా? మట్టిలో మాణిక్యాలుండవా? సున్నా నుండి శిఖరాగ్రానికి చేరుకున్న వారు లేనే లేరా?
ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు తన వ్యాపార ప్రస్థానంలో అటువంటి వ్యక్తులు ఎదురుపడనే లేదా? అన్నీ తెలిసిన అతను మొదటగా మనసు వ్యతిరేకించినప్పటికీ, తనను తాను సమాధానపరచుకోవాల్సిన అవసరం లేదంటారా?

2. వృత్తి జీవితానికి – వ్యక్తిగత జీవితానికి సమన్వయం కుదుర్చుకోవడంలో విఫలమైన కథానాయకుడు.

అవమానాలే పునాదిరాళ్లుగా అం దలాన్ని అందిపుచ్చుకున్నవారు మనచుట్టే ఉంటారు, నిజమే! కానీ ఏ డబ్బునైతే తృణప్రాయంగా వదులుకొని వచ్చిందో, ఆ డబ్బు సంపాదనలో భాగంగానే ఆమెను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం?

ఆమెకు అవన్నీ పుట్టినప్పటి నుండే ఉన్నాయి, ఆమె వాటికి అంతగా ప్రాధాన్యం ఇచ్చి ఉంటే వాటిని వదులుకొని వచ్చి ఉండేదే కాదు.
సమన్వయం కొరవడితే ఎటువంటి పరిస్థితులెదురవుతాయి అనే విషయానికి ఇతను ఒక బలమైన నిదర్శనం.

3. అతని ప్రేమకు తప్ప ప్రపంచంలో మరే విషయానికి ప్రాధాన్యం ఇవ్వని కథానాయక.

భర్తను ఎంత గొప్పగా ప్రేమించాలో ఈ పాత్ర ద్వారా సమర్థవంతంగా సమాజానికి అందించిన మాట వాస్తవమే.

దీనికి మాత్రం హద్దు అనేది అవసరం లేదా?

అతని నుండి తనకు ప్రేమ అందడం లేదని బాధపడిందే తప్ప, తానొక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిన నీ, ఆ బిడ్డకు తన ప్రేమ అవసరమనీ, అతని సంరక్షణా బాధ్యత తనపై ఉందనీ, బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్ది, సమాజానికి అందించాల్సిన కర్తవ్యం తన ముందుందని ఆమె ఆలోచించకపోవడం, ఆ బాధలోనే కృంగిపోతూ, తల్లి లేని బిడ్డగా ఆ శిశువును ఈ ప్రపంచంలో వదిలేయడం ఎంత వరకు న్యాయం?
(” జనన మరణాలను గూడా పిడికిట బంధించే మహిమాన్వితుడా మనిషి?” అని కొంతమంది పాఠకులు ప్రశ్నను లేవదీయవచ్చు, నిజమే, నేను కాదనడం లేదు. కానీ అది లోతైన కోణం, నేనిప్పుడు దాన్ని స్పృ షించడం లేదు, కేవలం పాటకు విశ్లేషణ మాత్రమే వ్రాస్తున్నాను)

పరిస్థితుల ప్రభావాన్ని (అవి మానసికమా, శారీరకమా, ఆర్థికమా, సామాజికమా అనేది విషయం కాదు. సమస్య ఏ రూపంలో వచ్చినా) తట్టుకొని దాంపత్య బంధాన్ని పండించుకోవాలంటే ప్రేమ ఎంత అవసరం అనేది కథా రచయిత, దర్శకనిర్మాతలు, నటీనటులు, గాయని గాయకులు అందరూ తమదైన పాత్రలో అత్యద్భుతంగా రాణించి, సమాజానికి చక్కని సందేశాన్ని అందించారు. వారందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలతో…….

పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారత కోకిల – సరోజినీనాయుడు

దొరసాని -64 వ భాగం