అందాల మధ్య…..

భౌగోళిక ప్రదేశం
ప్రకృతి రమణీయకతకు ఆలవాలం
ఉన్నతంగా నిలిచే హిమశిఖరాలొక వైపు
గలగల పారే నదీనదాలొకవైపు

జీవన సమయాలలో తొంగిచూసామా ….
అంతంత మాత్రం అతుకుల బొంత

యాత్రికుల సందడిలా
ఏడాదిలో కొన్ని ఋతువులే వేడుక చేస్తుంటాయి
కడుపులు నింపుతుంటాయి

తరాలు మారినా అంతం కాని దారిద్ర్యం
దారిద్య్రానికి తలవంచని నైజం
సాగిస్తుంటారు ప్రశాంతం జీవనం

కలలెప్పుడూ అవవు నిజం
నిరంతరం సమస్యల వలయాలు
ప్రకృతి ప్రకోపమో వైరి దేశపు కుతంత్రమో

ఏదైతేనేం! ఎరుకరాని మరణం నీడలో
నిరంతరం సరిహద్దు గ్రామాల ప్రజానీకం
నాగరికులకు నవ్య దీప్తుల హిమవన్నగ నయగారాలు చూపుతుంటారు

తాత తండ్రుల నుండి
తమ పిల్లలకు ఆవాస నివాసాల ప్రదేశం
విడిచి చరించ లేరు
లేదు వేరే అవకాశం

ప్రమాదాలెట్లా ఎదురవుతాయో తెలియని నిరంతరం భయం!
ప్రకృతి కన్నెర్ర చేస్తే విరిగిపడే కొండ చరియల క్రిందనా?
దొంగచాటుగా వైరి విసిరిన బాంబుల దాడిలోనా?
స్వదేశ శత్రుదేశాల మధ్య జరిగే క్రాస్ ఫైరింగ్ లోనా?

మృత్యువు పలకరించే వరకు తెలియదు ఆ నిజం
అయినా వెరవరు అక్కడి ప్రజానీకం

సాగిస్తారు సామాన్య జీవనం
ఆలోచనలలో నిరంతర మధనం
ఎప్పటికాగేను ఈ దారుణ మారణ హోమమని!
ఇరుదేశాల మధ్య శాంతి సఖ్యతలెప్పుడని?

కాశ్మీర్ ఓ అందాల నిలయం
కాశ్మీర్ ఓ అయోమయాల విలయం

సరిహద్దు గ్రామాల సమస్యలెప్పుడు తీరాలని
నిరంతరం ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు
ప్రకృతి అందాల మధ్య భయం గుప్పిట్లో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమల(కోడలమ్మకథలు)

ధీరలారా! ధీరులారా! శిరసాభివందనం