ఏం చేయలే పిల్లా! ఏం చేయలే!
నీది–నాది కులము వేరన్నరే,
మా అమ్మయ్యలు పెళ్లికి వద్దన్నరే,
మా చెల్లి పెళ్లి కి అడ్డన్నరే..!
అందగత్తె అమ్మాయని నే చెప్పితిని,
అణకువగా ఉంటుందని నే చెప్పితిని,
అందరిలాంటి అమ్మాయి కాదని నే చెప్పితిని.
గుణమున్న పిల్లనూ ప్రేమించితిని,
కులం కంటే గుణమే ప్రధానమని అంటిని.
నిన్ను విడిచి నేను బతకలేనులే అని అంటిని..!
ఏం చేయలే పిల్లా! ఏం చేయలే!
“ప్రేమ దోమ” అనిచెప్పొద్దు అంటున్నారే,
పారిపోయి రావాలని ప్రయత్నిస్తినే
కులముపై పిచ్చి ఉన్న మా అయ్యకు
కులం అంటే ఏంటో వివరిస్తినే..!
ఏం చేయలే పిల్లా! ఏం చేయలే..!
కూడు లేకున్నా కులమే గొప్పదంటాడు,
కులమున్న పిల్లని ప్రేమించమంటాడు,
కులంలోని పిల్లనే పెళ్లాడమంటాడు.
ఏం చేయలే పిల్లా! ఏం చేయలే..!
ఎంత ఆస్తిపరురాలనీ చెప్పినా,
ఎంత గుణవంతురాలనీ చెప్పినా,
అందచందాలు కలదని చెప్పినా –
ఏం చేయలే పిల్లా! ఏం చేయలే..!
ఎంత ప్రయత్నం చేసినా చివరికి,
“తక్కువ జాతి పిల్ల” అని తిడుతున్నాడు,
పెళ్లి వద్దంటున్నాడు…
ఏం చేయలే పిల్లా! ఏం చేయలే..!
సాకులు చెప్పి నువ్వు సాగదీయకు రా!
అమ్మయ్యల అనుమతితోనే ప్రేమించావా..?
ప్రేమించేటప్పుడు “నీ కులం ఏది?”
అని ఎందుకు అడగలే?
మోజు తీరాక మాత్రం
“అమ్మయ్య!” అంటున్నావే..!
నువ్వు లేకుండా నేను బతకనన్నావుగా,
నీకంటే అందగత్తె ఎవరూ లేరన్నావుగా..!
ప్రేమ కాస్త మనసు నుండి
మైకమై ఒంటి వరకు వచ్చినప్పుడు –
కులమడ్డు రాలేదు గా.
నీ అమ్మ అయ్య అప్పుడు యాదిరాలేదుగా..!
ఇప్పుడు కులం పేరు చెప్పి వదిలేయాలని చూస్తున్నావా?
మాయమాటలు చెప్పి మాయమవ్వాలని చూస్తున్నావా?
ఏం చేస్తానో బాబు! ఏం చేస్తానో..!
చట్టాలున్నాయి – చుట్టమై వస్తాయి,
అప్పుడు “నాది–నీది ఒకటే కులం” అంటావు.
అదే ప్రేమ కులమని నువ్వే చెప్పావు!……లే…!