తెల్లవారుఝామున మూడు నాలుగ య్యుంటుంది ఫోన్ రింగ్ అవుతుంది నిద్ర కళ్ళతో తీసుకొని చూస్తే మా పిన్నమ్మ కూతురు లక్ష్మి, ఈ టైంలో ఏంటబ్బా అనుకుంటూ కొంత ఆదుర్దాతో హలో లక్ష్మి, అని పలకరించగానే, సారీ అక్కా టైం చూసుకోలేదు కిట్టీ పార్టీ నుండి వస్తున్నాను నిద్ర పట్టలేదు చాలా రోజులైంది నిన్ను పలకరిద్దామని చేశాను. నాకు కాసేపు అర్థం కాలేదు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మా వారికి కూడా మెలకువ వచ్చి ఎవరి ఫోను? అని అడిగారు. కంగారేమీ లేదు మా చెల్లెలు లక్ష్మీ అండీ, అర్థమైనట్లుగా అటు పక్కకు పొర్లి పడుకున్నారు.
భయపడవలసినది ఏమీ లేదని అర్థమయిన తర్వాత ఆపై మాటలు పెంచేందుకు నాకు ఓపికనిపించలేదు. ప్రొద్దున లేచింది మొదలు పనుల పరంపర ప్రక్క రోజు వరకు కొనసాగుతాయి ఎక్కడ లింకు కట్ అయినా అన్ని పనులు దబదబా మీద పడ్డట్టు అవుతాయి ఇదీ నా పరిస్థితి. ఈ టైంలో ఫోన్ వస్తే కంగారుపడ్డాను లక్ష్మి, అంతా బాగున్నారు కదా రేపు నేనే ఫోన్ చేస్తాను సరేనా! అలాగే అక్కా, సారీ అంటూ ఫోన్ పెట్టేసింది తను. మంచి నిద్ర చెడింది. నాకు నిద్ర పట్టలేదిక లక్ష్మీని గురించే ఆలోచనలు నేను, లక్ష్మి అక్కచెల్లెళ్ల పిల్లలం, నాన్న బాబాయ్ కూడా అన్నదమ్ములే తాతయ్య నానమ్మ అందరం కలిసే ఉంటాము. తనకు నాకు ఒక్కరోజు గడువులో పెళ్లిళ్లయ్యాయి. నేను కాపురానికి హైదరాబాదు వచ్చాను లక్ష్మీ అత్తవారిల్లు ఉన్న ఊర్లోనే వారిదికూడా వ్యవసాయ కుటుంబమే, పొలం పుట్రా బాగా ఉన్నవాళ్లు లక్ష్మీని నచ్చి చేసుకున్నారు.లక్ష్మీ భర్త కాక ఒక్క ఆడపడుచు వయసులో మాకంటే పెద్దామె మా పెళ్లిళ్లప్పటికే ఏడు ఎనిమిది ఏళ్ళ వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఆమెకు. లక్ష్మీ భర్త వ్యవసాయమే కాక చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఏవో చేస్తుండేవాడు. మా అత్తంటివాళ్లంతా ఉద్యోగస్తులే పెద్ద కుటుంబంలో పెద్ద కోడలిని నేను. ఇద్దరు మరుదులు, ఇద్దరు ఆడపడుచులు అత్తగారు మామగారు మా వారి నాయనమ్మ ఇదీ మా కుటుంబం. బంధువుల రాకపోకలు కూడా ఎక్కువే. మావారు మామగారు ఒక మరిది ఉద్యోగాల్లో తక్కిన ముగ్గురు కాలేజీ చదువుల్లో ఉన్నారు. అయితే ఎవరి విలువలను వారు కాపాడుకుంటూ, ఒక క్రమంలో ఎవరి పనులు వారు చేసుకు పోతూ అరమరికలు లేకుండా అందరం కలిసి పోతాము. కానీ ఎవరి హద్దులు వారికుంటాయి ఈ విషయంలో మా అత్తగారిని అభినందించాలి ఆమె నడిచి వచ్చిన త్రోవే ఇది ఈనాటికీ వాళ్ళ అత్తగారు అంటే ఎంతో గౌరవంగా అభిమానంగా ఉంటారు మా అత్తగారు.
ఉద్యోగం చేయాలని గట్టి సంకల్పమే ఉండింది నాకు కానీ పెళ్లయిన సంవత్సరమే బాబు పుట్టాడు ఉద్యోగ విషయమై రాధీ! ఇంట్లోనే చేసినంత పని ఉంటుంది ఇంకా అనవసరశ్రమెందుకుపడతావు నీకభ్యంతరం లేకుంటే కొన్నాళ్లు ఇంట్లోనే అమ్మకు సాయంగా ఉండు. బాబుతో ఎంజాయ్ చెయ్యి అని మా వారు చెప్పినప్పుడు నాకు సబబే అనిపించింది. నా తర్వాత కోడళ్ళకు నాకున్న బరువు బాధ్యతలుండకపోవచ్చు కానీ పెద్ద కోడలుగా నాకిచ్చే విలువ గౌరవం వేరు. అది కాపాడుకోగలిగితే అంతకన్నా సక్సెస్ ఏముంటుంది క్షణం తీరిక లేకుండా రోజు గడిచినా అందులో ఏదో సంతృప్తి. తరువాత ఐదేళ్ల తేడాతో మాకు ఇప్పుడు ఒక పాప కూడా.
ప్రొద్దున హడావుడి అంతా అయిపోయి ఎక్కడి వారక్కడ ఆఫీసులకు కాలేజీలకు మా బాబు స్కూల్ కి వెళ్ళగానే, పాపను నిద్రపుచ్చేందుకు రూమ్ లోకి వచ్చినప్పుడు లక్ష్మీ కి ఫోన్ చేస్తానన్న విషయం గుర్తొచ్చి ఫోన్ చేశాను ఎప్పటిలాగానే తన ఫోన్ బిజీ అని వస్తున్నది. వాళ్ళిప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నారు ఇంచుమించు నా పిల్లల వయసు వాళ్లే తనకు
ఇద్దరు ఆడపిల్లలు. పాపను నిద్ర బుచ్చి నేను కూడా నడుం వాలిచాను.
ఇంతలో ఫోన్ రింగ్ అయింది ఆలోచనలు ఆపి హలో!అనగానే, లక్ష్మీ అత్తగారు హలో రాధమ్మ బాగున్నారా! అంటూ పలకరించారు ఆ, అంతా బాగున్నాము అత్తయ్య మీరు ఎలా ఉన్నారు హైదరాబాదు ఎప్పుడు వచ్చారు? నాతో ఎవరు కూడా అనలేదు మీరు ఇక్కడ ఉన్నట్లు. ఏదో చెప్పాలన్న ఆరాటం ఆమె గొంతులో వినిపిస్తుండగా అవును తల్లీ! వచ్చి వారమవుతున్నది పిల్లలిద్దరికీ జ్వరాలు అమ్మవారు పోసింది. చిన్న పాపకు ఎక్కువగానే వచ్చింది చిడి పెడుతూ చెయ్యి దిగడం లేదు అందుకే నీకు ఫోను కూడా చేయలేకపోయాను రాధి. అలాగా అత్తయ్యా, అవునూ, లక్ష్మీ లేదా! ఫోన్ చేస్తే కలవలేదు. ఏం చెప్పమంటావు తల్లీ, రాత్రి పొద్దుపోయి వచ్చినట్లుంది నేను పిల్లలిద్దరినీ పక్కలో వేసుకుని పడుకున్నాను . ప్రొద్దున్న మళ్లీ ఎక్కడికి వెళ్ళిందో పలకరించుకోను కూడా వీలు అవ్వలేదు. పిల్లలకు ఎట్లా ఉన్నది ఇప్పుడు అని వంటావిడను అడిగి వెళ్లిందట. గదిలోకి వచ్చి వాళ్ళని చూసే తీరిక కూడా లేదా అమ్మా! ఇక వాడి విషయానికొస్తే వాడు ఎప్పుడు వస్తాడో అదీ తెలియదు ఇంటికి పిల్లలకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడయితే, ఇలా ఉంది రాధమ్మ ఇక్కడి పరిస్థితి . వీలు చూసుకుని రేపు ఇంటి వరకు వస్తానులెండి అత్తయ్య,!ఏమైనా చేసుకుని రమ్మంటారా! ఎందుకమ్మా వంటావిడ ఉంది ఆమె పుణ్యమా అని ఏదో చేసి పెడుతున్నది అందుకేమీ ఇబ్బంది లేదు. ఇదిగో పిల్లలు కూడా ఇప్పుడే కాస్త నిద్రకుపడ్డారు. సరే అత్తయ్య మీరు కూడా వాళ్లు పడుకున్నప్పుడే కాస్త రిలాక్స్ అవ్వండి.అలాగే రాధమ్మ ఉంటానైతే ఫోన్ పెట్టేశారు. నాకు లక్ష్మీ మీద చిరాకు,కోపం కూడా వచ్చింది.
మరుసటి రోజు లక్ష్మి వాళ్ళ ఇంటికెళ్లి వద్దామనుకొని మా వారితో చెప్పాను అలాగే వెళ్లి చూసిరా ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని చెప్పారు. మా అత్తయ్య గారితో కూడా లక్ష్మీపిల్లలకు అమ్మవారు పోసిందట చూసి వస్తానని చెప్పగానే, కాస్త ఉండు పిల్లలకే మైనా చేసిస్తాను బాబు ఎలాగు స్కూల్ కి వెళ్ళాడు,పాపను కూడా తీసుకెళ్లొద్దులే మాకు మాలిమే కదా ఉంటారులే అంటూ వంటింట్లోకి వెళ్లారు. పండ్లు,స్నాక్స్ కూడా తీసుకొని లక్ష్మీ వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయింది ఇంట్లోకి అడుగుపెట్టగానే రామ్మా, అంటూ అత్తయ్య గారు గుమ్మం దగ్గరే పలకరించుకున్నారు.చిన్నది చంకలోనే ఉన్నది పిల్లలు బాగా నీరసంగా ఉన్నారు ఆమె కూడా వ్యధతో, బడలికగా కనిపిస్తున్నారు. కూర్చో రాధమ్మ, ఇంట్లో అందరూ బాగున్నారా,పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు అత్తయ్య, అంటూ చేతిలో సంచులు వంటావిడ కందించి అత్తయ్య చేతుల్లోంచి చిన్న పాపనందుకొని సోఫాలో కూర్చున్నాను. మెల్లిగాపెద్ద పాప వచ్చి నన్ను ఆనుకుని,నా పక్కన కూర్చుంది.బహుశా వాళ్ళ అమ్మను మిస్ అవుతుందేమో!
ఇప్పుడే పెద్ద దానికి కాస్త అన్నం తినిపించాను చిన్నది ససేమిరా నోట పెట్టలేదు కాసిన్ని పాలు కలిపి తాగించాను. మనం భోంచేద్దాము రామ్మా , ఇంటిదగ్గర భోంచేసే బయలుదేరాను అత్తయ్యా, మీరు భోంచేయండి . ఈలోగా వంటావిడ సంచులలో వన్నీ తీసి టేబుల్ పైన పెట్టింది. పండ్లు బిస్కెట్స్ తో పాటుగా మా అత్తగారు పిల్లలు కొరకు రెండు మూడు పథ్యంకూరలు కరివేపాకు పొడి,లక్ష్మీ అత్తయ్య గారి కొరకు ఈరోజు మేము వంటలొ చేసుకున్న కూరలు కూడా పంపించారు అవన్నీచూస్తూ, శ్రమ తీసుకుని చాలా పంపించారమ్మా కృతజ్ఞతగా అంటూ భోజనం పూర్తి చేశారు. ఈ లోపు నా భుజం పైనే నిద్రపోయిన పాపను నన్ను ఆనుకుని కూర్చుని తూగుతున్న పెద్ద పాపను రూములో పడుకోబెట్టి అక్కడే కూర్చున్నాము.
అత్తయ్య ఏదో చెప్పాలని సంశయంగా ఇబ్బంది పడుతూ,మీకు తెలియని విషయాలు కాదు తల్లీ, ఒక్కోసారి ఆలోచన లేని పనులతో అర్థం కాని సంపాదన రుచి మరిగితే అది వ్యసనంగా మారి మనిషిని బానిసను చేస్తుంది.అదే మా అబ్బాయి విషయంలో జరుగుతున్నది. ఇంకా నాగరికత వాసనలు పూర్తిగా అంటని మన ఊరు, మనకు తెలిసిన వ్యవసాయం వెలితి లేక జరిగిపోతున్నది కదా అనుకుంటే,ఇదిగో వీడికిలా ఏదో చేసి సంపాదించాలని కోరిక పుట్టింది. ఆ ఒరవడి లోనే రొయ్యలపై ఆదాయం బాగా వస్తుందని ఊరు ఊరంతా వేలంవెఱ్ఱిగ బంగారం లాంటి పచ్చని పొలాలను రొయ్యల గుంటలుగా మార్చేశారు. మితిమీరిన ఆదాయం ఉన్నచోట అంతే కష్ట నష్టాలు ఉంటాయి కదమ్మా! మొదట్లో బాగా డబ్బులు కనపడ్డాయి దాంతో అందరి జీవనశైలిలో మార్పు వచ్చేసింది ఎకరం పొలం ఉన్న వాళ్ళు కూడా కార్లలో తిరగడం,లెక్క లేనట్లుగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోయారు. ఉన్నట్లుండి రొయ్యలకు ఏవో తెగుళ్లు సోకుతున్నాయని, ఎట్లా ఎదిగామనుకున్నారో అట్లాగే చతికిల పడిపోయారు. ఎక్కువ వడ్డీలకు డబ్బు తెచ్చి పెట్టినవారు తేరుకోలేని పరిస్థితయ్యింది . మళ్లీ అందరూ అప్పో సప్పో తెచ్చి గుంటలు పూడ్చి వ్యవసాయానికి దిగారు .తగిలిన దెబ్బ నుండి కోలుకోలేక, నడ మంత్రపు సిరితో చేసుకున్న అలవాట్లను మానుకోలేక నలిగిపోతున్నాయి సంసారాలు. ఏ కొద్దిమందో మీ నాన్నగారి లాంటివారు ఈ పరుగు పందెంలో లేకుండా ఎప్పటిలా స్తిమితంగా ఉండిపోయారు.
మా వాడు కూడా ఈ ప్రయోగం చేసి ఎక్కువ వడ్డీలకు తెచ్చిన డబ్బులకు వత్తిడి పెరిగిపోతుంటే గ్రుక్క తిప్పుకోలేక సిటీలో ఏవో అవకాశాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చాడు. అన్నీ అనుకున్నట్లు జరగలేదు ప్రయత్నాలన్నీ చేతికి అందినవి నోటి కందనట్లు అయ్యాయి. అక్కడ పరిస్థితి చూసుకుని కాపురం పెట్టొచ్చు కదరా అంటే అదీ వినకుండా హైదరాబాదు వచ్చారు. అన్నింటికీ పరుగే, అలవాటయిన ఆడంబరాలకు డబ్బు చేతికి అందినప్పుడు ధారాళంగా ఖర్చు చేయడం, లేనప్పుడు అప్పులకై వేట. వీటికై వాడు పడుతున్న శ్రమ వాడికి తెలియడం లేదు. ఎక్కడికి చేరుతాడో అదీ అంతు పట్టడం లేదు. నువ్వెలాగూ బిజీగా ఉంటున్నావు అమ్మాయి నయినా ఇంటిపట్టునఉండనిమ్మని మొదటినుండి,నేను వాళ్ళ నాన్నగారు చెప్తూనే ఉన్నాము. కొత్త పరిచయాలు కొత్త కొత్త అలవాట్లు వేళాపాళా లేకుండా మోజుగా కలిసి తిరిగారు, ఇంకాస్త పరిచయాల స్థాయి పెరగగానే ఎవరి ప్రపంచం వారిది ఎవరి వ్యాపకాలు వారివయ్యాయి . ఇప్పుడు కిట్టి పార్టీలు పేకాట క్లబ్బులు ఎవరిస్వేచ్ఛను వారు వాడుకుంటున్నారు మధ్యలో ఈ పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతున్నది. వంటకు,పిల్లలను చూసేందుకు ఈ మనిషిని కుదుర్చుకున్నారట తాను ఇక్కడే ఇంట్లోనే ఉంటుందట డబ్బులు వెదజల్లితే మనుషులు దొరకొచ్చు కానీ ప్రేమలు కొనలేం కదా, అమ్మానాన్నలతో,అయిన వాళ్ళ మధ్య పెరిగే అదృష్టానికి కరువయ్యారీ పిల్లలు రాధమ్మ. మా వరకు మేము చేయగలిగింది ఏమీ లేనప్పుడు భూమిని నమ్ముకున్న వాళ్ళం కదా వచ్చే పంటలోనే అడపా దడపా వీళ్ళకు అందిస్తూ కూడా చిన్న చిన్న అప్పులు తీరుస్తున్నాము. ఇప్పుడు చూడు,పొలం పనులు వదిలి రాలేక ఆయనొక్కడే వూర్లో అవస్థ పడుతున్నాడు నేనేమో ఇక్కడ ఉన్నాను. పెద్ద పాపని ఈ సంవత్సరమే కదా స్కూల్లో వేశారు, దానికి ఎంత వయసు అని చెప్పు వచ్చే ఏడాది హాస్టల్లో వేస్తారట ” అవసరానికే మేము కానీ, అవసరమైన మంచి చెప్పేందుకు పనికి రాము ” ఈ తీరుగా జరుగుతున్నది సంసారం. ఒక వూరి వాళ్ళం, ఒకరి స్థితిగతులు ఒకరం ఎరుగున్న వాళ్ళం. సంపాదించాలన్న ఆలోచన తప్పు కాదు రాధమ్మ, మీ తరం ఆలోచనలు, కోరుకుంటున్న మార్పులు సహజమే ,కానీ” అరగని ఆహారం జీర్ణం కాక బాధపెట్టినట్లే అరిగించుకోలేని అనుభవాలు సంసారాన్ని నలిపివేస్తాయి కదా తల్లి!
ఆ రాత్రి నిద్ర పట్టక అమ్మకు ఫోన్ చేశాను. లక్ష్మీ వాళ్ళింటికి వెళ్లి వచ్చిన వైనం అక్కడ అత్తయ్య పిల్లల అవస్థ చెప్తూ , ఏంటమ్మా ఇది! పిన్ని అయినా లక్ష్మి తో మాట్లాడొచ్చు కదా! పిన్ని చెప్పకుండానే ఉంటుందా రాధీ, నీకు చెప్పలేదు కానీ,పిన్ని,బాబాయ్ఆ మధ్య హైదరాబాద్ వచ్చారు. అక్కడ పరిస్థితికి చేసేదేమీ లేక పిల్లల్ని తీసుకెళ్లి పది రోజులు ఉంచుకొని పంపిస్తాను అని పిన్ని అడిగితే, పాపకు స్కూలు పోతుంది అది లేకుండా చిన్న పాప ఉండదు అన్నదట లక్ష్మి. కడుపులోనుంచి తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకోలేననిపించి రాధకి ఫోన్ కూడా చేయలేదక్క అని బాధపడింది పిన్ని. ఇంట్లో అందరం తోచనట్లున్నాము . పల్లెటూరులో కట్టుబాట్ల మధ్య సామాన్యంగా పెరిగిన పిల్ల సడన్ గా అర్థం కాని రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టి దాని భర్త దానికిచ్చిన స్వేచ్ఛను , ఇంటికి,బయటకు వున్న వ్యత్యాసాన్ని సమన్వయం చేసుకోలేక పోతున్నది. చిన్నప్పటినుండి ఒకటిగా ఆత్మీయంగా కలిసి పెరిగారు మీరిద్దరూ, పోనీ ఒకసారి నువ్వు చెప్పి చూడు రాధీ, ఇంకేం సంగతులుఅక్కడ అందరూ బాగున్నారు కదా పిల్లలెలావున్నారు. మీరు ఊరికి వచ్చి కూడా చాన్నాళ్లవుతున్నది గంగమ్మ జాతరకు అందరూ రండమ్మా, నేను మళ్ళీ అత్తయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేసి పిలుస్తాలే పొద్దుపోయింది పడుకో తల్లి, సరే అమ్మా! పిన్నికి ధైర్యం చెప్పు ఉంటాను మరి ఫోన్ పెట్టేసాను.
లక్ష్మీ ని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అమ్మ అన్న ” సమన్వయం” అన్నమాటతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయింది. మరుసటి రోజు లక్ష్మి కి మెసేజ్ పెట్టాను ఒకసారి ఫోన్ చేయమని,ఆశ్చర్యంగా వెంటనే చేసింది రాధక్క ఎలా ఉన్నావు?అంటూ బాగున్నాను లక్ష్మి నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంట్లోనా, లేదక్కా క్లబ్బులో మా కిట్టీలొ ఒకరి బర్తడే అందరం సెలబ్రేట్ చేస్తున్నాము. అవునా! నిన్ను కలుద్దామనుకుంటున్నాను లక్ష్మి, ఎప్పుడు వీలవుతుంది? అలాగే అక్క,రేపు కలుద్దాము ఇంటికి వచ్చేయండక్కా, అలా కాదులే లక్ష్మి, కృష్ణ మందిరానికి వచ్చేయి ప్రొద్దున పది గంటల కల్లా నేను అక్కడ ఉంటాను. మా ఇద్దరికీ తెలిసిన ప్లేస్ అది. సరే అక్కా, అవునూ విశేషమేమైనా ఉందా? అలా ఏం లేదు చాలా రోజులయింది కదామనం కలుసుకుని కాసేపు నీతో గడుపుదామని అంతే! రేపు కలుద్దామయితే, అలాగే అక్క.
నేను వెళ్లేసరికి నాకంటే ముందుగానే వచ్చి మెట్లపై కూర్చుని ఉందిలక్ష్మి. నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చి నా చేయి పట్టుకుంది. మందిరంలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాము ప్రశాంతంగా ఉంది అక్కడ.ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండానే ఈమధ్య ఇంటికి వచ్చాను లక్ష్మి, అత్తయ్య పిల్లలు ఉన్నారు అమ్మవారు వచ్చి పిల్లలు బాగా తగ్గిపోయి ఉన్నారు. అవునక్కా మా ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళి ఉన్నాను అత్తయ్య గారిని పిలిపించారట మీ మరిది గారు హమ్మయ్య మంచి పని చేశారని అనుకున్నాను. ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా చెప్తుంటే ఒక్క నిమిషం పట్టింది నాకు సర్దుకునేందుకు ఏమైందీపిల్లకు? హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకున్నట్లుగా అన్ని పనులు బాగా జరుగుతున్నాయా లక్ష్మి! మరిది గారు కూడా చాలా బిజీగా ఉన్నట్లున్నారు కదా, ఏం పనులో అక్కా, ఎందుకు ఇక్కడికి వచ్చామో, ఏం జరుగుతున్నదో నాకు అయోమయంగా ఉన్నది, అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడిక అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. తన స్థితేమిటో నాకు కొంత బోధపడింది.
ఇంతకీ ఫ్రెండ్స్ అంటున్నావు కదాఏం చేస్తుంటారు అందరూ? బాగా స్థితి మంతులక్క అందరు. ఎవ్వరూ ఇళ్లల్లో బాదర బందీలేమి పెట్టుకోరు. సినిమాలు షికార్లు జాలీగా తిరుగుతాము పెద్ద పెద్ద మొత్తాలు పెట్టి పేకాట ఆడుతాము డ్రింక్ పార్టీలు ఉంటాయి కొత్త కొత్త గేమ్స్ ఉంటాయి ఒకరితో ఒకరు పోటీ పడుతూ చీరలు,నగలు కొంటుంటారు, వారిలో నేనే తక్కువలో ఉంటాను అయినా వెలితి పడకుండా జాగ్రత్త పడతాను. ఇంకా చెప్పాలి అంటే సినిమా ప్రపంచం కానీ మరి ఇతరమైనదైన పర్సనల్ విషయాలు నుండి సమస్తం సేకరించి మాట్లాడుకుంటారు. అదంతా నాగరికతకు మరో రూపంగా ఉన్న హై క్లాస్ వారికిది మామూలే అన్నట్లు ఉంటారు. అదొక సరదా ప్రపంచం అక్క,పొద్దు తెలియదు. అవును లక్ష్మి, నిజమే” కొందరికి పొద్దుచాలదు, మరికొందరికి పొద్దే తెలియదు.” తనకేమనిపించిందో నా ఒళ్ళో చేయి వేసి దగ్గరగా జరిగి కూర్చుంది.
లక్ష్మి, నువ్వు ఇప్పుడు చెబుతున్న ఈ కొత్త ప్రపంచం మనకు సరిపోయేది కాదు, వెఱ్ఱివేయి తలలు వేసినట్లున్నది వింటుంటే . మహిళా సంస్థ లెన్నో ప్రగతి పథంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘానికి దేశానికి ప్రపంచానికి ఆడవారు అబలలు కాదు అంటూ చాటుతున్నారు. విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఇంటా బయట రాణించిన వారెందరో ఉన్నారు. ఆర్థికమైన ఇబ్బందులతో నీకు ఏర్పడిన చిక్కుముడులను సున్నితంగా విప్పుకోవాల్సింది పోయి, చదువుకున్నదానవు ఉద్యోగ ప్రయత్నం అయినా చేసి సహాయంగా నిలుస్తున్నావా అంటే, అదీ లేకుండా నీ తెలివినంతా పక్కదారిలో పెడుతున్నావు. జీవితాన్ని మరింత అస్తవ్యస్తం చేసుకుంటున్నావు. అసలు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని ఎన్ని రోజులవుతున్నది ? మీ ఆలనా పాలనా అవసరమయిన మీ పిల్లల సంగతేమిటి? వాళ్లతో ప్రేమగా గడిపి ఎన్నాళ్ళవుతున్నది, అన్నింటికీ అండగా నిలిచే పెద్ద వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారోగ్రహించారా! ఇంత కొద్ది సమయంలో ఎన్ని మార్పులో కదా, ఇక్కడ ఇంకొక విషయం నీకుతప్పక చెప్పాలి లక్ష్మి, ఈ జరుగుతున్న మార్పులన్నింటికీ, తమ కొడుకు తొందరపాటు అని బాధపడుతున్నారే కానీ నిన్ను దోషిని చేయలేదు. మీ అత్తింటి వాళ్లు కానీ, మీ ఆడపడుచు గానీ నీ గురించే ఆలోచిస్తున్నారు.
.. మన చిన్నతనంలో నీకు గుర్తుంది కదా మగ పిల్లలతో సమానంగా అన్ని అల్లరి పనులు చేసేవాళ్లం సెలవు రోజులైతే మరీను, రోజంతా తోటలు,దొడ్లు,కాలువల అన్నీ తిరిగి ఇంటికి రాగానే వాకిట్లోనే మన జేజవ్వ ఖంగుమనే గొంతుతో ఎక్కడికెళ్లారే ఆడపిల్లలన్న జ్ఞానం లేకుండా, ఆగమ్మకాకుల్లా ఊరంతా పెత్తనాలు చేసి వస్తున్నారా! మొహాలు చూడు ఎలా వాడిపోయి ఉన్నాయో ” ఊరికి ఉపకారమా ఇంటికి ఉపయోగమా ” అంటూ దగ్గరకు పిలిచి ముఖాన ఇన్ని నీళ్లు పోసి కడిగి లోపలికి ఊరేగండి. ఇందుకే అంటారు ” క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు ” అని మీకోసమే పుట్టినట్టుందీ మాట.ఇలా సాగేది జేజవ్వ వాక్ ప్రవాహం. ఇప్పుడు చూడబోతే ఇలానే ఉన్నది మీ సంసారం లక్ష్మి. మన పెళ్లిళ్లు అయిన తర్వాత ఆరు నెలలు నీకంటే ముందు నేను కన్సీవ్ అయ్యాను. నువ్విక డాక్టర్ల చుట్టూ దేవాలయాల్లో ప్రదక్షణలు, పుట్టలో పాలు,చెట్ల చుట్టూ దారాలు కట్టడం చేసావు. నీకు గుర్తుందా పెద్ద పాపకు ఒకసారి ఒళ్ళు వెచ్చబడినందుకే ఊర్లో డాక్టర్లున్నా పాపను తీసుకొని నా దగ్గరకు హైదరాబాదు వచ్చి వైద్యం చేయిస్తూ నువ్వు చేసిన హడావుడి మా ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారిప్పటికీ. లక్ష్మి మనం చేసుకున్న పుణ్యం పుట్టిల్లు,మంచి మర్యాదలతో కూడినదైతే, అత్తగారిళ్లు అంతకంటే గొప్పగా చెప్పుకోదగినవి. మావారు, మరిది గారు మనసున్న మంచివాళ్లు ఇంతకన్నా అదృష్టమేముంటుంది చెప్పు.
కాలం తెచ్చే మార్పులతో మనం పెరిగినంత ఆరోగ్యమైన వాతావరణం మన పిల్లలకు లేదు లక్ష్మీ, కనీసం మనమైనా వాళ్ళ పట్ల ధర్మంగా ఉందాము. ఈ క్రేజీ పరుగులకు పిల్లల బాల్యాన్ని బలి చేయొద్దు మీరు, నాలుగు రోజులు పోతే మీ పిల్లలు మీ బాటలోనే మీకు కూడా అర్థం కాకుండా అవుతారు. వాళ్లు సహజంగానే మార్పులకు అలవాటైపోతారు కానీ నువ్వు అలా పెరగలేదు రేపు ఇమడలేవుకూడా . ఒక్కటి గ్రహించు,జీవితం సమస్యల వలయం.ఎవ్వరికీ,ఎప్పుడూ ఒకే లాగా జరగదు. మనం చేయగలిగిందల్లా ఒక్క క్షణం ఆగి సమస్యలను, సమయాన్ని సామరస్యంతో సమన్వయపరచుకోగలగడమే. సంసారంలో నయినా, సంఘపరంగాఅయినా మనిషి మనుగడకే ఆధారం ” సమన్వయం ” మనం జీవితంతో కుదుర్చుకోవలసిన ఒప్పందం ” సమన్వయం ” అనే ఈనాలుగు అక్షరాల మహా మంత్రమే లక్ష్మీ. జేజవ్వ మనల్ని ఎప్పుడూ అంటూ ఉండే ఊత పదం .” క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు ” ఈ మాట అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మన జీవితాలకు అన్వయిస్తున్నది. పనీ పాటు లేకుండా తిరిగే వారిని ఉద్దేశించి ఏర్పడిన నానుడి ( సామెత) ఇది, నా విషయానికొస్తే క్షణం తీరిక లేకుండా రోజు గడుస్తున్నా, దండిగా దమ్మిడీలు సంపాదిస్తున్నంత సంతృప్తి నా కుటుంబంలో నేను పొందుతున్నాను. కానీ నువ్వుచేయవలసిన బాధ్యతలను విస్మరించి ఈ సామెతకు సరిపోయేటట్లు తిరుగుతున్నావు . మొదట నువ్వు నేల విడిచి సాము చేయడం మానుకో,అప్పుడు మీ వారిని నేల మీదకు దింపడం పెద్ద శ్రమ కాదు. నీ కొరకు బెంగ పడుతున్న పిల్లలను ఒళ్ళోకి చేర్చుకో, ఈరోజు నీ పక్కలో పడుకో పెట్టుకో రేపటికి నీ మనసే నీకు సమాధానం ఇస్తుంది.మన మధ్య ఉన్న చనువు కొద్దీ చొరవ తీసుకున్నాను లక్ష్మీ, మరోలా అనుకోకు, నేను చెప్పిన వేవి నీకు తెలియనివి కావు నీకు గుర్తు చేస్తున్నానంతే, అపార్థం చేసుకోవద్దు. మమ్మల్ని అందరినీ ఈ అయోమయ స్థితి నుండి బయట పడేయ్యి. చాలాసేపయింది వచ్చి , ఇంట్లో ఎదురు చూస్తుంటారు ఇక బయలుదేరుదామా! అంటూ లేవబోతుంటే ఇంతసేపు ఒక్క మాట కూడా మధ్యలో మాట్లాడకుండా తలవంచుకుని వింటూ కూర్చున్న లక్ష్మి,అక్కా, అంటూ నన్ను చుట్టేసి నా ఒళ్ళో తల పెట్టుకొని ఏడుస్తుంటే నాకూ దుఃఖమాగలేదు. వీపు నిమురుతూ ఉండిపోయాను .
ప్రక్క రోజేవూరికెళ్లి కొద్దిరోజులు ఉండి వస్తాము అక్కా, అంటూ లక్ష్మి ఫోన్ చేసింది. మరో రెండు రోజుల తర్వాతఅమ్మ మాట్లాడుతూ లక్ష్మీ వాళ్ళు అత్తగారింటికొచ్చున్నారు, రేపెళ్లి చూసి వస్తామని చెప్పింది . రోజు లక్ష్మి గుర్తుకొస్తున్నా ఫోన్ చేసి పలకరించుకోలేదు, . ఈ లోపు మా పిన్నమ్మ, అమ్మ వాళ్ళ ద్వారా విషయాలు తెలుస్తున్నా, మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్నాను . నెల్లాళ్ళ తర్వాత అనుకున్న శుభదినం వచ్చినట్లయింది పనులన్నీ ముగించుకుని రూము లోకి రాగానే లక్ష్మీ ఫోను, గుండె దడ దడ లాడుతూ హలో లక్ష్మి అనగానే, అక్కా! అంటూ వూరికెళ్ళినప్పటి నుండి జరిగిన విషయాలు చెబుతూ, నానమ్మ అమ్మమ్మల మురిపాలతో పిల్లలు గూటికి చేరుకున్న గువ్వల్లా ఉన్నారు. పెదనాన్న,నాన్న వచ్చి మామయ్యతో,మా వారితో చాలాసేపు మాట్లాడి వెళ్లారు. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారక్కా, వచ్చిన కష్టం అందరిదీ అందరం కలిసే ఈ ఇబ్బందినుండి బయట పడదాము అని మామయ్యను, మీ మరిది గారిని ఒప్పించారు. మా ఆడపడుచు వాళ్ళతో సహా అందరి తరఫున కొంత పొలం అమ్మి అప్పులన్నీ తీర్చేట్లుగా, మేమెక్కడ ఉండాలన్నది మా ఇష్టానికే వదిలారు. అక్కా! పెద్దవాళ్ళను పక్కకు పెట్టి సంపాదన వేటలో ఆయన, సరదాల వెంటనేనూ తప్పటడుగులు వేసి, తప్పు మేము చేసి శిక్షమీకు వేసినట్లు మేము ప్రవర్తించిన తీరు మాకుజుగుప్స కలిగిస్తున్నదిప్పుడు. చాలాసేపు ఉద్వేగంగా మాట్లాడుతూ,మా జీవితాన్ని మాకు తిరిగి అందించావు అక్కా, నీ ఋణం ఎలా తీర్చుకోగలను అంటూ ఏడ్చేసింది. గొప్పదనమంతా నీదే లక్ష్మీ, చాలా త్వరగా నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటూ అనునయించాను. వీలు చూసుకుని అందరూ రండక్క మేము అత్తయ్య వాళ్ళతో ముందులాగానే ఉందామని నిర్ణయించుకున్నాము. సరే అక్క మళ్లీ ఫోన్ చేస్తాను అని పెట్టేసింది.
ఇంతసేపు అంతా వింటూ చిరునవ్వుతో నా వైపు చూస్తూ పడుకుని ఉన్న మా వారితో, వీలు చూసుకుని అమ్మ వాళ్ళ దగ్గరకు , గంగమ్మ జాతర కూడా ఉంది కదా మనమందరం వెళ్లి వద్దామండి, లక్ష్మీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదాఅందరం కలుసుకుని చాలా రోజులవుతున్నదని చెబుతూ మా ఊరి ప్రయాణం తలుచుకొనినా మనసంతా ఆనందంతో నిండిపోయింది .