నిష్క్రియా పర్వం

పరిస్థితులన్నీ
చెయ్యి దాటిపోయిన
అనివార్య స్థితిలో
కొట్టుమిట్టాడుతున్నాం !

కర పిశాచే (సెల్ ఫోన్)
సర్వస్వమై
స్వీయ నియంత్రణ కోల్పోయి
దిక్కుతోచని స్థితిలోకి
నెట్టివేయబడుతున్నాం !

సామాజిక మాధ్యమాలు
వశీకరణ మాంత్రికులై
గుప్పిట్లో బంధిస్తుంటే
సంకెళ్లను తెంచుకోలేని
అశక్తులమైపోతున్నాం !

ఎవర్నేమీ అనలేం
దేన్నీ సరిచేయలేం
నిస్సహాయంగా నిట్టూర్చడం తప్ప !

మంచిని ఎంచుకునేవారు
కొద్దిమంది మాత్రమే
పరివర్తన కోసం అడుగులు వేసేది
కనిష్ట శాతమే !

పరిస్థితులు ప్రక్క దారి పడుతున్నా …
విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోతున్నా …
చెడు మార్గాలే
స్వేచ్ఛయని విపరీతార్ధాలు చెబుతున్నా ….
బంధాలు, బంధుత్వాలు
సుఫారీ గ్యాంగులకు
బలైపోతున్నా….
అక్రమ సంబంధాలు
క్షణికావేశాలు
విశృంఖలమైపోతున్నా…
ఆస్తి తగాదాలకు
అయినవాళ్ళే ఆహుతైపోతున్నా….

ఏదీ వింతగా భావించలేం
ఎవరికీ వంత పాడలేం !

తప్పు అని చెబితే
మనల్నీ తప్పించడానికీ వెనుకాడని దుస్థితి !
సరిచేయడానికి ప్రయత్నిస్తే
మనల్నీ ఉరితీయడానికీ
సంకోచించని దైన్యం !
ప్రశ్నిస్తే
మన ఉనికే ప్రశ్నార్ధకమయ్యే
వైపరీత్యం !

మహానుభావులెవరు
మళ్ళీ పుట్టినా …
ఎందుకు పుట్టామని
దుఃఖించే దౌర్భాగ్య స్థితి !

నిరాశావాదం కాదిది
ఎవరేమీ చేయలేని
నిష్క్రియా పర్వం !

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కలలే కన్నీళ్ళుగా

సమన్వయం