ఆడ పిల్లల తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!

యావండోయ్ ఇది విన్నారా….వినకపోతే ఇప్పుడు నేను చెప్తాను. మనస్సు ఉగ్గపట్టుకుని వినండి ఏం…! “ గ్రూమింగ్ గాంగ్” అని ఒకటి వచ్చిందిటండీ. అది యూకేలో పుట్టి , అమెరికా లాంటి దేశాలకి పాకి ఇప్పుడిప్పుడే మన దేశానికి కూడా దిగుమతి అయిందిట. కొంతమంది యంగ్ అబ్బాయిలు కలిసి కష్టపడకుండా ఎలా డబ్బు సంపాదించాలన్న విషయం మీద రిసెర్చ్ చేసి మరీ కనిపెట్టారట.ఈ అబ్బాయిల పని ఏమిటంటే పదమూడు నుంచి పదహారేళ్ళ ధనవంతులైన తల్లిదండ్రులు గల ఆడపిల్లలని టార్గెట్ చేసి వారిని చాలా తెలివిగా అందమైన అబ్బాయిలచేత మచ్చిక చేయించి వారిని తమ బుట్టలో వేసుకుంటారుట. ఆ తరువాత వారిని ప్రేమలోకి దింపి తాము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేటట్లు చేసుకుంటారుట. ఆ అమ్మాయిలకి తామంటే నమ్మకం కలిగాక వారికి డ్రగ్స్, మందు అలవాటు చేస్తారుట. ఆ మత్తులో వారున్నప్పుడు వారి మీద సామూహిక అత్యాచారం చేసి, వదిలేసి, వారు నగ్నంగా ఉన్నప్పుడు తీసిన విడియోలు, ఫొటోలు అవీ, మేము చెప్పినట్టు మీ పేరెంట్స్ దగ్గరనుంచి మేమడిగినంత డబ్బు తేకపోతే సోషల్ మీడియాలో పెట్తామని బ్లాక్ మెయిల్ చేస్తారట. ఆ విషవలయంలో చిక్కుకున్న ఆడపిల్లలు తప్పించుకునే మార్గమే లేకుండా అయిపోతోందిట. అదండీ విషయం…! చూసారా మన సమాజంలో ఎంతటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయో! దీనికంతటికీ కారణం ఏమై ఉంటుందంటారు…? నేనైతే తప్పంతా ఆడపిల్లలున్న ధనవంతులైన తల్లిదండ్రులదే అంటాను. ఇదంతా వారు తమ అమ్మాయిల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ, ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ కారణం కాదా…!అసలు తమ పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తున్నారో వారికి తెలుసుకునే అవకాశం, సమయం ఎక్కడ ఉంటోంది వారికి? ధనవంతుల ఇళ్లల్లో ముఖ్యంగా తల్లులకు వారి భర్తలు సంపాదించే నల్ల ధనం ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, షాపింగ్ లనీ, కిట్టీ పార్టీలనీ ఎప్పుడూ బిజీగా ఉండటమే సరిపోతుందాయె….ఇక పిల్లల మంచిచెడుల గురించి పట్టించుకునే సమయం, శ్రద్ధ ఎక్కడ ఉంటాయి?
అందుకే సంపన్న కుటుంబంలోని తల్లిదండ్రులారా మేల్కొనండి…..మీరు అప్రమత్తులవాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ఆడపిల్లలని యుక్తవయసు రాగానే ఓ కంట కనిపెట్తూ ఉండండి. అంతే కాదు చిన్న వయసునుంచే వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తల్లి తమ ఆడ పిల్లలకు రజస్వల కాకముందే దాని గురించిన పూర్తి అవగాహన కలిగించాలి. ఎందుకంటే అదంటే ఏమిటో తెలియకపోవడం వల్ల ఆ సమయం రాగానే అమ్మాయిలు బెంబేలెత్తి పోతారు. ఒక్కోసారి షాక్కు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. ఒకసారి ఆడపిల్ల రజస్వల అయ్యాక ఆమెకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అవసరం. అసలు సెక్స్ అంటే ఏంటి? పెళ్లి కాకుండా సెక్స్ లో దిగితే వచ్చే అనర్థాలు మొదలైనవి వాళకు అర్థం అయేలా బోధించాలి. అంతేకాదు కొందరి మగవారి అతి చొరవ పద్ధతిని ఎలా ఎదుర్కోవాలి, వారి పశువాంఛకు బలి కాకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలి అన్నది తల్లి కూతురికి ఒక స్నేహితురాలి లాగా తెలియజేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పాలి. “ఎవరైనా నీ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తే వెంటనే దాన్ని ఖండించాలి, పెద్ద వాళ్ళమైన మాకు చెప్పాలి. “ అని. అమ్మ ఎకత్తే కాదు నాన్న కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇది తల్లి తండ్రుల ఇద్దరి బాధ్యత.
ఈ వయసు ఆడపిల్లలకి ఎదుటివారినుంచి గుర్తింపు పొందాలన్న, మెప్పులు పొందాలన్న ఆరాటం ఉంటుంది. అంతేకాదు ఆ వయసు ఆడపిల్లలు తమ అందాన్ని ఎదుటి వారు గుర్తించాలనీ ప్రశంసించాలనీ కోరుకుంటారు. తల్లిదండ్రులు వారికి స్నేహితులుగా వ్వ్యవహరించి వారి మనస్సును కనిపెట్టి తగు సలహాలు ఇవ్వడం, వారి అందాన్ని సందర్భానుసారంగా మెచ్చుకోవడం, వారు చేసిన మంచి పనులను ప్రశంసిస్తూ వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించడం వంటివి చేయాలి. ఈ టీనేజ్ పిల్లల మనసు ప్రేమ ఆప్యాయతానురాగాలను విపరీతంగా కోరుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తమ ఆడపిల్లలకు స్పర్శ ద్వారా, మాటల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడం తప్పనిసరి. అలా కాని పక్షంలో ఆ ప్రేమాప్యతలను వారు బయట నుంచి పొందే ప్రయత్నం చేస్తారు. వీరిలోని ఈ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండే మగవారి తీపి మాటలకు మాయమాటలకు కరిగిపోయి ప్రేమలో పడడం మోసపోవడం వంటివి జరుగుతాయి. తల్లికీ కూతురికి మధ్య మంచి కమ్యూనికేషన్ కనుక ఉన్నట్లయితే కూతురు తల్లి దగ్గర ఏ విషయం దాచదు. అప్పుడు కూతురు సరైన మార్గంలో వెళ్తుందో లేదోనని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతే కాదు సరైన పద్ధతిలో తగిన సలహాను సరైన సమయంలో ఇస్తే కూతురు తప్పటడుగు వేయకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
అంతే కాదు తల్లులు తమ కూతుళ్ళ ప్రవర్తనలోగానీ వారిలో వచ్చే మార్పులను గానీ పసిగట్టి జాగ్రత్తగా, మెల్లిగా అమ్మాయి మనసు నొచ్చుకోకుండా సర్దిచెప్పి కాస్త గారాబం చేయాలి. కోప్పడాల్సి వస్తే చిన్నగా కోప్పడ్డా, మళ్ళీ వెంటనే దగ్గరకు తీసుకుని నచ్చజెప్పాలి.
అంతే కాదు తల్లులు తమ కూతుళ్ళ కదలికలను కూడా గమనిస్తూ ఉండాలి.అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వగైరా విషయాలన్నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఓ సిఐడీ లాగా కని పెట్తూ ఉండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని అక్కడికి అక్కడ నిలదీయండి. మంచి చెడు వారికి బోధించండి. మీరు కనుక నేను పైన పేర్కొన్న సూచనలు కనుక పాటించినవారైతే మీ అమ్మాయి మీ దగ్గర ఏమీ దాచకుండా అన్నీ చెప్తుంది. అప్పుడు మీరు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించి ముందడుగు వేయగలుగుతారు.
ఇంకొక విషయంలోనూ తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. అదేమిటి అంటే భార్యాభర్తల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పిల్లలకి తెలిసిపోయేలా ప్రవర్తించకూడదు. వారు తమ సమస్యలను విడిగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలే కానీ పిల్లల ముందు బయట పడకూడదు. అందువల్ల పిల్లలలో అభద్రతా భావం ఏర్పడి ఇంటి వాతావరణం మీద విముఖత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతే కాదు, తల్లిని తండ్రి ఆమె యాబ్సెన్స్ లో తప్పుగా మాట్లాడడం చేయకూడదు. అలాగే భర్త గురించి కూడా తల్లి పిల్లల ముందు చులకన చేసి మాట్లాడకూడదు.ఇవన్నీ గమనించి పిల్లలు కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతారు కాబట్టి చాలా తెలివిగా మసలుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. దానికి తోడు మన మంచితనం కూడా హెల్ప్ అవుతుంది.
అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!!!

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేవుడు నవ్వాడు

ప్రజ్వలన