( మాధవపెద్ది ఉషా శాస్త్రి గారు ” కొత్త లోకం..” అనే శీర్షికతో కాలమ్ అందివ్వనున్నారు.. నెలనెలా తరుణి పత్రిక పాఠకులకు! ఈ రోజు ల్లో ఆలోచనలు ఆచరణలు ఎలా ఉన్నాయి వాటిలోని మంచి చెడుల వివేచనతో మీ ముందుకు వస్తోంది! చదవండి!!- సంపాదకులు)
పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హలో ఇది విన్నారా..? రెండే రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా రాపల్లి గ్రామానికి చెందిన అక్షాంత్ అనే ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో ననే భయంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఓ సంచలన వార్తనే చెప్పాలి. తీరా పరీక్ష రిజల్ట్స్ లో అతను పాస్ అయినట్టు రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏమయి ఉంటుంది అంటారు? నేనైతే దీనికంతటికీ కారణం ఆ తల్లి తండ్రులే అంటాను! ఇంకా చెప్పాలంటే ఆ తల్లి తండ్రులకు ఛదువుకుంటున్న ఎదిగే పిల్లల్ని ఎలాపెంచాలో తెలీలేదంటాను. ఈ సందర్భంలో ఇటువంటిదే నాకు మరో కేసు జ్ఞాపకం వస్తోంది. మాకు తెలిసిన ఒకాయన పిల్లల్ని ఓ చండశాసనుడిలా ట్రీట్ చేసేవాడు. చదువు విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయేవాడు కాదు. వాళ్ల అబ్బాయి టెన్త్ పరీక్షలు రాసి రిజల్ట్స్ వచ్చే లోపల ఫెయిల్ అవుతానేమో నాన్న చంపేస్తాడే నన్న భయంతో సరిగ్గా రిజల్ట్స్ వచ్చే ముందే ఇంట్లోంచి పారిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంత వెతకించినా లాభం లేకపోయింది. తీరా రిజల్ట్స్ రాగానే అతను పాస్ అయినట్టు తెలుసుకుని ఆ తండ్రి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు.
ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు! కారణం పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడమే!! అసలు బాల్యం నుంచే పెద్దలు పిల్లలతో సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పిల్లలు పెద్దలలో ఒక ఆత్మీయుడిని చూసుకుంటారు. తమ సమస్యలను తల్లిదండ్రుల్తో నిస్సంకోచంగా చెప్పుకోగలుగుతారు. వారి మనస్సుల్లో పెద్దలు ఒక నియంతలా నిలిచిపోకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను స్కూల్లో చేర్పించినప్పటినుంచీ వారి చదువు విషయంలో తగిన శ్రద్ధవహిస్తూనే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు చదువులో రాణిస్తూ ఉంటే వారిని ప్రశంసింస్తూనే తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. ఒకవేళ వారు చదువులో అంతగా చురుకుగా లేకపోతే వారిని నిరుత్సాహ పరచకుండా వారు ఏ సబ్జెక్టులో వీకో తెలుసుకుని మీకు వీలైతే మీరు లేకుంటే ట్యూషన్ పెట్టించటమో చేయాలి.
ఆ తరువాత ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల మీద వారు సాధించలేని గోల్స్ పెట్టి వారి మీద ఒత్తిడిని పెంచుతున్నారు. దాంతో పిల్లలు బంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా ఆత్మహత్యే శరణ్యం అనుకుని కన్న తల్లితండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన వారవుతున్నారు. అందుకే నేటి తల్లిదండ్రుల ఆలోచనావిధానంలోనే మార్పు రావాలి. ఇంకొక పెద్ద బ్లండర్ నేటి తల్లిదండ్రులు చేస్తున్న దేమిటంటే తమ అభిరుచులను పిల్లల మీద రుద్దడం… . అందువల్ల తమ అభిరుచికి విరుద్ధంగా తల్లిదండ్రులు చెప్పిన సబ్జెక్టు చదవలేక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక నరకం అనుభవిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. మాకు తెలిసిన ఓ తల్లి తండ్రులు తమ ఏకైక సంతానం అయిన కొడుకును తనకు ఇష్టమైన రంగం సంగీతం తీసుకోమని ప్రోత్సహించారు. అతను సందేహిస్తూ మరి నేను ఆ సబ్జెక్ట్ తీసుకుంటే నేను ఏ డాక్టరో, లేక ఏ ఇంజనీరో అవ్వాలని మీకుంటుంది కదా..।మరి మీకు ఫరవాలేదా అని అడిగాడు. దానికి వారిచ్చిన సమాధానం నేటి తల్లిదండ్రులకు ఆదర్శప్రాయం అంటే అతిశయోక్తి కాదు! అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా నాన్నా నీ అభిరుచి ఎందులో ఉందో అందులోనే నువ్వు రాణించగలవు, కాబట్టి గో అహెడ్ వి ఆర్ విత్ యు అన్నారండి. ఇంక చూసుకోండి ఆ కుర్రాడు తన ఇష్టమైన రంగంలో అంచెలంచెలుగా ముందుకు దూసుకెళ్ళి యూరోప్లోని స్పెయిన్ లో తన ఎమ్. ఎస్ పూర్తి చేశాడు. ఇప్పుడు తన రంగంలో ఓ ఉన్నత పదవిని అందుకున్నాడు. అతను అంటాడుట . నేను నా జాబ్ ఆడుతూ పాడుతూ ఏ విధమైన టెన్షన్స్ లేకుండా చేయగలుగుతున్నాను అంటే అదంతా మీ చలవే అని తన పేరెంట్స్కే ఆ క్రెడిట్ ఇస్తున్నాడు ఆ అబ్బాయి. చూసారా ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా మనకి ఎవరి అభిరుచికి వారికి విలువ ఇవ్వాలని తెలియడానికి? అందుకే ఈ నాటి తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!!! ఏమంటారు??? ఈ విషయంలో మీరంతా నాతో ఏకీభవిస్తారు కదూ!!!